Sunday, October 19, 2014

బాలకృష్ణుని పారవశ్యం

బాలకృష్ణుని పారవశ్యం
డా|| చిలకమర్తి దుర్గాప్రసాద రావు
ఒకనాడు కృష్ణుణ్ణి వాళ్ళమ్మ  యశోద ఉయ్యాలలో పడుక్కోబెట్టి నిద్రపుచ్చుతోoది. ఎంతసేపటికి నిద్ర రావడం లేదు. సాధారణంగా పిల్లలకు  నిద్రపట్టనప్పుడు తల్లులు పాటలు పాడడం గాని కథలు చెప్పడం గాని చేస్తూ ఉంటారు. అందువల్ల ఆమె ఒక కథ చెప్పడం ప్రారంభించింది.
  అనగనగా పూర్వం రాముడనే రాజుండేవాడు అంది . కృష్ణుడు ఊ( అని ఊ కొట్టేడు . ఆయనకొక భార్య ఉంది ఆమె పేరు  సీత అంది . మళ్ళా ఊ( అని ఊకొట్టేడు. వాళ్ళిద్దరూ తండ్రి దశరథుని  ఆజ్ఞననుసరించి అయోధ్యను విడిచి అడవుల్లో సoచరిస్తూ ఉండగా అక్కడ పంచవటీవనప్రదేశంలో సీతను రావణుడు  అపహరించాడు అంది.
ఈ విధంగా వాళ్ళమ్మ చెబుతున్న తన పుర్వకథనే తన్మయత్వంతో వింటూ ఉండడం  వల్ల గతం అంతా జ్ఞాపకం వచ్చేసింది. ప్రస్తుతం తానెవరో మరిచిపోయాడు. తక్షణం  రాముడైపోయాడు .  అంతే వెంటనే ఒక్క ఉదుటున  ఉయ్యాలలోంచి బయటకు దూకి ఆవేశపరవశుడై ఓలక్ష్మణా | నా ధనుస్సు (కోదండం) ఎక్కడ ?  నా ధనుస్సు ఎక్కడ ?  నా ధనుస్సు  ఎక్కడ ? అని గట్టిగా అరుస్తున్నాడు. ఈ విధంగా పరవశత్వంతో రామునివలే    పలికిన  ఆ బాలకృష్ణుని పలుకులు మనలను రక్షించు గాక అని కృష్ణకర్ణామృతకర్త  లీలాశుకుడు ఒక అందమైన శ్లోకం రచించాడు .

రామో  నామ బభూవ  హుం తదబలా సీతేతి హుం తౌ పితు
ర్వాచా పంచవటీ వనే విహరతస్తామాహరద్రావణ:
కృష్ణేనేతి పురాతనీo నిజకథామాకర్ణ్య మాత్రేరితాం

సౌమిత్రే! క్వ ధనుర్ధనుర్ధనురితి ప్రోక్తా: గిర: పాంతు వ:

No comments: