Tuesday, September 27, 2016

రాధ ఎత్తు – కృష్ణుడు చిత్తు

రాధ ఎత్తు – కృష్ణుడు చిత్తు
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

రాధాకృష్ణుల అనురాగం లోకానికే ఆదర్శం. రాధ జీవాత్మకు కృష్ణుడు పరమాత్మకు ప్రతీకలు . కృష్ణుని పొందు కావాలనే రాధ కోరిక పరమాత్మలో లీనం కావాలనే జీవాత్మ ఆవేదనను సూచిస్తుంది. అందుకే భక్తులకు వారిద్దరి  కలయిక కేవల శృగారం కాక  విగళిత వేద్యా౦తరమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది . ఆమె ఒక్క క్షణమైనా కృష్ణుని విడిచి ఉండలేదు . రాధ ఒకసారి  అతనికోసం ఎదురు చూసి చూసి విసిగి వేసారి పోయింది .  ఇక ఆయన  రాడని నిశ్చయించుకుని తలుపులు వేసేసుకుంది. ఆయన చాల ఆలస్యంగా  ఇంటికి చేరాడు . లోపలకు వెళ్ళకుండా గుమ్మం దగ్గరే నిలబడ్డాడు . రాధ  కిటికీ లోంచి అతన్ని చూసింది . అసలే ప్రణయకోపంతో ఉందేమో ఆమెకు తలుపు తియ్యాలనిపి౦చ లేదు. అతన్ని ఒక ఆట పట్టించాలనుకుంది. కోయం ద్వారి? అని ఒక ప్రశ్న వేసింది గుమ్మం దగ్గర ఉన్నదెవరు? అని ఆ మాటలకర్థం. వెంటనే కృష్ణుడు హరి: అన్నాడు . నేను కృష్ణుణ్ణి అని ఆయన  సమాధానం. కానీ హరి అనే పదానికి చాల అర్థాలున్నాయి . వాటిలో కోతి అనే అర్థం కూడ ఉంది. అది తీసుకుంది రాధ. వెంటనే  ప్రయాహ్యుపవనం శాఖామృగస్యాత్ర కిం ? అంది . నువ్వు కోతివైతే అడవుల్లోకి పో. ఇక్కడేం పని ? అంది.   కృష్ణుడు గతుక్కుమన్నాడు . వెంటనే   కృష్ణోsహం దయితే అన్నాడు అమాయకంగా.   ఓ ప్రియురాల! నేను కృష్ణుణ్ణి గుర్తుపట్టలేదా అన్నాడు. కృష్ణపదం నామవాచకంగా తీసుకుంటే కృష్ణుడు అనే అర్థం వస్తుంది . విశేషణ౦గా తీసుకుంటే నలుపు అని అర్థం . రాధ విశేషణంగా తీసుకుని  బిభేమి సుతరాం కృష్ణాదహం వానరాత్ అంది . నల్లకోతివా! అదంటే నాకు చాల భయం అని ఆ మాటలకర్థం. వెంటనే కృష్ణుడు రాధేsహం మధుసూదన: అన్నాడు. ఓ రాధా ! నన్ను పోల్చుకోలేదా నేను మధు అనే పేరుగల రాక్షసుణ్ణి చంపినవాణ్ణి (కృష్ణుణ్ణి) అన్నాడు. ఈ సారి తప్పక గుర్తుపట్టి తలుపు తీస్తు౦దనుకున్నాడు. కాని మరల ఎదురుదెబ్బే తగిలింది . మధుసూదన అనే పదానికి రెండర్థాలున్నాయి . ఒకటి కృష్ణుడు రెండో అర్థం తుమ్మెద . మధు అంటే తేనే సూదన అంటే హరించేది (తుమ్మెద) .   ఈవిడ రెండో అర్థం తీసుకుంది . అటైతే  వ్రజ లతాం తామేవ పుష్పాన్వితా౦ అంది . ఎక్కడైనా పువులున్న లత చూసుకుని అక్కడికి పో . ఇక్కడి కెందుకొచ్చావ్? అంది . ఈ విధంగా రాధ ఎత్తుగడలతో కూడిన వాక్కులకు చిత్తుగా ఓడిపోయి అవాక్కై నిలిచిన  ఆ కృష్ణుడు మిమ్ము రక్షించుగాక అని ఆశీర్వదిస్తూ కవి ఈ శ్లోకం రచించాడు . రాధ ప్రణయకోపంతో  చిత్తుగా ఓడి౦చినా చివరకు తన ప్రాణనాథుని లోపలకు ఆహ్వానించి హృదయానికి హత్తుకునే ఉంటు౦దని భావిద్దాం .     

కోsయం ద్వారి? హరి: ప్రయాహ్యుపవనం శాఖామృగస్యాత్ర కిం ?
కృష్ణోSహం దయితే బిభేమి సుతరాం కృష్ణాదహం వానరాత్
రాధేsహం మధుసూదనో వ్రజ లతాం తామేవ పుష్పాన్వితా
మిత్థం నిర్వచనీకృతో దయితయా హ్రీణో హరి: పాతు వ:   
(కాశ్మీర వల్లభదేవుని సుభాషితావళి ---104)

<><><> 














No comments: