Friday, January 11, 2019

వీనులవిందైన వక్తృత్వకళకు అందమైన చిట్కాలు


వీనులవిందైన వక్తృత్వకళకు  అందమైన చిట్కాలు

                             డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

వక్తృత్వం ఒక కళ . ఏ కళలోనైనా నైపుణ్యం సంపాదించాలంటే ఆ కళలో కొంత సాధన చెయ్యాలి . మాట్లాడే కళలో గొప్పవాళ్ళు కావాలంటే మాట్లాడటం మొదలు పెట్టాలి . ఉదాహరణకు ఈదడం అనేది ఒక కళ . ఆ కళలో ప్రావీణ్య౦ సంపాదించాలంటే ఈదడం మొదలెట్టాలి.  అంతేగాని ఈతగాళ్ళ ఉపన్యాసాలు విన్నా, వాళ్ల విన్యాసాలు చూచినా ప్రయోజనం ఎక్కువగా ఉండదు.  ప్రపంచచరిత్ర పుటలు తిరగేస్తే మనకు ఎంతోమంది గొప్పగొప్ప వక్తలు కనిపిస్తారు. మనదేశంలోనే ఎంతోమంది ఉన్నారు . వాళ్ళల్లో, వాళ్ళ మాటల్లో ఎంతో ఆకర్షణ కనిపిస్తుంది . మాటలతో ప్రజల్ని మంత్రముగ్దుల్ని చేసిన వారే అందరు . కొంతమంది ఈ కళను ప్రజాహితం కోసం వినియోగిస్తే మరి కొంతమంది స్వార్థం కోసం వినియోగి౦చుకున్నారు . అదొక్కటే తేడా .  ఉదాహరణకి జర్మన్ నియంత Adolph Hitler ని తీసుకోండి. ఆయన వ్యక్తగత అంశాలు ప్రక్కన పెడితే   అంతటి వక్త మరొకడు లేడు . ఆయన ప్రసంగించేటప్పుడు ఆయన్ని చంపడానికి తుపాకులతో వచ్చేవారట. ఆయన చెప్పిన ఉపన్యాసం వినగానే కాళ్ళమీద పడిపోయి క్షమాపణలు కోరేవారట . ఇంకో గమ్మత్తే౦టంటే కొంతమంది పిల్లలు ఆయన ఉపన్యాసాలకు మంత్రముగ్ధులై ఆయన దగ్గరకెళ్లీ ఏమండి మానాన్న మిమ్మల్ని చంపడానికి కుట్ర పన్నుతున్నాడండి అని వాళ్ళు ఇంట్లో విన్న మాటల్ని ఆయనకు చెప్పేవారట . ఆయన మాటల్లో అంత ఆకర్షణ ఉండేది . సరే ! ఆ విషయం అలా ఉంచుదాం. ఏ కళలోనైనా నైపుణ్యం సాధించడానికి   ప్రతిభా , వ్యుత్పత్తి, అభ్యాసం అని మూడు కారణాలుంటాయి. ఇందులో ప్రతిభ సహజసిద్ధమైనది. అది దైవదత్తం  . ఇక వ్యుత్పత్తి , అభ్యాసం అనేవి మానవప్రయత్నానికి సంబంధించినవి . వ్యుత్పత్తి అంటే పాండిత్యం . ఇక అభ్యాసం అంటే నిరంతర సాధన . కొంతమందికి సహజంగానే ఈ వక్తృత్వం అనే కళ అలవడుతుంది .  వారికి ఈ నియమాలతో పనిలేదు . ప్రతిభ అంతగా లేనివాళ్ళు ఈ రంగంలో రాణి౦చాలంటే కొంత కొంత పాండిత్యం సంపాదించి కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం . మన ప్రాచీనులు,  పాశ్చాత్యులు  అభ్యాసానికి కూడ ఎంతో ప్రాముఖ్యం ఇవ్వడం కనిపిస్తోంది . You can improve your faculty by practice or impair it by negligence అని వారి అభిప్రాయం. మన ప్రాచీనులు వక్తృత్వకళలో ప్రావీణ్యం సంపాది౦చాలనుకునే వాళ్లకు కొన్ని సూచనలు చేశారు . అవి దృష్టిలో ఉంచుకుని సాధనచేస్తే అనూహ్యమైన ఫలితాలు సిద్ధిస్తాయి . మన పెద్దలు ఆ నియమాలను ఒక శ్లోకంలో రూపొందించారు .

1 తథ్యం:-  ఇది మొదటి నియమం .  తథ్యం అంటే యథార్థం . వక్త ఎప్పుడూ యథార్థం మాట్లాడాలి . అతని మాటల్లో  అసత్యంగాని, అతిశయోక్తి గాని ఉండ కూడదు . ఒక్కసారి ఎవరైనా అతని మాటల్లో అసత్యం గాని,  అతిశయం గాని గమనించారో ఆ మాటలకు విలువివ్వరు.

2. పథ్య౦ :- ఇది రెండో నియమం .   వక్త మాటలు మృదువుగా ఉండాలి . ఎట్టి పరిస్థితిలోను కఠినంగా ఉండకూడదు . ఒకవేళ కఠినంగా ఉండే  విషయాన్ని చెప్పవలసి వచ్చినా కూడ మృదువుగానే చెప్పగలగాలి

3 సహేతు:- ఇది మూడో నియమం . వక్త ఏ విషయమైనా హేతుబద్ధంగా చెప్పగలగాలి. దున్నపోతు ఈనింది,  దూడను కట్టేయండి అనే విధంగా ఉ౦డకూడదు. విషయాన్ని ఒకవేళ emotional గా ప్రతిపాదించినా అది హేతుబద్ధంగా ఉంటేనే అందరు మెచ్చుకుంటారు .

4. ప్రియం:- ఇది నాలుగో నియమం . వక్త తాను చెప్పబోయే విషయాన్ని అందరు మెచ్చుకునే లాగ,  అందరిని మెప్పించే లాగ ఉండాలే గాని ఏ ఒక్కరిని నొప్పించే విధంగా ఉ౦డ కూడదు . ఒక వేళ విషయం కష్టం కలిగి౦చేదైనా వాళ్లకు ఇష్టమైన రీతిలో  చెప్పాలి .

5. అతిమృదులం:- ఇది ఐదో నియమం . వక్త ప్రతిపాదించే విషయం అందరి మనస్సుకు హత్తుకునే లాగ ఉండాలి. పేలవంగా ఏదో చెబుతున్నాడులే అనే విధంగా ఉ౦డకూడదు.

6. సారవత్:- వక్త తాను చెప్పే విషయంలో సారం ఉందా లేదా అని గమని౦చుకుంటు ఉండాలి. ఊక దంపుడు ఉపన్యాసంలా ఉ౦డ కూడదు . కొంతమంది మాట్లాడతారు . అది విన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది . తరువాత ఆయన ఏ౦ చెప్పేర్రా  అని ఆలోచిస్తే ఏమీ ఉండదు .

7. దైన్యహీనం:-   ఇది ఏడో నియమం. వక్త తాను చెప్పే అంశాన్ని గట్టిగా, గంభీరంగా చెప్పాలి. కొంతమందికి మాత్రమే వినిపించేలా కాక సభాసదులందరికి స్పష్టంగా వినిపించేలా ఉండాలి .

8. సాభిప్రాయం:- ఇది ఎనిమిదో నియమం. వక్త చెప్పే విషయం ప్రయోజనవంతంగా, సూటిగా  ఉండాలి. అనవసరమైన విషయాలు మాట్లాడ కూడదు . శాఖా చంక్రమణం (beating around the bush) పనికిరాదు .

9. దురాపం:- ఇది తొమ్మిదో నియమం.  అంటే వక్త చెప్పే అంశాలు శ్రోతలకు పూర్తిగా తెలిసేవి కాకూడదు. అతని మాటలు శ్రోతలను ఆలోచింప చేసే విధంగా ఉండాలి. ఆలోచిస్తేనే తెలిసేవిగా ఉండాలి . ఆలోచించి అర్థం చేసుకునేవిగా ఉండాలి . అలా లేకపోతే వినేవారికి ఆసక్తి కలుగదు, చాల  పేలవంగా తోస్తుంది ..

   10. సవినయం:- ఇది పదో నియమం.   వక్త తాను మాట్లాడే మాటలలో  వినయ౦ తొణికిస లాడేలా చూసుకోవాలి . గర్వం గాని , అహంకార౦ గాని ఏ కోశాన కనిపించకూడదు . 

11. ఆశఠ౦:- ఇది పదకొండో నియమ౦.  వక్త మాటలు మొండివైఖరితో ఉoడకూడదు. . అందరికీ అంగీకారయోగ్యంగా ఉండాలి

12. చిత్రం:- ఇది పన్నెండవ నియమం. వక్త మాటలు నిస్సారంగా ఉ౦డకూడదు. . మంచిమంచి పదాలతో figurative గా చమత్కార భరితంగా ఉండాలి. లలితమైన శబ్దాలంకారాలతో అందమైన అర్థాలంకారాలతో ఆకర్షణీయంగా ఉండాలి. అలాగని అసలు విషయం లేకుండా కృత్రిమంగా ఉండరాదు.  కేవలం verbosity పనికిరాదు .

13. అల్పాక్షరం:- ఇది పదమూడవ నియమం.  వక్త తాను చెప్పదలచుకున్న అంశాన్ని చాల సంక్షిప్తంగా చెప్పాలి . ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండుననిపి౦చాలి గాని ఎప్పుడు ఆపుతాడురా బాబూ అనిపించేలా ఉ౦డకూడదు. హృదయం కదిలి౦చే విధంగా ఉ౦డాలి గాని కుర్చీల్లో౦చి  కదిలించే విధంగా ఉ౦డకూడదు.

14.  బహ్వర్థం:- ఇది పదునాలుగో నియమం. ప్రతిమాట ఎంతో అర్థవంతంగా ఉండాలి . విషయగాంభీర్యంతో ఉండాలి.

15. కోపశూన్యం:- ఇది పదిహేనో నియమం. వక్త ఎప్పుడు చిరునవ్వుతోనే మాట్లాడాలి. ఎట్టి పరిస్థితిలోను కోపాన్ని ప్రదర్శి౦చ కూడదు. ఒకవేళ శ్రోతలు విసిగి౦చినా సంయమనం కోల్పోకూడదు.

16. స్మితయుతం:- ఇది పదహారో నియమం.   వక్త  ఎప్పుడు చిఱునగవుతోనే మాట్లాడాలి . ఎటువంటి మాటలైనా చిఱునగవుతోనే చెప్పాలి.

 17. ఘనదాక్షిణ్యయుక్తం:- ఇది పదిహేడో నియమం.    వక్త ఏ విషయాన్నైనా పక్షపాత రహితం (UNBIASED) గా ప్రతిపాదించాలి. ఒక అంశాన్ని గాని ఒక సిద్ధాంతాన్ని గాని నిర్హేతుకంగా  సమర్ధించకూడదు, తూలనాడకూడదు .

18. సందేహహీనం:-   వక్త ఏ విషయాన్నైనా ఎటువంటి సందేహం లేకుండా ఖచ్చితంగా సూటిగా చెప్పగలగాలి. నూటికి నూఱుపాళ్ళు తాను చెప్పే విషయం పట్ల  సంపూర్ణమైన  విశ్వాసం కలిగి ఉండాలి. ఆంగ్లభాషలో ఒక సామెత ఉంది . దాని సారాంశ మే౦టంటే: 
ఒకడున్నాడు వాడికేం తెలీదు , తనకేమీ తెలీదనే విషయం కూడ వాడికి తెలీదు. అటువంటివాడు మూర్ఖుడు, వాణ్ణి దూరంగా ఉంచాలి .
మరొకడున్నాడు. వాడికేం తెలీదు. కాని తనకేమీ తెలీదనే విషయం వాడికి తెలుసు . అటువంటి వాడికి బోధించాలి.
వేరొకడున్నాడు . వాడికి అన్ని తెలుసు కానీ తనకు తెసుననే విషయం వాడికి తెలీదు . అతను అజ్ఞానంలో ఉన్నాడు . అతనిని మేల్కొల్పాలి .
ఇంకొకడున్నాడు  అతనికన్నీ తెలుసు , తనకన్నీ తెలుసనే విషయం కూడ అతనికి తెలుసు. అతడు జ్ఞాని . అతన్ని అనుసరించాలి.

He, who knows not and knows not that he knows not is a fool. Shun him.
He, who knows not and knows that he knows not can be taught. Teach him.
He, who knows and knows not that he knows not is asleep. Wake him.  
  He
, who knows and knows that he knows, is a prophet. Follow him.
కాబట్టి వక్త సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో ఉండాలి. సందేహాలకు చోటుండకూడదు . ఒకాయన మాట్లాడడం మొదలు పెట్టాడు , ఆ ముందురోజు కొంత మాట్లాడాడు . ఏం మాట్లాడాడో, ఎంతవరకు మాట్లాడాడో మరిచిపోయాడు. Yesterday I delivered.. I delivered... I delivered అంటూనే ఉన్నాడు అదేంటో చెప్పలేక పోతున్నాడు . అంతలో శ్రోతల్లోంచి ఒకాయన లేచి He has already delivered thrice, but nochild అన్నాడు. అందరు అది విని గొల్లు మన్నారు. 

19. సప్రమేయం:- ఇది పందొమ్మిదవ నియమం వక్త ప్రతి అంశాన్ని హేతుబద్ధంగా మాట్లాడాలి.

 20. అప్రమత్తం:- ఇది ఇరవయ్యో నియమం . చాల ముఖ్యమైనది . వక్త చాల అప్రమత్తంగా మాట్లాడాలి. ఒక్క ముక్కలో  పచ్చిగా చెప్పాలంటే  ప్రతి మాట  ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి

తథ్యం పథ్య౦ సహేతు ప్రియమతిమృదులం సారవద్దైన్యహీనం
సాభిప్రాయం దురాపం సవినయమశఠ౦ చిత్రమల్పాక్షరం చ
బహ్వర్థం కోపశూన్యం స్మితయుతఘనదాక్షిణ్య సందేహ హీనం 
వాక్యం బ్రుయాద్రసజ్ఞ: పరిషది సమయే సప్రమేయాప్రమత్తం
  
तथ्यं पथ्यं सहेतु प्रियमतिमृदुलं सारवद्दैन्यहीनं
साभिप्रायं दुरापं सविनयमशठं चित्रमल्पाक्षरं |
बह्वर्थं कोपशून्यं स्मितयुतघनदाक्षिण्यसन्देहहीनं
वाक्यं ब्रूयाद्रसज्ञ: परिषदि समये सप्रमेयाप्रमत्तम् ||    




Tuesday, January 8, 2019

The Yoga Sutras of Patanjali -12, 13&14


        The Yoga Sutras of Patanjali -12, 13&14
                                           (పతంజలి యోగసూత్రములు)

Dr. Chilakamarthi Durgaprasada Rao


యోగమంటే చిత్తవృత్తులను అరికట్టడం అని ఇంతకు ముందు చెప్పుకున్నాం . అరికట్టే విధానాన్ని ఇప్పుడు చెబుతున్నాడు .

अभ्यासवैराग्याभ्यां  तन्निरोध:1.12. (అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధ: )

तन्निरोध: = (చిత్తవృత్తి నిరోధ:) = చిత్త వృత్తులను నిరోధించడం

अभ्यासवैराग्याभ्यां = అభ్యాస వైరాగ్యముల చేత {సాధ్యపడును}
  
          భగవద్గీతలో అర్జునుడు కృష్ణునితో  ఓ కృష్ణా ! మనస్సు చాల చంచలమైనది . ప్రమాదకరమైనది , చాల దృఢమైనది , వాయువును నిరోధించడం ఎంత కష్టమో మనస్సును నిరోధించడం కూడఅంతే  కష్టం అని నాకనిపిస్తో౦ది  అంటాడు
చంచలం హి మన: కృష్ణ  ప్రమాధి బలవద్దృఢ౦
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం VI-33

 కృష్ణుడుఅర్జునుని అభిప్రాయాన్ని  కాదనలేదు పైగా అతని అభిప్రాయాన్ని సమర్థించాడు . నాయనా! నువ్వు చెప్పింది నిజమే . మనస్సు చంచలమై౦ది, దాన్ని అరికట్టడం చాల కష్టం . కాని అభ్యాస వైరాగ్యాలవల్ల అది సిద్ధిస్తుంది అంటాడు .
అసంశయం మహాబాహో! మనో దుర్నిగ్రహం చలం
అభ్యాసేన తు కౌ౦తేయ వైరాగ్యేణ చ గృహ్యతే 
VI-341
ఇప్పుడు అభ్యాసమంటే ఏంటో తెలుసుకుందాం .

13. तत्र स्थितौ यत्नो sभ्यास:

तत्र= అభ్యాస వైరాగ్యాలలో
अभ्यास: =అభ్యాసమనగా
स्थितौ= మనస్సును స్థిరంగా ఉ౦ చుటలో
  यत्न: = ప్రయత్నమే
ఇక్కడ మనస్సును స్థిరంగా ఉంచడం అంటే ఏ ఆలోచనా లేకుండా భావ శూన్యంగా ఉంచడం అని అర్థం . ఇక అది ఎలా ఉండాలో వివరంగా చెబుతున్నాడు .

1.14. तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमि:
( తు దీర్ఘకాలనైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి: )
तु = అది
दीर्घकालनैरन्तर्यसत्कारासेवित:
दृढभूमि: = స్థిరంగా ఉండును
చాల కాలం , నిరంతరం , తపస్సు మరియు బ్రహ్మచర్యం మొదలగు దీక్షలతో సేవి౦చబడినచో అది దృఢమగును .


Friday, January 4, 2019

ఒకటి రెండు - రెండు ఒకటి


ఒకటి రెండు - రెండు ఒకటి

డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాద రావు

సుబ్బారావు ఎంతో పొదుపరి. ఎంగిలి చేత్తో కాకిని కూడ అదలి౦చని గొప్ప పిసినారి. అతను ఎంత పిసినారో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు .  ఒకసారి పొరుగూరి నుంచి ఇంటికి రైల్లో వస్తున్నాడు . రైలు ఇంటి ము౦దు ను౦చే పోతుంది . స్టేషను దాకా వెడితే మళ్ళా రిక్షాలో ఇంటికి రావాలని , ఆ ఖర్చు తగ్గి౦చడం కోస౦ రైలు సమీపానికి రాగానే రైల్లోంచి దూకేశాడు . తత్ఫలితంగా రెండు కాళ్ళు విరిగిపోయాయి . ఇది ఆయన కథ . సరే ఆ సంగతి అలా ఉంచుదాం . ఒకసారి ఆయన ఇంటికి ఒక   అతిథి వచ్చాడు . అసలు అతిథిని ఆదరించే అలవాటు లేనే లేదు . కాని ఆరోజు కాదనలేని పరిస్థితి దాపురించింది . ఎందుకంటే ఆ వ్యక్తీ  బాగా దగ్గరి వాడు, అందులోనూ వయస్సులో చాల పెద్ద వాడు . అందువల్ల కాదనలేక పోయాడు. ఎదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలి అని  ఆలోచించాడు . వెంటనే ఉపాయం తట్టింది . భార్యకు సైగ చేస్తూ  ఏమే! ఒకటి రెండు   రెండు ఒకటి చెయ్యి   అన్నాడు. అతిథికి ఏమీ అర్థం కాలేదు . అసలే పొరుగూరిను౦చి నడిచొచ్చాడో యేమో  ఆకలితో నకనక లాడిపోతున్నాడు . కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి . కాళ్ళు చేతులు వ్రేలాడి పోతున్నాయి . నీరసంతో విలవిలలాడి పోతున్నాడు .  ఒక వైపు ప్రాణాలు పోయే పరిస్థితి . మరో వైపు ఎంత  నిరీక్షిస్తున్నా భోజనానికి పిలుపు రావడం లేదు . ఒంటి గంట దాటింది , రెండు దాటింది , మూడు దాటింది , నాలుగు దాటింది , ఐదు కావొస్తో౦ది. బాబయ్య గారు భోజనానికి రండి అనే పిలుపు ఆ ఇంటి ఇల్లాలి నోటినుంచి  వినిపించింది . అతని ఆనందానికి అవధులే లేవు . ఒక్క ఉదుటున లేచి  కంచం ముందు చతికిలపడ్డాడు . ఆమె వడ్డన మొదలెట్టింది . ముందుగా  అరిటికాయ కూర వడ్డించింది . అవి తరగగా వచ్చిన తొక్కలతో పచ్చడి చేసింది . అదికూడా వడ్డించింది . మొహమాటపడకు౦డా భోజనం చెయ్య౦డి బాబయ్యగారు! అంది.    అతికష్ట౦ మీద నాలుగు మెతుకులు కొరికి చెయ్యి కడుక్కున్నాడు . అంతే ఇంక రాత్రి భోజనానికి పిలుపే  లేదు . మరునాడు వెళ్ళిపోతూ వీడి దుంప తెగా   ఒకటి రెండు, రెండు ఒకటి చెయ్యమన్నాడు దాని అర్థం ఇదేకాబోలు అని తిట్టుకున్నాడు మనసులో  


11. ‘Charucharya’ of Kshemendra


11. Charucharya’ of Kshemendra
(A treatise on moral education)
                                 Dr. Chilakamarthi Durgaprasada Rao
                                                                             dr.cdprao@gmail.com
  
मद्यव्यसनी क्षीब: कुर्याद्वेतालचेष्टितम् |
वृष्णयो हि ययु: क्षीबास्तृणप्रहरणा : क्षयम् ||

 मद्यव्यसनी =మద్యపానవ్యసనంతో
क्षीब:= బలహీనుడై
वेतालचेष्टितम्=చెడ్డ పనులను  
  कुर्यात् = చేయరాదు
     वृष्णय: = వృష్ణి కులజులు
क्षीबा:= బలహీనులై
तृणप्रहरणा := గడ్డిపరక చేత కొట్టబడిన వారై
 क्षयं  = నాశనమును
ययु: = పొందిరి
 हि = కదా
మద్యమునకు బానిసలై మత్తెక్కి చెడ్డపనులు చేయరాదు . వృష్ణి కులజులైన యాదవులు మద్యము సేవించి, మదించి తుంగ కాడలతో  కొట్టుకొని మరణి౦చిరి కదా !
సప్త వ్యసనాల్లో మద్యపానం ఒకటి . ఇది చాల ప్రమాదకరమైనది ..
ఒకసారి కొందరు  మహర్షులు కృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చారు. అప్పుడు కొంతమంది తుంటరి యువకులు సా౦బుడనే వానికి గర్భిణీ  స్త్రీ వేషం ధరింపజేసి ఋషులకు నమస్కారం పెట్టించి స్వామీ ! ఈ మెకు కొడుకు పుడతాడా కూతురు పుడుతుందా అని అడిగారు . అసలు విషయం గ్రహించిన ఆమునులు తమను ఆటపట్టిస్తున్నందుకు వారిపై  కోపించి యాదవకులాన్ని నాశనం చేసే రోకలి పుడుతుందని చెప్పారు . అలాగే రోకలి పుట్టింది . వసుదేవుడు జరిగిందంతా తెలుసుకుని దాన్ని అరగదీయి౦చి సముద్రంలో కలిపి౦చాడు . అక్కడనుంచి రోకళ్ల వంటి తుంగ కాడలు మొలిచాయి . ఒకసారి శ్రీ కృష్ణుడు యాదవులనందరినీ సముద్ర తీరానికి తీసుకుపోయాడు. అక్కడ సాత్యకి కృతవర్మలకు మధ్య అభిప్రాయ భేదం వచ్చింది. అసలే వారు త్రాగి ఉండడంతో దెబ్బలాటకు దిగారు . వాళ్ళ కారణంగా యాదవులు రెండు వర్గాలుగా విడిపోయారు . తు౦గ కాడలతో కొట్టుకుని అందరు మరణించారు .    

One should not do any heinous crime by being intoxicated with wine. The descendents of Vrishni clan were killed by fighting themselves with tunga straws.














Wednesday, January 2, 2019

Spoken Sanskrit Lesson-25





  సంభాషణ సంస్కృతం 25
(Spoken Sanskrit)
Lesson-25
Dr.  Ch.  Durgaprasada Rao,
Reader in Sanskrit (Retd),
3/106, Premnagar, Dayalbagh, AGRA.

                                पञ्चमीविभक्तिः (अवधे:)
ఇంతకు ముందు మనం చతుర్థీవిభక్తి ఏఏ సందర్భాల్లో వస్తుందో తెలుసుకున్నాం . ఇప్పుడు పంచమీ విభక్తి ఎప్పుడెప్పుడు ఉపయోగించాలో సంగ్రహంగా తెలుసుకుందాం .  ఈ పంచమీ విభక్తి  అనేక సందర్భాల్లో వస్తుంది . కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ పాఠంలో పరిశీలిద్దాం .

  1. जनिकर्तु:  प्रकृति:  ( జనికర్తు: ప్రకృతి: ) అని వ్యాకరణ నియమం . ఒక వస్తువు వేరొక వస్తువులోంచి  పుడుతో౦టే లేక వెలువడుతో౦టే  అది ఎక్కడ నుంచి వెలువడుతో౦దో  ఆ వస్తువును చెప్పే పదానికి పంచమీ విభక్తి వస్తుంది .
For Example:-

1. पर्वतात् नदी  प्रभवति  (పర్వతమునుండి నది పుట్టును)
    River flows from a mountain
2. गोमयात् वृश्चिको जायते (పేడ నుంచి తేలు పుట్టును) 
   Scorpion is born from cow - dung
अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसंभव:
यज्ञाद्भवति पर्जन्यो यज्ञ: कर्मसमुद्भव:
(भगवद्गीता )
ప్రాణులు అన్నం నుండి పుట్టును
అన్నం మేఘం వలనపుట్టును
మేఘం  యజ్ఞం వలన సంభవించును
యజ్ఞం కర్మలవలన జనించును .
అందువల్ల ఇక్కడ అన్నిటికి పంచమీ విభక్తి వచ్చి
అన్నాత్ పర్జన్యాత్ యజ్ఞాత్  మొదలైన పంచమీ విభక్తి ప్రత్యయాలు ఏర్పడ్డాయి .
 
2. ध्रुवमपाये अपादानम्

రెండు వస్తువులు విడిపోయినప్పుడు ఏది స్థిరంగా ఉంటుందో దానికి అపాదానం అనే సంజ్ఞ వస్తుంది . అపాదాన సంజ్ఞ వచ్చిన పదం పంచమీ విభక్తిలో ఉంటుంది .
  1. वृक्षात् फलं पतति
చెట్టునుండి పండు పడుచున్నది .
A fruit is falling from a tree.
  1. बालक: विद्यालयात्  आगच्छति
బాలుడు పాఠశాలను౦డి వచ్చుచున్నాడు .
A boy is coming from school.
  1. आकाशात् वर्ष: पतति
ఆకాశము నుండి వర్షము పడుచున్నది .
మొదలైన ఉదాహరణలు పరిశీలిద్దాం
Rain is falling from the sky.    

वृक्षात् फलं पतति అనే వాక్యంలో చెట్టు పండు ఒకప్పుడు కలిసే ఉన్నాయి . వాటికి వియోగం కలిగింది . చెట్టు అక్కడే స్థిరంగా ఉంది పండు పడిపోయింది . అందుకే చెట్టుకు అపాదానసంజ్ఞ , తద్ద్వారా పంచమీ విభక్తీ  వచ్చి वृक्षात् फलं पतति  అయింది. అల్లాగే बालक: विद्यालयात्  आगच्छति అనే వాక్యంలో బాలకుడు విద్యాలయం ఒకే చోట ఉండేవారు. బాలుడు వచ్చేశాడు . విద్యాలయం స్థిరంగా అక్కడే ఉంది.  అందువల్ల ఆ పదానికి అపాదానసంజ్ఞ  తద్ద్వారా పంచమీ విభక్తి వచ్చి बालक: विद्यालयात्  आगच्छति  అనే వాక్య౦  ఏర్పడింది .

3. भयहेतु:

    ఎవరికైనా భయం కలిగినచో ఆ భయానికి  కారకులెవరో వారిని సూచించే పదానికి పంచమీ విభక్తి వస్తుంది .
1. चोरात् भयं चोरभयम् (దొ౦గ వలన భయము )
ఇక్కడ భయానికి కారణం దొంగ అందువల్ల ఆ పదానికి పంచమీవిభక్తి వచ్చింది .
2. पापात्  भयं पापभयम् (పాపము వలన భయము ) ఇక్కడ భయానికి కారణం పాపం . అందువల్ల ఆ పదానికి పంచమీ విభక్తి వచ్చింది .
3. छात्राणां व्याकरणात् भीति: (విద్యార్థులకు వ్యాకరణము వలన భయము )
ఇక్కడ విద్యార్థులకు వ్యాకరణం వల్ల భయం . అందువల్ల వ్యాకరణ పదానికి పంచమీ విభక్తి వచ్చింది .
4. सज्जनानां दुर्जनेभ्यो भयम् (మంచివారికి  చెడ్డవారి వలన భయం)
    ఇక్కడ భయానికి కారణం చెడ్డ వాళ్ళు కాబట్టి ఆ పదానికి పంచమీ విభక్తి వచ్చి దుర్జనేభ్యో  అయింది.
5 मूषिकस्य मार्जालात् भयं भवति ( ఎలుకకు పిల్లివలన భయం )
6. चोरस्य रक्षकभटेभ्यो भयं भवति (దొంగకు రక్షకభటుల వలన భయం )

  1. बहि: योगे (outside)

वनात् बहि: पर्वता: सन्ति (వనాత్ బహి: పర్వతా: సంతి )
ग्रामात् बहि: सरांसि सन्ति (గ్రామాత్ బహి: సరాంసి సంతి )
कूपात् बहि: मण्डूका: सन्ति (కూపాత్ బహి: మండూకా: సంతి)

Note:--  పంచమీ విభక్తి అకారాంత పుంలింగంలో ఈ విధంగా ఉంటుంది..
रामात् ---रामाभ्याम्रामेभ्य:
ग्रामात्- ग्रामाभ्याम्-ग्रामेभ्य:
పంచమీ విభక్తి  ఆకారాంత స్త్రీ లింగంలో ఈ విధంగా ఉంటుంది..
रमाया: -रमाभ्याम् रमाभ्य:
लताया: -लताभ्याम् लताभ्य:
పంచమీ విభక్తి అకారంత నపుంసక పుంలింగంలో ఈ విధంగా ఉంటుంది.
वनात् वनाभ्याम् वनेभ्य:
पुष्पात् -पुष्पाभ्याम्- पुष्पेभ्य:

5. Formation of nouns and verbs
प्रातिपादिकम्
रम् क्रीडायाम् అనే ధాతువునకు భావార్థంలో घञ  అనే ప్రత్యయ౦ వస్తే రామ राम అనే రూపం ఏర్పడుతుంది . దీన్ని ప్రాతిపదిక అంటాం . ఈ ప్రాతిపదికకు విభక్తి ప్రత్యయాలు చేరితే అది పదం అవుతు౦ది.
n      विभक्तिप्रत्यया: ప్రథమాదివిభక్తులకు ఏకవచన , ద్వివచన , బహువచానాల్లో 
सु जस्
अम् औट-शस
टा- भ्याम्- भिस्
(ङ्+ ) -  भ्याम् --भ्यस्
ङ्सि    भ्याम्-     भ्यस्
ङ्स्    ओस्-      आम्
(ङ्+ इ)  ओस्-     सुप्           చేరితే       
          
                       एकवचनम्                 द्विवचनम्                बहुवचनम्

प्रथम:-- (राम + सु)  राम: -- (राम  + औ) रामौ -   (राम+ जस् )  रामा:
द्वितीय :-- (राम+अम् ) रामम्     (राम  + औ) रामौ (राम + जस्) रामान्
तृतीया :--( राम +टा ) रामेण (राम + भ्याम्) रामाभ्याम्  (राम + भिस्) रामै:
चतुर्थी:--  (राम +ङ्+ ए) रामाय  ( राम+भ्याम्)  रामाभ्याम् (राम +भ्यस्) रामेभ्य:
पञ्चमी:--  (राम +ङ्सि) रामात्  (राम + भ्याम् ) रामाभ्याम्    (राम+भ्यस्) रामेभ्य:
षष्ठी :--     (राम +ङ्स्)  रामस्य (राम +ओस्) रामयो: (राम +आम्)      रामाणाम्
सप्तमी :-- (राम+ङ्+इ) रामे  (राम+ओस्) रामयो:  (राम +सुप्)          रामेषु  

అనే రూపాలు ఏర్పడతాయి . ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
ఇక క్రియాపదం మాటకొస్తే 

n      धातु:  भू 
     भू धातु: - వర్తమానకాలంలో
तिप् -- तस् -- झि
सिप्--- थस् -- थ
मिप्- वस् -- मस्
भू+(शप्)अ+ति =भवति

भू+(शप्)अ+ति =भवति

Present Tense

भव +( तिप्) ति    भव (तस्)  त:  - भव (झि)  न्ति
भव (सिप्) सि भव (थस्) थ:-   भव ()
भव (मिप्) मि भव (वस्)  व:- भव (मस्) म:

भवति   भवत:  - भवन्ति భవతి భవత: -భవంతి

भवसि भवथ:   -   भवथ భవసి భవథ: -భవథ

भवामि भवाव:  - भवाम: భవామి భవావ: - భవామ:
అనే రూపాలు ఏర్పడతాయి .అలాగే ఆత్మనే పదంలో    
आताम्
थास् आथाम् ध्वम्
इट वहि महिङ्    అనే ప్రత్యయాలు చేర్చగా

वन्दते वन्देते वन्दन्ते
वन्दसे वन्देथे वन्दध्वे
वन्दे वन्दावहे वन्दामहे
అనే వర్తమాన క్రియా రూపాలు ఏర్పడతాయి
         ఇక మిగిలిన కాలాలకు సంబంధించిన క్రియా పదాలకు కూడ ఇవే ప్రత్యయాలు వర్తిస్తాయి . అవి అనేక మార్పులుపొంది ఆయా కాలాలకు సంబంధించిన క్రియాపదాలు ఏర్పడతాయి
A Sanskrit Sloka
सिंहो व्याकरणस्य कर्तुरहरत् प्राणान् प्रियान् पाणिनेः
मीमांसाकृतमुन्ममाथ सहसा हस्ती मुनिं जैमिनिम्।
छन्दोज्ञाननिधिं जघान मकरो वेलातटे पिङ्गलम्
अज्ञानावृतचेतसामतिरुषां कोऽर्थस्तिरश्चां  गुणैः॥ 
(पञ्चतन्त्रम् )
పాణిని మహర్షి సంస్కృత వ్యాకరణ శాస్త్రాన్ని మనకు అ౦ది౦చిన మహనీయుడు .ఆయన ప్రపంచ మేధావులలోనే ప్రథాన గణనీయుడు . అటువంటి పాణిని మహర్షిని ఒక సింహం చంపేసింది . మీమాంసా శాస్త్ర ప్రవర్తకుడైన జైమిని మహర్షిని ఒక ఏనుగు త్రొక్కి చంపేసింది. ఇక ఛ౦దశ్శా సత్రాన్ని  రచించిన పి౦గళనాగమహర్షిని వేలాతటంలో ఒక మొసలి చంపేసింది . అజ్ఞానం చేత మదించిన వారికి , అధికకోపంగల వారికి ఇతరుల యొక్క మంచి గుణాలతో పని లేదు .