Saturday, January 16, 2016

జాషువ గారి కావ్యాల్లో మహిళాసాధికారత

జాషువ గారి కావ్యాల్లో మహిళాసాధికారత
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
ధునికాంధ్రకవుల్లో  శ్రీ గుఱ్ఱ౦ జాషువ గారి స్థానం సమున్నతం. కరుణరసాన్ని ఆలంబనగా చేసుకుని కవిత్వమల్లిన కవివతంసుడాయన. ఆయన సమాజాన్ని పట్టిపీడిస్తున్న అన్ని సమస్యలను కవితావస్తువులుగా స్వీకరించడమే కాకుండా వాటికో పరిష్కారముద్రను కూడ సూచించారు. మహిళాభ్యుదయం, మహిళాసాధికారతల విషయంలో ఆయన ప్రకటించిన భావాలు ప్రశ౦సనీయమైనవి. ఆయన కావ్యాల్లోని స్త్రీపాత్రల స౦ఖ్య తక్కువే అయినా అవన్నీ  ఎంతో ఉన్నతంగా, హుందాగా కనిపిస్తాయి.
ఆయన స్త్రీపురుషసమానత్వాన్ని ప్రతిపాదిస్తూ ఈ సృష్టిలో స్త్రీపురుషులిద్దరూ సమానమేనని, స్త్రీ  పురుషుని కంటే ఏ మాత్రం తక్కువ కాదని అంటూ- అసలు ఆడుది లేకపోతే మగవాని ఉనికి ఎక్కడుంది? అని ప్రశ్నించారు.

మగ తెగయు నాడుతెగయను
తెగలున్నవి రెండు యాడు తెగలేకున్నన్
మగతెగకు పుట్టుగతి లే
దగణ్యములు రెండు తెగల యనుబంధంబుల్

 స్త్రీ లేకపోతే ఈ పదునాలుగు లోకాల్లో అసలు శోభే లేదని మగవాణ్ణి కన్నది కూడ ఒక స్త్రీ యేనని స్పష్టం చేశారు. పురుషుడు ఆడదాన్ని కేవలం పనులు చేసే ఒక యంత్రంగా భావించడం నేరమని హితవు చెప్పారు .
ఆడుది లేకుండిన  నీ
రేడుజగంబులను శోభయే లేదు నరుం
డూడిగపు యంత్రమనుకొని
చేడెను బంధించి వ్యర్థ జీవినొనర్చెన్
 భారతమహిళామణికున్న సహనం ఈ భూదేవికి కూడ లేదని కొనియాడారు.   
భూషణ సంతృప్తిం తన
ఘోషా చెరసాల నోర్చుకొనుగాని మదిం
దోషంబూనదు భారత
యోషామణికున్న సహనముర్వికి కలదే!

పురుషుడు తన పురుషాహంకారంతో స్త్రీలకు బట్టలు, నగలు ఎర చూపించి వారి శక్తి యుక్తులను దోచుకుంటున్నాడని ఇప్పటికైనా సత్యం తెలుసుకుని మసలుకొమ్మని మహిళలకు హితవు చెప్పారు. ఏమంటున్నారో ఆయన మాటల్లోనే చూడండి .
గడ్డాల్ మీసము లున్నవారమనుచున్ గర్వించి మీ నైపుణుల్
గొడ్డుం బోవగజేయు బూరుషుల యుక్తుల్ నమ్మి సేవించుచున్
గుడ్డల్ దొడ్డనగల్ ధరించుకొని షోకుల్ చేసి మోదింతువా
బిడ్డా!  యెంతటి వెఱ్ఱి దానవు కళావిశ్వంబు వీక్షింపుమా!     
ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నెన్నో లెక్కకు మిక్కుటంగా ఉన్నాయి .
ఇక జాషువ గారి రచనల్లోని  స్త్రీపాత్రలన్నీ ఎంతో విచక్షణ, ఆత్మగౌరవం కలిగి చాల హుందాగా కనిపిస్తాయి. ముఖ్యంగా ముంతాజ్ మహల్ లోని రాణి ముంతాజ్ స్త్రీ పాత్రలన్నిటిలో తలమానికం. తనకు మృత్యువు చేరువౌతున్నా తడబడక భర్తకు మృత్యువు యొక్క తత్వాన్ని ఉపదేశిస్తుంది. ఓనాథా! ఈ మహీతలం సుఖదు:ఖాల మిశ్రమ౦. ఇది శాశ్వతం కాదు. కొంచెం ము౦దూ వెనుకా, అందరు దీన్ని విడిచి వెళ్ళ వలసిన వాళ్ళే.  ఈ విశ్వమనే పులి కడుపులో రేపో మాపో అందరు ఇమిడిపోవలసిన వారే. వాళ్ళల్లో నే నొకదాన్ని. అందుకు విచారి౦చవద్దని మనవిచేస్తుంది. అలా అంటూనే  కొంతసేపటికి కన్ను మూస్తుంది. ఆమె మరణం షాజహానుకు తీవ్రమైన మనస్తాపాన్ని కల్గిస్తుంది. ఆమె లేనందుకు భయపడి పోతాడు. నిస్సహాయుడై హృదయవిదారకంగా విలపిస్తాడు. జాషువ గారి అభిప్రాయంలో భార్య అంటే ఏమిటో షాజహాను మాటలలో మనకు వ్యక్తం అవుతుంది.

అసుపేటిం బదిలంబుగా పతిరహస్యం బెల్ల గాపాడు వి
శ్వసనీయంబగు వ్యక్తి భార్యయె గదా! క్ష్మాచక్రమం దట్టి నీ
వసువుల్ బాసిన యంతనే ప్రబలసైన్యం బుండి భీతిల్లుదున్
వసుధారాజ్యము కల్గియున్ కటిక నిర్భాగ్యుండనైపోయితిన్             

ఇక ఫిరదౌసి కావ్యంలో ఫిరదౌసి కుమార్తె కూడ తండ్రి వలె ఆత్మాభిమానం గల యువతి. మాటతప్పిన మహమ్మదుఘజనీ  ఆ తరువాత పశ్చాతాపంతో  ఫిరదౌసికి అరువదివేల బంగారునాణాలు పంపిస్తాడు. కాని నాణాలు ఇంటికి చేరే సమయానికి ఫిరదౌసి మరణిస్తాడు. అతని కళేబరం స్మశానానికి చేరుకుంటుంది. అభిమానవతియైన ఫిరదౌసి కుమార్తె ఆ ద్రవ్యాన్ని స్వికరి౦చదు సరి కదా! వెనక్కి  త్రిప్పి పంపిస్తూ

ఇది నా తండ్రిని కష్ట పెట్టిన ధనం బీస్వాపతేయంబు ము
ట్టుదునా కంట తడిపెట్టున్ స్వర్గమందుండి మా
ముది తండ్రిన్ దయ తోడనేలిన నవాబు౦ డైన మీ స్వామికి౦
బదివేలంజలులు-- అంటూ మెత్తని చెప్పుతో కొట్టినట్లు సందేశమిచ్చి  ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని ప్రదర్శిస్తుంది.
ఈ విధంగా జాషువ గారి కావ్యాల్లో స్త్రీపాత్రలు కూడ చాల ఉన్నతమైనవి.  మహిళాభ్యుదయం, మహిళాసాధికారతల పట్ల జాషువ గారు వ్యక్తీకరించిన భావాలు సాటిలేనివి. అవి ఆదరణీయాలు, ఆచరణసాధ్యాలు ఆనడంలో ఎటువంటి సందేహంలేదు.        
         


No comments: