డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
మహానటి శ్రీమతి జమునమ్మ మనకికలేరనే
వార్త తెలియగానే నా మనసెందుకో తీవ్రమైన పరితాపానికి
గురైంది . సినీ కళామతల్లి ఒక నటీమతల్లిని శాశ్వతంగా కోల్పోయిందనిపించింది . సరే ! జాతస్య
మరణం ధ్రువం అనే మాట ప్రక్కన
పెడితే ఉత్తమ నటిగా, నటనపట్ల నిబద్ధత, ఆరాధనభావం,
అత్యుత్తమ సేవానిరతి, ఉన్నత వ్యక్తిత్వం గల మహిళామణిగా, ఆదర్శగృహిణిగా ఆమె పొందిన
పేరు, ప్రఖ్యాతులు జగమేరిగినవే. నేను నాల్గవతరగతి చదువుకుంటున్న రోజుల్లో నరసాపురంలో
‘మూగమనసులు’ సినిమా తీస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆమెను,
సావిత్రీదేవిని చాల దూరంనుంచి చూశాను . ఆ
తరువాత మా ప్రాంతంలో జరిగిన సినిమా
షూటింగ్ సమయాల్లో ఒకటి రెండుసార్లు ఆమెను చూశాను. ఇక రాజకీయసభల్లో ఆమె ప్రసంగాలు
ఎన్నో విన్నాను. ఈ మధ్య ఆమెను వారి
నూతనగృహంలో చూడడం తటస్థ పడింది . ఒకసారి నేను, నా భార్య హైదరాబాదు వెళ్ళినప్పుడు అక్కడ పనిచేస్తున్న మామిత్రులు శ్రీ రవివర్మగారిని కలిశాం . ఒకసారి జమునగారిని
చూడాలని అనుకుంటున్నామండి అన్నాం ఆయనతో . ఆయన వెంటనే స్పందించి వారింటికి
తీసుకెళ్ళారు. తీరా చూస్తే ఆమె అక్కడ లేరు . అక్కడున్న ఒకామె జమునామేడం ఇక్కడ
ఉండడం లేదండి . కొత్తిల్లు కట్టుకున్నారు,
అక్కడే ఉంటున్నారని చెప్పింది. అప్పుడు ఆమె చెప్పిన గుర్తులను బట్టి వెతుక్కుని
అక్కడికి వెళ్ళాo. ఆమె అప్పుడే కొత్తగా
అక్కడికి వెళ్ళినట్లున్నారు .
ఇంటి
పనులు పూర్తికాలేదు. wood work ఇంకా జరుగుతోoది. నేను లోపలికెళ్ళి
జమునమ్మగారున్నారా? అని అడిగాను . ‘అప్పుడే
మన కొత్త ఇంటి అడ్రస్సు వీరికెలా తెలిసిందయ్యా!’ అనే మాటలు వినిపిస్తున్నాయి . ఎవరో
బయటకొచ్చి తలుపుతీస్తారని అనుకుంటున్న మాకు సాక్షాత్తుగా ఆమే వచ్చి తలుపుతీయడం ఆశ్చర్యం కలిగించింది. నేనన్నాను. నేను మీ అభిమానిని , నేను మూడోతరగతి
చదువుకుంటున్నరోజుల్లో మా ఊళ్లో మూగమనసులు సినిమా తీస్తున్నప్పుడు మొదటిసారిగా మిమ్మల్ని చూశాను . ఆ తరువాత ఎన్నోసార్లు
మిమ్మల్ని ఎన్నో సార్లు రాజకీయ సభల్లోను
చూశాను. మరొక్కసారి మిమ్మల్ని చూడటానికి ఇంటికి వచ్చామన్నాను. ఆమె కూడ చాల ఆనందంతో
మమ్మల్ని లోపలి ఆహ్వానించారు. చాలసేపు మాతో మాట్లాడేరు. లేతమనసులు దగ్గరనుంచి ఆమే
పొందిన అవార్డులన్నీ ప్రతి దాన్ని మాకు చూపించారు. వస్త్రేణ వపుషా వాచా
విద్యయా వినయేన చ అంటారు పెద్దలు . ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వేసుకునే
దుస్తులు , రూపం , మాటలపొందిక , విద్య , వినయం అనే (వకారపంచకం) ఐదిటివల్ల
తెలుస్తుందట. ఈ ఐదంశాల్లోను పరిపూర్ణంగా
మాకు కనిపించిన ఆమెను చూచి మంత్ర ముగ్దులమయ్యాం . నలభై నిముషాలు నాలుగు నిమీషాల్లా
కరిగిపోయాయి . ఇంటిలో అంతటి పని వత్తిడి ఉన్నా కొంతసేపు మాతో గడిపిన ఆమె
ఔదార్యానికి కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడనుండి బయలు దేరాము . ఆమె కేవలం ఉత్తమ నటి
మాత్రమే కాదు. ఉత్తమ సేవానిరతిగల మహిళామణి.
అత్యుత్తమ ఆదర్శగృహిణి. ఆమె జీవితం
నేటి మహిళాలోకానికి, భావితరాలకుకూడ
ఆదర్శం కావాలి. ఆమె భౌతికంగా మననుంచి దూరమైనా ఆమె మన హృదయాల్లో శాశ్వతంగా
నిలిచిపోతారు. ప్రకృతి ఆమె భౌతిక శరీరాన్ని కబళించిందే గాని కీర్తి శరీరాన్ని
కబళించడానికి దాని కెన్ని గుండెలు!
వారి కుటుంబ సభ్యులకు నా
ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను .
<><><><>
No comments:
Post a Comment