Monday, October 24, 2016

ఆర్యాశతకం--2

శ్రీ అప్పయ్యదీక్షితులు రచించిన
ఆర్యాశతకం
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
            ఒక భక్తుడు తన స్త్రీలౌల్యాన్ని ఎంత గొప్పగా సమర్ధించు కు౦టున్నాడో స్వయంగా చూడండి . ఓ పరమశివ! నేను స్త్రీల కడగంటి చూపులకు ఓడిపోయి వారికి వశం అయ్యానని నన్ను ఎందుకు చులకన చేస్తున్నావు ? ఎందుకు నన్ను హీనంగా చూస్తున్నావు ? నీ శరీరంలోనే సగం నీ భార్య నిండి ఉండడం చేత నువ్వు ఆమెను చూడలేకపోతున్నావు. నీకా అనుభవం లేదు . ఒకే ముఖంలో ఉన్న ఒక కన్ను మిగిలిన వాటిని  చూడ లేదుకదా! శివశివ ! నిన్ను చుస్తే జాలేస్తోంది . నీకా అనుభవం  బొత్తిగా లేదు కదా పాపం. ఆ రసికత్వం తెలియని నువ్వు వీడు  స్త్రీల కడకంటి చూపులకు లొంగిపోయాడు అని నన్ను ఆక్షేపిస్తున్నావు . నేను కేవలం వాళ్ళ కడగంటి చూపులకు మాత్రమే  లొంగిపోయినవాణ్ణి నువ్వలా కాదు స్త్రీని శరీరంలోనే దాచుకుని భరిస్తున్నవాడివి. నువ్వు నన్ను ఆక్షేపించడం చాల హాస్యాస్పదంగా ఉంది కదూ .
 లలనాలోలవిలోకన జితమిత్యవమన్యసే కథం మాం  త్వం
త్వయి జాయార్ధశరీరే శివ శివ నాలోకనానుభవ: (9)
త్వం = నువ్వు
లలనాలోలవిలోకనజిత౦ = (వీడు) స్త్రీల యొక్క చంచలమైన చూపుల చేత ఓడి౦పబడినవాడు
ఇతి = అని
మాం= నన్ను
కథం= ఎట్లు
అవమన్యసే= చులకనగా చూస్తున్నావు  
జాయార్ధశరీరే = శరీరంలో సగం భార్యయే గలిగిన 
త్వయి = (నీయందు) నీకు
శివ శివ = ఓ శివ శివ  (జాలితో)
ఆలోకనానుభవ:= చూడడంతోఅనుభవం 
న= లేదు
><><>< 




No comments: