Thursday, October 20, 2016

ఆర్యాశతకం-1

శ్రీ అప్పయ్యదీక్షితులు రచించిన
ఆర్యాశతకం
  డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు        
క భక్తుడున్నాడు . అతనికి ఎప్పుడు భోగాల పట్ల ఆసక్తి . అంతే కాకుండ అతని స్వభావం నిరంతరం విషాదంతోనే ఉంటుంది . ఆయన తన భోగాలాలసతను , విషాదస్వభావాన్ని ఎంత చక్కగా సమర్ధించుకుంటున్నాడో గమనించండి .

ఓ పరమశివా!  లోకంలో కొడుకు తండ్రిలాగ, కుమార్తె తల్లి లాగ ఉంటారని ప్రతీతి . రామాయణం కూడ పితృన్ సమనువర్త౦తే నరా:, మాతరమంగనా: అని ఈ విషయాన్నే నొక్కి చెబుతోంది.     ఇందులో తప్పేముంది? నువ్వూ భోగాసక్తుడవే (పాముల యెడ ఆసక్తి గలవాడవు ) నీ స్వభావమే నాకూను. నేనూ భోగాసక్తుడనే (భోగముల యెడ ఆసక్తి గలవాడనే) అయ్యాను . ఇక  నా స్వభావం మా అమ్మ పార్వతి స్వభావం వంటిది. ఆమె  విషాదవతి (విషం అత్తి ఇతి విషాద: (శివుడు) విషాదునితో కలసి ఉండేది . అంటే విషం తిన్న నీతో కలసి ఉన్నది కాబట్టి విషాదవతి ) ఇక నా స్వభావం  కూడ అటువంటిదే  ( అంటే ఎప్పుడు విషాదం ( విచారం / చింత ) తోనే కూడి ఉంటుంది ) కాబట్టి ఇందులో నాతప్పేమీ లేదు . అన్నీ మీ (ఇద్దరి)  పోలికలే .
 
పుత్ర: పితృవత్పుత్రీ మాతృవదిత్థం మమాత్ర కోదోష:?
అహమపి భోగాసక్త: ప్రకృతిర్జాతా విషాదవతీ   (11)
పుత్ర:= కుమారుడు 
పితృవత్ = తండ్రి వంటివాడు
పుత్రీ= కుమార్తె
మాతృవత్= తల్లి వంటిది
ఇత్థం=ఈ విధంగా ఉండును
అత్ర = ఈ విషయంలో
 మమ= నాయొక్క 
దోష:= దోషము 
క:?= ఏమిటి ?
అహ౦ +అపి = నేను కూడ
భోగాసక్త: = సర్పశరీరాసక్తుడవు (నువ్వు)/ భోగములపట్ల ఆసక్తి గలవాడను (నేను) 
చ= మరియు
ప్రకృతి:= స్వభావము
విషాదవతీ= (మా అమ్మ పార్వతిలాగ) విషం తిన్న నీతో కలిసు౦డేది / విషాదంతో నిండినదిగా . 
జాతా = తయారైంది 
<><><><><> 



No comments: