Thursday, November 23, 2017

ఇంకో రెండేళ్ళు పోతే...

            ఇంకో రెండేళ్ళు పోతే...
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు  

సుజాత డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది . తెలివితేటలున్న చురుకైన పిల్ల . అందం,  అందంతో పాటు అణకువ , సంస్కారం అన్ని ఉన్నాయి .  చదువు పూర్తయ్యాక యోగ్యుడైన వరుడికిచ్చి పెళ్లి చేసి పంపేస్తే తమ బాధ్యత తీరిపోతుందని  వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటున్నారు . సంబంధాలు కూడ చూస్తున్నారు.  సుజాతను చూసుకోడానికి ఎంతో మంది వస్తూనే ఉన్నారు . ఒకసారి సుజాతను చూసుకోడానికి వస్తున్న పెళ్లివారు తాము ఫలానా రోజున  మధ్యాహ్నం వస్తున్నామని  సాయంకాలానికే తాము తిరిగి వెళ్లి పోవాలని ఈ లోపుగానే ఆ పెళ్లిచూపుల కార్యక్రమం పూర్తయ్యేలా చూడమని అడిగారు . దురదృష్టవశాత్తూ ఆ రోజు సుజాతకు పరీక్ష పడింది. అసలే ఆఖరు పరీక్ష, మానడానికి వీలులేదు. అందులోనూ పొరుగూరెళ్లి వ్రాయాలి. ఎలాగా అని కొంచెం ఆలోచించారు . సరేలే ఎలాగో సమయం అడ్జెస్ట్ చేసుకోవచ్చులే అనుకున్నారు . రమ్మని వారికి తెలియజేశారు . అనుకున్నట్లు ఆరోజు రానే వచ్చింది . పెళ్లి కొడుకు , తల్లి దండ్రులు, అక్క, బావ, చెల్లి వీళ్ళతో బాటు పెళ్లికొడుకు స్నేహితులు కూడ వచ్చారు . ఏర్పాట్లు అన్నీ  బాగానే జరిగాయి. కాని ఏ౦ లాభం? పరీక్ష వ్రాయడానికి వెళ్ళిన సుజాత మాత్రం ఇంకా ఇంటికి చేరలేదు . ఈలోగా ఆమె ఫోటోలు, సర్టిఫికెట్లు , గెలుచుకున్న బహుమతులు  అన్ని చూపించారు . వాళ్లకు నచ్చాయి . అమ్మాయి రావడం , ఆమెను చూడడమే ఆలస్యం . ఎంత సమయం గడిచినా ఆమె ఇల్లు చేరలేదు . పరీక్షల్లో ఫోన్లు తీసుకెళ్లడం వీలు పడదు , అందువల్ల ఆమె సెల్ ఫోను కూడ తీసుకెళ్ళలేదు. అంతలో పెళ్లి కొడుకు వాచీ చూసుకుని అమ్మా! మనం బయలుదేరాలి లేకపోతే ట్రైన్ కి అందుకోలేం అన్నాడు . హుటాహుటిగా అందరు లేచారు . ఇంకొక్క ఐదు నిముషాలు ఉండండి అని సుజాత అమ్మ-నాన్న ఎంతో వాళ్ళని బ్రతిమాలారు . కాని వాళ్ళు వినిపించుకోలేదు. అమ్మాయికి పరీక్ష మీరుమాత్రం ఏం చెయ్యగలరు . త్వరలో మరోసారి వస్తాం లెండి అని బయలుదేరబోతున్నారు . అంతలో సుజాత తల్లి వాళ్ళతో తన పెద్ద కూతుర్ని చూపించి  ఇదిగో ఇది నా పెద్దకూతురు నళిని . సుజాత చిన్న  కూతురు . ఇద్దరు అచ్చం ఒకలాగే ఉంటారు . ఇద్దరికీ రెండేళ్లే తేడా .  ఆ అమ్మాయి  రెండేళ్ళు పోతే అచ్చం ఇలాగే ఉంటుంది అంది . అది విని ఆమెను చూసిన పెళ్లికొడుకు తల్లి వాళ్ళతో   అమ్మా! మీరు వేరే సంబంధం చూసుకోండి . మేం మళ్లీ మీ ఇంటికి రాలేం, ఏమీ అనుకోకండి అంటూ  చటుక్కున బయటకు నడిచింది . అందరు ఆమె వెంట నడుస్తూ బయలు దేరి వెళ్లిపోయారు . స్టేషన్ చేరుకున్నాక భర్త, భార్యతో ఏమే ! మళ్లీ వస్తామని మనం అన్నాం కదా ! నువ్వేంటి అంత నిష్ఠూరంగా వేరే సంబంధం చూసుకోండి అన్నావు . ఇదేమన్నా బాగుందా అన్నాడు . ఆమె వెంటనే ఊరుకో౦డి. మీరు మగాళ్ళు మీకేం తెలీదు. ఆవిడేమందో మీరు సరిగ్గా విన్నారా ? రెండేళ్ళు పొతే వాళ్ళ పెద్దమ్మాయికీ చిన్నమ్మాయికి తేడా ఉ౦డదట, ఇద్దరూ ఒక్క లాగే ఉంటారట అన్నదండి అంది  . అవును అ౦దులో తప్పేముంది, పోలిక చెప్పాలంటే అల్లాగే చెబుతారు కదా! అన్నాడు అమాయకంగా .  ఓసి మీ తెలివి పాడుగాను .  ఆ అమ్మాయికి  మొగుడుపోయి ఆరునెలలే ఐ౦దిటండి, బొట్టు కూడ లేదు చూశారా! . ఇక ఆ సంబంధం చేసుకుంటే మన పిల్లాడి గతే౦ కాను ? మన సంగతే౦ కాను అందుకే వద్దని చెప్పానండి అంది . విషయం అందరికి అర్థమైంది . అంతలో రైలొచ్చింది. ఎక్కి వెళ్లి పోయారు .   అందుకే ఏ మాట మాట్లాడినా పూర్వాపరాలు చూసుకుని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి .     


No comments: