Monday, January 18, 2016

పదిలమైన విద్యకు పదహారు కళలు -2

పదిలమైన విద్యకు పదహారు కళలు -2
(The sixteen facets of Education)
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
  
II.             నాలుగు మార్గాలు: 1. అధ్యాపకుడు 2. స్వబుద్ధిబలం 3. సహాధ్యాయులు 4. సమాజం.
గతంలో నాలుగు స్తంభాల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు నాలుగు జ్ఞానార్జనమార్గాలు గురించి ముచ్చటించుకుందాం. సంస్కృతంలో ఒక సూక్తి ఉంది.
ఆచార్యాత్పాద మాధత్తే   పాదం శిష్య: స్వమేధయా
పాదం సబ్రహ్మచారిభ్య:    పాదం కాలక్రమేణ చ
విద్యార్థి తన గురువు నుంచి 1/4 వంతు జ్ఞాన౦ మాత్రమే గ్రహిస్తాడు.
ఇంకో 1/4 వంతు జ్ఞానం  తన బుద్ధిబలం ఉపయోగించి సంపాదిస్తాడు.
మరో 1/4 వంతు జ్ఞానం సహాధ్యాయులతో చర్చించడం వల్ల తెలుసుకుంటాడు.
మిగిలిన 1/4 వంతు  జ్ఞానం లోకానుభవంతో పొందుతాడు.
 గురువు సంపూర్ణమైన జ్ఞానం కలవాడే అయినప్పటికీ  ఒక ప్రణాళికను అనుసరించి బోధించవలసిన కారణంగానుసమయాభావం వల్ల పూర్తి జ్ఞానాన్ని విద్యార్థికి అందించలేడు. కొ౦త మాత్రమే అందించ గలుగుతాడు  అందువల్ల విద్యార్థి కేవలం గురువు బోధించిన దానితోనే సరిపెట్టుకుని సంతృప్తిపడకూడదు. తన బుద్ధిబలం ఉపయోగించి అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు కొంత పెరుగుతుంది. అదీ సమగ్రం కాదు కాబట్టి  ఆ తరువాత తన సహాధ్యాయులతో (class mates) చర్చించి మరింత  పెంపొందించుకోవాలి. అది కూడ అసమగ్రమే. అందువల్ల విద్యార్థి కాలక్రమంగా సమాజంనుంచి గ్రహిస్తాడు. అందుకే  Instruction ends with class room but education ends only with life అన్నారు .        
అంతేకాకుండ మనం సమాజం లేదా ప్రకృతిని పరిశీలించి నేర్చుకునే జ్ఞానం అపరిమితం . అందుకే ప్రముఖ ఆంగ్లకవి   Tennison ఒక సందర్భంలో 
Enough of Science and that of Arts
Close up those barren leaves
--------------------------------
Let nature be your teacher
అంటారు. అందువల్ల ప్రతి వ్యక్తీ నిరంతరవిద్యార్థియే. ఎందుకో ఈ కాలంలో అధ్యాపకవర్గానికి చెందినవారు కూడ ఉద్యోగాల్లో స్థిరపడగానే చదువుకి స్వస్తి చెప్పేస్తున్నారు. ఇది చాల శొచనీయం.

 III. నాలుగు స్థాయిలు: 1. శారీరకవికాసం 2. మానసిక వికాస౦ ౩. బౌద్ధికవికాసం
                              4. ఆధ్యాత్మిక వికాసం 
మనిషి అంటే  కేవలం పైకి కనిపించే శరీర౦ మాత్రమే కాదు, మనస్సు , బుద్ధి , ఆత్మ- వీటన్నిటి యొక్క సమగ్రస్వరూపం. అందువల్ల విద్య వీటన్నిటి సమున్నతికి దోహదం చేసినప్పుడే అది సమగ్రమైన విద్య ఔతుంది. సమతౌల్యం గల ఆహారం, ఆహారం తోపాటు తగినంత వ్యాయామం, క్రీడలు శారీరకవికాసానికి అవసరం. మంచి పుస్తకాలు, వినోదకార్యక్రమాలు మానసికవికాసానికి  తోట్పడతాయి. పాఠ్యపుస్తకాలు, చర్చలుసమావేశాలు, గోష్ఠులు బుద్ధివికాసానికి దోహదం చేస్తాయి.  ఇక యోగసాధన, ధ్యానం, పవిత్ర స్థలాలు సందర్శించడం ||మొ|| ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ అన్నివిషయాలలోనూ తమపిల్లల అభివృద్ధికి  సహాయపడాలి.

  IV.  నాలుగు దశలు: 1. అధీతి  2.  బోధ 3.  ఆచరణ 4.  ప్రచారం .

  ఇప్పుడు విద్యయొక్క నాలుగు దశలను గురించి   తెలుసుకుందాం.
 అవి అధీతి , బోధ, ఆచరణ , ప్రచారం అనేవిఅధీతి అంటే చదవడం, బోధ అంటే ఇతరులకు బోధించడం. ఆచరణ  అంటే నేర్చుకున్న విద్యలో నున్న విలువల్ని ఆకళింపు చేసుకుని ఆచరణలో  పెట్టడం.  ప్రచారం అంటే విద్యను సమాజాభివృద్ధికి  తోట్పడే విధంగా ప్రచారం చెయ్యడం. నాలుగు జరిగితేనే చదువుకున్న విద్య  సార్థకం అవుతుంది. భట్టహర్షుడు తన  నైషధీయచరితలో  నాయకుడైన నలమహారాజును ప్రశంసిస్తూ ఆయన చతుర్దశవిద్యలకు (14 విద్యలకు) చతుర్దశలు ( నాలుగు దశలు) కల్పించాడని అంటాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అనే నాలుగువేదాలు; శిక్ష , వ్యాకరణం, చందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం  అనే ఆరు వేదాంగాలుపురాణ౦, న్యాయశాస్త్రం,   మీమాంసధర్మశాస్త్ర౦  అనే చతుర్దశవిద్యలకు, చతుర్దశలు అంటే చదవడం , బోధించడంఆచరించడంప్రచారం చెయ్యడం అనే నాలుగు దశలూ చేకూర్చాడని వివరించాడు. కాబట్టి కేవలం చదవడం వల్ల విద్యయొక్క సంపూర్ణ ప్రయోజనం నెరవేరదు. చదివిన దాన్ని ఇతరులకు చెప్పాలి.
ఇక మనకు తెలిసిన విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టడం మహాపాపమంటుంది భారతీయసనాతన ధర్మం.  నన్నయ గారు మహాభారతంలో ఒకచోట-
తన యెఱిగిన యర్థం బొరు
డనఘా ! యిడి యెట్లు చెప్పు మని యడిగిన చె
ప్పని వాడును సత్యము చె
ప్పనివాడును ఘోరనరకపంకమున బడున్ -          అంటారు
ఎవరైనా తనకు తెలియని విషయాన్ని బోధించమని మరొకరిని అడిగినప్పుడు తనకు తెలిసినప్పటికీ చెప్పని వాడు, నిజం చెప్పని వాడు అంటే అబద్ధం చెప్పేవాడు ఘోరమైన నరకానికి చేరుకుంటాడని అర్థం. కాబట్టి మనకు తెలిసిన జ్ఞానాన్ని దాచుకోకూడదు. అడిగినవారికి, ఆసక్తిగలవారికి చెప్పాలి. అప్పుడే విద్యకు శాశ్వతత్వం సిద్ధిస్తుంది . లేకుంటే మనతోబాటే నశిస్తుంది.
ఇక విద్యలో చెప్పబడిన విషయాలను ఆచరించాలి. ఆచరణలేని విద్య వల్ల ఎటువంటి ప్రయోజనం లేకకపోవడం మాట అటుంచి ప్రమాదం కూడ కల్గుతుంది . .
వేదం  ఆచరణ లేని విద్యావంతుణ్ణి ఎంత తీవ్రంగా నిందించిందో స్వయంగా చూడండి
ఆచారహీనం న పునంతి వేదా:
యద్యప్యధీతా: సహ  షడ్భిరంగై:
ఛందాంస్యేనం మృత్యు కాలే త్యజంతి
నీడం శకు౦తా ఇవ జాతపక్షా:
     ఒక వ్యక్తి సమస్త వేదాలు, వేదాంగాలు చదివినప్పటికీ వాటి విలువలను ఆచరించడో అట్టివానిని మరణ సమయంలో వేదాలన్నీ -- ఏవిధంగా రెక్కలొచ్చిన పక్షి  గూడును విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్లి పోతు౦దో అదే విధంగా విడిచిపెట్టి పోతాయి. వాడికి ఎటువంటి ఫలితాన్ని చేకూర్చవు. ఒక సారి గూడు విడిచివెళ్లిన పక్షి తిరిగి ఆ గూటికి రాదు . స్వయంగా గూడు తయారు చేసుకుంటుందని ప్రతీతి.
ఆచరణకు అంత ప్రాధాన్యం ఉంది. కొంతమంది చూడండి వేద,వేదాంగాలు చది వినప్పటికి చాల నీచమైన ప్రవర్తన కలవారై ఉంటారు. అటువంటి వారిని చేరకూడదంటాడు భర్తృహరి.

దుర్జన: పరిహర్తవ్య: విద్యయాsలంకృతోsపి సన్
మణినా భూషిత: సర్ప: కిమసౌ న భయంకర:

దుర్మార్గుడు విద్యావంతుడైనప్పటికి అతనిని చేరరాదు. పాము తన తలపైన విలువైన మణిని ధరించినప్పటికీ  అది భయంకరమైనదే కదా! ఈ విషయాన్నే షేక్స్పియర్ మహాకవి  ఒక సందర్భంలో " Like the toad ugly and venomous, wears yet a precious jewel on its head " అంటాడు. కాబట్టి  నీతిలేని విద్యావంతుని కన్నా నీతిగల విద్యావిహీనుడే మిన్న.
ఇక చిట్టచివరి అంశం ప్రచారం . విద్యవల్ల సమాజం అంతా ప్రయోజనం పొందాలి . అది విద్య సమాజానికి అ౦దినప్పుడే సాధ్యమౌతుంది. అందువల్ల ప్రతి విద్యావంతుడు Each one teach one అనే ప్రాతిపదికన అందరిని విద్యావంతుల్ని చెయ్యాలి .  If Mohammad does not go to the Mountain, the mountain should go to Mohammad అంటారు వివేకానందస్వామి. కాబట్టి మనం సమాజం నలుమూలలకు పోయి అందరికి విజ్ఞానకాంతులు వెదజల్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మనం సమాజం యొక్క ఋణాన్ని కొంతవరకు తీర్చుకున్న వాళ్ళ మౌతాము. ఆనాడే మనం నేర్చుకున్న విద్యకు సాఫల్యం సిద్ధిస్తుంది .
అజ్ఞానాంధకారం  నిర్మూలిద్దాం. విజ్ఞానకాంతులు వెదజల్ల్లుదాం   


No comments: