Thursday, November 23, 2017

వాసికెక్కిన కృతి శ్రీ వంగపండు వారి ‘భామతి’ (ఒకనాటి కన్నీటి గాధ)

వాసికెక్కిన కృతి
శ్రీ వంగపండు వారి భామతి
(ఒకనాటి కన్నీటి గాధ)
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

ఒక ఊళ్లో ఒక రచయిత ఒక గొప్పగ్రంథం రచించాడు .  ఆ గ్రంథం ఆవిష్కరి౦చడానికి పెద్ద  సభ కూడ ఏర్పాటు చేశారు . ఆ సభలో రచయిత మాట్లాడుతూ ఈ గ్రంథరచనకు నా భార్య చాల సహకరించింది, ఆమెకు నేను ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నాడు . సభలో ఆమె కూడ ఉంది . ఆమెకేం అర్థం కాలేదు . కాని అందరి సమక్షంలో భర్త తనను పొగిడినందుకు ఆనందంతో ముసి ముసి నవ్వులు నవ్వుకుంది . ఇంటికి వచ్చాక భర్తతో ఏమండి నన్ను అంతగా పొగిడారు, అదేమన్నా బాగుందా  . నేను ఊళ్లోనే లేను కదండి పుట్టింటి కెళ్లిన నేను మీకేం సహకరి౦చాను ? అంది అమాయకంగా . ఔను అదే నువ్వు నాకు చేసిన సహకారం అన్నాడాయన .
అటువంటి పరిస్థితులున్న ఇటువంటి కాలంలో భర్త వద్దనే ఉండి ఆయన రచనావ్యాసంగానికి సహాయసహకారాలందిస్తూ ఇతోధికాభివృద్ధికి తమ సర్వస్వం త్యాగం చేసిన మహిళామణులెందరో మన ప్రాచీనభారతదేశసాహిత్య చరిత్ర పుటల్లో కనిపిస్తారు . ఉదాహరణకు నాగేశభట్టు అనే ఒక వ్యాకరణశాస్త్రపండితుడు ఉన్నాడు . ఆయన భార్య, తన సాంసారికసౌఖ్యం వదలుకొని  రచనా వ్యాసంగంలో జీవితాంతం భర్తకు సహకరిస్తూనే కాలం గడిపింది . కొంత కాలానికి ఇద్దరూ వృద్ధులై పోయారు .   ఒకనాడు ఆమె భర్తతో ఏమండీ, మనం సంతానం లేకుండానే ముసలివాళ్లం అయిపోయాం అని వాపోయింది . దానికి సమాధానంగా ఆయన ఓసి  పిచ్చిదానా! నేను నీ సహకారం వల్ల రెండు గ్రంథాలు వ్రాయగలిగాను ఒకటి శబ్దేందుశేఖరం రెండు మంజూష . శబ్దేందుశేఖర: పుత్రో మంజూషా మమ పుత్రికా అన్నాడు . మనకు సంతానం కలిగితే ఎటువంటి పేరు తెస్తారో తెలియదు గాని ఈ రెండు గ్రంథాలు మాత్రం మనకు శాశ్వతమైన కీర్తిప్రతిష్ఠలు తెస్తాయి అన్నాడు . ఆయనన్నట్లుగానే ఆ రెండు గ్రంథాలు నాటికి , నేటికి, ఎప్పటికి  వ్యాకరణశాస్త్రవినీలాకాశంలో ధృవతారలుగా వెలుగుతూనే ఉన్నాయి .  
ఇక మరో  గ్రంథం మాటకొస్తే భామతి ఉదాహరణగా చెప్పుకోవచ్చు . ముందుగా మూడుముక్కల్లో దీన్ని గురించి తెలుసుకుందాం . ఇది వేదాంతశాస్త్రగ్రంథం . వేదాంతశాస్త్రం . ముఖ్యంగా మూడు గ్రంథాలపై ఆధారపడి ఉంది . ఒకటి ఉపనిషత్తులు, రెండు బ్రహ్మసూత్రాలు, మూడోది భగవద్గీత . ఉపనిషత్తులు లెక్కకు సుమారి 108 ఉన్నా పది ఉపనిషత్తులు ప్రధానం. బ్రహ్మ సూత్రాలు 555. ఇక భగవద్గీత 700 శ్లోకాలు .
     శ్రీశంకరాచార్యులవారు ఉపనిషత్తులకు , బ్రహ్మసూత్రాలకు , భగవద్గీతకు అద్వైతపరంగా వ్యాఖ్యానాలు రచించారు . అద్వైతం అంటే బ్రహ్మమే సత్యం, జీవుడు మిథ్య; జీవాత్మ, పరమాత్మలు ఒక్కటే అనే వాదం . శంకరులు వ్రాసిన బ్రహ్మసూత్రావ్యాఖ్యానాన్ని  ఎంతోమంది తమ వ్యాఖ్యాన, ఉపవ్యాఖ్యానాలతో విశ్లేషించారు . శంకరుల తరువాత అద్వైత సిద్దాంతం భామతీ ప్రస్థానం , వివరణ ప్రస్థానం, వార్తిక ప్రస్థానం అని మూడు శాఖలుగా విస్తరించింది . వీటిలో భామతీ వివరణ ప్రస్థానాలు చాల ప్రధానమైనవి . ఈ రెంటికి మధ్య కొన్ని సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలున్నప్పటికి జీవబ్రహ్మైక్యవిషయంలో ఒకే అభిప్రాయం కలిగి ఉండడం వల్ల అద్వైతసిద్దాంతానికి ఎటువంటి భంగం వాటిల్లలేదు .   అందులో భామతీ ప్రస్థానానికి మూలగ్రంథం   భామతి అనే వ్యాఖ్యానం . వాస్తవానికి భామతి అనేది  ఒక స్త్రీ మూర్తి పేరు . ఇది ఆమె త్యాగానికి ప్రత్యక్ష నిదర్శనం . ఈ వ్యాఖ్యానాన్ని రచించినవారు శ్రీ వాచస్పతిమిశ్రులు . ఆయన తన తల్లి కోరిక ననుసరించి వివాహం చేసుకున్నప్పటికి ఆమె వంక ఎన్నడు కన్నెత్తి చూడలేదు . పన్నెత్తి పలకరించచ లేదు.  రాత్రింబవళ్ళు వ్యాఖ్యానరచనలోనే నిమగ్నమై పోయాడు. తల్లి వాదన చెవిటివాని ముందు ఊదిన శంఖం కాగా,  భార్య మనోవేదన  అరణ్యరోదనై౦ది . ఆమె అందం అడవిగాచిన వెన్నెలైంది . ఇక ఆ సాధ్వి తన సకలసౌఖ్యాలకు స్వస్తి చెప్పి తన భర్త రచనావ్యాసంగానికి సహకరించడం మొదలెట్టింది . రోజులు , నెలలు , సంవత్సరాలు , దశాబ్దాలు గడిచిపోయాయి. వ్యాఖానం పూర్తయ్యేసరికి  ఆయన నడుము వంగిపోయింది . ఈమె కన్నుగానని మూడుగాళ్ల ముసలిదై పోయింది . ఒకనాడు ఆయన తలెత్తి ఆమెవైపు చూసి నువ్వు ఎవరవు ? అని అడిగాడు . ఆమె ఎంతో చింతిస్తూ తనను తాను పరిచయం చేసుకుంటుంది . ఆయన తనకీర్తి ప్రతిష్ఠలకోసం ఆమెకు చేసిన అన్యాయానికి పరిపరివిధాల చింతించి తాను రచించిన వ్యాఖ్యానానికి ఆమె పేరు పెడతాడు . అప్పటినుండి అది భామతీ వ్యాఖ్యానంగా పేరు పొందింది. ఇదీ అసలు  కథ .  ఈ కథను ఆధారం చేసుకుని శ్రీ వంగపండు నరసింహం గారు భామతి అనే కావ్యాన్ని రచించారు . వృత్తిరిత్యా శ్రీ వంగపండు వారు గణితశాస్త్రఅధ్యాపకులు (M.A;B.Ed)  . కవిత్వం వీరి ప్రవృత్తి.    వారికి కవిత్వానికి అవినాభావసంబంధం ఉంది . ఒక్క మాటలో చెప్పాలంటే కవిత్వం ఈయనకు ఊపిరి.  ఆయన పద్యవిద్యలో చేయి తిరిగిన చతురుడు . ఎన్నో శతకాలు , కావ్యాలు రచించారు . బాల్యంలోనే కమనీయమైన పద్యాలు రచించి, కవిసమ్రాట్టు శ్రీవిశ్వనాథవారి ప్రశంసాపూర్వకమైన ఆశీస్సులందుకున్న కవికిశోరం . చేతికందిన యే అంశాన్నైనా కవితామయం చేయగల సాహిత్య కృషీవలుడు . వీరి రచనల్లో భామతి తలమానికం . ఈ కావ్యానికి సంబంధించిన ఇతివృత్తం (కథ) ఒక స్త్రీమూర్తి యొక్క త్యాగానికి, పాతివ్రత్యానికి, దర్పణంగా నిలుస్తోంది . భామతి స్త్రీలోకానికే ఆదర్శమూర్తి. స్వల్పమైన ఈ కథకు వంగపండు వారు కూర్చిన కల్పనలు , చేర్చిన సాహిత్యపరిమళాలు వారి ప్రతిభకు నిదర్శనం . ఈ  లఘుపద్యకృతి రాసిలో చిన్నదైనా వాసిలో మిన్న. ఇందులో 219 పద్యాలున్నాయి . ఇక కావ్యం లోపలికి ప్రవేశిస్తే ముఖ్యమైన ఘట్టాలన్నీ కరుణరసార్ద్ర భరితాలే. వధూవరులైన భామతీ వాచస్పతుల యోగ్యతలను కవి ఎంత గొప్పగా వర్ణిం చారో పరికించండి  .
అతడు నిత్యాగ్నిహోత్రి, నిరామయు౦డు
భామ యార్ష ధర్మానల జ్వలితదీప్తి
అతడఖిలశాస్త్రకోవిదుండామె ప్రచుర
శాస్త్ర నిగమ విజ్ఞాన విశారద మఱి
యాతడద్వైతి యామెయు నద్వయమతి (63)

                       కవి వసంతశోభను వర్ణిస్తూ నవవధువు, విరహిణియైన భామతిని మన్మధాస్త్రములు బాధించినప్పుడు ఆమె మన: స్థితిని , దృఢనిశ్చయాన్ని ఎంత  హృద్యంగా వర్ణించారో చూడండి.    
  
ఏమిది వెఱ్ఱినాకు చటులేంద్రియ చేష్టకు బానిసౌటయా
కామన లేనిదాన కులకాంతను భ్రాంతి విలుప్తనయ్యు నే
డీమెయి వర్తిలంగ తగవే యని యాత్మయు హెచ్చరించెడిన్
ధీమతినై చరించెదను ధీరపతివ్రతనై మెలంగెదన్ (86)
మాన్యచరిత్రనై నిగమమానిత జీవన భాగ్యనైతి , సా
మాన్యవధూటి కైవడిని మానస సంచలనంబు నాకయెన్
మాన్యత గూర్చునే విమలమార్గము దప్పిన రాగ చిత్తతన్
అన్య మనస్క గానిక, గుణాఢ్యను నాకు వికల్పమేటికిన్  (87)            


భామతి-వాచస్పతిమిశ్రుల వ్యక్తిత్వం , గుణతారతమ్యాలను తులనాత్మకంగా విశ్లేషించిన తీరు  సుమనో మనోజ్ఞం.
భాష్యకారుడతడు,భాషారహిత యామె
శిల్పియాతడామె చెక్కనిశిల
కావ్యకర్త యతడు కర్మయోగిని యామె
సతి సరాగహృదయ పతి విరాగి (94)
   
భావరహిత యామె భావుకుడాతడు
నాత్మవిద్యావిదగ్ధుడామె ముగ్ధ
ఉపనిషద్ జ్ఞాన పూర్ణుడౌ యోగి యతడు
జ్వలితభాష్యదీక్షానలసమిధ యామె (95)  

వాచస్పతి భామతిని తొలిసారిగా చూచిన సందర్భంలో భామతి నర్మగర్భితభావన కందంలో  ఎంత అందంగా వర్ణి౦చారో పరికించండి .

విస్ఫారిత నేత్రా౦చిత
ప్రస్ఫురిత దయార్ద్ర  హృదయ రచితోడిత రా
గాస్పదుడిపు డయ్యెనొకో
ప్రస్ఫుటముగ చూడసాగె భార్యనిటంచున్ (113)     
  వాచస్పతి తన వివాహమైన కొన్ని దశాబ్దాలు గతి౦చినా భార్యయగు భామతినెప్పుడూ చూడలేదు . ఒకనాడు సాయంకాలం సంధ్యాదీపాన్ని వెలిగిస్తున్న ఆమెను   చూచి నీవెవరవు ? అని ప్రశ్నించినతీరు,  ఆమె స్పందించిన తీరు పఠితలకు కంట తడి పెట్టి౦చక  మానదు . ముందుగా ఆయన ప్రశ్నించినతీరు గమనించండి .
ఎవ్వతెవీవు మానవతి? ఎందుల కియ్యెడనుంటివో ? మారిం
కెవ్వరు లేరొ? యొంటరిగ నీవయి వచ్చిన చంద మాయెడిన్
ఇవ్విధి సంజ దీపమును నెవ్వరి పన్పున వెల్గ జేసితో
నివ్వెర బోతి నీ కృతికి నిన్ను గతంబున చూడకుండుటన్          (118)
పఠితల హృదయాన్ని కలచివేసే ఆమె సమాధానం పరికించండి .
నేనొక దీనమానవతి నేరము సేయక శిక్ష బొందితిన్    
తానొక యజ్ఞదీక్షితుడధర్మముతో సతి విస్మరి౦చెడిన్
మౌనముగా సహించెదను మాన్యు నిరాదరణ౦బు   సైతమున్
ఐనను భావ్యమే మరువ నప్పటి నాతి చరామి సూక్తులన్ (128)

ఎవ్వతె నేననన్ ధర జితేంద్రియుడాగమవేత్త పూజ్యుడు
న్నెవ్వరు బ్రహ్మతేజముననెప్పుడు భాసిలు నాత్మవిద్యలో
నెవ్వరు పారగుండయి రహించు సదానలహోత్రి   యెవ్వరౌ
నెవ్వరు పుణ్య భాగుడగు నిమ్ముల నాతని సాధ్విభామతిన్ (143)

సేవకురాల నేను తమ సేవలు చేసి తరించు చుంటి, నా
జీవనధర్మమిద్దియని జెప్పక జేసితినిన్ని యే౦డ్లుగా
నా విధులందు దోషముల నాకెఱిగించిన దిద్దుకొందు మీ
రేవిధినానతీయ నటులే తమసేవలొనర్తునీ పయిన్ (140)       
              
ఈ భామతిలో ఎన్నో వేదాంతశాస్త్రవిశేషాలు పొందుపరచబడ్డాయి. రచయిత కావ్యా౦త౦లో ఒక గీతమాలికలో ఆమె గుణగణాలన్ని పొందుపరిచి ఆమెను కళ్ళకు కట్టినట్లు కనిపించేలా చేశారు.
పరిణయమ్ము మొదలుకొని పండు ముదిమి
వరకు పరిసేవ తరియించె భారతీయ
సాంప్రదాయానువర్తిత సాధ్వి యనగ
పూర్ణ జీవిక నిస్స్వార్థ పూరితముగ
త్యాగశోభితసౌశీల్య ! ధన్యజీవి !
నిగ్రహ ప్రతిరూపిణి! నిగమవాణి!
జ్ఞానరాగిణి ! యోగిని ! మౌన రమణి !
పొలుపగు పతివ్రతా శిరో భూషణమణి!
పావని ! సహనశీలప్రవర్తిని ! ధర
హై౦దవాదర్శగృహిణి భవ్యప్రతీక!
నిరుపమాన గుణానీక! నిష్కళంక! 
పూతచరితాంక! భామతి పుజ్యరేఖ !      
భామతి వంగపండు వారి భా మతి కి నిదర్శనం . ఈ గ్రంథం ఆంధ్రసాహిత్యచరిత్ర పుటల్లోను, రసజ్ఞులహృదయాల్లోనూ శాశ్వతంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు . ఇటువంటి చక్కని గ్రంథాన్ని మనకందించిన శ్రీ వంగపండు వారు ప్రశంసనీయులు .             




No comments: