Friday, January 15, 2016

ఎంత వారలైనా కాంతదాసులే

 ఎంత వారలైనా కాంతదాసులే
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు  

ఆ విప్రోత్తము వజ్రపంజరనిభంబై  నిశ్చల౦బైన స
ద్భావం బంగనసాహచర్యగుణసంపర్కంబునన్ లోహమై
గ్రావంబై దృఢదారువై తరుణవృక్షంబై ఫలప్రాయమై
పూవై తన్మకరందమై కరగె  బోబో నీళ్లకుంబల్చనై

  పద్యం వైజయంతీవిలాసం లోది. దీనికే విప్రనారాయణ చరిత అనే మరో పేరు కూడ ఉంది. కావ్య కర్త సారంగు తమ్మయ్య . కావ్య కథానాయకు డైన విప్రనారాయణుడు పరమభాగవతోత్తముడు.  పన్నిద్దరాళ్వారులలో  ఒకరు, తొండరడిప్పొడియాళ్వారుగా ప్రసిద్ధి పొందారు . తొండర = భక్తుల యొక్క ; అడి= పాదముల యొక్క ;పొడి=రేణువు అనగా భక్త పాద రేణువు అని అర్థం . ఆయన కావేరీనదీతీరంలోని   శ్రీర౦గంలో వెలసిన రంగనాథుని ధ్యానిస్తూ , మధూకరం చేసుకుంటూ కాలం గడిపేవారు. ఒకనాడు ఆయన నగరసంకీర్తన చేస్తూ ఉండగా మధురవాణి దేవదేవి అనే ఇద్దరు వేశ్యకా౦తలు ఆయనకు మ్రొక్కుతారు . ఆయన భక్తి పారవశ్యంలో ఉండడం వల్ల వారి మ్రొక్కులను గమనించక వారిని ఆశీర్వదించకుండానే ముందుకు సాగిపోతారు. మధురవాణి ఆయన భక్తి పారవశ్యాన్ని మెచ్చుకుని ఎంతగానో ప్రశంసిస్తు౦ది. దేవదేవి మాత్రం ఆయన భక్తి పారవశ్యాన్ని తమపట్ల నిర్లక్ష్యంగా  అర్థం చేసుకుంటుంది.     అనవసరంగా   మ్రొక్కేమని విసుక్కుంటు౦ది. ఆయనను ఎలాగైనా తనకు దాసునిగా చేసుకుంటానని దేవదేవి శపథం చేస్తుంది . శపథం నెరవేరకపోతే వేశ్యావృత్తి వదలి దాసిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తుంది. శిష్యురాలుగాను , భక్తురాలిగాను నటిస్తూ   విప్రనారాయణునికి చేరువౌతుంది. ఒకానొక సమయంలో విప్రనారాయణుడు తనను తాను మరచి ఆమెకు వశమై పోతాడు. దేవదేవునకు దాసునిగా ఉన్న ఆవ్యక్తి పూర్తిగా దేవదేవీదాసుడుగా మారిపోతాడు . ఆమె ఎడబాటును సహించలేని స్థితికి దిగజారి పోతాడు . ఆమె ఇల్లే ఈయన కొలువుగా మారుతుంది.     ప్రతిజ్ఞ పూర్తయిన తరువాత ఆమె అతన్ని వెళ్ళగొట్టిస్తుంది. వేశ్య మాత సహజంగా దానం పట్ల ఆసక్తి గలది కావడంతో ఈయన రాకను అనుమతించదు. తన భక్తుని విరహబాధను గమనించిన రంగనాధుడు అతని శిష్యుని వేషంలో వేశ్యమాతను చేరుకొని ఆమెకొక బంగారు గిన్నె సమర్పిస్తాడు . ఆమె తిరిగి అతని రాకను అనుమతిస్తుంది . కొంతకాలం తరువాత రంగనాథుని ఆలయంలో బంగారుగిన్నె కనపడక పోవడంతో పూజారుల కోరికపై  రాజభటులు అన్వేషిస్తూ దేవదేవి ఇంటిలో పాత్రను కనుగొంటారు. చౌర్యానికి  విప్రనారాయణుడే కారకుడని భావించి పట్టుకొని  శిక్షింపబోగా స్వామి ప్రత్యక్షమై విప్రనారాయణుడు నిరపరాధి యని తానే అతని శిష్యుని వేషంలో బంగారు గిన్నెను వేశ్యమాతకు సమర్పించానని వివరిస్తాడు. అదివిని ప్రజలంతా విప్రనారాయనుని భక్తికి ఆశ్చర్య చకితులై ఆయనకు బ్రహ్మరథం పడతారు . విధంగా కథ సుఖా౦తమౌతుంది .
ఇక మేరునగధీరుడైన ఆ విప్రనారాయణుడు ఆ దేవదేవి శరీరస్పర్శకు  కఱగి పోయిన విధానాన్ని కవి వర్ణి౦చిన తీరు ఎ౦త రమణీయంగా ఉందో చూడండి.   
  వజ్రము వలె చాల దృఢమైన ఆ విప్రనారాయణుని మనస్సు  ఆమె సాహచర్యంతో లోహంగా మారిపోయిందట . ఆ తరువాత దృఢమైన వృక్షంగా తయారైంది . కాసేపటికి లేతచెట్టుగాను, మెల్లమెల్లగా పండుగాను, పువ్వుగాను, మకరందం గాను, చిట్టచివరకు కరగి నీరుగా మారిపోయిందట. అంతే జితే౦ద్రియుడైన ఆయన ఇంద్రియజితుడై పోయాడు .
బలవానింద్రియగ్రామ: విద్వా౦సమపి కర్షతి  అంటారు వ్యాసమహర్షి.

తస్మాత్ జాగ్రత జాగ్రత 

No comments: