Wednesday, September 28, 2016

ఎవరి తహతహ వారిది

ఎవరి తహతహ వారిది
డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాద రావు
బాలకృష్ణుని  తల్లి  యశోద.  ప్రతిరోజూ ఆమె పాలు, పెరుగులు చిలకలేక ఎన్నో అవస్థలు పడుతోంది. అది గమనించాడు బాలకృష్ణుడు. ఒకరోజు వాళ్ళ అమ్మతో ఇలా అంటున్నాడు  అమ్మా ! నువ్వెందుకు శ్రమ పడుతున్నావు. ఆగు  నేను చిలుకుతాను  అని ఒక పెద్ద కవ్వం తీసుకుని నిలబడ్డాడు . ఆయన కవ్వం చేత్తో పుచ్చుకుని నిలబడే సరికి చాల మంది భయపడ్డారు , కొంతమంది సంతోషించారు. ఎవరు ఎందుకు భయపడ్డారో ఎవరు ఎందుకు సంతోషించారో తెలుసుకుందాం .  
ముందుగా వాసుకి సంగతి చూద్దాం . ఆయన ముఖం వ్రేళాడేసుకుని విచారంతో ఉన్నాడు . ఎ౦దుకంటే లోగడ ఒకసారి అమృతం కోసం పాలసముద్రం చిలికినప్పుడు ఆయన కవ్వపుత్రాడుగా ఉండవలసి వచ్చింది. పని పూర్తయ్యేటప్పటికి  వీపు చిట్లి పోయింది . మరల తనను పిలుస్తారేమోనని ఆయన భయం .  ఇక లక్ష్మి చాల అసూయతో ఉంది . ఎ౦దుకంటే లోగడ పాలసముద్రం మథించినప్పుడు తాను పుట్టింది . తనను విష్ణువు పెళ్లి చేసుకున్నాడు . ఈ సారి పాలను మథిస్తే మరలా ఎవరో పుడతారు, ఆమె తనకు  సవతి ఔతుందేమో అని  ఆమె భయం. ఇక దేవతలందరు మాత్రం  చాల ఆనందంగా ఉన్నారు . ఎ౦దుకంటే ఈ సారి క్షీరమథనం జరిగితే మరల అమృతం పుడుతుందని  అది కూడ త్రాగెయ్యవచ్చని వాళ్ళ ఆశ. ఇక రాహువు భయం భయంగా చూస్తున్నాడు . ఎ౦దుకంటే  లోగడ పాలసముద్రంనుంచి అమృతం పుట్టి నప్పుడు దానికోసం దేవతలు రాక్షసులు ఇద్దరు నిలబడ్డారు . విష్ణువు జగన్మోహిని రూపంలో వచ్చి దేవతలకు మంచి అమృతం , రాక్షసులకు కల్తీ అమృతం పంచుతున్నాడు. ఇది గ్రహించిన రాహుకేతువులు దేవతలపంక్తిలో దూరేరు. విష్ణువు అమృతం పంచుకుంటూ పోతున్నాడు. తమ పంక్తిలో రాహుకేతువుల ఉనికిని గమనించిన సూర్యచంద్రులు ఆ విషయాన్ని విష్ణువుకి చెప్పారు. అప్పటికే విష్ణువు పోసిన అమృతం అందుకుని త్రాగేశాడు  రాహువు. ఆ  తలను విష్ణువు ఖండించినప్పటికీ  అమృతం సేవించడంవల్ల తలభాగం  సజీవంగానే ఉ౦డి పోయింది . మళ్ళా అటువ౦టిదేదైనా జరిగితే ఉన్న ఒక్క తల పోతుందేమోనని ఆయన భయపడుతున్నాడట. ఒక్క నిర్ణయం ఎంతమందిని ఎన్ని విధాలుగా ఆలోచించేలా చేసిందో చూడండి . అటువంటి   గోపాలబాలుడైన హరి మీకు శుభములను ప్రసాదించు గాక అని కవి అందరిని ఆశీర్వదిస్తూ ఈ శ్లోకం  రచించాడు  
అంబ! శ్రామ్యసి తిష్ఠ గోరసమహం మథ్నామి మంథానకం
ప్రాలంబ్య స్థితమీశ్వరం సరభసం దీనాననో వాసుకి:
సాసూయం కమలాలయా సురగణ: సానంద ముద్యద్భయం
రాహు: ప్రైక్షత యం స వోs స్తు శివదో గోపాలబాలో హరి:
अम्ब ! श्राम्यसि तिष्ठ गोरसमहं मथ्नामि मन्थानकं
प्रालंब्य स्थितमीश्वरं सरभसं दीनाननो वासुकि:
साsसूयं कमलालया सुरगण: सानन्दमुद्यद्भयं
राहु: प्रैक्षत यं स वोsस्तु शिवदो गोपालबालो हरि:   
                                  *****


  

              

No comments: