Tuesday, April 22, 2014

“ద”

డా|| చిలకమర్తి. దుర్గాప్రసాదరావు.
కసారి ఒక టీచరు క్లాసులో  పిల్లల్ని రైట్ అనే పదానికి వ్యతిరేకపదం చెప్పమని అడిగాడట. ఒకడు రాంగ్ అన్నాడు . రెండో వాడు  లెఫ్ట్ అన్నాడు. ఇక మూడోవాడు   హోల్డాన్ అన్నాడు. టీచరు  చాల తికమక పడ్డాడు. ఎoదుకంటే ఆయన ఏ ఉద్దేశ్యంతో ప్రశ్న వేసినా వాళ్లు చెప్పిన సమాధానాలన్నీ కరక్టే .  రాంగ్ అన్నవాడు టీచరుకొడుకని , లెఫ్ట్ అన్నవాడు డ్రైవర్ కొడుకని , హోల్డాన్ అన్న వాడు కండక్టర్ కొడుకని  ఆ తర్వాత ఆయనకు అర్థమైoది.      
ఇక ఉపాధ్యాయుడు అందరకు చెప్పే విషయం ఒక్కటే అయినా    విద్యార్థుల అవగాహన  వాళ్ళ  వాళ్ళ సంస్కారాన్ని, పరిసరాల వాతావరణాన్ని   అనుసరించి భిన్నంగా  ఉంటుంది. బృహదారణ్యకఉపనిషత్తులో  దీనికి సంబంధింఛిన ఒక ఆసక్తి కరమైన  చక్కని కథ ఉంది.        
ఒకసారి దేవతలు, రాక్షసులు , మానవులు తమ తండ్రియైన ప్రజాపతి దగ్గరకు వెళ్ళారు.   తమకు జ్ఞానాన్ని బోధించమని ప్రార్థించారు. ముందుగా దేవతలు వెళ్ళారు. కొంతకాలం ఆయనకు సేవలు చేయగా ఆయన చాల
 సంతోషించి వారికి అని బోధించాడు.  అర్థమయింది స్వామి ! అని అన్నారు వారు. మీకు ఏమి తెలిసిందో చెప్పండి అనడిగాడు ప్రజాపతి. అయ్యా! మా నివాసమైన  స్వర్గం భోగాలకు నిలయం . అందువల్ల ఇంద్రియాలను మిoపచెయ్యమని (అదుపులో పెట్టుకొమ్మని)  మీ మాటలోని తాత్పర్యంగ మేము గ్రహించాము అన్నారు. ఆయన వారితో మీరు నా  అభిప్రాయం బాగా    అర్థం చేసుకున్నారు. నేను చెప్పినట్లు చెయ్యండి. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోoడి మీకు మేలు కలుగుతుంది అని ఆశీర్వందిoచి  పంపించాడు.      
ఆ తరువాత కొంతకాలానికి మానవులు ప్రజాపతి వద్దకు వెళ్ళారు. ఆయనకు సేవలు చేసి జ్ఞానం ప్రసాదించమని కోరారు. ఆయన వారికి అనే అక్షరాన్ని బోధించాడు. వాళ్ళనుకున్నారు మనది కర్మభూమి స్వార్థంతో అనేకకర్మలు చేస్తూ ధనం సంపాదిస్తున్నాము. దానధర్మాలు చెయ్యకుండ  లోభంతో ప్రవర్తిస్తున్నాం . అoదువల్ల లోభాన్ని  విడనాడి దానం చెయ్యమని వారు ఉపదేశించినట్లుగా అర్థం చేసుకున్నారు. అర్థమైoది  స్వామి! అన్నారు . ఏమర్థమైoదో చెప్పమన్నాడు ప్రజాపతి. వాళ్లు అర్థం చేసుకున్నది చెప్పారు. మీరు బాగా అర్థం తెలుసుకున్నారు. మీకు కలిగిందానిలో కొంత ఇతరులకు   దానం చేస్తూ ఉండండి. మీకు సకలశుభాలు కలుగుతాయని దీవించి పంపించాడు.
ఆ తరువాత కొంత కాలానికి రాక్షసులు ప్రజాపతి వద్దకు వెళ్ళారు. ఆయనకు భక్తితో కొంతకాలం సపర్యలు  చేసి సంతృప్తి పరచి జ్ఞానం బోధించమని  వినయంతో ప్రార్థన చేశారు. ఆయన వారికి కూడ అని బోధించాడు. వాళ్లకు వెంటనే అర్థమయింది. కృతజ్ఞతలు స్వామి! అని చెప్పి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఆయన ఆశ్చర్యంతో మికేమర్థమైoదో చెప్పమన్నాడు. వాళ్లు చేతులు జోడిస్తూ తండ్రీ! మేము సహజంగా హిoసాప్రవృత్తి కలవాళ్ళం. క్రోధం , హింస మాకు పుట్టుకతో వచ్చిన లక్షణాలు. అందువల్ల వాటిని విడిచిపెట్టి సకలప్రాణులపట్ల  దయకలిగి ఉండమని మీరు మాకు అనే అక్షరo ద్వారా  బోధించినట్లుగా అర్థం చేసుకున్నామని వారు వివరించారు. ప్రజాపతి వారితో మీరు నా అభిప్రాయాన్ని చాల బాగా గ్రహించారు. అందరి యెడ దయకల్గి ప్రవర్తిం చండి . మీకు లాభం చేకూరుతుంది అని దీవించి పంపించాడు.
వాస్తవానికి మనిషిలో దైవప్రవృత్తి, రాక్షసప్రవృత్తి రెండు ఉన్నాయి. అందువల్ల మానవుడు మహనీయుడు కావాలంటే పై మూడు లక్షణాలు అంటే ఇంద్రియనిగ్రహం , దానం, దయ అలవరచుకోవాలి.        

సాధన చేస్తే సాధ్యం కానిదేది లేదు.

No comments: