Friday, December 2, 2022

కవులతో పెట్టుకోకు ఖరుసైపోతావ్-1 డాక్టర్ చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

కవులతో పెట్టుకోకు ఖరుసైపోతావ్-1

డాక్టర్ చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

 ఉదయంతు శతాదిత్యా: ఉదయంత్వి౦ దవ: శతం

న వినా  కవివాక్యేన నశ్యత్యాభ్యంతరం తమ:

అన్నారు మన పెద్దలు .   వంద సూర్యబింబాలు , వందచంద్రబింబాలు ఉదయిoచొచ్చు. కాని మానవ హృదయాల్లో నున్న అజ్ఞానాన్ని  కవివాక్కు  మాత్రమె  పోగొట్టగలదు.

సరే ! ఆసంగతలా ఉంచుదాం .

సమాజంలో కవికి చాల ప్రాముఖ్యం ఉంది . ఏక కాలికమైన అంశాన్ని సార్వకాలికం చేసేవాడు, వ్యక్తిగతమైన అంశాన్ని సమాజగతం చేసేవాడు, క్షణికమైన దానిని శాశ్వతం చేసే వాడు కూడ కవే . అలాగే బ్రహ్మానందంతో ఇంచుమించు సమానమైన ఆనందాన్ని తన కావ్యం ద్వారా కవి పాఠకుని కందిచే వాడు కూడ కవే. అటువంటి కవిని చిన్నచూపు చూడకూడకూడదు . 

“కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు

కృతిని జెందువాడు మృతుడు కాడు”  అంటారు శ్రీ జాషువ .

అందుకే గొప్ప గొప్ప చక్రవర్తుల కూడ కవులతో విరోధం పెట్టుకోలేదు. దానికి కారణం ఏమిటంటే రాముని  రావణున్ని కవే సృష్టించాడు . కవి ఎవారినైనా  ఎలాగైనా వర్ణించగలదు.    

కవులతో విరోధం పెట్టుకుని నవ్వులపాలైన ఒక పెద్దమనిషిని గురించి తెలుసుకుందాం .

 కూచిమంచి జగ్గకవి ఎన్నో రాజాస్థానాల్లో సత్కారాలు, సన్మానాలు పొందిన సాటిలేని మేటి సరసకవి . ఆయన ఒకప్పుడు విజయనగరం వెళ్లి శ్రీ పూసపాటి విజయరామరాజుగారి   చెల్లెలి భర్త శ్రీ చింతలపాటి నీలాద్రి రాజును ఆశ్రయించాడు. ఆయన తాను౦చుకున్న వేశ్యను నాయికగా చేసి తన మీద ఒక ప్రబంధం రచించమని అడిగాడు .  జగ్గకవి దానికంగీకరించి చంద్రరేఖావిలాసమనే అద్భుతమైన కావ్యాన్ని రచించాడు. అంతలో శ్రీ నాడిమళ్ళ వెంకటశాస్త్రి అనే పండితుడు తాను ఆ గ్రంథాన్ని సంస్కృతంలో రచించి ఇస్తానని చెప్పి  జగ్గకవి కావ్యాన్ని  నిరసించేలా చేశాడు . అప్పటికే కావ్యరచన పూర్తయింది . కాని నీలాద్రిరాజు జగ్గకవిని పట్టించు కోలేదు. అప్పుడు జగ్గకవి తనకు జరిగిన అవమానానికి కోపించి తాను వ్రాసిన గ్రంథాన్ని పూర్తిగా చించి పారేశాడు .  చంద్ర రేఖా విలాపమనే అసభ్యకరమైన హాస్య ప్రబంధాన్ని రచించాడు. అంతటితో ఊరుకోలేదు . ఆ తరువాత జగ్గకవి హైదరాబాదు వెళ్లి అప్పటి పాలకుడైన నవాబును చేరుకొని ఆయనను సంతోషపరచి తనగ్రంథాన్ని నీలాద్రి రాజును కూర్చోబెట్టి  అతని  సమక్షంలో ఆ గ్రంథాన్ని చదవడానికి అనుమతి సంపాదించి  ఆ గ్రంథం  ఆముఆలాగ్రం  చదివి వినిపించి  అతనిని నవ్వులపాలు చేశాడు. కవి ఎవరినైనా పగ బడితే వారి అంతు చూసేదాకా వదలడు .       కవి అనుగ్రహం ఎంత ఆహ్లాద కరంగా ఉంటుందో ,ఆగ్రహం కూడ అంత కఠినం గాను ఉంటుంది . సరసుడైతే విలాసం విరసుడైతే విలాపం  

 

No comments: