పంచభూతాలు-రామాయణo
Dr.Chilakamarthi
Durga Prasada Rao
ఈ ప్రపంచం
పంచభూతాలతో తయారైంది. అవి భూమి, నీరు, ఆగ్ని, వాయువు, ఆకాశం. మొదటిది భూమి. రెండోది నీరు. మూడోది అగ్ని . నాల్గోది
వాయువు. ఐదోది ఆకాశం.
ఈ పంచభూతాలు
ఆధారంగా ఒక కవి చిన్నపద్యంలో సంగ్రహంగా రామాయణకథను వివరించాడు. ఎంత అందంగా
చెప్పాడో చూడండి. కాబట్టి కాదేదీ కవికినసాధ్యం .
అంచిత
చతుర్థజాతుడు
పంచమమార్గమున బోయి
ప్రథమతనూజన్
గాంచియు నచట
తృతీయం
బుంచి ద్వితీయంబు దాటి
యొందెను రాజున్
ఒక చతుర్థజాతుడు
పంచమమార్గంలో ప్రయాణం చేసి, ప్రథమతనూజను చూసి, అచట తృతీయం ఉంచి , ద్వితీయం దాటి
రాజును చేరుకున్నాడట. ఇదంతా చాల గందరగోళంగా ఉంది . అందువల్ల ఇది పూర్తిగా అర్థం
కావాలంటే పంచభూతాలపరిజ్ఞానం కావాలి. అదెలాగో చూడండి.
‘చతుర్థజాతుడు’ అంటే
ఆంజనేయస్వామి . ఎందుకంటే పంచభూతాల్లో
నాల్గోది వాయువు . వాయుదేవుని పుత్రుడే ఆంజనేయస్వామి.
పంచమమార్గమున పోయి అంటే ఐదవదైన ఆకాశమార్గంలో
ప్రయాణం చేసి అని ఆర్థం. ప్రథమతనూజన్ అంటే
పంచభూతాలలో మొట్టమొదటిదైన భూమి కుమార్తె (సీత)
ను అని అర్థం. అందు( లంకలో ) తృతీయంబుoచి
అంటే మూడవదైన అగ్నిని ఉంచి (తగులబెట్టి)
అని అర్థం . ఇక ద్వితీయంబు దాటి అంటే
నీటిని ( సముద్రాన్ని) దాటి రాజును ( శ్రీరాముని ) చేరుకున్నాడట . మొత్తం రామాయణకథ
సంగ్రహంగా ఈ పద్యంలో కనిపిస్తోంది .
తాత్త్వికంగా
చూస్తే ఆత్మ నుండి ఆకాశం పుట్టింది . ఆకాశం నుండి వాయువు పుట్టింది . వాయువు నుండి
అగ్ని పుట్టింది . అగ్ని నుండి నీరు పుట్టింది. నీటి నుండి భూమి పుట్టింది. ఇది
సూక్ష్మం నుంచి స్థూలప్రపంచం ఏర్పడిన విధానం.
(ఆత్మన: ఆకాశ: సంభూత:, ఆకాశాద్వాయు:, వాయోరగ్ని:, అగ్నేరాప:, అద్భ్య:
పృథివీ, పృథివ్యా: ఓషథయ:, ఓషథీభ్యో sన్నమన్నాత్పురుష: ) కాని ఇక్కడ కవి వ్యావహారికదృష్టితో స్థూలం నుంచి
సూక్ష్మానికి (వెనుకనుంచి ముందుకు)
పంచభూతాల వరుసను పరిగణనలోకి తీసుకున్నాడు. అందువల్ల స్థూలరూపంలో రాముడుగా
కనిపిస్తున్న ఈ ఆకారం వెనుకనున్నది ఆ సూక్ష్మమైన ఆత్మతత్త్వమే
అని మనం గ్రహించాలి. వేదవేద్యుడైన ఆ పరమపురుషుడు దశరథ తనయుడగు
రామునిగా పుట్టగా వేదం వాల్మీకి ద్వారా రామాయణంగా వెలువడిందట. ( వేదవేద్యే
పరే పుంసి జాతే దశరథాత్మజే
వేద:
ప్రాచేతసాదాసీత్సాక్షాద్రామాయణాత్మనా )
అంతేగాక ఈ సృష్టి ఉన్నంతకాలం పంచభూతాలు ఉంటాయి .
పంచభూతాలు ఉన్నంత కాలం రామాయణం ఉంటుoదని మరియు ఉండాలనే ఆకాంక్షతో కవి ఈ అందమైన శ్లోకం రచించి నట్లు
కనిపిస్తోంది. కవి ఎవరో నాకు తెలియదు గాని ఆయన ప్రతిభకు అభినందనలు.
No comments:
Post a Comment