Thursday, October 23, 2014

తస్మాత్ జాగ్రత! జాగ్రత! జాగ్రత!

తస్మాత్ జాగ్రత! జాగ్రత! జాగ్రత!
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
                                                                              dr.cdprao@gmail.com

సాధారణంగా మనలో కొంతమందికి ఒక విలక్షణమైన లక్షణం ఉంది. అదే౦టంటే మనకు ఒక  విషయం గురించి కొoత తెలిస్తే అంతా మనకు తెలుసనే అనుకుంటాం.  అలాగే ఒక సబ్జక్టులో  కొంత ప్రవేశం కలిగితే ఆ ప్రవేశాన్నే ప్రావీణ్యంగా భావిస్తాం. మనల్ని మించినవారు ఎవరు లేరని అనుకుంటూ ఉంటాం . ఇది చాల ప్రమాదకరం అంటాడు భర్తృహరి. జ్ఞానానికి అవధి లేదంటాడు. అందువల్ల ఒక శాస్త్రం మనం ఎంత చదివినా, ఆ శాస్త్రంలో ఎంత ప్రావీణ్యం సంపాదించినా దానిపై పట్టు సాధించామని  ఎప్పుడు అనుకోకూడదు, ఎల్లప్పుడు చదువుతూనే ఉండాలి. మననం చేసుకుంటూనే ఉoడాలి. అలా కాకుండా  మనం పుస్తకాన్ని వదిలేస్తే జ్ఞానం మన మస్తకాన్ని వదిలేస్తుంది .

          రెండో విషయానికొద్దాం. మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ  మనకు ఎదురుగానే ఉంటారు.  వాళ్ళు మన అధీనంలో ఉన్నట్టుగానే  కన్పిస్తారు. ఐనప్పటికీ మనం వాళ్ళను ఎప్పుడు ఒక కంట కనిపెట్టి చూసుకోవలసిన అవసరం ఎంతైనా   ఉంది.       ఏమరుపాటుగా ఉంటే ఏ క్షణంలోనైన ఏదైనా ముప్పు ముంచుకొచ్చే  ప్రమాదముంది.
  
ఇక మూడో విషయం  రాజు. ఇక్కడ రాజు అంటే అధికారి. మనం అనేక కార్యాలయాల్లో పనిచేస్తూ ఉంటాం . మనకంటే ఎంతోమంది ఉన్నతపదవుల్లో ఉంటారు. వాళ్ళందరూ మనకధికారులే. వాళ్ళతో అణకువగా, నిజాయితిగా ఉండాలి గాని ఎప్పుడు అతిచేరువగా ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు చనువు చూపించి మనల్ని దగ్గరకు రానిచ్చినా మన జాగ్రత్తలో మనం ఉండాలి .   మనకు ఆప్తుడని ఎన్నడు అనుకోకూడదు. అలాగే మనకు  వాళ్ళతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మిగిలిన సహోద్యోగులతో అమర్యాదగా ప్రవర్తించకూడదు. వారికి ఇబ్బంది కల్గించకూడదు. ఒకవేళ అలా  చేస్తే అటు అధికారికి  ఇటు సహచరులకు  కూడ దూరమయ్యే  ప్రమాదముంది. ఎoదుకంటే మన పైఅధికారి మనతో ఎప్పుడు, ఎంతకాలం   సుహృద్భావంతో ఉంటాడో మనం చెప్పలేం.  కాబట్టి వాళ్లకి చేరువై తోటివారికి దూరం కాకూడదు.
మొత్తం మీద సారాంశం ఏమిటంటే ఒక శాస్త్రాన్ని ఎంత మథించినా ఎప్పుడు చదువుతూనే ఉండాలి. ఆడపిల్ల ఎంత చేరువలో ఉన్నా ఒక కంట కనిపెట్టి చూసుకుంటూనే ఉండాలి. అధికారి మనకు ఎంత దగ్గరివాడైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి . ఈ మూడు విషయాల్లోనూ ఎన్నడు, ఎప్పుడు, ఎక్కడ ఏమరుపాటు తగదు. అతి విశ్వాసం (over-confidence) పనికి రాదు .      शास्त्रं सुचिन्तितमथोपरि चिन्तनीय
मङ्के कृतापि युवति: परिरक्षणीया
आराधितोsपि नृपति: परिशङ्कनीय:
शास्त्रे नृपे च युवतौ च कुतो वशित्वम् || 
(Bhartruhari SubhaashitaM)  

శాస్త్రం సుచిoతితమథోపరి చింతనీయం
అంకే కృతాsపి యువతి: పరిరక్షణీయా   
ఆరాధితోsపి నృపతి: పరిశoకనీయ:
శాస్త్రే నృపే చ యువతౌ చ కుతో వశిత్వం
                              ***


No comments: