A misconception about Mahatma Gandhi (1)
డాక్టర్ . దుర్గాప్రసాదరావు చిలకమర్తి
ఈమధ్య సమాజంలో చాలామంది, ఆలోచనా రహితంగా ఏవో, ఏవేవో మాట్లాడేస్తున్నారు.
ఎవరికైనా తమ అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉంది . అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది
భారతీయ సనాతన ధర్మం . ఇక దేవుడు లేడని భావించే చార్వాకుని అభిప్రాయాలను వివరిస్తూ ‘నాస్తికశిరోమణినా
చార్వాకేణ’ అంటారు విద్యారణ్యస్వామి. అలాగే అద్వైతమతస్థాపన కోసం బౌద్ధమతాన్ని
ఖండించవలసి వచ్చినప్పుడు ‘భగవతా బుద్ధేన’
అని గౌరవప్రదంగా అనడం మనం గమనించాలి . ఇవి
మన సనాతన సంస్కృతీ సాంప్రదాయాలు అని మనం ఎన్నడు మరిచిపోకూడదు. ఎట్టి పరిస్థితిలోను మనం
వీటిని విడిచిపెట్టకూడదు . సర్వశాస్త్ర
పారంగాతోsపి య: సాంప్రదాయవిత్
న భవతి స మూర్ఖవదుపేక్షణీయ: అన్నారు శంకరులు. ఎంత చదువుకున్నా సంస్కృతీ
సాంప్రదాయాలను విడిచి పెట్టినవాడు మూర్ఖుడే ఔతాడట. ఇక స్థితస్యగతి: చింతనీయా అనేది మరో
నియమం.
ఒక విషయం పై, ఒక వ్యక్తి, ఒక విధంగా
స్పందిస్తే ఆ స్పందనకు కారణం అనుకూలాత్మకంగా, ఆలోచించడానికి ప్రయత్నించాలి.
. అనుకూలాత్మకంగా ఎంత ఆలోచించినా పొసగనప్పుడు మనం నిర్ద్వంద్వంగా ఖండించాలి.
ఇక అసలు విషయానికొస్తే మహాత్మాగాంధీ పాకీస్తాన్ కి వంద కోట్లు ఇమ్మని
, ఇస్తే గాని వీలు లేదని పట్టుబట్టి తమ పంతం నెగ్గించుకున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇది తప్పా , కాదా అనేది అప్పటి పరిస్థితులను
దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో ఆలోచిద్దాం. మనం మనుషులం కదా! మనుషులుగా
ఆలోచిద్దాం .
ఒక కుటుంబంలో తండ్రికి ఇద్దరు కొడుకులు
ఉన్నారు అనుకుందాం . ఒక
కొడుకు, వాడు చిన్నవాడు కావచ్చు , లేదా పెద్దవాడు కావచ్చు . స్వార్థం తోనో, లేదా మరే
ఇతర కారణాల వల్లనో కుటుబం నుంచి బయటకు వెళ్ళిపోడానికి నిర్ణయించుకున్నాడు . ఆ
విధంగా కుటుంబం విడిచి పెట్టి స్వంత కుంపటి
పెట్టు కోలనుకోడం నూటికి నూరుపాళ్లు తప్పే , అందులో ఎటువంటి సందేహం లేదు . ఇక వాడికి
పెళ్ళాం , చాల మంది పిల్లలు కూడ ఉన్నారు. వాళ్ళకు ఏ అభిప్రాయం ఉందో మనకు తెలియదు .
భర్త మాట కాదన లేక భార్య , వారి ఇద్దరిని కాదనలేక పిల్లలు వాళ్ళని అనుసరించి బయటకు
పోయారు అనుకుందాం . అలా విడిపోవడం నూటికి
నూరుపాళ్లు తప్పే , అందులో ఎటువంటి సందేహం లేదు . కాని వాళ్ళు ఉండడానికి గూడు ఉంది
గాని, తినడానికి కూడు లేదు. ఆ
పరిస్థితుల్లో తాత్కాలికంగా ఏ తండ్రైనా ఏం చేస్తాడో ఆలోచించండి . తండ్రిగా ఆలోచించండి , ఎండ్రిగా కాదు ; పితగా ఆలోచిం చండి పీతగా
కాదు . ఏ తండ్రి ‘మీరు నా మాట వినకుండా బయటకు పోతున్నారు , మీ చావేదో మీరు చావండి’ అనలేడు. అంటే వాళ్ళు కనీసావసరాలు
తీరక చచ్చిపోతారు . తండ్రి స్వార్థానికి మిగిలినవారిని బలితీసుకోవడం న్యాయం కాదు. అందువల్ల
ఆయన వారికి కొంత దానం ఇమ్మని అధికారులను పట్టు పట్టాడు . ఇక ఆయన దగ్గర ఇవ్వడానికి
ఏమీ లేదు, ఒక్క కర్ర తప్ప అది కూడ ఆయన
నడవడానికి గాని ఇంక ఎందుకూ పనికి రాదు . ఆయన దగ్గర ఉన్న ఆయుధం ఒక్కటే, అది నిరాహారదీక్ష
. అది ప్రయోగించాడు వారికి తాత్కాలికంగా కొంత ధనం ఇప్పించాడు . మనిషికి knowledge , wisdom అని రెండు ఉంటాయి . ఈ రెంటిలో knowledge కేవలం బుద్ధికి సంబంధించింది, ఇక wisdom హృదయానికి సంబంధించింది.
ప్రతివాడు ఈ రెండు ఉపయోగించుకోవాలి . ఏ ఒక్కటి సమగ్రం కాదు . ఇక వారు
మనం ఇచ్చిన డబ్బుతో ఆయుధాలు కొనుక్కున్నారని
కొంతమంది అంటున్నారు . నిజమే కావొచ్చు . అది వారి విజ్ఞతకు వదిలేయాలి
. నా అనుభవం ఒకటి చెపుతాను. నా మిత్రుడు ఒకాయన రాత్రి పదింటికి మా ఇంటికి వచ్చాడు.
నేను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆయనతో నాకు పరిచయం. ఆయన నాకు అర్జంటుగా
కొంత డబ్బు కావాలి, అత్యవసరం నన్ను నమ్మండి అన్నాడు. నేను నమ్మి కొంత డబ్బు
ఇచ్చాను . మీరు నమ్మండి! లేదా నమ్మక పొండి! ఆ డబ్బుతో ఆయన బీరు బాటిల్స్
కొనుక్కుని వెళ్లి పోయాడు. నాకు డబ్బు పోయింది , తల కూడ తిరిగిపోయింది.
ఏది ఏమైనా గాంధీజీ స్వయంగా నేతాజీ చేత జాతిపితగా ప్రశంసించబడిన వ్యక్తి ఆయన జాతిపిత. జాతికి తండ్రి. ఏమాత్రం ఇంగితజ్ఞానం
కలవాడికైనా ఇది తెలుస్తుంది. పీతలకు ‘పిత’ విలువ; ఎండ్రికి తండ్రి విలువ తెలియదు ,
తెలియవలసిన అవసరం కూడ లేదు . తెలియక పోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం అసలే లేదు.
జై భారత్ జై జన్మభూమి .