Tuesday, April 2, 2013

తండ్రికి తగిన తనయుడు


తండ్రికి తగిన తనయుడు
డాక్టర్. చిలకమర్తి. దుర్గాప్రసాద రావు
09897959425

ఈశ్వరుడు అష్టమూర్తి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, సూర్య చంద్రులు, యజ్ఞ పురుషుడు ఆయన శరీరాంగాలు. ఆందుకే ఆయన్ని అష్టమూర్తి అని అంటాం. ఆయన కొడుకు వినాయకుడు కూడ తక్కువేం కాదు . తండ్రికి తగ్గ తనయుడే. ఆయన కూడ ఆష్టమూర్తే. ఎందుకంటే ఆయనకి కూడ ఎనిమిది లక్షణాలూ ఉన్నాయి.
ఏకరదుడు. ఒకేదంతం కలవాడు. ద్వైమాతురుడు. ఇద్దరు తల్లులు గలవాడు. ఒకావిడ పార్వతి, రెండో ఆవిడ గంగ. నిస్త్రిగుణుడు అంటే గుణాతీతుడు. సత్వరజస్తమోగుణాలకు అతీతుడు. చతుర్భుజుడు అనగా నాలుగు భుజాలు కలవాడు. పంచకరుడు అంటే ఐదు చేతులు కలవాడు. తొండం కూడ అవసరాన్ని బట్టి వాడుకుంటాడు. అందువల్ల భుజాలు నాలుగే అయినా చేతులు ఐదు . షణ్ముఖనుతుడు అంటే ఆరు ముఖాలుగల కుమారస్వామిచే స్తుతించబడేవాడు. సప్తచ్ఛదగంధిమదుడు. శ్రేష్ఠమైన ఏనుగు యొక్క గండస్థలం నుంచి ఎల్లప్పుడు ఒకరకమైన ద్రవం స్రవిస్తూ ఉంటుంది. దాన్ని మదజలం అంటాం. అలా స్రవిస్తేనే అది మదపుటేనుగు అవుతుంది . ఆ ద్రవం వాసన ఏడాకుల అరటిచెట్టు కాండం నుంచి కారే ద్రవం వాసనను పోలి ఉంటుంది. వినాయకుడు గజముఖుడు కదా! ముఖంతో పాటు వాసన కూడ సంక్రమించింది.
ఇక ఆఖరి లక్షణం ఏమిటంటే ఆయన అష్టతనుతనయుడు. అంటే ఎనిమిదిశరీరాలుగల శివునికి కుమారుడు. చూశారా! ఆయన తండ్రికి తగిన కొడుకు ఎలా అయ్యాడో. ఆయన గుణాలతోనే ఆయన్ని ఒకసారి స్తుతిద్దాం.
ఏకరద! ద్వైమాతుర! నిస్త్రిగుణ! చతుర్భుజోపి పంచకర!
జయ షణ్ముఖ నుత! సప్తచ్ఛదగన్ధిమదాష్టతనుతనయ!....


No comments: