Saturday, October 1, 2016

అమ్మ-నాన్నలే ఆరాధ్యదైవాలు

అమ్మ-నాన్నలే ఆరాధ్యదైవాలు

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి                                                
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినుర వేమ

సృష్టిలో అన్నిటికన్నా తీయనైన పదం అమ్మ. ఉచ్చరి౦చే , అక్షరాలు స్వల్పమే అయినా ఉచ్చరించడం వల్ల పొందే ఆన౦దానుభూతి అనల్పం. మనం నోరు తెరిస్తే మొదటగా వెలువడే అక్షరం . ఇక నోరు మూసుకుంటే వెలువడే అక్షరం . ఈ రెండక్షరాల కలయికే అమ్మ . అందువల్ల అన్ని అక్షరాలూ అమ్మ పదంలోనే దాగి ఉన్నాయి . అన్ని భావాలు మాతృత్వంలోనే ఒదిగి ఉన్నాయి .
అందుకే ప్రపంచసాహిత్యంలోనే మొట్టమొదటిది,  తలమానికము ఐన  వేదం మాతృదేవో భవ పితృదేవో భవ అని అమ్మకే పెద్దపీట వేసింది. వేదాలకు సారాంశరూపమైన ఉపనిత్తులు కూడ మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద అని గురువుల్లో సమున్నతస్థానాన్ని అమ్మకే కట్టబెట్టాయి. అమ్మ సమస్తదేవతలకే దేవత . అందుకే భాస మహాకవి
మాతా కిల మనుష్యాణాం దైవతానాం చ దైవతం అన్నారు .
తల్లి మూర్తీభవించిన ప్రేమస్వరూపం. ఆమె తన పిల్లల్ని   ఎటువంటి స్వార్థం లేకుండానే పెంచి పోషిస్తూ ఆనందిస్తూ ఉంటుంది . మన ప్రాచీనులు భక్తి యొక్క స్వరూపాన్ని వివరిస్తూ అది పరమప్రేమరూపమని పేర్కొన్నారు . అది తల్లికి బిడ్డలమీద గల ప్రేమవంటిదని ఉదాహరించారు. కాబట్టి తల్లికి కన్నబిడ్డలమీద ఉండే ప్రేమ ఎంత పవిత్రమైనదో గమనించండి.
తల్లి ప్రేమ ఎటువంటిదో పాల్కురికి సోమనాథుడు  తన బసవపురాణ౦లో ఒకచోట చాల అద్భుతంగా వర్ణించాడు .  చదివితే ఒళ్ళు పులకరి౦చక మానదు.
పూర్వం బెజ్జమహాదేవి అనే ఒక భక్తురాలు ఉండేది. ఆమె ఒకరోజు ఒక శివలింగాన్ని చూస్తుంది. ఆ శివలింగం చాల కాలంనుంచి ఎటువంటి సంస్కారాలు లేకుండా మలినంగా పడి ఉంటుంది . ఆమె శివలింగాన్ని తల్లిలా సాకుతుంది. శివుని దుస్థితికి తల్లి లేక పోవడమే కారణమని వాపోతుంది . ఎలాగో చూడండి :
తల్లి గల్గిన నేల తపసి గానిచ్చు
తల్లి గల్గిన నేల తలజడల్గట్టు 
తల్లి యున్న విషంబు ద్రావనేలిచ్చు
తల్లి యు౦డిన తోళ్ళు తాల్ప నేలిచ్చు    
తల్లి పాములనేల ధరియి౦పనిచ్చు   
తల్లి బూడిద యేల తా పూయనిచ్చు    
తల్లి పుచ్చునె భువి తనయుని దిరియ
తల్లి పుచ్చునె సుతు వల్లకాటికిని
తల్లి లేకుండిన తనయుడు గాన
ప్రల్లదుడై ఇన్ని పాట్లకు వచ్చె
                   తల్లి లేకపోవడం వల్లనే శివుడు తాపసుడై పోయాడట . అతనికి  అమ్మే గనక ఉంటే ఒప్పుకునేది కాదు. తల్లి లేకపోవడం వల్లనే శివునికి జడలు కట్టాయట . ఒక వేళ అమ్మే అతనికి ఉండి ఉంటే రోజు చక్కగా తలదువ్వేది. తల్లి లేకపోవడం వల్లనే శివుడు విషం త్రాగాడట. తల్లి ఉంటే ససేమిరా ఒప్పుకునేది కాదట . తల్లి లేకపోవడం చేతనే శివుడు తోళ్ళు కట్టు కు౦టున్నాడట. తల్లి ఉంటే కట్టనిచ్చేది కాదు.  తల్లి లేకపోవడం వల్లనే పాములు ధరిస్తున్నాడట. తల్లి ఉంటే పాములు కట్టుకోనిచ్చేది కాదు. తల్లి లేక పోవడం వల్లనే శివుడు వీధి వీధి తిరుగుతూ అడుక్కు౦టున్నాడట. అమ్మే ఉంటే ఆ దుస్థితి అతనికి కలిగేది కాదు .  అమ్మ లేకపోవడం వల్లనే శివుడు స్మశానంలో ఉంటున్నాడట . ఒక వేళ ఆమ్మే ఉంటే అక్కున చేర్చుకుని ఒళ్లో కూర్చోబెట్టుకునేది . ఈ విధంగా శివుని దయనీయస్థితికి కారణం అతనికి తల్లి లేకపోవడమే అని భావిస్తుంది.
ఇక తల్లిప్రేమకు నోచుకున్నవాడు ఎటువంటి కష్టాలు పొందడు. తల్లి తానెన్ని కష్టాలనైనా సహించి తన బిడ్డలకు కష్టాలు రాకుండా చేస్తుంది. బిడ్డలు ఎటువంటి వారైనా బిడ్డలకోసం తల్లి తన ప్రాణాలివ్వడానికైనా వెనుకాడదు. శ్రీ శంకరభగవత్పాదులు కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి  అంటారు. ఈ ప్రపంచంలో చెడ్డపుత్రుడు  ఉండవచ్చునేమో గాని చెడ్డతల్లి ఉ౦డదట.
తల్లి ప్రేమ యొక్క పరాకాష్ఠను తెలియ జేసే  ఈ ఘట్టం పరిశీలించండి .
అది ఒక అరణ్యం. ఆ అరణ్యంలో  ఒక వేటగాడు. ఒక లేడి అతని కంట పడింది . బాణం తీశాడు .  గుఱిపెట్టి వదిలాడు. అది లేడి గొంతులో గుచ్చుకుంది . కొంతసేపట్లో ఆ లేడి మరణించడం ఖాయం . అంతలో దానికి తన పిల్లలు గుర్తుకొచ్చారు.  తన స్థితికి చలించిపోయింది . వేటగాణ్ణి ఎంత దీనంగా వేడుకుంటో౦దో చూడండి .
ఆదాయ మా౦సమఖిలం స్తనవర్జమంగాన్
మాం ముంచ వాగురిక యామి కురు ప్రసాదం
సీదంతి శష్పకబళగ్రహణానభిజ్ఞా:
మన్మార్గవీక్షణపరా: శిశవో మదీయా:                        
ఓ వేటగాడ !      నువ్వు నా శరీర౦లోని ప్రతి అవయవాన్ని కోసుకుపో. నాకెటువ౦టి అభ్యంతరం లేదు . కాని పొదుగు మాత్రం మిగుల్చు . ఎందుకంటే లేత పచ్చ గడ్డి కూడ తినడం చేత కాని నా పిల్లలు నేనెప్పుడు ఇంటికి వస్తానా అని నేను వచ్చిన మార్గం వైపే చూస్తూ నిరీక్షిస్తూ ఉంటాయి . కాబట్టి నువ్వు నాపై దయుంచి పొదుగు మాత్రం మిగుల్చు. . మిగిలినవన్నీ కోసుకుపో . నేనింటికెళ్ళి వాళ్ళకు కడుపార పాలివ్వాలి.
తల్లి ప్రేమ ఇంతటి మహత్తరమైనది . కాబట్టి తల్లి అందరికి పూజనీయురాలు. తండ్రి కూడ ఇంచుమించు ఇంతటి ఉన్నతుడే . అందుకే వ్యాసమహర్షి  తల్లిదండ్రుల స్థానాన్ని వర్ణిస్తూ ...
మాతా గురుతరా భూమే: పితా చోచ్చతరశ్చ ఖాత్
(తల్లి భుమికన్న గొప్పది . తండ్రి ఆకాశంకన్నా ఉన్నతుడు) అంటారు .     
 అటువంటి ప్రత్యక్షదైవాలను నిర్లక్ష్యం చేస్తే ఎన్ని పుణ్యాలు చేసినా అవి ఫలించవు . తల్లి దండ్రులను గౌరవించి ఆదరించే వాడికి వేరేవి పుణ్య కార్యాలు చెయ్యవలసిన అవసరం లేదు . ఎవడు తన నడవడిక చేత తల్లి దండ్రులను సంతోష పెడతాడో వాడే పుత్రుడని భర్తృహరి అంటాడు . కాబట్టి ప్రతి వ్యక్తి వారి వారి తల్లి దండ్రులను గౌరవించి ఆదరిస్తే వారి ఆనందం బిడ్డలకు సాటిలేని మేటివరాలై వారి ప్రగతికి బంగారు బాటలు వేస్తాయి.       

****************

No comments: