Sunday, October 5, 2014

తారలతో తారాశశాంకం

తారలతో తారాశశాంకం
చిలకమర్తి. దుర్గాప్రసాద రావు

పద్యం వ్రాయడం సులభం కావచ్చునేమో  గాని నియమనిబంధనలచట్రంలో బిగించి పద్యం వ్రాయడo మాత్రం అనుకున్నంత  సులభమేమీ కాదు. కాని కవి ప్రతిభా వంతుడైతే  ఎటువంటి నిబంధనలు అడ్డం రావు. ఒక చోట కవిపండితసభ జరుగుతోంది . ఎంతోమంది కవులు పండితులు పాల్గొన్నారు . ఒక పండితుడు కొన్ని నియమనిబంధనలు  విధించి వాటికి లోబడి తాను కోరిన ఇతివృత్తాన్ని వర్ణిస్తూ  ఒక  అందమైన   పద్యాన్ని చెప్పమని కవులను కోరాడు.
ఆ నియమాలేమిటంటే:
౧. పద్యమంతా నక్షత్రం అనే పదమే ఎక్కువగా ఉపయోగించాలి.
౨. ఆ పదం ఏ అర్థంలో ప్రయోగించినా  అది ఒక నక్షత్రాన్ని సూచిస్తూనే ఉండాలి .
౩. ఆ పద్యం  ఒక నక్షత్రం కథను సమగ్రంగా వివరించాలి .
  ఒక కవి ఇలా వెంటనే ఆశువుగా చెప్పాడు .

నక్షత్రము పేరిటి చెలి
నక్షత్రసుఖంబు గోరి నక్షత్రములో
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పట్టి యీడ్చె నక్షత్రేశున్
      
నక్షత్రేశున్ అంటే చంద్రుణ్ణి అని అర్థం. నక్షత్రము పేరిటి చెలి అంటే తార. తార  అంటే  నక్షత్రమే కదా ! నక్షత్రసుఖంబు గోరి అంటే ఆశ్లేష ( కౌగిలింత ) సుఖంబు గోరి అని అర్థం . ఆశ్లేష అనేది ఒక నక్షత్రమే . నక్షత్రములో అంటే చిత్తంలో ( మనస్సులో) అని అర్ధం . చిత్త కూడ ఒక నక్షత్రమే . నక్షత్రమునకు రమ్మని  అంటే మూలకు రమ్మని అని అర్థం. నక్షత్రాల్లో మూల కూడ ఉంది. నక్షత్రము పట్టి యీడ్చె అంటే హస్తము ( చెయ్యి ) పట్టుకుని లాగిoదట. హస్త కూడా ఒక నక్షత్రమే.
మొత్తం మీద ఈ పద్యం యొక్క భావమేమిటంటే  తార అనే ఒక నాయిక తన మనస్సులో సంగమసౌఖ్యాన్ని కోరుకొని మూలకు రమ్మని చంద్రుని చెయ్యి పుచ్చుకు లాగిoదట. ఇదే తారలతో తారాశశాంకం.  

                            ***************************

No comments: