Friday, January 4, 2019

ఒకటి రెండు - రెండు ఒకటి


ఒకటి రెండు - రెండు ఒకటి

డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాద రావు

సుబ్బారావు ఎంతో పొదుపరి. ఎంగిలి చేత్తో కాకిని కూడ అదలి౦చని గొప్ప పిసినారి. అతను ఎంత పిసినారో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు .  ఒకసారి పొరుగూరి నుంచి ఇంటికి రైల్లో వస్తున్నాడు . రైలు ఇంటి ము౦దు ను౦చే పోతుంది . స్టేషను దాకా వెడితే మళ్ళా రిక్షాలో ఇంటికి రావాలని , ఆ ఖర్చు తగ్గి౦చడం కోస౦ రైలు సమీపానికి రాగానే రైల్లోంచి దూకేశాడు . తత్ఫలితంగా రెండు కాళ్ళు విరిగిపోయాయి . ఇది ఆయన కథ . సరే ఆ సంగతి అలా ఉంచుదాం . ఒకసారి ఆయన ఇంటికి ఒక   అతిథి వచ్చాడు . అసలు అతిథిని ఆదరించే అలవాటు లేనే లేదు . కాని ఆరోజు కాదనలేని పరిస్థితి దాపురించింది . ఎందుకంటే ఆ వ్యక్తీ  బాగా దగ్గరి వాడు, అందులోనూ వయస్సులో చాల పెద్ద వాడు . అందువల్ల కాదనలేక పోయాడు. ఎదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలి అని  ఆలోచించాడు . వెంటనే ఉపాయం తట్టింది . భార్యకు సైగ చేస్తూ  ఏమే! ఒకటి రెండు   రెండు ఒకటి చెయ్యి   అన్నాడు. అతిథికి ఏమీ అర్థం కాలేదు . అసలే పొరుగూరిను౦చి నడిచొచ్చాడో యేమో  ఆకలితో నకనక లాడిపోతున్నాడు . కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి . కాళ్ళు చేతులు వ్రేలాడి పోతున్నాయి . నీరసంతో విలవిలలాడి పోతున్నాడు .  ఒక వైపు ప్రాణాలు పోయే పరిస్థితి . మరో వైపు ఎంత  నిరీక్షిస్తున్నా భోజనానికి పిలుపు రావడం లేదు . ఒంటి గంట దాటింది , రెండు దాటింది , మూడు దాటింది , నాలుగు దాటింది , ఐదు కావొస్తో౦ది. బాబయ్య గారు భోజనానికి రండి అనే పిలుపు ఆ ఇంటి ఇల్లాలి నోటినుంచి  వినిపించింది . అతని ఆనందానికి అవధులే లేవు . ఒక్క ఉదుటున లేచి  కంచం ముందు చతికిలపడ్డాడు . ఆమె వడ్డన మొదలెట్టింది . ముందుగా  అరిటికాయ కూర వడ్డించింది . అవి తరగగా వచ్చిన తొక్కలతో పచ్చడి చేసింది . అదికూడా వడ్డించింది . మొహమాటపడకు౦డా భోజనం చెయ్య౦డి బాబయ్యగారు! అంది.    అతికష్ట౦ మీద నాలుగు మెతుకులు కొరికి చెయ్యి కడుక్కున్నాడు . అంతే ఇంక రాత్రి భోజనానికి పిలుపే  లేదు . మరునాడు వెళ్ళిపోతూ వీడి దుంప తెగా   ఒకటి రెండు, రెండు ఒకటి చెయ్యమన్నాడు దాని అర్థం ఇదేకాబోలు అని తిట్టుకున్నాడు మనసులో  


No comments: