Wednesday, October 21, 2015

An article on environmental awareness-నీరు-విలువ-( The value of water)

                        An article on environmental awareness
                                నీరు-విలువ
                                ( The value of  water)             
   
                                          డాక్టర్:-  చిలకమర్తి దుర్గాప్రసాద రావు

1.   ఉపోద్ఘాతం:
ప్రపంచవ్యాప్తంగా ఈనాటి మానవసమాజం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో పర్యావరణకాలుష్యసమస్య ప్రధానమైంది. ఈ ప్రపంచ౦  భూమి, నీరు, గాలి, అగ్ని,  ఆకాశం అనే ఐదు తత్వాలతో నిండి ఉంది. వీటిలో అగ్ని, ఆకాశం తప్ప మిగిలిన మూడు అంటే భూమి, నీరు, గాలి ఎంతో కొంత  కాలుష్యానికి లోనవుతాయి . ఏ కాలుష్యం ప్రకృతిసమతౌల్యాన్ని దెబ్బదీసి ప్రాణికోటికి విఘాతం కల్గిస్తు౦దో ఆ కాలుష్య౦ పర్యావరణకాలుష్యమని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ప్రాచీనకాలంలో మనిషి ప్రకృతితో సహజీవనం చేస్తూ శాంతియుతంగా నివసించేవాడు. ప్రకృతిలోని  ప్రతివస్తువును  దైవసమానంగా భావించేవాడు.   భూమిని భూమాత గాను, నీటిని వరుణదేవుని గాను, గాలిని వాయుదేవుని గాను, నిప్పును అగ్నిదేవుని గాను, అలాగే ప్రతి వస్తువును దైవసమానంగాను భావించి పూజించేవాడు. ప్రకృతి ఎప్పుడైనా ప్రళయతాండవం  చేసినప్పుడు తనను, తనతో బాటు అందరిని రక్షించమని వేడుకునేవాడు .

    కానీ ఆధునికయుగంలో మనిషి స్వార్థపరుడై అభివృద్ది, ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ  అనే వంకతో   సహజవనరులను నాశనం చెయ్యడం మొదలు పెట్టాడు. అడవుల నిర్మూలన, మితిమీరిన ప్రాణిహింస, అధికమైన   రసాయనాల వినియోగం పర్యావరణకాలుష్యానికి  కారణాలయ్యాయి. నేటితరం  గతతరానికి,  భవిష్యత్తరానికి వారధి లాంటిది. అందువల్ల మనం గతతరం నుండి అందుకున్న వారసత్వసంపదను రాబోయే తరానికి అందించవలసిన గురుతరమైన  బాధ్యత మనపై  ఉంది. అలా కాకుండా నేటి  మనిషి తన వైఖరి మార్చుకోకుండా ఇలాగే  కొనసాగితే, మానవమనుగడకే ముప్పు వాటిల్లే  ప్రమాదం అతి చేరువలోనే ఉంది. నిజానికి ఏ దేశ౦ అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధిని కాదనదు. కాని ఆ అభివృద్ధి ఆరోగ్యకర౦గాను, ఆనందదాయక౦గాను ఉండాలి. అంతేగాక అది భావితరాల మనుగడకు, అభివృద్ధికి ఆటంకం  కలుగజేయనివిధంగా కూడ ఉండాలి. అటువంటి ఆరోగ్యవ౦తమైన,  స్థిరమైన అభివృద్ధిని సాధించటానికి  ప్రకృతితో శాంతియుతమైన సహజీవనం చెయ్యడం అలవరచుకోవాలి. ఇది తప్ప మరొక మార్గంలేదు. ఇదే మన పూర్వీకులు వేదకాలం నుంచి చేస్తున్నదీ మనకు చెబుతున్నదీని.

ప్రపంచంలోనే మొట్టమొదటిగ్రంథమైన ఋగ్వేదం పర్యావరణపరిరక్షణపై కూడ మనకెన్నో విషయాలు తెలియజేసింది. ఈ భూమికి మనకు గల  సంబంధం తల్లి  బిడ్డల సంబంధం వలె ఉన్నత౦గా  ఉండాలని హిత౦ చెప్పింది. ప్రకృతి మనకిచ్చిన సంపదను రక్షించాలని, సద్వినియోగం  చెయ్యాలని, దుర్వినియోగ పరచకూడదని  శాసించింది.  ప్రస్తుత వ్యాసంలో ప్రకృతి మనకిచ్చిన నీటివిషయంలో మన భారతీయుల భావన ఎలా ఉందో  పరిశీలిద్దాం.
2. నీరు- స్వరూప స్వభావాలు

 సహజవనరులన్నిటిలో గాలి తరువాత   నీటికి ఎంతో  ప్రాముఖ్య౦ ఉంది .
 సంస్కృతభాషలో నీటికి  అనేక పదాలున్నాయి. అవన్నీ సార్థకాలే.  నీటిని (1) ఆప: అంటారు. ఆప్నోతి ఇతి ఆప: . అంతట వ్యాపి౦చేది అని అర్థం. ఇక నీటిని (2) వారి అని కూడ పిలుస్తారు.     అపవారయతి నిమ్నోన్నతం ఇతి వారి అనే అర్థాన్ని బట్టి ఇది ఎత్తు పల్లాలను తొలగిస్తుంది. అలాగే ప్రవహించే స్వభావం కలిగి ఉండడం వలన దీనికి (3) సలిలం అనిపేరు  (సరతి ఇతి సలిలం ). అలాగే దాహంతో బాధపడేవారు కోరుకునేది కాబట్టి (కామ్యతే తృషార్తై:) నీటికి   (4) కమలం అని కూడ పేరు. ఘనరుపంలో కూడ ఉంటుంది కాబట్టి (జడతి - జడీ భవతి ఇతి జలం) నీటికి (5) జలం అని పేరు. పీయతే ఇతి పయ: అనే వ్యుత్పత్తిని బట్టి నీటిని (6) పయ: అంటారు. ఇది అందరి చేత త్రాగబడుతుందని అర్థం . అగ్నిని చల్లారుస్తుంది కాబట్టి నీటికి (7)కీలాలమని పేరు (కీలాన్జ్వాలాన్    అలతి వారయతీతి కీలాలం). నీటికి (8)అమృతం అనే పేరు కూడ ఉంది. న మ్రియతే అనేన ఇత్యమృతం అనే వ్యుత్పత్తిని బట్టి   ఇది ప్రాణాలు కాపాడుతుంది అని అర్థం.  ఇది త్రాగే ప్రతి ఒకరిని   జీవి౦ప జేస్తుంది కాబట్టి దీనికి (9) జీవనం అని పేరు జీవంత్యనేన ఇతి జీవనం. ఇది ప్రయోజనాలు నెరవేరుస్తుంది  కాబట్టి నీటిని (10) భువనం అని పిలుస్తారు.
(భవతి సర్వం అనేన ఇతి భువనం). నీటిని  (10) వనం అని కూడ అంటారు
(వన్యతే యాచ్యతే ఇతి వనం ) ఐది ప్రతి వ్యక్తి చేత కోరబడేది. అందరికి కావలసినది.  నీటిని (11) కబంధం ( కం బధ్నాతి)  అని కూడ పిలుస్తారు. ఎందుకంటే  ఇది శరీరాన్ని ఒకే విధంగా బంధించి ఏకంగా ఉంచుతుంది. ఉనక్తి ఇతి ఉదకం అని చెప్పడం వల్ల  ఇది ద్రవస్థితిలో ఉంటు౦ది కాబట్టి (12) ఉదకమని పిలుస్తారు. పాతి భూతాని ఇతి పాథ: అనే అర్థంలో  ఇది  అన్ని జీవులను  రక్షిస్తుంది కాబట్టి (13) పాథ: అని పిలవబడుతో౦ది. అలాగే ఇది ప్రతిజీవిని పోషించడం వల్ల (14) పుష్కరం  ( పోషయతి ఇతి పుష్కరం) అయింది .   ఇది (సర్వతో ముఖాని అస్య) ఘన, ద్రవ, వాయు అనే మూడు రూపాల్లోనూ ఉంటుంది కాబట్టి (15) సర్వతో ముఖం అయింది.    ఇది ప్రవహించే స్వభావం కలిగి ఉండడం వల్ల(అమతి గచ్ఛతి ఇతి) (16) అంభస్సు  అయింది. ఇది శరీరానికి కావలసిన పోషకపదార్థాలను అందించి రక్షిస్తుంది కాబట్టి (తన్యతే పాలయతి ఇతి) (17) తోయం  అని పిలుస్తారు. త్రాగుటకు యోగ్యమైనది కావడం వల్ల (పాతుం యోగ్యం ) (18) పానీయం అయింది . అందరికి సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది  కాబట్టి
( నయతి సుఖం ) (19) నీరం అయింది. ఆవిరై నశిస్తుంది అంటే  బాష్పీభవనానికి లోనవుతుంది కాబట్టి (20) క్షీరం (క్షీయతే ఇతి ) అని పిలుస్తారు. ప్రవహిస్తూ ధ్వని చేస్తుంది కాబట్టి (అంబతే ఇతి) ఇది (21) అంబు అయ్యింది . శం సుఖం  వృణోతి అనే అర్ధంలో అందరికి సుఖాన్ని, ఆనందాన్ని  కలిగించడం చేత (22) శంవరం అయింది.  ఈ విధంగా నీటికి ఉన్న అన్ని మాటలు  అర్థవంతంగా ఉండి నీటి యొక్క  వివిధలక్షణాల్ని, ఉపయోగాల్ని  వివరిస్తున్నాయి.

3. నీటి కాలుష్య౦- కారణాలు:
విచక్షణారహితంగా   రసాయనద్రవ్యాల   వినియోగం, మురికినీటిని, వివిధ కర్మాగారాలనుండి బయటకు విడిచిపెట్టిన కలుషమైన నీటిని నదులలోకి, కాలువలలోకి వదిలేయడం, అశాస్త్రీయమైన జలనిర్వహణవిధానాలు,  అవాంఛిత మైన, ప్రమాదకరమైన  వస్తువులను నీటిలో పారవేయడం మొ|| నీటి కాలుష్యానికి దోహదం చేస్తున్నాయి.  ఈ ప్రపంచంలోని సమస్తజీవుల మనుగడకు కారణమైన నీటిని  మనం పరిశుభ్రంగా ఉంచాలి. మన పూర్వీకులు  దాని స్వచ్ఛతను కాపాడడానికి ఏ ఏ విధానాలు ఆసరించారో అర్థం చేసుకోవాలి.  నీటి ప్రాముఖ్యాన్ని గుర్తించాలి. పిల్లలకు, పెద్దలకు అందరికి తెలియ(జెప్పాలి.

4. నీటి ప్రాముఖ్య౦:

ఋగ్వేదంలో నాసదీయసూక్తం (10/129) ప్రకారం సృష్టి ముందు నీరు మాత్రమే ఉంది. హిందూధర్మం, పురాణాలు నీటిని విష్ణువు యొక్క నివాసంగా వర్ణిస్తున్నాయి. నారా: ఆప:  అయనం స్థానం  యస్య స:  నారాయణ: అని నీరే నివాసస్థానం గలవానిగా   స్తుతించాయి. నీరు మానవజీవితంలో చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ప్రాణిజీవనానికి అడుగడుగునా నీటి అవసరం ఉంది. ఏ వైదికకార్యకలాపమైన నీటిని ఉపయోగించకుండ నిర్వహించడం సాధ్యం కాదు.  నీటి ప్రాధాన్యాన్ని చెప్పే వేదమంత్రాలు వందలకు పైగా ఉన్నాయి.  సంస్కృతంలో నీటిని జీవనం అంటారు. ఇది అమరత్వాన్ని ప్రసాదించే  ఒక పానీయం. మన దేశం వ్యవసాయప్రధానమైన దేశం. వ్యవసాయం నీటి మీద ఆధారపడి ఉంటుంది. నీటిని ఒక దివ్య ఔషధం గాను (6/1) అలాగే తల్లిగాను కూడ(6/2) పరిగణిస్తారు. మన ప్రాచీనవైద్యవిధానం ద్వారా (6/3) మానస గంగోత్రి నుండి వెలువడిన నీటిని  క్రిమినాశకజలం(distilled-water)గా ఉపయోగించేవారని తెలుస్తోంది. అందుకే మన ప్రాచీనులు, నీటి ప్రాముఖ్య౦  గుర్తింఛి నీటితో  మమైక్యం చెందారు.
 మన  సంస్కృతిలో మానవులకు  నీటితో  సంబంధబాంధవ్యాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతో మంది  గొప్ప వ్యక్తులు నదులను  వివాహం చేసుకున్నారు. ఉదాహరణకు: - శంతనుడు గంగను,   పురుకుత్సుడు  నర్మదను, శ్రీరాముని కుమారుడైన కుశుడు కుముద్వతిని వివాహం చేసుకున్నారు. నదుల చరిత్రలను వివరించే ఎంతో సాహిత్యం మనకుంది. మనుషులకు, వాహనాలకు, కట్టడాలకు నదులపేర్లు పెట్టుకోవడం మన సాంప్రదాయం. నదులలో స్నానం చెయ్యడం కూడ ఒక పవిత్ర కార్యక్రమంగా భావిస్తా౦. ఇక  గంగానదిని  కేవలం చూస్తేనే ముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. (8)
ఈ సందర్భంలో ఒక విషయ౦ ప్రస్తావి౦చడం అసందర్భం కాదు. ఇటీవల పరమపదించిన సన్నాయి వాద్యకళాకారుడు శ్రీ బిస్మిల్లా ఖాన్ గార్ని అమెరికా దేశీయులు తమదేశానికి ఆహ్వానిస్తూ అయ్యా! మీరు శాశ్వతంగా మా దేశానికొచ్చెయ్యండి మీకు ఏ లోటు రానివ్వం, కోరిన ధనం ఇస్తాం, సకల సౌఖ్యాలు  ఏర్పాటు చేస్తాం అన్నారు . సరే నేను వస్తాను మరి నాకు గంగమ్మ తల్లిని అక్కడ ఏర్పాటు చేయగలరా? అని అడిగారు. వారు సారీ సార్ అన్నారు. ఈయన సమాధానంగా వెరీ సారీ, నేను ఈ పవిత్రగంగాతీర౦ కాశీని విడిచిపెట్టి అక్కడికి  రాలేను అని చెప్పేశారు.  కాబట్టి మనకు  నీరంటే కేవలం H2O కాదు,  అంతకంటే అతీతమైన దైవ స్వరూపం .

5. నీటికాలుష్యంమహాపాపం:

వేదం జలకాలుష్యాన్ని తీవ్రంగా నిరశి౦చింది. ఏ పరిస్థితిలోను  నీటిని  కలుషిత౦ చెయ్యకూడదని హెచ్చరించింది. (9)  నీటిని కలుషితం చెయ్యడం నేరంగా పరిగణి౦ చింది. కృష్ణుడు విషసర్పమైన కాళియుని  శిక్షిస్తూ -- ఓ కాళియా! నువ్వు పవిత్రమన నదీజలాలను కలుషితం చేశావు, అందుకే నిన్ను దండించాను. ఇప్పుడు క్షమిస్తున్నాను. కానీ నువ్వు ఇక్కడ ఏ మాత్రం ఉండకూడదు. తిరిగి సముద్రానికి వెళ్లి మీ వాళ్ళతో సుఖంగా బ్రతుకు.  నది మానవుల ఉపయోగం కోసం ఉద్దేశించబడింది. వారి జీవితాలు నదిపై ఆధారపడి ఉన్నాయి . నువ్వు నీ విషంతో కలుషితం చెయ్యడం శిక్షి౦చదగిన నేర౦ అంటాడు (భాగవతం)  .
 రామాయణం త్రాగునీటిని  కలుషితం చెయ్యడం  ఒక గొప్ప పాపంగా పరిగణి౦ చింది. రాముని తల్లి కౌసల్య భరతుని రాకను తెలుసుకుని, అతన్ని చేరి,  రాముని అడవికి పంపించినందుకు తీవ్రంగా నిందించింది. అప్పుడు భరతుడు ఆమెతో అమ్మా! నేను నిజంగా రాముని అడవులకు పంపించాలనే చెడ్డ ఉద్దేశం కలవాణ్ణే అయితే త్రాగు నీటిని కలుషితం చేసేవాడు ఏ నరకానికి పోతాడో నేను కూడ ఆ నరకానికి పోతాను అని అంటాడు (10). దీన్ని బట్టి  నీరు  కలుషితం చెయ్యడం ఎంత నేరమో తెలుస్తోంది. ఎందుకంటే జలకాలుష్య౦ వల్లనే మనం అనేక వ్యాధులతో  బాధపడుతున్నాం. సుజలాం సుఫలాం అని పిలవబడే మనదేశంలో మంచినీరు కూడ డబ్బుతో కొనుక్కుని త్రాగవలసిన  దౌర్భాగ్యస్థితిలో ఉన్నా౦.
మనిషికి ప్రకృతికి మధ్య గల బంధం ప్రాచీనకాలం నుండి చాల బల౦గా  ఉంది. అందువల్ల మనం ప్రకృతితో మితిమీరినజోక్యం విడిచిపెట్టి దాని  సమతౌల్యాన్ని కాపాడవలసిన గురుతరమైన బాధ్యత మన మీద ఉంది. ప్రసిద్ధ అమెరికన్ నవలా రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే అన్నట్లు “Mending nature is ending nature”.
 ప్రకృతిని అణచి పెట్టడమంటే ప్రకృతిని నాశనం చెయ్యడమే.
6. అనుసరించ వలసిన పద్ధతులు:
1 . నీటిని పవిత్రమైన , విలువైన వస్తువుగా భావి౦చాలి. వ్యర్థం కాకుండా చూడాలి .
2. ఇప్పటికే నదీజలాలు  చాల వరకు కలుషితమై పోయాయి. ఇప్పటికైనా తగిన చర్యలు చేపడితే తీవ్రనష్టం కలగకుండ జాగ్రత్తపడొచ్చు.   
3. జలనాణ్యతానిర్వహణపద్ధతులు సమర్థవంతంగా చేపడితే రాబోయే నష్టాన్ని నివారి౦చొచ్చు. నివారణచర్యలు సమయం తీసుకుంటాయి. కాబట్టి prevention is better than cure అన్నట్లు మనం చిత్తశుద్ధితో  మన ప్రాచీనులు అనుసరించిన మార్గాన్ననుసరించి మసలుకుంటే జలకాలుష్యానికి తావే ఉండదు.
 ఒక అమెరికన్ సామెత ఇలా చెబుతోంది. ఇదైన మన మనస్సులో కొన్ని మార్పులు తేవాలి.
"ఆఖరి చెట్టును నరికిన తరువాతనే 
ఆఖరి  చేపను పట్టుకున్న తరువాతనే
ఆఖరి నదిని కలుషితం చేసిన తర్వాతనే
డబ్బు తినడానికి పనికి రాదని నువ్వు  గ్రహిస్తావు
 Only after the last tree has been cut down,
Only after the last fish has been caught,
Only after the last river has been poisoned,
Only then will you realize that money cannot be eaten’’
                                              --- Native American Saying----
  యజుర్వేద౦లోని ఈ శాంతి మంత్రంతో  వ్యాసం ముగుస్తు౦ది.

द्यौ: शान्ति: | अरन्तरिक्षं शान्ति: | पृथिवी शान्ति: आप: शान्ति: | ओषधय: शान्ति: | वनस्पतय: शान्ति: | विश्वे देवा: शान्ति: | ब्रह्म शान्ति: | सर्वं शान्ति: | शान्तिरेव शान्ति: | सा मा शान्तिरेधि ||

                             Save water --- Save the world.

References:

(1)     अग्निर्देवता वातो देवता सूर्यो देवता चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता ss दित्या देवता मरुतो देवता विश्वेदेवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता (यजुर्वेद -14/20)
(2)     माता भूमि: पुत्रोऽहं पर्थिव्या: (अथर्ववेद- 12-1-12)         
(3)  आप: स्त्री र्भुम्नि वार्वारि सलिलं कमलं जलम्
      पय: कीलालममृतं जीवनं भुवनं वनम्
                कबन्धमुदकं पाथ: पुष्करं सर्वतो मुखं
       अम्भोणस्तोयपानीयं निरक्षीराम्बुशंवरम् (अमरकोशे- वारिवर्ग: -   - श्लो-3&4)
(4) नासदासीन्नो सदासीत्तदानीं नासीद्रजो नो व्योमा परो यत्|
      किमावरीव: कुहु कस्य शर्मन्नम्भ: किमासीद्गहनं गभीरम् ||
    (ऋग्वेद: -10-129)
(5) नारा आप: अयनं स्थानं यस्य स: नारायण: (अमरकोश:/  स्वर्वर्ग: /18). 
(6/1) भिषग्भ्यो s पि भिषक्तर: (अथर्वणवेद-- 19-2-3)
(6/2)  यूयं हि ष्ठा भिषजो मातृतमा
विश्वस्य स्थातुर्जगतो जनिय्री: (ऋग्वेद: 6-50-7)
 (6/3) शरीरे जर्जरीभूते व्याधिग्रस्ते कलेबरे |
औषधं जाह्नवीतोयं वैद्यो नारायणो हरि: ||
 (7)   मधुवाता ऋतायते
          मधु क्षरन्ति सिन्धव:
          माध्वीर्नः सन्त्वोषधी (ऋग्वेद-1-90-6)
 (8)   अम्ब तवद्दर्शनान्मुक्ति: न जाने स्नानजं फलम् |   
 (9)  मा ss पो हिंसी:, मा ओषधीन्हिंसी:
    धाम्नो: धाम्नो राजंस्ततो वरुण नो मुञ्च
    सुमित्रिया न sआप sओषधय:  सन्तु
    दुर्मित्रियास्तस्मै सन्तु  योसमान् द्वेष्टि
    यं च वयं द्विष्म:      ( यजुर्वेद: - 6-22)
 (10) पानीयदूषके पापं तथैव विषदायके |
        यत्तदेकस्स लभतां यस्यार्योs नुमते गत: ||
    (श्रीमद्रामायणम्अयोध्याकाण्ड:)| Canto 75/ Stanza56

Bibliography:
1. Amarakosa 2.  Atharva Veda. 3.  Bhagavata puranam
4.  Rig-Veda.  5. The Ramayana of Valmiki  6. Yajurveda.

7. Journals & News Papers.

No comments: