Wednesday, October 7, 2015

మఱువబోకు చిలకమర్తి మాట-3

                   మఱువబోకు చిలకమర్తి మాట
                                     మూడవ భాగం  
                                                          చిలకమర్తి వేంకట సూర్యనారాయణ 
                                                                                      నరసాపురం

51. ఆగ్రహంబనియెడి యద్భుత రాక్షసిన్       
     శాంతమనెడి దివ్య శక్తి తోడ
     సంహరింప వేగ సౌఖ్యంబు తానబ్బు
    మఱువబోకు చిలకమర్తి మాట
52. శాoతి లేదటంచు  సంసారమును వీడి
    అడవికేగి తపము నాచరింప  
    మనసునందు దాగు మలినంబు పోవునా
    మఱువబోకు చిలకమర్తి మాట

53. తాళి కట్టు పతిని దైవమనెడి సతి
చిత్తశుద్ధితోడసేవలొసగు
అత్తవారి యింట నాదిలక్ష్మిగ నుండు 
మఱువబోకు చిలకమర్తి మాట

54.         మనసు నందు దాగు మాయను తొలగించి      
      కరుణరసము నింపు గాఢముగను
         అతిథికింత పెట్టి యాపైన తిను నీవు
         మఱువబోకు చిలకమర్తి మాట
55 . అన్య సతినినీవు నమ్మగా భావించు  
      చెడ్డతలపు మదిని చేరనీకు
      మాతృబుద్ధి గల్గి మసలుము సర్వదా
      మఱువబోకు చిలకమర్తి మాట

56 . కోపమొదవు నాడు గుర్తించి పది సార్లు
        చేయుటొప్పు దైవ చింతనంబు          
      ఆగ్రహంబుతగ్గి యానందముదయించు               
      మఱువబోకు చిలకమర్తి మాట

57.  శక్తి కలుగునాడు సంసారజలధిలో
       మునిగి బలమునుడుగి ముదిమిరాగ
       ముక్తి కొరకు వేడ మోక్షంబు దొరకునా
       మఱువబోకు చిలకమర్తి మాట
58. వంశ వృద్ధి  యనెడు వా౦ఛను దీర్పo
      పెండ్లి యనెడు క్రతువు వెలసె  జగతి
      సత్యమెరిగి నీవు చక్కగా మసలుకో  
      మఱువబోకు చిలకమర్తి మాట
59. ధా వ్రాయు వ్రాత తప్పించు ఘనుడెవడొ
     కోటి కొక్కడుండు గుర్తు నెరిగి
    దివ్య జ్ఞానిగాక తెలియంగ సాధ్యమా     
    మఱువబోకు చిలకమర్తి మాట
60. చిత్తశుద్ధి  తోడ శ్రీనివాసుని సదా
     మనసు నందు నిలిపి మరువకుండ
  అర్చనంబు చేసి యభయంబు సాధించు 
 మఱువబోకు చిలకమర్తి మాట
61 . ముదిమి యనెడు కాంత మోహించి శిరమెక్కి
     కపట ప్రేమ జూపి కాలమరసి
మిసిమి ముద్దవోలె మ్రింగుగా నొకరోజు
మఱువబోకు చిలకమర్తి మాట
62 . ఆశ తోడ నీవు నార్జి౦చు సంపద
      వెళ్లి పోవునాడు వెంట రాదు
      పాపపుణ్యచయమె పయనించు నీవెంట
  మఱువబోకు చిలకమర్తి మాట
 63. ధా వ్రాయు వ్రాత తప్పదెవ్వరికైన
     అనుభవించువరకు  నదియు పోదు  
  నిజము తెలియ నౌదు వీవె సుజ్ఞానివి 
   మఱువబోకు చిలకమర్తి మాట
64 . సర్వ జీవులు౦డు  చక్రంబు చేబూని
      గతము వారు చేయు కర్మలరసి
   ఇహము నందు ఫలము నీశ్వరు డొసగును 
     మఱువబోకు చిలకమర్తి మాట
 65 . సద్గుణాలు గలుగు సతి నెంచు కొని వేగ
       దైవ సాక్షికముగ తాళి గట్టి   
   శాస్త్రయుక్తమైన సంసారమీదుము 
     మఱువబోకు చిలకమర్తి మాట
 66.  మేత కనుల గాంచి మిక్కిలి ప్రేమతో
    తనదు జాతి బిలిచి  తాను తినెడి  
  కాకి ప్రేమ యెంత ఘనమైనదో చూడు
మఱువబోకు చిలకమర్తి మాట
 67. సద్గుణాల రాశి సతి నెన్నుకొని ప్రేమ
      దైవసాక్షికముగ తాలిగట్టి
  ధర్మబద్ధ మైన కర్మలు సేయుము 
మఱువబోకు చిలకమర్తి మాట
 68 . మనమునందు నింపు మంచి తనంబును
      కనుల యందు నింపు కరుణ రసము 
  సర్వజీవులందు సర్వేశు గాంచుము 
  మఱువబోకు చిలకమర్తి మాట
 69 . కామమనెడు దుష్ట కామిని నిను జేరి
    కపట ప్రేమజూపి కౌగలించి
మనసు పాడుజేసి మరి మరి  బాధించు 
మఱువబోకు చిలకమర్తి మాట
 70 . తల్లి బాధ  పెట్టి ధరణికొచ్చితినని 
     యెఱుగ జేయ నీవె యేడ్చితివిగ
 నిన్ను కనులగాంచి మిన్నంటి మురిసిరి 
మఱువబోకు చిలకమర్తి మాట
 71 .   కట్టుకున్న  భార్య గయ్యాళి యైనను
         కులము చెరచునట్టి  కొడుకులున్న
    నీదు జీవితంబు నిత్యము నరకమే
     మఱువబోకు చిలకమర్తి మాట
72.  ఆడ శిశువు కలిగెనని ద్వేషబుద్ధితో
      సంహరింప జూడ చాల తప్పు
  నిన్ను గన్నదెవరొ నెఱుగుము మదిలోన 
  మఱువబోకు చిలకమర్తి మాట
 73. ఆదరించ కుండ నమృతం బిచ్చినా
         మోదమొంది త్రావ ముప్పు తెచ్చు 
        ప్రేమ నొసగు కూడు పిడికెడు రక్షించు
        మఱువబోకు చిలకమర్తి మాట

74. శివుడు చూడనట్టి చిటికెడు చోటును        
      కడు శ్రమించి వెదుక కానరాదు
     తప్పు చేసి నీవు దాచుట సాధ్యమా!
     మఱువబోకు చిలకమర్తి మాట

75 . చెప్పినట్లు వినక చెడు పనులొనరించి
      బాధ పడెదవేల పాడు మనస
      దైవ శాసనంబు దాటుట ధర్మమా?
     మరువబోకు చిలకమర్తి మాట

No comments: