Tuesday, October 13, 2015

కాళిదాసు-విద్య (The views of Kalidasa on education)

కాళిదాసు-విద్య
(The views of Kalidasa on education)

డాక్టర్. చిలకమర్తి  దుర్గాప్రసాద రావు

ఆహారం, నిద్ర, భయం, స్త్రీ పురుషుల కలయిక అనే ఈ నాలుగు అంశాలు మనిషికి జంతువుకి సమానమే.   ఇక మనిషి  జ్ఞానం వల్లనే  ఇతర జంతువుల కంటే  ఉన్నతుడుగా  పరిగణించబడుతున్నాడు. జ్ఞానం విద్య వల్ల లభిస్తోంది. అందువల్ల విద్య లేని  మనిషి మృగంతో సమానం అన్నారు మన పెద్దలు .
विद्याविहीन: पशु: {भर्तृहरि:} (1)

 ఇక విద్య గురించి  ఉపనిషత్తులు ఏమంటున్నాయో చూద్దాం. అధ్యాపకుడు ఒక  (unit)అంశం. విద్యార్థి మరొక (Unit)అంశం. విద్య వీరిద్దరి కలయిక. ఇక బోధన ఇద్దరినీ సంధానపరిచే అంశం .

आचार्य: पूर्वरूपम्, अन्तेवास्युत्तररुपम्
विद्या संधि: प्रवचनं संधानम्     ( तैत्तिरियोपनिषद् -4- (2)

 విద్య మనదేశంలోనే కాదు ప్రపంచం లోనే  ఒక ప్రధానభూమిక వహిస్తోంది. ఎంతోమంది కవులు, తత్వవేత్తలు, విద్యావేత్తలు, మనోవిజ్ఞానశాస్త్రజ్ఞులు   విద్యను ఎన్నోవిధాలుగా  నిర్వచించారు. వాటిలో కాళిదాసమహాకవి  వెలువరించిన  అభిప్రాయాలు  విద్యకు సంబంధించిన పలుఅంశాల్లో ఎన్నో విశేషాలు అందజేస్తూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆయన తన కావ్యాల్లో  సందర్భానుసారంగా, సూచనప్రాయంగా   వెలువరించిన భావాలు నాటికి నేటికి రాబోయే తరానికి కూడ ఉపయోగకరంగా కన్పిస్తున్నాయి. కాళిదాసు ఒక నిర్దిష్టప్రాంతానికి, నియమిత కాలానికి సంబంధించినవాడే అయినప్పటికీ ఆయన వెలువరించిన ఆభిప్రాయాలు సార్వకాలికాలు సార్వదేశికాలున్ను.   ఈ వ్యాసంలో విద్యపై  కాళిదాసునకు గల   కొన్ని అభిప్రాయలు  పొందు పరుస్తాను.

1.                 విద్య స్వరూపం :
కాళిదాసు తన ప్రఖ్యాతరచన కుమారసంభవంలో పార్వతి యొక్క విద్యాభ్యాస విధానాన్ని వివరిస్తూ ఇలా అంటాడు.
                  శరత్కాలంలో హంసలు గంగానదిని చేరినట్లుగా; ఓషధులు  రాత్రిపూట  తమ కా౦తితో   ప్రకాశిస్తున్న విధంగా  పార్వతికి తాను మునుపటి జన్మలో నేర్చిన విద్యలన్ని ఒకేసారి ఉపదేశించగానే తిరిగి ఆమెను చేరుకున్నాయట.

तां हंसमाला: शरदीव गङ्गां महौषधिं नक्तमिवात्मभास:
स्थिरोपदेशादुपदेशकाले  प्रपेदिरे प्राक्तनजन्मविद्या:
(कुमारसंभवम् - 30) (3)

సహజంగానే హంసల నివాసస్థానం గంగానది. హంసలకు వానంటే పడదు . అందువల్ల వర్షకాలంలో అవి వర్షానికి భయపడి గంగను వదిలి పెట్టి మేఘమండలానికి పైన గల పర్వతాల మీద సంచరిస్తాయి. తిరిగి శరత్కాలం  రాగానే  వాటి యొక్క  సహజనివాసమైన గంగానదిని చేరుకు౦టాయి.  అదే విధంగా ఓషధులు (దీపము వలె వెలుగు తృణజ్యోతి) స్వయం ప్రకాశకములైనప్పటికి  సూర్యకాంతికారణంగా ఆ వెలుగు మనకు కనిపించదు. రాత్రి మామూలుగా మేరుస్తో కన్పిస్తాయి. ఇక్కడ వాటికి కాంతి కొత్తగా ఎక్కడో నుంచి వచ్చి చేరలేదు. వాటిలోనే ఉంది ఎటొచ్చీ సూర్యకాంతి వలన మెరుపు కనిపించలేదు. ఇపుడు సూర్యుడు లేకపోవడం వల్ల మెరుపు కనిపిస్తోంది, అంతే.   ఈ రెండు ఉపమానాలవల్ల  జ్ఞానం అనేది  ఎక్కడో బయట నుంచి వచ్చేది కాదని  లోపలే ఉంటు౦దని  లోపలున్నదే బయటికి ఉద్బుద్ధ మౌతు౦దని  స్పష్టమవుతోంది.  ఒక వ్యక్తిలో నిబిడీకృతంగా ఉన్నదే గురూపదేశం వల్ల బయటకు ప్రకటం అవుతుందని తెలుస్తోంది.  ఈ విషయాన్నే వివేకానందస్వామి Education is the manifestation of perfection already in man  (విద్య మనిషిలో దాగియున్న ప్రతిభ యొక్క  బాహ్య రూపమైన అభివ్యక్తి) అన్నారు.  కాళిదాసు మాటలే స్వామి అభిప్రాయానికి మూలాధారం. ఆధునికకాలంలో కొంతమంది సైకాలజిస్టులు కూడ ఈ అభి ప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

2.                 విద్యాబోధన:
విద్యాబోధనపద్ధతి గురించి వివరిస్తూ కాళిదాసు ఇలా అంటాడు .  జ్ఞానం సంపాదించడం ఒక అంశం, సంపాదించిన ఆ జ్ఞానాన్ని  ఇతరులకు అంది౦చగలగడం మరో అంశం. ఎవరికి ఈ రెండు లక్షణాలు పుష్కలంగా     ఉంటాయో అటువంటి వ్యక్తి ఉత్తమఉపాధ్యాయునిగా పరిగణి౦పబడతాడు. లేకపోతే ఉత్త ఉపాధ్యాయుడుగానే మిగిలిపోతాడు. 

श्लिष्टा क्रिया कस्यचिदात्मसंस्था  संक्रान्तिरन्यस्य विशेषयुक्ता |
यस्योभयं साधु स शिक्षकाणां धुरि प्रतिष्ठापयितव्य एव ||(मालविकाग्निमित्रम्- i -16) (4)

 కాబట్టి విద్య నేర్చుకోవడం ఎంత ముఖ్యమో నేర్చుకున్న ఆ విద్యను చక్కగా ఇతరులకు బోధించగలగడం కూడ అంతే ముఖ్యం అని స్పష్టం అవుతోంది.
 ఈ నియమం కేవలం లౌకికవిద్యలకే కాదు ఆధ్యాత్మికవిద్యలకు కూడ వర్తిస్తుంది.  అందుకే ముండక ఉపనిషత్తు గురువు లక్షణాన్ని నిర్దేశిస్తూ ఆత్మ జ్ఞానం కోసం శ్రోత్రియుడు,  బ్రహ్మనిష్ఠ గల్గిన గురువును ఆశ్రయించాలని  సూచి౦చి౦ది.

तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत् , समित्पाणि: (1) श्रोत्रियं (2) ब्रह्मनिष्ठम्

ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీత కూడ -

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया
उपदेक्ष्यन्ति ते ज्ञानं (1)ज्ञानिन: (2) तत्त्वदर्शिन: | |

అని గురువు  జ్ఞాని, తత్త్వదర్శి కావాలని నిర్దేశించింది. ఎందుకంటే ఒక విషయం ఒకవ్యక్తి  ఇతరులకు చెప్పాలంటే ఆ విషయం తనకు తెలిసుండాలి. ఇక కేవలం తెలిస్తేనే సరిపోదు. తెలియజేప్పే నైపుణ్యం కూడ అవసరం .  ఆ నైపుణ్యమే బోధన పటిమ. ఈ కాలంలో బోధన విషయంలో  ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్లు కనిపించదు. అధ్యాపకులు రీడర్లుగా మారిపోయారు, అర్థం వివరించకుండ  పుస్తకాలు చదివేస్తున్నారు. అర్థం అడక్కుండా విద్యార్థులు వినేస్తున్నారు . అర్థం తెలియకుండానే పరీక్షల్లో వ్రాసేస్తున్నారు . అధ్యాపకులు మార్కులు వేసేస్తున్నారు .  రోగి అదే కోరాడు వైద్యుడు కూడ అదే కోరేడు అన్నట్లుగా అంతా ఉభయతారకంగా ఉంది.         

3. విద్యాభ్యాస విధానం:
కాళిదాసు విద్య నేర్చుకునే విధానం వశిష్టుని మాటల ద్వారా ఇలా సూచించాడు. ఓ దిలీపమహారాజా! నువ్వు కందమూలఫలాలు ఆహారంగా స్వీకరిస్తూ నిరంతరం ఈ న౦దినీధేనువును అనుసరించి  నడుస్తూ అభ్యాసంతో విద్యను వశపరచుకున్న విధంగా దీన్ని (ఈ గోవును) ప్రసన్నం చేసుకో.

वन्यवृत्तिरिमां शश्वदात्मानुगमनेन गाम् |
विद्यामभ्यसनेनैव प्रसादयितुमर्हसि || (रघुवंशम् -i-88) (5)

ఈ సందర్భంగా కాళిదాసు రెండు ముఖ్యమైన విషయాలు మనకు తెలియజేశాడు. విద్యనేర్చుకునేవాడు ఆహారం తగుమాత్రం గానే తీసుకోవాలి. ఎక్కువ తింటే నిద్ర వస్తుంది.  బ్రతకడం కోసమే తినాలి గాని  తినడం కోసం బ్రతక్కూడదు. రుచులకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఇక్కడొక విషయం చెప్పడం అసందర్భమేమీ కాదు.
పూర్వం పిల్లలు వారాలు చేసుకుంటూ గురుకులాల్లో చదువుకునే వారు. వారాలంటే ఒక్కొక్కరోజు ఒక్కొక్క ఇంట్లో  భోజనం చేస్తూ చదువుకోవడం . ఒక రోజు ఒక విద్యార్థి ఒక ఇంట్లో భోజనం చేస్తున్నాడు. ఇంటి ఇల్లాలు వడ్డిస్తో౦ది. అమ్మగారు! ఇవాళ కంచంలో ఆవుపేడ వేశారేమిటి? అని అడిగాడు . వెంటనే ఆవిడ నాయనా! నువ్వు రేపటి నుంచి మా ఇంటికి రావక్కరలేదు అంది . అదేంటమ్మగారు? అన్నాడు ఆశ్చర్యంగా. నాయనా! నువ్వు ఐదేళ్ళ నుంచి మా ఇంట్లో భోజనం చేస్తున్నావు. నేను రోజూ నీకు అదే వేస్తున్నాను. నువ్వెప్పుడు ఇలా ప్రశ్నించలేదు. అపుడు నీ దృష్టి తిండి మీదలేదు. చదువు మీదే ఉండేది.    ఇప్పుడు  నీ దృష్టి చదువు మీద లేదు. రుచుల మీదకు పోయింది. చదువుకునే వాడికే ఇక్కడ అన్న౦ పెడతాము గాని రుచులు మరిగిన వాడికి కాదు అంది.
ఈ సంఘటన కొంచెం విపరీతంగా కనిపించినా విద్యార్థిదశలో పిల్లవాడు రుచుల మీద దృష్టి  పెట్టకూడదనే   తాత్పర్యం. అందుకే కాళిదాసు కందమూలఫలాలు భుజిస్తూ అనే మాట వాడడ౦ జరిగింది .

4. విద్య కాలపరిమితి    
ఇక విద్యార్థి ఎంత కాలం చదవాలనే విషయానికి సమాధానంగా విద్య వశం అయ్యే వరకు సాధన చెయ్యాలని సూచించాడు కాళిదాసు. ముందు దాని చుట్టూ మనం తిరిగితే ఆ తరువాత అది మన చుట్టూ తిరుగుతుంది.  కాబట్టి  జ్ఞాన సాధనకు కృషి తప్ప మరో మార్గమేదీ లేదంటాడు కాళిదాసు. నిజమే! పరీక్ష పాసవ్వడానికి అనేక మార్గాలు౦టాయి . కాని చదువు రావడానికి  ఒకటే మార్గం. అదే నిరంతర కృషి . కృషి మరియు లోతైన అధ్యయనం మినహా మరొక మార్గమేదీ లేదు.

5. విద్య - ప్రయోజనం:
కాళిదాసు విద్య యొక్క ప్రయోజనం వివరిస్తూ,  విద్య యొక్క  ప్రయోజనం జ్ఞానం సంపాదించడమే గాని  డబ్బు సంపాదించడం కాదంటాడు. ఎవడు కేవలం   ధనసంపాదన కోసం చదువుతాడో అతను ఒక  వ్యాపారి వంటి వాడని కాళిదాసు భావించాడు.
यस्यार्जनं केवलजीविकायै तं ज्ञानपण्यं वणिजं वदन्ति (मालविकाग्निमित्रम् - 17) (6)
విద్య ద్వారా ధనం సంపాదించడం తప్పుకాదు. కాని ధన సంపాదనే ప్రధాన ఉద్దేశ్యం ఎన్నటికి కాకూడదు.

6. విద్యాభ్యాస సమయం :
కాళిదాసు రఘువంశరాజుల లక్షణాలు వర్ణిస్తూ- వారు తమ బాల్యంలో అన్ని విద్యలు నేర్చుకునే వారని, యౌవనంలో సమస్తసుఖాలు అనుభవించేవారని,  ముసలితనంలో మునిజీవన౦ గడుపుతూ  చివరి దశలో యోగమార్గంద్వారా శరీరాన్ని విడిచిపెట్టే వారని అంటాడు . దీన్ని బట్టి  చదువుకోడానికి బాల్యమే చాల అనువైనసమయమని తెలుస్తోంది.

शैशवेsभ्यस्तविद्यानां यौवने विषयैषिणाम् |
वार्धके मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजाम् || (रघुवंशम्- I-8) (7)

నేటి సమాజంలో ప్రభుత్వం  ఎన్ని అవకాశాలు కల్పిస్తున్నా, ఎంత వత్తిడి తెస్తున్నా   కొంతమంది తమ పిల్లల్ని బడికి పంపించడం లేదు . వాళ్ళు నిరక్షరాస్యులుగానే మిగిలిపోవడం వల్ల మరల వయోజనవిద్య పేరుతో విద్య నేర్పవలసిన అవసరం ఏర్పడుతోంది .  దీన్నిబట్టి  చిన్ననాడే చదువుకోవాలని స్పష్టంగా తెలుస్తోంది.

7. విద్యాపోషణ:
 కాళిదాసు రఘువంశంలో దిలీపుని రాజ్యపాలనను వర్ణిస్తూ ఆయన ప్రజలకు విద్యలో  శిక్షణను ఇవ్వడం ద్వారా, రక్షించడం ద్వారా, పోషించడం ద్వారా ఆయనే అందరికి తండ్రి అయ్యాడట. ఇక వారి వారి తల్లిద౦డ్రులు  కేవలం కన్నవారిగానే మిగిలి పోయారట .  దీన్ని బట్టి విద్య కేవలం ప్రభుత్వం బాధ్యత అని తెలుస్తోంది.

प्रजानां विनयाधानाद्रक्षणाद्भरणादपि |
स पिता पितरस्तासां केवलं जन्महेतव: || (रघुवंशम्- I- 24) (8)

8. విద్యార్థి ఎంపిక :
విద్యావ్యవస్థలో విద్యార్థి ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. విద్య నేర్పడం ఎంత ముఖ్యమో విద్యనందుకునే వ్యక్తి యొక్క అర్హత గమనించడం కూడ అంతే ముఖ్యం. చెడ్డ వ్యక్తికి విద్యనేర్పితే ఆ వ్యక్తి విద్యను దుర్వినియోగం చేస్తాడు. సమాజ౦లో చదువుకున్న చెడ్డవాడు చేసే౦త పెద్దమోసాలు చదువులేని చెడ్డవాడు చెయ్యలేడు. చదువుకున్నవాడికి మోసం ఎలాచేయ్యాలో,  ఎలా బయట పడాలో అంతా తెలుసు. అందువల్ల చదువుకున్న చెడ్డవాడికంటే చదువులేని చెడ్డవాడే  నయం . పాపం! చదువులేని వాడికి ఇవన్ని తెలియవు . साक्षरा विपरिताश्चेद्राक्षसा एव केवलम् అన్నారు పెద్దలు అక్షర జ్ఞానం కలవాళ్ళు చెడ్డగా మారితే వాళ్ళు రాక్షసులే అవుతారట .   అందుకే Ascar wild అంటారు Society produces rogues and education makes one rouge wiser than the other.      అంతేకాక, విద్య  నేర్చుకోవడం, బోధన, ఆచరణ, వ్యాప్తి  అనే ఈ నాలుగు అంశాలు కూడ ముఖ్య౦. అప్పుడే  విద్యయొక్క  ఏకైక లక్ష్యం నెరవేరుతుంది. అందువల్ల జ్ఞానం భావితరాలకు అందజేయడం  కోసం ఒక మంచి విద్యార్ధిని  ఎంచుకోవడం గురువు యొక్క  ప్రధాన కర్తవ్యం. విద్యార్థి శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. నిరంతర జిజ్ఞాస కలవాడై ఉండాలి .

సాధారణంగా ఒక మంచి అధ్యాపకుని పొందవచ్చు కానీ  ఒక మంచి విద్యార్ధిని  పొందలేము. మంచివిద్యార్థి ఎంపిక కూడ చాల అవసరం. అభిజ్ఞాన శాకుంతలంలో కణ్వుడు తన కుమార్తె శకుంతల దుష్యంతుని  గాంధర్వవివాహం చేసుకుందని తెలుసుకుని ఆమెను అభినందిస్తూ ఆమ్మాయీ! మంచి విద్యార్థికి పంచిన విద్యవలె నువ్వు దుష్యంతుని చేతికి  దక్కినావు, కాబట్టి  నీవిషయంలో నేను చింతించవలసిన పనిలేదు అంటాడు .  

वत्से ! सुशिष्यपरिदत्ता विद्येवा sशोचनीयाsसि संवृत्ता ||  (अभिज्ञानशाकुन्तलम्- IV.4-page-217)(9)

ఈ వ్యాసంలో విద్యపై   కాళిదాస మహాకవి ప్రకటించిన   కొన్ని అభిప్రాయాలు మాత్రమే పేర్కొనడం జరిగింది . మరెన్నో  అభిప్రాయాలు  ఇంకా ఆయన ఇతర రచనల్లో ఉన్నాయి. కాళిదాసు వెలువరించిన అభిప్రాయాలు,  ఆలోచనలు సార్వకాలికాలు, సార్వత్రికాలు, ఆచరణసాధ్యాలు కూడ. కాబట్టి నేటి విద్యావేత్తలు వాటిని ఖచ్చితంగా అమలు చేస్తే  విద్యారంగం మరింత ఉన్నతస్థాయికి  చేరుకుంటు౦దనడంలో ఎటువంటి సందేహంలేదు.

Reference:

1.     SubhaaShita trishati of Bhartruhari I-20
2.     Taittiriya Upanishad
3.     Kumarasambhavam
4.     Malavikagnimitram
5.     Raghuvamsa
6.     Malavikagnimitram –Act-1. Stanza 17
7.     Raghuvamsa
8.     Ibid – Canto-1                                                                                                      
9.    Abhijnana sakuntalam
10.                        Education is the manifestation of perfection already in    man-The complete works of Swami Vivekananda, Vol-IV-p-358. Advaita Ashram, Delhi -5, Entally Raod Calcutta.-700014.


No comments: