Thursday, October 23, 2014

నరులు – నాలుగు రకాలు-2

నరులు నాలుగు రకాలు
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు  

నల్ని సృష్టిoచిన   బ్రహ్మకు నాలుగు తలలుoడడం వల్ల కాబోలు మనుషుల్లో కూడ నాలుగు రకాల మనస్తత్త్వాలు గలవాళ్ళు కనిపిస్తారు.
మొదటి రకానికి చెందినవారు వాళ్ళ పనిని కూడ విడిచిపెట్టి ఇతరుల పనులను పూర్తి చేస్తారు. వాళ్ళు సజ్జనులు. ఇక కొంతమంది ఉంటారు . వారు వాళ్ల పనులు విడిచి పెట్టరు గాని వాళ్ళ పనులు చేసుకుంటూనే ఇతరులకు ఉపకారం చేస్తారు. వాళ్ళని  మధ్యములు అనవచ్చు. మరికొంతమంది ఉంటారు. వాళ్ళు తమ పనుల కోసం ఇతరుల పనులు నాశనం చేస్తారు . వాళ్లని రాక్షసులంటారు. ఇంకా  కొంతమందున్నారు ఏ కారణం లేకుండానే ఇతరుల పనులు చెడగొడుతూ ఉంటారు. వాళ్లనేమని పిలవాలో తెలియదంటాడు భర్తృహరి. వీళ్లు రాక్షసుల కంటే హీనం. ఎoదుకంటే రాక్షసులు వారి ప్రయోజనం నెరవేరడం కోసం ఇతరుల ప్రయోజనాలను దెబ్బ తీస్తారు. ఇక్కడ ఒకరి ప్రయోజనం సిద్ధించకపోయినా మరొకరి ప్రయోజనం సిద్ధిస్తోంది .   ఇక నాలుగోరకం వాళ్ళు హీనాతిహీనులు.
వాళ్లకు ఎటువంటి ప్రయోజనం లేకపోయినా ఇతరులకు నష్టం కల్గించడం వారి ధ్యేయం . వారి మనస్తత్త్వం అతిరాక్షసం .  ఉదాహరణకు పొరుగింటిలో ఆవు చస్తే  చాలు వాళ్ళ ఇంటిలో ఆవు ఉన్నంత ఆనందం పొందుతారు. మరో ఉదాహరణ.  వీళ్ళు ఎప్పుడైనా ఏదైన  హోటలుకి వెళ్ళారనుకుందాం. అక్కడ సర్వర్ అయ్యా | మీకు పెసరట్టు కావాలా! మినపట్టు కావాలా! మరేదైనా కావాలా అని అడుగుతాడు. అప్పుడు పెసరట్టు , మినపట్టుల  రెండిటి ధర ఒకటే ఉంది అనుకుందాం. అప్పుడు వాళ్లకు కావలసింది తెమ్మని అడగచ్చు. కాని వీళ్ళు అలా ఆడగరు. వెంటనే పేపరు చూస్తారు. ఆ సమయంలో మినుగుల రేటు ఎక్కువో పెసల రేటు ఎక్కువో చూస్తారు. దేని రేటు ఎక్కువుంటే అదే తెమ్మని ఆర్డరు చేస్తారు. ఇక్కడ వీళ్ల ఇష్టo కంటే హోటలు యజమానికి కలిగే నష్టమే వీరికి అభీష్టం.
ఇలా వీరి ఆలోచనావిధానం గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. నేటి సమాజంలో ఇటువంటి వారి సoఖ్య చాల ఎక్కువ . ఈ సమాజాన్ని దేవుడు తప్ప  మరెవ్వరూ రక్షించలేరు 
భర్తృహరి నాలుగురకాలైన మనుషుల్ని , వారి స్వరూపస్వభావాల్ని అందంగా ఒకే పద్యంలో పొoదుపరిచాడు. దానికి ఏనుగులక్ష్మణకవి రచించిన తెలుగు అనువాదం చూడండి . 
తమకార్యంబు పరిత్యజించియు (బరార్థప్రాపకుల్ సజ్జనుల్
తమకార్యంబు ఘటించుచుo బరహితార్థవ్యాపృతుల్మధ్యముల్
తమకై యన్యహితార్థఘాతుకజనుల్ దైత్యుల్ వృథాన్యార్థభం
గము గావిoచెడు వారలెవ్వరొ! యెఱుoగన్ శక్యమే యేఱికిన్?
                                           **** 
    



No comments: