Friday, January 11, 2019

వీనులవిందైన వక్తృత్వకళకు అందమైన చిట్కాలు


వీనులవిందైన వక్తృత్వకళకు  అందమైన చిట్కాలు

                             డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

వక్తృత్వం ఒక కళ . ఏ కళలోనైనా నైపుణ్యం సంపాదించాలంటే ఆ కళలో కొంత సాధన చెయ్యాలి . మాట్లాడే కళలో గొప్పవాళ్ళు కావాలంటే మాట్లాడటం మొదలు పెట్టాలి . ఉదాహరణకు ఈదడం అనేది ఒక కళ . ఆ కళలో ప్రావీణ్య౦ సంపాదించాలంటే ఈదడం మొదలెట్టాలి.  అంతేగాని ఈతగాళ్ళ ఉపన్యాసాలు విన్నా, వాళ్ల విన్యాసాలు చూచినా ప్రయోజనం ఎక్కువగా ఉండదు.  ప్రపంచచరిత్ర పుటలు తిరగేస్తే మనకు ఎంతోమంది గొప్పగొప్ప వక్తలు కనిపిస్తారు. మనదేశంలోనే ఎంతోమంది ఉన్నారు . వాళ్ళల్లో, వాళ్ళ మాటల్లో ఎంతో ఆకర్షణ కనిపిస్తుంది . మాటలతో ప్రజల్ని మంత్రముగ్దుల్ని చేసిన వారే అందరు . కొంతమంది ఈ కళను ప్రజాహితం కోసం వినియోగిస్తే మరి కొంతమంది స్వార్థం కోసం వినియోగి౦చుకున్నారు . అదొక్కటే తేడా .  ఉదాహరణకి జర్మన్ నియంత Adolph Hitler ని తీసుకోండి. ఆయన వ్యక్తగత అంశాలు ప్రక్కన పెడితే   అంతటి వక్త మరొకడు లేడు . ఆయన ప్రసంగించేటప్పుడు ఆయన్ని చంపడానికి తుపాకులతో వచ్చేవారట. ఆయన చెప్పిన ఉపన్యాసం వినగానే కాళ్ళమీద పడిపోయి క్షమాపణలు కోరేవారట . ఇంకో గమ్మత్తే౦టంటే కొంతమంది పిల్లలు ఆయన ఉపన్యాసాలకు మంత్రముగ్ధులై ఆయన దగ్గరకెళ్లీ ఏమండి మానాన్న మిమ్మల్ని చంపడానికి కుట్ర పన్నుతున్నాడండి అని వాళ్ళు ఇంట్లో విన్న మాటల్ని ఆయనకు చెప్పేవారట . ఆయన మాటల్లో అంత ఆకర్షణ ఉండేది . సరే ! ఆ విషయం అలా ఉంచుదాం. ఏ కళలోనైనా నైపుణ్యం సాధించడానికి   ప్రతిభా , వ్యుత్పత్తి, అభ్యాసం అని మూడు కారణాలుంటాయి. ఇందులో ప్రతిభ సహజసిద్ధమైనది. అది దైవదత్తం  . ఇక వ్యుత్పత్తి , అభ్యాసం అనేవి మానవప్రయత్నానికి సంబంధించినవి . వ్యుత్పత్తి అంటే పాండిత్యం . ఇక అభ్యాసం అంటే నిరంతర సాధన . కొంతమందికి సహజంగానే ఈ వక్తృత్వం అనే కళ అలవడుతుంది .  వారికి ఈ నియమాలతో పనిలేదు . ప్రతిభ అంతగా లేనివాళ్ళు ఈ రంగంలో రాణి౦చాలంటే కొంత కొంత పాండిత్యం సంపాదించి కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం . మన ప్రాచీనులు,  పాశ్చాత్యులు  అభ్యాసానికి కూడ ఎంతో ప్రాముఖ్యం ఇవ్వడం కనిపిస్తోంది . You can improve your faculty by practice or impair it by negligence అని వారి అభిప్రాయం. మన ప్రాచీనులు వక్తృత్వకళలో ప్రావీణ్యం సంపాది౦చాలనుకునే వాళ్లకు కొన్ని సూచనలు చేశారు . అవి దృష్టిలో ఉంచుకుని సాధనచేస్తే అనూహ్యమైన ఫలితాలు సిద్ధిస్తాయి . మన పెద్దలు ఆ నియమాలను ఒక శ్లోకంలో రూపొందించారు .

1 తథ్యం:-  ఇది మొదటి నియమం .  తథ్యం అంటే యథార్థం . వక్త ఎప్పుడూ యథార్థం మాట్లాడాలి . అతని మాటల్లో  అసత్యంగాని, అతిశయోక్తి గాని ఉండ కూడదు . ఒక్కసారి ఎవరైనా అతని మాటల్లో అసత్యం గాని,  అతిశయం గాని గమనించారో ఆ మాటలకు విలువివ్వరు.

2. పథ్య౦ :- ఇది రెండో నియమం .   వక్త మాటలు మృదువుగా ఉండాలి . ఎట్టి పరిస్థితిలోను కఠినంగా ఉండకూడదు . ఒకవేళ కఠినంగా ఉండే  విషయాన్ని చెప్పవలసి వచ్చినా కూడ మృదువుగానే చెప్పగలగాలి

3 సహేతు:- ఇది మూడో నియమం . వక్త ఏ విషయమైనా హేతుబద్ధంగా చెప్పగలగాలి. దున్నపోతు ఈనింది,  దూడను కట్టేయండి అనే విధంగా ఉ౦డకూడదు. విషయాన్ని ఒకవేళ emotional గా ప్రతిపాదించినా అది హేతుబద్ధంగా ఉంటేనే అందరు మెచ్చుకుంటారు .

4. ప్రియం:- ఇది నాలుగో నియమం . వక్త తాను చెప్పబోయే విషయాన్ని అందరు మెచ్చుకునే లాగ,  అందరిని మెప్పించే లాగ ఉండాలే గాని ఏ ఒక్కరిని నొప్పించే విధంగా ఉ౦డ కూడదు . ఒక వేళ విషయం కష్టం కలిగి౦చేదైనా వాళ్లకు ఇష్టమైన రీతిలో  చెప్పాలి .

5. అతిమృదులం:- ఇది ఐదో నియమం . వక్త ప్రతిపాదించే విషయం అందరి మనస్సుకు హత్తుకునే లాగ ఉండాలి. పేలవంగా ఏదో చెబుతున్నాడులే అనే విధంగా ఉ౦డకూడదు.

6. సారవత్:- వక్త తాను చెప్పే విషయంలో సారం ఉందా లేదా అని గమని౦చుకుంటు ఉండాలి. ఊక దంపుడు ఉపన్యాసంలా ఉ౦డ కూడదు . కొంతమంది మాట్లాడతారు . అది విన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది . తరువాత ఆయన ఏ౦ చెప్పేర్రా  అని ఆలోచిస్తే ఏమీ ఉండదు .

7. దైన్యహీనం:-   ఇది ఏడో నియమం. వక్త తాను చెప్పే అంశాన్ని గట్టిగా, గంభీరంగా చెప్పాలి. కొంతమందికి మాత్రమే వినిపించేలా కాక సభాసదులందరికి స్పష్టంగా వినిపించేలా ఉండాలి .

8. సాభిప్రాయం:- ఇది ఎనిమిదో నియమం. వక్త చెప్పే విషయం ప్రయోజనవంతంగా, సూటిగా  ఉండాలి. అనవసరమైన విషయాలు మాట్లాడ కూడదు . శాఖా చంక్రమణం (beating around the bush) పనికిరాదు .

9. దురాపం:- ఇది తొమ్మిదో నియమం.  అంటే వక్త చెప్పే అంశాలు శ్రోతలకు పూర్తిగా తెలిసేవి కాకూడదు. అతని మాటలు శ్రోతలను ఆలోచింప చేసే విధంగా ఉండాలి. ఆలోచిస్తేనే తెలిసేవిగా ఉండాలి . ఆలోచించి అర్థం చేసుకునేవిగా ఉండాలి . అలా లేకపోతే వినేవారికి ఆసక్తి కలుగదు, చాల  పేలవంగా తోస్తుంది ..

   10. సవినయం:- ఇది పదో నియమం.   వక్త తాను మాట్లాడే మాటలలో  వినయ౦ తొణికిస లాడేలా చూసుకోవాలి . గర్వం గాని , అహంకార౦ గాని ఏ కోశాన కనిపించకూడదు . 

11. ఆశఠ౦:- ఇది పదకొండో నియమ౦.  వక్త మాటలు మొండివైఖరితో ఉoడకూడదు. . అందరికీ అంగీకారయోగ్యంగా ఉండాలి

12. చిత్రం:- ఇది పన్నెండవ నియమం. వక్త మాటలు నిస్సారంగా ఉ౦డకూడదు. . మంచిమంచి పదాలతో figurative గా చమత్కార భరితంగా ఉండాలి. లలితమైన శబ్దాలంకారాలతో అందమైన అర్థాలంకారాలతో ఆకర్షణీయంగా ఉండాలి. అలాగని అసలు విషయం లేకుండా కృత్రిమంగా ఉండరాదు.  కేవలం verbosity పనికిరాదు .

13. అల్పాక్షరం:- ఇది పదమూడవ నియమం.  వక్త తాను చెప్పదలచుకున్న అంశాన్ని చాల సంక్షిప్తంగా చెప్పాలి . ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండుననిపి౦చాలి గాని ఎప్పుడు ఆపుతాడురా బాబూ అనిపించేలా ఉ౦డకూడదు. హృదయం కదిలి౦చే విధంగా ఉ౦డాలి గాని కుర్చీల్లో౦చి  కదిలించే విధంగా ఉ౦డకూడదు.

14.  బహ్వర్థం:- ఇది పదునాలుగో నియమం. ప్రతిమాట ఎంతో అర్థవంతంగా ఉండాలి . విషయగాంభీర్యంతో ఉండాలి.

15. కోపశూన్యం:- ఇది పదిహేనో నియమం. వక్త ఎప్పుడు చిరునవ్వుతోనే మాట్లాడాలి. ఎట్టి పరిస్థితిలోను కోపాన్ని ప్రదర్శి౦చ కూడదు. ఒకవేళ శ్రోతలు విసిగి౦చినా సంయమనం కోల్పోకూడదు.

16. స్మితయుతం:- ఇది పదహారో నియమం.   వక్త  ఎప్పుడు చిఱునగవుతోనే మాట్లాడాలి . ఎటువంటి మాటలైనా చిఱునగవుతోనే చెప్పాలి.

 17. ఘనదాక్షిణ్యయుక్తం:- ఇది పదిహేడో నియమం.    వక్త ఏ విషయాన్నైనా పక్షపాత రహితం (UNBIASED) గా ప్రతిపాదించాలి. ఒక అంశాన్ని గాని ఒక సిద్ధాంతాన్ని గాని నిర్హేతుకంగా  సమర్ధించకూడదు, తూలనాడకూడదు .

18. సందేహహీనం:-   వక్త ఏ విషయాన్నైనా ఎటువంటి సందేహం లేకుండా ఖచ్చితంగా సూటిగా చెప్పగలగాలి. నూటికి నూఱుపాళ్ళు తాను చెప్పే విషయం పట్ల  సంపూర్ణమైన  విశ్వాసం కలిగి ఉండాలి. ఆంగ్లభాషలో ఒక సామెత ఉంది . దాని సారాంశ మే౦టంటే: 
ఒకడున్నాడు వాడికేం తెలీదు , తనకేమీ తెలీదనే విషయం కూడ వాడికి తెలీదు. అటువంటివాడు మూర్ఖుడు, వాణ్ణి దూరంగా ఉంచాలి .
మరొకడున్నాడు. వాడికేం తెలీదు. కాని తనకేమీ తెలీదనే విషయం వాడికి తెలుసు . అటువంటి వాడికి బోధించాలి.
వేరొకడున్నాడు . వాడికి అన్ని తెలుసు కానీ తనకు తెసుననే విషయం వాడికి తెలీదు . అతను అజ్ఞానంలో ఉన్నాడు . అతనిని మేల్కొల్పాలి .
ఇంకొకడున్నాడు  అతనికన్నీ తెలుసు , తనకన్నీ తెలుసనే విషయం కూడ అతనికి తెలుసు. అతడు జ్ఞాని . అతన్ని అనుసరించాలి.

He, who knows not and knows not that he knows not is a fool. Shun him.
He, who knows not and knows that he knows not can be taught. Teach him.
He, who knows and knows not that he knows not is asleep. Wake him.  
  He
, who knows and knows that he knows, is a prophet. Follow him.
కాబట్టి వక్త సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో ఉండాలి. సందేహాలకు చోటుండకూడదు . ఒకాయన మాట్లాడడం మొదలు పెట్టాడు , ఆ ముందురోజు కొంత మాట్లాడాడు . ఏం మాట్లాడాడో, ఎంతవరకు మాట్లాడాడో మరిచిపోయాడు. Yesterday I delivered.. I delivered... I delivered అంటూనే ఉన్నాడు అదేంటో చెప్పలేక పోతున్నాడు . అంతలో శ్రోతల్లోంచి ఒకాయన లేచి He has already delivered thrice, but nochild అన్నాడు. అందరు అది విని గొల్లు మన్నారు. 

19. సప్రమేయం:- ఇది పందొమ్మిదవ నియమం వక్త ప్రతి అంశాన్ని హేతుబద్ధంగా మాట్లాడాలి.

 20. అప్రమత్తం:- ఇది ఇరవయ్యో నియమం . చాల ముఖ్యమైనది . వక్త చాల అప్రమత్తంగా మాట్లాడాలి. ఒక్క ముక్కలో  పచ్చిగా చెప్పాలంటే  ప్రతి మాట  ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి

తథ్యం పథ్య౦ సహేతు ప్రియమతిమృదులం సారవద్దైన్యహీనం
సాభిప్రాయం దురాపం సవినయమశఠ౦ చిత్రమల్పాక్షరం చ
బహ్వర్థం కోపశూన్యం స్మితయుతఘనదాక్షిణ్య సందేహ హీనం 
వాక్యం బ్రుయాద్రసజ్ఞ: పరిషది సమయే సప్రమేయాప్రమత్తం
  
तथ्यं पथ्यं सहेतु प्रियमतिमृदुलं सारवद्दैन्यहीनं
साभिप्रायं दुरापं सविनयमशठं चित्रमल्पाक्षरं |
बह्वर्थं कोपशून्यं स्मितयुतघनदाक्षिण्यसन्देहहीनं
वाक्यं ब्रूयाद्रसज्ञ: परिषदि समये सप्रमेयाप्रमत्तम् ||    




No comments: