శివుడు త్రిపురాంతకుడు
(అర్థం -అంతరార్థం)*
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
ఈశ్వరుడు త్రిపురాసురులను
సంహరించాడని ఆ కారణం చేత అతనికి త్రిపురాంతకుడనే పేరు కలిగిందని పురాణాలు
చెపుతున్నాయి. పూర్వం త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులుండేవారట వారు పురాలుగా
అంటే పురరూపంలో ఉండేవారట. వారు ఆకాశంలో సంచరిస్తూ ఎక్కడపడితే అక్కడ వాలే
వారని ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు వారిక్రింద
పడి నలిగి చచ్చి పోయేవారని ప్రజలు ఆ
రాక్షసుల బాధలు పడలేక శివుని వేడుకుంటే ఆయన కరుణించి వారిని సంహరించాడని పురాణాల్లో కథలు కనిపిస్తున్నాయి. పౌరాణికులు
మనకు వినిపిస్తున్నారు. ఈ కథ యొక్క తాత్పర్యం మాత్రం ఎవరు వివరించడం లేదు. అలా
చెప్పకపోవడం వాళ్ళ మన వైదిక సంస్కృతికి ఎంతో నష్టం కలుగుతోంది. అందువల్ల ఈ కథ యొక అంతరార్థం తెలుసుకోవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది.
పురం అంటే శరీరం . పురి=శరీరంలో శేతే=
నివసిస్తాడు కాబట్టి పురుష: అంటారు. పురమంటే
శరీరం అనుకున్నాం కదా! ఇక త్రిపురాలసంగాతికోద్దాం
. మానవశారీరాన్ని భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా విశ్లేషిద్దాం . దీన్ని మనం meta-physical Anatomy అంటాం. అది తెలుసుకుందాం . ఇక దీనికంటే ముందు మనం కొంత తెలుసుకోవాలి .
మానవుడు
తన జీవితంలో సాధించవలసిన వానిని పురుషార్థములు అంటారు .
అవి ధర్మం , అర్థం , కామం
, మోక్షం అని నాలుగు . ఇందులో మొదటి మూడు ఆచరించేవి . నాల్గోది పొందేది .
ఇది అత్యున్నతమైన పురుషార్థంగా పేర్కొన బడింది . దీన్నే ముక్తి అని కూడ పిలుస్తారు
. మానవుడు జన్మమరణరూపమైన ఈ సంసారచక్రం నుండి
బయటపడడమే ముక్తి . ఇది మానవుడు తన
ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది, వేరొకమార్గం
లేదు . తమేవ విదిత్వాsతిమృత్యుమేతి
నాsన్య: పంథా: విద్యతే s యనాయ అనే
శ్రుతి ఈ విషయాన్ని సమర్ధిస్తోంది. ఈ
ముక్తి జీవన్ముక్తి, విదేహముక్తి అని రెండు విధాలు. మనిషి
జీవించి యు౦డగానే ముక్తిని పొందితే అది జీవన్ముక్తి అని, మరణించిన
తరువాత ముక్తి పొందితే అది విదేహముక్తి అని అంటాం. భారతీయతత్త్వశాస్త్రంలో ఈ
జీవన్ముక్తికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.
.
ఆత్మకు శరీరం ఉండదు.
అదిశరీరంతోను ఇంద్రియాలతోను కలిసి పొందడం వల్ల ఆత్మకు శరీరం ఉందనుకుంటున్నాం. ఆత్మ దేశకాలాలకు అతితమైనది . కాబట్టి ఆత్మ యొక్క యథార్థస్వరూపాన్ని గుర్తిస్తే జీవించి యుండగానే
ముక్తి పొందే అవకాశం ఉంది. ఆత్మ తెలియబడే వస్తువు కాదు. అందువల్ల ఆత్మ కంటే
భిన్నమైన వస్తువులను గుర్తించి వాటిని వదిలేస్తే ఆత్మ తెలుస్తుంది, అనుభవగోచరం అవుతుంది.
కాబట్టి ఆత్మను గుర్తించాలంటే దానినావరించియున్న శరీరాలు, కోశాలు
గురించి స్పష్టంగా తెలుసుకోవడం అవసరం .
ఈ
ఆత్మ చట్టు ఐదు
కోశాలుంటాయి.
1.
అన్నమయ
2 ప్రాణమయ
3
మనోమయ
4.
విజ్ఞానమయ
5.
ఆనందమయ
ఈ ఐదు కోశాలే
1. స్థూలశరీరం
2. సూక్ష్మశరీరం
3. కారణశరీరం అనే మూడు శరీరాలుగా ఏర్పడుతున్నాయి.
అన్నమయకోశం
=1.స్థూలశరీరం
1.ప్రాణమయ+2.మనోమయ+3.విజ్ఞానమయ
కోశాలుమూడు కలిస్తే =2. సూక్ష్మ శరీరం
ఆనందమయ
కోశం =3. కారణ శరీరం
కాని ఆత్మకు వీటితో ఎటువంటి సంబంధం లేదు.
1.అన్నమయకోశం: ఇది
పంచభూతాలతో నిర్మి౦చబడింది. మనం తిన్న ఆహార౦తో ఈ
అన్నమయకోశం ఏర్పడుతుంది. మనకు పైకి కనిపించే ఈ శరీరమే అన్నమయ కోశం .
2.
ప్రాణమయకోశం: మనకు కనిపించే ఈ అన్నమయకోశం
లోపల ప్రాణమయ కోశం ఉంటుంది . ఇది ప్రాణ౦, అపాన౦, వ్యాన౦,
ఉదాన౦, సమాన౦ అనే ఐదు వాయువులతోను ; నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధన౦జయమనే ఐదు ఉపవాయువులతోను కూడి ఉంటుంది .
ప్రాణం హృదయంలోను , అపానం గుదస్థానం లోను. సమానం బొడ్డులోను,
ఉదానం కంఠ౦లోను, వ్యానం శరీరమంతటను వ్యాపించి
ఉంటాయి.
హృది
ప్రాణే గుదేsపాన: సమానో నాభిమండలే
ఉదాన:
కంఠదేశస్థ: ప్రాణ: సర్వశరీరగ: అని శాస్త్రకారులు
పేర్కొన్నారు. ఇక వాటితోపాటు నాగ, కూర్మ, కృకర, దేవదత్త , ధన౦జయమనే
ఉపవాయువులు కూడ ఉంటాయి. నాగం అనే వాయువు ముక్కులో ఉంటుంది . కూర్మం కంటి
రెప్పలలో ఉంటుంది. కృకరం నేత్ర వలయంలోను , దేవదత్తం కంఠద్వారమందు, ధనంజయం శరీరమంతటను నిండి
ఉంటుంది . ఇక ఉపవాయువుల మాటకొస్తే నాగ౦ వాంతి మొ|| వాటికి
కారణ౦ అవుతుంది . కూర్మ౦ కనురెప్పలు తెరుచుకోడం, మూసుకోడం
మొదలైన పనులకు తోట్పడుతుంది. కృకరం ఆకలిదప్పికలను అదుపులో ఉంచుతుంది. దేవదత్తం
అనే వాయువు ఆవులింత మొదలైన వాటికి కారణం అవుతుంది . ధనంజయం శరీరానికి పోషకంగా ఉండి
కాంతిని చేకూరుస్తు౦ది. ఈ ధనంజయం అనే వాయువు మనిషి
మరణించిన తరువాత కూడ మృతకళేబరానికి స్నానం చేయి౦చే వరకు శరీరాన్నే అంటి పెట్టుకుని
ఉంటుంది. అందుకే స్నానం చేయి౦చాకనే దహనసంస్కారాలు నెరవేరుస్తారు.
3. మనోమయకోశం: ఇది ఐదు జ్ఞానే౦ద్రియాలతోను, ఐదు కర్మేంద్రియాలతోను,
మనసుతోను కలసి ఏర్పడుతుంది. చర్మం ,
కన్ను , ముక్కు, చెవి,
నాలుక, అనేవి జ్ఞానేంద్రియాలు, ఎందుకంటే మనం వీటి ద్వారానే జ్ఞానం సంపాదిస్తా౦. కాలు, చేయి, నోరు, జననే౦ద్రియం, విసర్జనేం
ద్రియం, అనే ఈ ఐదు కర్మేంద్రియాలు . ఈ పది మనసుతో కలసి మనోమయకోశంగా ఏర్పడతాయి.
4. విజ్ఞానమయకోశం
ఇది
ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు బుద్ధితో కలిసి
ఏర్పడుతుంది . ఇది మనోమయకోశం లోపల ఉంటు౦ది .
5. ఆనందమయ
కోశం :
విజ్ఞానమయకోశం లోపల ఆనందమయకోశం ఉ౦టు౦ది.ఈ ఆనందమయ కోశంలో పూర్వజన్మలో చేసిన
కర్మలన్నీ సంస్కారరూపంలో ఉంటాయి.
ఇక
అన్నమయకోశంకంటే ప్రాణమయకోశం , ప్రాణమయకోశంకంటే మనోమయకోశం, మనోమయకోశం కంటే విజ్ఞానమయకోశం, విజ్ఞానమయకోశం కంటే
ఆనందమయకోశం సూక్ష్మమైనవి, ప్రియమైనవికూడ.
ఉదాహరణకి
మనం అన్నంకోసం పొట్టచేతపుచ్చుకుని తిరుగుతాం. ఎక్కడ ఉద్యోగమొస్తే అక్కడకు పోతాం.
కాని అక్కడ ప్రాణానికి ముప్పువచ్చే పరిస్థితి ఎదురైతే ప్రాణంకోసం అన్నాన్ని
విదిచిపెట్టేస్తా౦. ఇక్కడ అన్నం కంటే ప్రాణం ముఖ్యమని తెలుస్తోంది. అల్లాగే
ఎప్పుడైనా మన మనస్సుకు గాని, అభిమానానికి గాని ముప్పు వాటిల్లితే ప్రాణం
విడిచి పెట్టడానికైనా సిద్ధ పడతాం గాని మనస్సును సమాధానపరచం. దీన్ని బట్టి ప్రాణం
కంటే మనస్సు గొప్పదని తెలుస్తోంది . ఒక్కొక్కప్పుడు మనం విజ్ఞానంకోసం మనస్సు
చంపుకుని ఎన్ని అవమాలైనా భరిస్తాం. గురువు ఎన్ని తిట్టినా ఎంత కొట్టినా
ఓర్చుకుంటాం. ఎందుకు? విజ్ఞానం కోసం. దీన్ని బట్టి
మనోమయకోశంకన్నా విజ్ఞానమయకోశం గొప్పదని తెలుస్తో౦ది. ఇక ఆనందం కోసం అన్ని
విదిచిపెట్టేస్తాం . ఎందుకంటే అదే జీవిత పరమావధి. దీన్నిబట్టి ఆనందమయకోశం
అన్నిటికన్న గొప్పదని తెలుస్తోంది. ఈ ఆనందమయకోశం ఆత్మకు చాల దగ్గరలో ఉండడం వల్ల
ఆనందమయకోశాన్నే ఆత్మ అని భ్రమించే అవకాశం కూడ ఉంది.
ఇక
అన్నమయకోశమే స్థూలశరీర౦. ప్రాణ, మనో, విజ్ఞానమయ
కోశాలు సూక్ష్మశరీర౦. ఈ సూక్ష్మశరీరాన్నే యాతనాశరీరం అని కూడ పిలుస్తారు. ఇది
మనిషి మరణించిన తరువాత స్వర్గనరకాదులు చేరుకొని పుణ్య పాప ఫలాలను
అనుభవిస్తుంది. ఇక ఆనందమయకోశమే కారణశరీరo.
స్థూలశరీరం జాగ్రదవస్థ (మెళుకువ)లోను; సూక్ష్మశరీరం
స్వప్నావస్థ(కల)లోను; కారణశరీరం సుషుప్త్యవస్థ(నిద్ర)లోను
మనకు అనుభవం లోకోస్తాయి..
ఆత్మకు వీటితో సంబంధంలేదు. ఈ మూడిటి కంటే అతీతమై౦ది. ఏ క్షణ౦లో జీవుడు ‘ నేను ఈ మూడిటికంటే
విలక్షణమైన ఆత్మతత్త్వాన్ని’ అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో ఆ క్షణంలోనే ముక్తుడౌతాడు .
ఈ విషయాన్నే తేజోబి౦దూపనిషత్తు ఇలా తెలియజేస్తోంది .
దేహత్రయాతిరిక్తోsహం శుద్ధచైతన్యమస్మ్యహం|
బ్రహ్మాsహమితి య:
శాంత: స జీవన్ముక్త ఉచ్యతే ||
నేను
స్థూల, సూక్ష్మ, కారణశరీరముల కంటే అతీతుడను, శుద్ధ, బుద్ధ, ముక్త స్వభావమైన పరబ్రహ్మమును, శాంతస్వభావుడను అని అనుభవపూర్వకంగా తెలుసుకు౦టాడో అట్టి వాడే
జీవన్ముక్తుడు.
ఇంత విషయాన్ని వివరించడానికి
మన పూర్వులు కొండంత కథ అల్లేరు.
ఈ
మూడింటికీ ఆత్మస్వరుపుడైన శివుడుఅతీతుడు . ఇది చెప్పడమే ఈ కథలోని సారాశం.
<><><.<><>
No comments:
Post a Comment