Sunday, January 17, 2016

పదిలమైన విద్యకు పదహారు కళలు

                                                           పదిలమైన విద్యకు పదహారు కళలు
                                                            (The sixteen facets of Education)
                                                                                                      డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

ఆహారం, నిద్ర, భయం, స్త్రీపురుషుల కలయిక అనే ఈ నాలుగు మనిషికి జంతువుకీ సమానమే. జ్ఞానం ఒక్కటే మనిషిని జంతువులనుండి వేఱుచేసి ఔన్నత్యాన్ని చేకూరుస్తుంది.  జ్ఞానం విద్యవల్ల లభిస్తుంది.  అందుకే 'విద్యలేనివాడు వింత పశువు' అన్నారు పెద్దలు. ప్రస్తుతం ' చదువుకున్న వాడు సంత పశువు' అనుకోండి. సరే ఆ సంగతలా ఉంచుదాం.
చంద్రుడు పదహారు కళలతో ఉంటే ఎలా పరిపూర్ణుడౌతాడో అలాగే విద్యకూడపదహారు అంశాలతో  పరిపూర్ణమౌతుంది.  అవేమిటో వరుసగా తెలుసుకుందాం.
I.   నాలుగు స్తంభాలు 1.తల్లి దండ్రులు 2. విద్యార్థులు 3 . అధ్యాపకులు 4. ప్రభుత్వం.
II.  నాలుగు మార్గాలు: 1. అధ్యాపకుడు 2. స్వయంకృషి 3. సహాధ్యాయులు 4. సమాజం
III. నాలుగుస్థాయిలు: 1. శారీరకవికాసం 2. మానసిక వికాస౦ ౩. బౌద్ధికవికాసం
                              4. ఆధ్యాత్మిక వికాసం
IV.  నాలుగు దశలు: 1. అధీతి  2.  బోధ 3.  ఆచరణ 4.  ప్రచారం . 4x4=16

విద్య అనేది ఒక అందాల మేడ అనుకుంటే ఒక మేడకు నాలుగు ప్రక్కల నాలుగు స్తంభాలున్నట్లే విద్యకు కూడ నాలుగు స్తంభాలున్నాయి. ఈ నాలుగు స్తంభాలపైనే విద్య అనే సౌధం నిలిచి ఉంటుంది. మొదటి స్తంభం తల్లిదండ్రులు. రెండో స్తంభం విద్యార్థులు. మూడో స్తంభం ఊపాధ్యాయులు. నాల్గో స్తంభం ప్రభుత్వం. ఈ నలుగురు తమతమ విధులను సక్రమంగా నిర్వహిస్తేనే విద్య పటిష్ఠంగా ఉంటుంది.
౧.  తల్లిదండ్రులు:
విద్యారంగంలో వీరిది చాల కీలకమైన పాత్రగా చెప్పుకోవచ్చు. పిల్లవాడు పాఠశాలలో చేరకముందు వీరే గురువులు. శతపథబ్రాహ్మణం "మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద " అని గురువుల సరసన తల్లిదండ్రులకే పెద్దపీట వేసింది.  అందుకే తమపిల్లల చదువుపట్ల శ్రద్ధ చూపించని తల్లిదండ్రులు శత్రువులతో సమాన0.
మాతా శత్రు: పితా వైరీ యేన బాలో న పాఠిత:
న శోభతే సభా మధ్యే హంసమధ్యే బకో యథా
 అన్నారు మన పెద్దలు. అందుకే తమపిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపని తల్లిదండ్రులు  తల్లిదండ్రులే కాదు. అంతేకాదు విద్యావంతుడు కాని కుమారుడు శత్రువుతో సమానమని (పుత్ర: శత్రు: అపండిత:) కూడ మన భారతీయసంస్కృతి పేర్కొంది. అందువల్ల తల్లిదండ్రులు తమపిల్లల చదువు పట్ల  శ్రద్ధ  వహించవలసిన అవసరం  ఎంతైనా ఉంది.
ఒకవేళ తల్లిదండ్రులు చదువు రానివారైనప్పటికి, తమ పిల్లల్ని చేరదీసి కనీసం రోజుకొక గంటసేపు దగ్గర కోర్చోపెట్టుకుని   ఎలా చదువుతున్నావురా అని లాలనతో ప్రశ్నిస్తే వారికది ఉత్తేజాన్ని కల్గించి అభివృద్ధికి దారితీస్తుందని అంతర్జాతీయసదస్సుల్లో విద్యావేత్తలు చేసిన తీర్మానం. ఆమాత్రం గంట కూడ తమపిల్లల్తో గడపలేని స్థితిలో నేటి తల్లిదండ్రులుండడం నిజంగా  శోచనీయం. నేటి సమాజంలో తల్లిదండ్రులు రెండురకాలుగా ఉన్నారు . అసలు పట్టించుకోని వారు కొందరైతే, విపరీతంగా పట్టించుకునే వారు మరికొందరు. రెండు ప్రమాదమే. విపరీతంగా పట్టించుకునే వారు పిల్లల చదువు కూడ వాళ్ళే చదివేస్తూ ఉంటారు. వాళ్లే  home work చేసేసి పిల్లల్ని ఎందుకు పనికిరానివారిగా తయారుచేస్తూ ఉంటారు. అలాగే cultural activities లోను మిగిలిన పోటీల్లోను పిల్లల్ని ఆలోచి౦పచేయకు౦డ అన్నీ వీళ్లే చేసేస్తూ ఉంటారు. ముద్దుపేరుతో పిల్లల్ని మొద్దులుగా తీర్చి దిద్దుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎలా సహాయం అ౦ది౦చాలో అప్పుడు, అక్కడ, అంతే, అలాగే అందించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు సమయానుకూలంగా విజ్ఞత చూపించాలి . మరో ముఖ్య విషయమే౦టంటే  తల్లిదండ్రులు  టీచరు చెప్పే పాఠ౦ మీద కంటే పిల్లలకు వేసే  మార్కుల మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఇది చాల శోచనీయం. మార్కులు కూడ అవసరమే, కాదనం. కాని జ్ఞానం లేని మార్కులు ప్రాణం లేని శరీరావయవాలతో  సమానం. అందువల్ల తల్లిదండ్రులు ప్రతిరోజూ టీచరు ఏమి చెప్పాడు ? అది అర్థం అయ్యిందా లేదా అనే విషయాన్నే గమనించాలి. ఒకవేళ నాలుగు మార్కులు తగ్గినా నష్టం ఏమిలేదు. ఈ కాలంలో పోటీపరీక్షల్లోను, ఉద్యోగాలల్లోనూ స్థానం పొందేవారు ఎక్కువ మంది స్వశక్తితో ఆలోచి౦చగలిగినవారే. ఎక్కువ మార్కులు పొందిన వారు మాత్ర౦  కాదు.          
2. విద్యార్థులు:
విద్యార్థి రెండో స్తంభం. ప్రతి విద్యార్థి  సమయం విలువ తెలుసుకోవాలి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. పాఠ్యప్రణాళికను తయారు చేసుకుని తదనుగుణంగా చదువుకోవాలి. కొంతమంది పరీక్షలకు ముందే చదువుతారు. పరీక్షల కోసమే చదువుతారు. అలా కాకుండా సాధ్యమైనంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాడించడానికి ప్రయత్నించాలి. పాఠ్యపుస్తకాలతో బాటుగా ఇతర పుస్తకాల్ని చదవడానికి కనీసం రోజుకొక గంటైనా ఖర్చు చెయ్యాలి. చదవడంలో సులభమైన మార్గాలు తెలుసుకోవాలి గాని పాసవడంలో కాదు. ఒక రోజు చదవడం మానేసినా పరవాలేదు గాని ఒక్కరోజు కూడ class మానకుండ వెళ్ళేలా ప్రయత్నం చెయ్యాలి. సందేహాలను వెంటనే  class లోనే నివృత్తి చేసుకోవాలి.  తనకేదీ రాదనుకుంటారనే భయమో, ఆసక్తి లేకనో, తోటి విద్యార్థులు ఆక్షేపిస్తారనో  ఎందుకోగాని  ఈ కాలంలో చాల మంది విద్యార్థులు ఎటువంటి ప్రశ్నలు వెయ్యడం లేదు. కారణం ఏదైనా ఇది మంచిదికాదు. సందేహనివృత్తి వల్ల అధ్యాపకుడు మిగిలిన విద్యార్థులు అందరు ప్రయోజనం పొందుతారు. ఇది అందరికి మంచిదే. ఇక అధ్యాపకుడు బోధించిన అంశాన్ని వెంటనే చదివితే గుర్తుండి పోతుంది. ముఱగబెడితే మఱుగున పడి పోతుంది.   'ఏకస్తప: ద్విరధ్యాయీ' అన్నారు పెద్దలు. అందువల్ల విద్యపై ఆసక్తిగల మంచి మిత్రుణ్ణి ఎంచుకుని కలిసి చదవడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. విద్యావిధానంలోని బాగోగులన్నిటికి విద్యార్థి బాధ్యుడు కాకపోయినప్పటికీ   ఫలితం అనుభవి౦చవలసి౦ది విద్యార్థే కాబట్టి చాల అప్రమత్తంగా మసులుకోవాలి.        
౩. అధ్యాపకుడు:
విద్యారంగంలో అధ్యాపకుడు మూడో స్తంభమే అయినా మూల స్తంభం లాంటివాడు . అటు తల్లిదండ్రులకు, ఇటు విద్యార్థులకు, మరోప్రక్క ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవలసిన బాధ్యత అధ్యాపకునిదే .
వేదానికి నిఘంటువు వ్రాసిన యాస్కమహర్షి అధ్యాపకునకు౦డవలసిన కనీస లక్షణాలను ఇలా వివరించారు. అధ్యాపకుని సంస్కృతంలో ఆచార్యుడు అంటారు .  1.ఆచరతి ఇతి ఆచార్య: ( మంచిని ఆచరించేవాడు ) 2. ఆచారం గ్రాహయతి  ఇతి ఆచార్య: (మంచిని బోధించి ఆచరి౦చేలా చేసేవాడు) 3. ఆచినోతి అర్ధాన్ ఇత్యాచార్య: ( ఎల్లప్పుడూ విద్యార్థులకు కావలసిన విషయాలను ప్రోగుచేసి, అందిస్తూ  ఉండేవాడు ) కాబట్టి అధ్యాపకుడు నిరంతర విద్యార్థి .
ప్రతి అధ్యాపకుడు పురోదృష్టి ( fore-sight), దూరదృష్టి (far-sight) మరియు  అంతర్దృష్టి (in-sight) ఈ మూడు కలిగి ఉండాలి. కాని ఎక్కువ మందికి ఆ మూడు ఉండవు eye-sight మాత్రమే ఉంటుంది. నిజమైన అధ్యాపకుడు విద్యార్థి యొక్క దీర్ఘ కాలిక ప్రయోజనాల గురించే ఆలోచించాలి, తాత్కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకూడదు.
అధ్యాపకుడు నిచ్చెన లాంటివాడు అందువల్ల మిగిలినవాళ్ళను పైకి తీసుకెళ్లడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి గాని తానే పైకెక్కి కూర్చోకూడదు. నిచ్చెన క్రింద ఉంటే అందరు పైకెక్క గలరు గాని నిచ్చెనే అటకెక్కి కూర్చుంటే ఎవరికీ ఉపయోగం ?      
4 ప్రభుత్వం:  విద్యారంగంలో ప్రభుత్వం నాల్గో సంభం. ఇది నాల్గోదే అయినా చాల ముఖ్యమై౦డి. ఒక దేశం యొక్క గొప్పదన౦ ఆ దేశంలోని విద్యావంతులను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి  విద్యావ్యాప్తి ప్రభుత్వం యొక్క ప్రథానలక్ష్యం కావాలి. కాళిదాసు రఘువంశంలో దిలీపుని పరిపాలనావిధానాన్ని వర్ణిస్తూ ఆయన ప్రజాలకు విద్యాబుద్ధులు నేర్పి౦చడంలోను, రక్షి౦చడంలోను అన్నపానాదులచే పోషి౦చడంలోను ఆయనే అందరికి తండ్రి అయ్యాడట. ఇక వారి వారి తల్లి దండ్రులు మాత్రం కేవలం జన్మకారకులు గానే మిగిలిపోయారని అంటాడు. '
ప్రజానాం వినయాధానాద్రక్షణాద్భరణాదపి
స పితా పితరస్తాసాం  కేవలం జన్మ హేతవ:
ప్రభుత్వం విద్యావ్యాప్తిని గురుతరమైన బాధ్యతగా స్వీకరి౦చాలి, భారంగా భావించకూడదు.  ఒక తరానికి వినియోగించిన  ఖర్చు యొక్క ఫలం వెంటనే కనబడక పోయినా తరువాతి తరంలో కనిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయ మేమిటంటే  ప్రభుత్వం విద్యావంతుల రాసి (quantity) కంటే వాసి (quality) కే ప్రాధాన్యం కల్పించాలి.  అక్షరాస్యత (Literacy) వేరు, విద్య (Education) వేరు. నూటికి నూరుపాళ్ళు అక్షరాస్యుల్నిచెయ్యాలి. పరిపూర్ణమైన అర్హత కలవారికే ఉన్నతవిద్యావకాశాలు కలగజెయ్యాలి. అలాకాకుండా అందర్నీ విద్యావంతుల్ని చెయ్యాలనే ఉద్దేశంతో  ఉన్నతవిద్యయొక్క ప్రమాణాలను దిగజారిస్తే లాభాల కన్న నష్టాలే ఎక్కువ. అందువల్ల ఒక ప్రక్క విద్యావ్యాప్తికి పాటుపడుతూనే మరో ప్రక్క విద్యా ప్రమాణాలు తగ్గకుండా తగు చర్యలు తీసుకోవాలి. విద్యావంతులను ఆదరించాలి వారి అర్హతకు తగిన అవకాశాలు కూడ కల్పించాలి. రఘువంశంలో కాళిదాసు దిలీపుని పాలనలోని విద్యావిధానాన్ని వర్ణిస్తూ --
ఆకారసదృశ: ప్రజ్ఞా ప్రజ్ఞయాసదృశాగమ:
ఆగమై: సదృశారంభ: ఆరంభసదృశోదయ: అంటాడు.
ఆయన రాజ్యంలో ప్రజలు ఆకారానికి తగిన తేలివితేటలు, తెలివితేటలకు తగిన విద్య, విద్యకు తగిన ఉద్యోగం, ఉద్యోగానికి తగిన ఫలప్రాప్తి (జీతం) కలిగి ఉండేవారట. కాబట్టి ప్రభుత్వం అర్హతకు తగిన విద్యావకాశాలు, విద్యకు తగిన ఉద్యోగావకాశాలు, ఉద్యోగానికి తగిన వేతనసదుపాయాలూ  కలుగ జెయ్యాలి. మనదేశంలో ముఖ్యంగా పల్లెటూళ్లలో ఎంతో మంది మేధావులైన యువతీ యువకులున్నారు. వారందరికీ  ఉన్నతవిద్యావకాశాలు లభ్యం కావడం లేదు. అల్లాగే విద్యావంతుల తెలివితేటలకు తగిన ఉద్యోగాలు దొరకడంలేదు. అలాగే ఎంత ఉన్నతమైన చదువు చదివి, ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నా తగిన జీతం లభించడం లేదు. ప్రభుత్వం ఈ లోపాలన్ని సవరి౦చవలసిన అవసరం ఉంది. అప్పుడే నిర్దుష్టమైన, నిర్దిష్టమైన విద్యావిధానం అమలు జరుగుతుంది. లేకపొతే మేధావులందరూ బయటికి పోయి సామాన్యులు మిగిలి పోతారు.
                                                                         (to be continued) 

No comments: