Monday, October 5, 2015

వేగ బ్రోవ రమ్ము వేంకటేశ!

వేగ బ్రోవ రమ్ము వేంకటేశ!
                                                                   చిలకమర్తి వేంకట సూర్యనారాయణ
నరసాపురం
1. సీసము:-  చుట్టాలు హితులును| చొరవగా దరిజేరి
                                      ధైర్యము చెప్పెడి|తరుణమందు
               వైద్యపు౦గవులిచ్చు| హృద్యౌషధంబులు
                                   కంఠ౦బు దిగనట్టి | కాలమందు
              మర్మంబు లెఱిగింప | మాటాడయత్నించి
                                    విఫలమై శోకించు | వేళలందు
               పాశాన శమను౦డు | ప్రాణాలు గొంపోవ
                                       నిర్దయుడై చెంత | నిలుచు నాడు
ఆ|| వె|| నిన్ను శరణు వేడ నెట్లుందునో  నాడు
          నాటికిపుడె గొనుము నాదు మనము
          కాలయాపనంబు గావింపకోస్వామి!
           వేగ బ్రోవ రమ్ము వేంకటేశ|

2. సీసము:- తిరుమలేశుని నామ| దివ్యమంత్రమ్మును
                      చిత్తశుద్ధిగ జపము| చేయువారు
               ఏడు కొండలనెక్కి |యింపుగా నీమూర్తి
                   కనువిందుగా వేగ | గాంచువారు
                   అమ్మలకమ్మయౌ | నలివేలుమంగకు
                  సాష్టాంగవందనాల్  | సలుపువారు
                  కడు భక్తితో స్వామి | కళ్యాణసేవను
                  విభవము మీర గా|వించువారు
ఆ|| వె||  జగతిలోన సర్వసౌఖ్యాల తులతూగి
            ఇష్ట సిద్ధులొంది యిహమునందు
            సజ్జనాళి వలన సన్నుతులందుచు
            నిన్ను చేరుకొనుట నిశ్చయంబు 

3. ఆ|| వె|| ఏడు గిరులపైన నింపుగా సతులతో
              నిండు సౌఖ్యమందు నీకు పరుల
             బాధలెట్లు తెలియు పంకజనాభుడా!
             వేగ బ్రోవ రమ్ము వేంకటేశ!

4. ఆ|| వె|| నీవె దిక్కటంచు  నిశ్చల భక్తితో
               చిత్తమందు పూజ చేయు నాదు
              మొరలు వినవదేల ముక్కంటి ప్రియసఖ !
               వేగ బ్రోవ రమ్ము  వేంకటేశ!

5. ఆ|| వె||  నాదు మనసు నందు నక్కిన రిపులను
                పాఱద్రోలి వేగ భయము బాపి
               నిన్ను గాంచునట్టి నిశ్చలతత్త్వంబు  
               వేగ మొసగి బ్రోవు వేంకటేశ!



No comments: