Friday, September 16, 2016

గడుసరి కొడుకు

గడుసరి కొడుకు
(ఈ కథ A wise son అనే ఆంగ్లకథకు స్వేచ్ఛానువాదం)
పూర్వం ఫ్రాంసుదేశంలోని  Abbeville అనే నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకొక భార్య, ఒక కొడుకు ఉన్నారు.  ఆ వ్యాపారి పట్టణంలో తనకంటే అంగబలం, అర్థబలం ఉన్న  సాటివ్యాపారస్థుల ధాటికి తట్టుకోలేక ఆ ఊరు విడిచిపెట్టి రాజధాని నగరం ప్యారిస్ లో స్థిరపడ్డాడు.  ఒక దుకాణం తెరిచి వ్యాపారం ప్రారంభించి  స్వల్పకాలంలోనే అభివృద్ధి  పొందాడు. ఆయన నీతిమంతుడు, భార్య అనుకులవతి, కొడుకు వినయవిధేయతలు కలవాడు అవడంతో అందరు ఇరుగుపొరుగువారి ఆదరాభిమానాలు, ప్రశంసలు పొందారు. జీవిత౦  ఆనందమయంగా గడుస్తోంది.
ఈ విధంగా సుమారు ఏడు సంవత్సరాలు గడిచాయి. ముప్పై ఏళ్ల నుండి తనకు చేదోడువాదోడుగా ఉండి జీవితం సుఖమయం చేసిన భార్య కన్నుమూసింది. తన ఏకైక పుత్రుడు తల్లి మరణానికి  ఎంతో విలపించాడు. వ్యాపారి దీనంగా విలపిస్తున్న కుమారుణ్ణి ఓదారుస్తూ నాయనా! మీ అమ్మ దేవుని దగ్గరకెళ్ళిపోయింది. నువ్వు ఏడవకు.  కళ్ళు తుడుచుకో. నువ్వు ఎంత ఏడ్చినా ఆమె తిరిగి రాదు. మనం కూడ ఎప్పటికైనా  వెళ్లి పోవలసిన వాళ్ళమే. నీకు పెళ్లి వయసు వచ్చి౦ది.  నేనెంతో కొంత సంపాదించాను. మన తాహతుకు సరిపోయే మంచికుటు౦బం నుంచి  పిల్లను తెచ్చి నీకు  పెళ్ళిచేస్తా. నా ఆస్త౦తా నీకు రాసిచ్చేస్తా. నువ్వు జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అన్నాడు .
ఆ ప్రాంతంలో ఉన్నతకుటుంబానికి చెందిన ముగ్గురన్నదమ్ములు ఉంటున్నారు. వాళ్ళు ఒకప్పుడు బాగా బ్రతికినవాళ్ళే గాని మితిమీరిన విలాసాలవల్ల  ప్రస్తుతం ఆర్థికంగా చితికిపొయారు. ఆ ముగ్గురిలో పెద్దవాడికో కూతురుంది. ఆమెకు తల్లి లేదు. ఈ వ్యాపారి నివసిస్తున్న ప్రా౦త౦లోనే ఆమెకు తనతల్లి వలన సంక్రమి౦చిన ఇల్లొకటు౦ది. దాని వల్ల ఆమెకు కొంత ఆదాయం కూడ వస్తూ ఉంటుంది. ఆమె అందానికి, ఆర్ధికస్థితికి ఆకర్షితుడైన వ్యాపారి ఆమెను తన కోడలిగా చేసుకోవాలనుకున్నాడు. ఆమె త౦డ్రి దగ్గర కెళ్ళి నేను సహజంగా ధనవంతుణ్ణి . అంతేగాక నేను న్యాయమార్గంలో వ్యాపారం కూడ చేసి  చాల డబ్బు కూడ బెట్టాను. నా ఆస్తిలో సగం మా అబ్బాయికి రాసిస్తాను . పెళ్లి చేసుకున్నాక ఆ డబ్బుతో సుఖంగా విలాసాలతో  బ్రతకచ్చు. మీ అమ్మాయిని మా అబ్బాయికివ్వండి అనడిగాడు. ఈ ఒప్పందం పిల్లతండికి  నచ్చలేదు. ఏమయ్యా ! నీవొక వేళ సన్యాసివైతే ఏం చేసేవాడివి ? నీఆస్తంతా ఏ చర్చికో రాసేసి ఉండేవాడివి కాదా! నీ కొడుకు విషయంలో ఇంత స్వార్థంగా ప్రవర్తించడం ఏ౦ న్యాయం? అన్నాడు అసహనంగా . అతని మాటలకు చాల బాధపడ్డాడు వ్యాపారి. ఐతే ఏ౦ చెయ్యమంటావో చెప్పు  అన్నాడు. నీ ఆస్తంతా నీ కొడుకు  పేర వ్రాయాలి . అంతేకాదు. నీ తరువాత కూడ అందులో ఎవరికీ వాటా ఉండకూడదు. ఈ నియమం నువ్వంగీకరిస్తేనే నా పిల్లనిస్తాను . ఇందులో ఎటువంటి బేరాలు లేవు. నువ్వాలోచించుకుని నీ నిర్ణయం తెలియ జెయ్యి అని ఖచ్చితంగా నొక్కి చెప్పేశాడు. వ్యాపారి విధిలేక ఆ షరతులన్ని అంగీకరించి తన యావదాస్తి తన కొడుకు పేర వ్రాసి ఇచ్చేశాడు. ఎప్పుడైనా కాఫీ తాగాలంటే తన కొడుకునడిగి తీసుకోవలసి౦దే గాని తనవద్ద చిల్లిగవ్వకూడ లేదు . పిల్ల తండ్రి ఆనందించాడు . పెళ్లి ఘనంగా జరిగి పోయింది .              
రెండు సంవత్సరాలు కొత్త దంపతులకు సుఖంగా దొర్లి పోయాయి. వారికొక కొడుకు పుట్టాడు . వ్యాపారి వాళ్ళతోనే ఉంటున్నాడు. కాని యావదాస్తి కొడుక్కి రాసి ఎంతో తప్పు చేశాననే విషయం  రానురాను అతనికి తెలుస్తూ వచ్చింది. ఇంట్లో తననెంత ఈసడించుకు౦టున్నా అన్ని మౌనంగా భరిస్తూ పన్నెండేళ్ళు గడిపాడు. మనవడు తాను పెద్దవాడౌతున్నకొద్ది ఆ ఇంట్లో  తన తాత పడుతున్న  దు:స్థితి అర్థమవ్వడం మొదలైంది.
కొంతకాలానికి వ్యాపారి చాల ముసలివాడైపోయాడు. శరీరం శుష్కించి పోయింది నడుం వంగిపోయింది. కొడుకు, తనతండ్రి ఇంట్లో ఉండడం భరించలేకపోతున్నాడు.
వాడు తండ్రి మరణం తర్వాత జరగవలసిన కార్యక్రమానికి డబ్బు కూడ చెల్లించేశాడు .  అతని భార్య చాల కటువుగా ప్రవర్తించడం మొదలెట్టింది.  ఒకరోజు తన భర్తతో నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే మీ
నాన్నను ఎక్కడికైనా బయటకు పంపి౦చెయ్యి.  ఆతన్ని చూస్తుంటే  నాకు అన్నం కూడ సయించడం లేదు.  నీకు నా  ఆరోగ్య౦  మీద శ్రద్ద ఉంటే, నేను ప్రాణాలతో ఉండాలని ఉంటే మీ నాన్నని వెంటనే ఇంటినుండి పంపించెయ్ అంది. వాడు తనభార్య నిర్బ౦ధించడంతో వేరే దారిలేక తన తండ్రిని ఇంట్లోంచి పంపించెయ్యాలని నిశ్చయించుకున్నాడు . ఒక రోజు తండ్రితో నాన్నా ! నిన్ను నేను పన్నెండు సంవత్సరాలపాటు నా దగ్గరు౦చుకుని పోషించాను . ఇక నేటి నుంచి ఎక్కడికైనా పోయి బ్రతుకు . నువ్వు ఇక్కడు౦డడం మాకెవరికి ఇష్టం లేదు . వెంటనే ఈ ఇల్లు విడిచి పెట్టి ఎక్కడికైనా వెళ్లి పో. నీ తిప్పలు నువ్వు పడు అన్నాడు.   తండ్రి ఈ మాటలకు హతాశుడై పొయాడు.  గత కొన్నాళ్ళుగా ఇంట్లో తనను చిన్న చూపు చూస్తున్నా తన కొడుకు నోటి వెంట ఇటువంటి దారుణమైన మాటలు వినవలసి వస్తుందని అతనెపుడు అనుకోలేదు. తనవద్ద చిల్లిగవ్వకూడ ఉంచుకోకుండా మొత్తం ఉన్నదంతా కొడుక్కి ధారాదత్తం చేసేసినందుకు పరిపరివిధాల బాధపడ్డాడు. కొడుకుతో నాయనా! నువ్విలా అంటే నేనేం మాట్లాడతాను ? నేనింతవరకు నీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. విలాసవంతమైన జీవితం నాకు చేకూర్చమని కూడా ఎన్నడు అడగలేదు. నాకిచ్చిన చిన్న చాపతోనే కాలం గడిపాను. నేనింక ఎంతో కాలం బ్రతకను .నేను బ్రతికినంతకాలం నాకు కాస్త అన్నం పెట్టు . దేవుడు నిన్ను రక్షిస్తాడు . నీ పాపాలన్నీ క్షమిస్తాడు . ఆ భగవంతుని ఆశీస్సులతో నువ్వు కలకాలం సుఖంగా బ్రతకాలని నా ఆశ అన్నాడు . కాని కొడుకు ఆతని ప్రార్థన వినిపించుకునే స్థితిలో లేడు. కోపంతో రెచ్చిపొతూ నాన్నా! నువ్వేం నాకు నీతులు చెప్పకు. ఒక వేళ నువ్వు బయటకు పోకపోతే మా ఆవిడ నిన్ను గెంటివెయ్యడం ఖాయం అన్నాడు నేనెక్కడికి పోతాను నన్నెవరు ఆదుకుంటారు అనడిగాడు తండ్రి . నగరానికి పో! అక్కడ పది వేలమందున్నారు. నీకెవడో ఒకడు కాస్త ముద్ద పెట్టకపోడు. ధైర్యంగా నీ త్రోవ నువ్వు చూసుకో. నీ మిత్రులు, తెలుసున్నవాళ్ళల్లో ఎవరో ఒకరు నిన్నాదరిస్తారు అన్నాడు .
తనవల్ల అంతులేని సిరిసంపదలతో తులతూగుచున్న తన కొడుకు ఇలా మాట్లాడేసరికి హతాశుడై పోయాడు తండ్రి.  కొడుకుతో దీనంగా నాయనా ! నేను నీకెంతో ధనం, సంపదలు, సమస్తం ధారపోశాను.  నువ్వే నన్ను బయటకు గెంటేస్తోంటే నా వల్ల ఎప్పుడు ఏ సహాయం పొందని, ముక్కు మొహం తెలియని బయటి వాళ్ళు నన్నేం చూస్తార్రా అనడిగాడు. నేను చేసేది తప్పో, ఒప్పో అదంతా నాకు తెలీదు. నా నిర్ణయానికి తిరుగు లేదు . నన్నెవ్వరేమనుకున్నా పరవాలేదు. నేనన్నీ భరిస్తా . నువ్వేమీ మారు మాట మాట్లాడకుండా ఇంట్లోంచి వెళ్ళిపో, అదే నాక్కావాలి అన్నాడు . కొడుకు అలా అనేసరికి తండ్రికి చాల దు:ఖం కలిగింది . గుండె చెరువయ్యేలా ఏడ్చాడు . ముసలివాడు కావడ౦తో నడవలేక ఎలాగో కాళ్లీ డ్చుకుంటూ ఇంట్లోంచి బయటకొచ్చాడు . గుమ్మం దగ్గర ఆగాడు. కొడుకు వంక దీనంగా చూస్తూ నాయనా! నిన్ను ఆ భగవంతునికి వదిలేసి నేను వెళ్లి పోతున్నాను . నువ్వు నన్ను వెళ్లి పొమ్మని బలవంతం చేస్తున్నావు కాబట్టి నేను వెళ్లి పోతున్నాను . కాని వెళ్ళే ముందు ఒక చిన్న కోరిక. ఇదే నా ఆఖరి కోరిక.  నేను ముసలితనంతో కృశించి పోయాను . ఇక చలిలో బిగుసుకు పోకుండా ఉండేందుకు ఒక దుప్పటి ఇవ్వు చాలు అని దీనంగా అడిగాడు.   నీ కివ్వడాని ప్రస్తుతం నావద్ద ఎటువంటి వస్త్రం లేదని కొడుకు ఖచ్చితంగా చెప్పేశాడు . కనీసం నువ్వు గుర్రం మీద కప్పే గుడ్డైనా ఇవ్వు అంతకంటే ఇంకేదీ నిన్ను కోరను అన్నాడు .  ఏదో ఒకటి ఇస్తే గాని తండ్రిని వదలి౦చుకోవడం సాధ్యం కాదనుకున్నాడు కొడుకు. ఇక చేసేది లేక తన పిల్లవాణ్ణి పిలిచి ఒరేయ్ అబ్బాయ్ ! గుర్రపుశాలకెళ్ళి గుర్రానికి కప్పిన గుడ్డ తీసుకొచ్చి మీ తాతకివ్వు , చలికాలంలో కప్పుకుంటాడు అన్నాడు.  వాడి కొడుకు చాల తెలివైన వాడు, వయసుకు మించిన వివేకం కలవాడు. తన తాతను గుర్రపుశాలదగ్గరకు తీసుకెళ్లి ఒక అందమైన గుడ్డను ఎంపిక చేశాడు. దాన్ని చాకుతో రెందుముక్కలుగా కోసి ఒకముక్క తాతకు ఇచ్చాడు . ఆముక్క అందుకున్నతాత చాల విస్తుపోయాడు.  ఒరేయ్ ! ఈ చిన్న ముక్క నేనే౦ చేసుకోను, నాకెలా సరిపోతుంది ? నువ్వు క్రూరత్వంలో  మీ నాన్నను మించి పోయావు . నువ్వసలు ఇది ఎందుకు సగం చేశావు ? ఎందుకు ఒకటి దిగతొక్కేసుకున్నావు ? మీ నాన్న పూర్తిగా ఇమ్మన్నాడుగాని సగం ముక్క ఇమ్మని అనలేదు. ఈ సంగతి మా అబ్బాయితో చెబుతాను  అన్నాడు . ఫో  నీ దిక్కున్నచోట చెప్పుకో ఇంతకంటే ఒక్క అంగుళం ముక్క అదనంగా ఇచ్చేది లేదు అన్నాడు మనవడు నిర్దాక్షిణ్య౦గా.  
ఆయన వెంటనే తనకొడుకు దగ్గరకెళ్ళి జరిగిందంతా వివరించాడు . అదివిన్న కొడుకు తన కొడుకుపై విరుచుకు పడ్డాడు . వస్త్రం పూర్తిగా ఇమ్మని ఆజ్ఞాపించాడు. పిల్లవాడు ఇవ్వనుగాక ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేశాడు . నేను ఇప్పుడదిస్తే నువ్వు మీ నాన్నకు చేసిందానికి నేను నీకు ఎలా చెయ్య గలుగుతాను ?నువ్వు మీ నాన్నకు చెల్లించిన మూల్యం రేపు నేను నీకు చేల్లి౦చొద్దా. నేను ఈ సగం అందుకే దాస్తున్నాను . నువ్వు మీనాన్నను పంపించిన విధంగా రేపు నిన్ను ఇంటినుంచి బయటకు గెంటేస్తాను. మీ నాన్న నీకు తన సమస్తసంపదలు ఇచ్చినా నువ్వు అతన్ని బయటకు గెంటేస్తున్నావు . నేను కూడ నీ దగ్గర అన్నీ లాక్కుని నిన్ను బయటకు గెంటేస్తాను. నువ్వు మీ నాన్నాను నిస్సహాయంగా వదిలేస్తే నేను నిన్ను అలాగే చేస్తాను . నువ్వు చేసిన పాపానికి ఫలితం నువ్వే అనుభవించాలి కదా అన్నాడు .
కొడుకు మాటలకు తండ్రి చాల సిగ్గు పడ్డాడు. తన కొడుకు మాట్లాడిన ప్రతి మాట ఈటెలా హృదయానికి గ్రుచ్చుకుంది. తాను చేసిన పనికి చాల పశ్చాత్తాప పడ్డాడు. కొడుకు మాటలు కళ్ళు తెరిపి౦చాయి. జ్ఞానోదయమై౦ది. వెంటనే తన తండ్రి వైపు తిరిగి పూజ్యులైన నాన్నగారూ! మీరు లోపలకురండి. నేటి నుంచి మీరే ఈ ఇంటికి యజమాని . మీరు నాకిచ్చి౦దంతా మీకు సమర్పి౦చేస్తున్నా. మీరు మీ ఇంటిలో సర్వసౌఖ్యాలు అనుభవించవచ్చు . మాతో పాటే రుచికరమైన పదార్థాలు , పానీయాలు అన్నీ ఆస్వాదించండి. వెచ్చని గదిలో సుఖంగా నిద్రపోండి.  ఒక వేళ మీరు ఇక్కడ ఉండడం నా భార్యకు ఇష్టం లేకపోతే నేను మీకు మరో చోట అన్ని సౌకర్యాలు చేకూరుస్తాను. ఈ సమస్తసంపదలు మీవే సమస్తహక్కులు మీవే. నేను మీకు   దయతో ఇచ్చేది  ఏమి లేదు. నేను మీకిచ్చేవన్నీ ఒకప్పుడు మీరు నాకిచ్చినవే .
ఈ విధంగా ఒక గడుసరి బాలుని తీక్ష్ణమైన నిరసన తండ్రికి కళ్ళు తెరిపించి మంచివాణ్ణిగా తీర్చి దిద్దింది. ఆ తరువాత వృద్ధవ్యాపారి శేషజీవితాన్ని తన కొడుకుతోనూ కుటుంబసభ్యులతోను సుఖ౦గా  గడిపాడు .                     

<><><><><><><><><><><> 

No comments: