Tuesday, October 4, 2016

శ్రీ మల్లాదివారి శంభో శతకం

శ్రీ మల్లాదివారి శంభో శతకం
(సమీక్ష)
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు
త తరానికి చెందిన  వ్యంగ్యకావ్యాల్లో శ్రీ మల్లాది శివరాం గారు రచించిన శంభోశతకం పేరెన్నిక గన్నది. కవి ఈ కావ్యాన్ని హాస్యరచనాచణులు, మధురాతి మధుర కావ్యనిర్మాణ చతురులైన శ్రీ మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి  గార్కి అంకితం చేశారు. కవి ఈ శతకంలో సమకాలీన సమస్యలను సునిశితంగా విమర్శించారు. అందువల్ల ఈ కృతిని   సమకాలీన సాంఘిక సమస్యలకు ఒక దర్పణంగా భావి౦చొచ్చు. ప్రతి పద్యం లోను ఎంతో కొంత హాస్యం దాంతో పాటు వ్యంగ్యం దర్శనమిస్తూ ఉంటాయి . కేవల౦ హాస్యం వల్ల కవికి తాను  ఆశించిన ప్రయోజనం నెరవేరదు . పాఠకుడు ఒకసారి నోరార చదివి, మనసారా నవ్వుకుని వదిలేస్తాడు. ఇక హాస్యానికి వ్యంగ్యాన్ని జోడిస్తే అది చదువరిని ఆలోచి౦పజేస్తుంది. మంచిమార్గం వైపునకు నడిపిస్తుంది .  ఈ విషయం బాగ తెలిసిన శ్రీ మల్లాదివారు హాస్యాన్ని వ్యంగ్యసమన్వితం చేశారు. మచ్చునకు కొన్నిపద్యాలు పరిశీలిద్దాం .
ఆనాటి ఆంగ్లేయుల ఉక్కు పాదాలక్రి౦ద నలుగుతూన్న  సామాన్య ప్రజాజీవితం చాల దుర్భరంగా ఉందని చెబుతూ వారి జీవితం కంటే జైలు జీవితమే మేలని  చమత్కరిస్తూ చెప్పిన పద్య౦ ఎంత హృద్యంగా ఉందో చూడండి .
ఉదయము వెచ్చని గంజియు
పదికొట్టంగానె ముద్ద వఱ్ఱని పులుసున్
అదె బాగున్నది జైలున
బ్రతుకే దుర్భరము బైట బాబో శంభో!
 సమాజంలో మనుషులు చవుకబారు సాహిత్యానికి, కళలకు అలవాటుపడి నిజమైన కళలకు కళాభిరుచికి తిలోదకాలు ఇస్తున్నారని ఆవేదనతో చెప్పిన ఈ పద్యం , హృద్యం, అనవద్యం . 
నీనాట్యపు ప్రోగ్రామే
దైనం బెట్టి౦పమందువా పురుషులకున్
కానీ రాదు కలెక్షను
సానినెవతెనైన తెమ్ము సరసకు శంభో!
సమాజంలో యోగ్యతకంటే కులానికే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారని ఈ కులాభిమానం ముందు దేవుడు కూడ తలవంచవలసిందే అని చమత్కరించిన ఈ పద్యాన్ని చూడండి . శివుడే సాక్షాత్తుగా వచ్చి ఎలక్షన్లలో నిలబడినా ఆయనకు కులం లేదు కాబట్టి ఒక్క ఓటు కూడ పుట్టదని చెప్పే ఈ పద్యం ఈ సమాజానికొక కనువిప్పు కావాలి .
కమ్మలకు కమ్మలున్ , మరి
కుమ్మర్లకు కుమ్మరులును , కూలికి కూలీల్
బమ్మలకు బమ్మలీయన్
బొమ్మకు నీ మొగముకోటు పుట్టునె శంభో !
 ఈ సమాజంలో  లోతుగా పాతుకుపోయిన వరకట్నదురాచారాన్ని చాల మృదువుగా విమర్శించిన ఈ పద్యం ఎంత బాగుందో  చూడండి.
గణపతికి పెండ్లి సేయవు
మని లేదా మాకుపంపు మగవాడు గదా
కనుముక్కుతీరులేకు
న్నను భువి కట్నంబులెదురు నడచును శంభో !
కొంతమంది ఛాందసవాదులు ఇతరభాషాపదాలను తమభాషలో కలుపుకోడానికి అభ్యంతరం చూపిస్తున్నారు .   ఒక విధంగా ఇది భాషకు ద్రోహం చెయ్యడమే . ఎ౦దుకంటే పెరుగుదల ఆరోగ్యహేతువు . భాష ఎంత పెరిగితే అది అంత గొప్పదౌతుంది. ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉ౦దనుకు౦దా౦ . ఆమె ఎదుగుతూ పెరిగి పెద్దదైతే  మళ్ళా పరికిణీలు కుట్టి౦చాలి,  క్రొత్త బట్టలు కొనాలి,  దానికి చాల డబ్బు ఖర్చు చెయ్యాలి అని ఎవరైనా అనుకుంటారా ! ఎవరూ అనుకోరు . అంతేగాక ఎదుగుతున్నకొద్ది సంతోషిస్తారు. . భాషావిషయంలో కూడ ఇదే నియమం వర్తిస్తుంది . మన భాషలోకి అనేక ఇతరభాషాపదాలు నిరంతరం వచ్చి చేరుతూ ఉంటాయి . ఇది అనివార్యం . మనం తదనుగుణంగా వ్యాకరణగ్రంథాలు వ్రాసుకుంటూ పోవాలి . అంతే గాని భాష పెరుగుదలను అరికట్ట కూడదు. భాషను సంకుచితం చేసే ఛాందసవాదుల అభిప్రాయాన్ని  నిరసిస్తూ వారు చెప్పిన ఈ పద్యం చూడండి . 
పాపమని యన్యపదముల
దాపును మాపెదరు పండితమ్మన్యులు ము
న్నేపదములు చేరకయే
యీ పలుకీరీతి పరిణమించెనె శంభో !

ఇక ఆనాడు అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోతున్న దుస్సాహిత్యాన్ని దుయ్యబడుచు కవి పలికిన మాటలు పరిశీలించండి . విషం ఒక వ్యక్తినే చంపుతుంది రెండోవాడు జాగ్రత్త పడొచ్చు . అలాగే కత్తి కూడ ఒక వ్యక్తినే చంపుతుంది . రెండో వ్యక్తి తప్పించుకోవచ్చు . కాని చెడ్డసాహిత్యం వల్ల వ్యాపించే భావజాలం సమస్త దేశాన్ని, రాజును ప్రజలను నాశనం చేస్తుంది. అందుకే --- ఏకం విషరసో హంతి శస్త్రేణైకశ్చ హన్యతే
సరాష్ట్రబంధుం  రాజానం హంత్యేకో  భావవిప్లవ:  అన్నారు మన పెద్దలు . 
అందువల్ల  కవి కాకపోయినా నష్టం లేదుగాని చెడ్డ కవి కాకూడదు . అది మరణంతో సమానం అని దండి అనే అలంకారశాస్త్రవేత్త అభిప్రాయ పడ్డారు  . ఏమన్నారో చూడండి .
నాsకవిత్వమధర్మాయ మృత్యవే దండనాయ చ
కుకవిత్వం పున: సాక్షాత్ మృతిమాహుర్మనీషిణ:
ఏమయ్యా ! నువ్వు కవి కానంతలో వచ్చే నష్టం లేదు . అది అపరాధమేమి కాదు నిన్నెవరు దండించరు. నిన్నెవరు చంపరు. కాని చెడ్డకవివి మాత్రం కాకు .   అది మరణంతో సమానం . కాబట్టి కవి కాక పోయినా పరవాలేదు గాని చెడ్డ కవి మాత్రం కాకూడదు . ఇక కవి ఆనాటి సమాజంలో పెరుగుతున్న చెడ్డ సాహిత్యానికి వేదన చెందుతూ చెప్పిన పద్యం పరికించండి .  
ఓశివ ! పూర్వం విషం త్రాగి ఈ పదునాలుగు లోకాల్ని రక్షి౦చావు. కాని నేడు నానాటికి పెరిగిపోతున్న  విషతుల్యమైన దుస్సాహిత్యాన్ని గమనించడం లేదు . నీకు మూడు కళ్ళున్నాయి  ఏమిటి లాభం అని వాపోయాడు కవి.      
గరళము గళమున దాలిచి
పరిరక్షణ సలిపినావు పదునాల్గు భువుల్
పెరిగెడి దుస్సాహిత్యము
నరయవు మూడుండె కన్నులవి యేల శివా !
ఇక ఆనాడు అర్థం లేని ఫ్యాషన్ల పేరుతొ జరుగుతున్న ఘోరాన్ని దాని ఫలితంగా ఏర్పడే సాంస్కృతిక పతనాన్ని  చక్కగా ఈ క్రింది పద్యంలో వర్ణించారు కవి . ఒకామె తన కుచసౌభాగ్య౦ కూలిపోతుందని పిల్లవాడికి పాలతిత్తితో సీసాపాలు పట్టి౦చిందట. అమ్మ పాలు త్రాగితే ప్రేమ , ఆప్యాయత అలవడతాయి . కాని వాడు త్రాగినవి పోతపాలు . వాడికి తల్లి దండ్రులపై ప్రేమ ఎలా కలుగుతుంది . అందువల్ల తండ్రి చస్తే కార్యక్రమాలు బయటవాడెవడితోనో కానిచ్చేశాడట.       
అబ్బా! గుబ్బలకెంతో
దెబ్బని యొక తల్లి పాలతిత్తిడె పుత్రుం
డబ్బ చనిపోవ కర్మల
నెబ్బేయని పరుని కొప్పగించెను శంభో!
ఇక  సమాజంలో కొంతమందికి ఒక విచిత్రమైన స్వభావం ఉంటు౦ది . అదేమిటంటే మనకు నష్టం కలిగినా పరవాలేదు గాని పొరుగువాడికి లాభం కలుగకూడదు .   పొరుగువాడి  ఇంట్లో దూడచచ్చి  పోతే  మన ఇంటిలో పాడి ఉన్నట్లే . తెలుగులో ఒక మోట సామెత ఉంది . అదే౦టంటే పొరుగువాడు నిప్పు అడుగుతాడని పొయిలో ఉచ్చ పోశాశాడట. ఇటువంటి కుసంస్కారాన్ని దుయ్యబడుతూ వారు రచించిన మరో పద్యం పరిశీలిద్దాం .
అడుగని వారుండరు మా
కిడుడంచు౦ జబ్బులనియొ యింకొకటనియో
చెడ విసిగితినని యొక్కతె
పడగొట్టెను పెరటి పొట్లపాదును శంభో !   
ఈ విధంగా మల్లాదివారి  శతకమంతా ఇటువంటి పద్యాలతో హాస్య, వ్యంగ్యమిళితమై నడుస్తు౦ది. వారు తమ రచనద్వారా  సమాజానికి ఒక సందేశాన్ని అందింఛి సమాజాభివృద్ధికి దోహదం చేసి కవిగా కృతకృత్యులయ్యారనడంలో   ఎటువంటి సందేహం లేదు . ఈ వ్యాసంలో కొన్ని పద్యాలు మాత్రమె పొందుపరచడం జరిగింది . పాఠకులు ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం చదివి ఆనందించాలని కోరుతున్నాను .     
><><>< 


No comments: