Thursday, February 6, 2014

వసుచరిత్రకారునిపై కాళిదాసు ప్రభావం

వసుచరిత్రకారునిపై కాళిదాసు ప్రభావం
                                              Dr. Chilakamarthi DurgaPrasada Rao
                                                               3/106,Premnagar,Dayalbagh ,
                                                                       Agra-282005.
                                                                       dr.cdprao@gmail.com 
ఆంధ్రసాహిత్యచరిత్రలో రాయలయుగమొక స్వర్ణయుగం అనడంలో ఎటువంటి  సందేహం లేదు. ఈ యుగాన్నే ప్రబంధయుగమని కూడ పిలుస్తారు. ఈ యుగంలో వెలువడ్డ ప్రబంధాల్లో వసుచరిత్ర సానలదీరిన జాతిరత్నం. రచయిత రామరాజభూషణుడు. ఇతనికే భట్టుమూర్తి అనే పేరు కూడ ఉంది. 
ఇది ఒక విలక్షణమైన మహాప్రబంధం. తెలుగుప్రబంధాల పంక్తిలో దీనికో ప్రత్యెకస్థానముంది. దీన్ని  రచించడానికి రామరాజభూషణుడు తన యావచ్ఛక్తిని వినియోగించి  యున్నాడనియు; వసుచరిత్రమునందు శ్లేషయో, ధ్వనియో, శబ్దాలంకారమో, అపూర్వమైన భావసౌష్ఠవమో, వర్ణనాచమత్కారమో లేని పద్యమరుదనుట సాహసము కాదని శ్రీయుతులు శేషాద్రివేంకటరమణకవులు పేర్కొన్నారు.  ఈ వసుచరిత్ర   తిరుమలదేవరాయునకు అంకితమియ్యబడింది.
                               సాధారణంగా సంస్కృతకావ్యాలు తెలుగులోకి అనువదింపబడటం  అనాదిగా వస్తున్న సంప్రదాయం. కాని వసుచరిత్ర విషయంలో  అది తారుమారైంది. వసుచరిత్ర సౌందర్యానికి ముగ్ధుడైన  కాళహస్తికవి ఆ కావ్యాన్ని సంస్కృతభాషలోకనువదించడం వల్ల ఆ గౌరవం మొట్టమొదటగా దానికే  దక్కిందని చెప్పవచ్చు. అంతేగాక  ఆ కావ్యం కొన్ని భారతీయ మరియు పాశ్చాత్యభాషల్లోకి అనువడింపడింది.
                సాధారణంగా ప్రాచీనకవుల పోకడలను అనువదించడమో  లేక అనుకరించడమో అర్వాచీనకవులకు పరిపాటి. వసుచరిత్రకారుడు కూడ ఈ సంప్రదాయాన్నే అనుసరించాడు. ముఖ్యంగా కవికులగురువైన కాళిదాసు ప్రభావం ఆయనపై  ఎంతో ఉంది. ఈ అంశాన్ని శ్రీ శేషాద్రిరమణకవులు తమ వసుచరిత్ర  ప్రస్తావనలో సంక్షిప్తంగా వివరించారు. కవి  కథాకథనం , సన్నివేశకల్పన, వర్ణనలు, ఉక్తివైచిత్రి మొదలగు అంశాల్లో  కాళిదాసును అనుకరించాడు. కావ్యం అంతా చదివితే, అసలు కాళిదాసును అనుకరించడం కోసమే ఈ ఇతివృత్తాన్ని స్వీకరించి ఉంటాడేమో అని అనిపించకమానదు.    
                      రామరాజభూషణునకు మహాకవికాళిదాసుపై  చెప్పలేనంత గౌరవం ఉంది. అందుకే  కావ్యావతారికలో ప్రాచీనకవులను స్తుతిస్తూ కాలిదాసునుద్దేశించి ను నీవనుమాట నెలయించె  నెవ్వాడు అని అంటాడు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పడం అసందర్భం కాదు.  ఒకసారి దండి కాళిదాసభవభూతులలో ఎవరు అధికులు అనే విషయం తేల్చవలసిన అవసరం ఏర్పడింది. ఎవరు తేల్చగలరు? ఎందుకంటే ఆ తేల్చేవ్యక్తి ఆ ముగ్గురి కన్న అధికుడై ఉండి తీరాలి.  వాళ్ళు ముగ్గురు కూడబలుక్కుని సాక్షాత్తూ సరస్వతీదేవినే నిర్ణయించమని కోరారట. ఆమె దండి గొప్పకవి , భవభూతి గొప్ప పండితుడు అని ఖచ్చితంగా చెప్పేసిందట. కాళిదాసుకు తన మాట  ఎక్కడ వినబడనందుకు చాల కోపం వచ్చిందట. కోపం ఆపుకోలేక పోయాడు. ఆమెను పచ్చిగా సంబోధిస్తూ మరి నేనెవరినే అని గట్టిగా అడిగాడట. ఆమె వెంటనే నీకు నాకు ఏమి తేడా లేదు  నువ్వే నేను నేనే నువ్వు. సందేహం లేదు   అందట. ఇది కథా లేక నిజమా అన్న విషయం ప్రక్కన పెడితే ఇది కాళిదాసు గొప్పదనానికి నిదర్శనం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
( కవిర్దండీ  కవిర్దండీ  భవభూతిస్తు పండిత:        
కో s హం రండే? త్వమేవాహం త్వమేవాహం న సంశయ:
వసుచరిత్రకారునిపై శాకుంతలం, కుమారసంభవాల ప్రభావం చాల ఉంది. కావ్య నాయికగిరికలో పార్వతి, శాకుంతలల  పోలికలు చాల కనిపిస్తాయి. ఒక మాటలో  చెప్పాలంటే ఆమె చిన్నదనంలో పార్వతిని పెద్దయ్యాక శకుంతలను గుర్తుకు తెస్తుంది.
అసలు కాళిదాసును అనుసరించడం కోసమే కవి ఇటువంటి ఇతివృత్తం  తీసుకుని ఉంటాడనిపించే  సందర్భాలు కూడా లేకపోలేదు.                
                              ఉదాహరణకు కుమారసంభవంలో శివుడు మాయావటువు రూపంలో పార్వతిని పరిక్షించడానికి వస్తాడు. ఆమె శివుని పతిగా పొందడానికే అంత ఘోరమైన  తపస్సు చేస్తున్నదని తెలుసుకొని, ఆమె ముందు శివుని దుర్గుణాలు వర్ణించి, నిరుత్సాహపరచి,  ఆ ప్రయత్నం విరమించుకొమ్మని హితవు చెబుతాడు. ఆమె కూడ మాయావటువు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి ప్రయత్నం విరమించుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పెస్తుంది.  మళ్ళా  అతడు ఏదో మాట్లాడబోతో ఉంటే అడ్డుకుని చెలికత్తెతో, ఓసఖి! ఇతనింకా ఏదో చెబుదామనుకుంటున్నాడు. బయటికి పొమ్మను. ఎందుకంటే మహాత్ములను నిందించేవాళ్ళు మాత్రమే కాదు, ఆ నిందలు వినేవాళ్ళు  కూడ పాపాత్ములౌతారు అని చెప్పి కొంచెం ఆలోచించి అక్కడనుంచి తానే వెళ్లిపోడానికి వెనక్కు తిరుగుతుంది. వెంటనే శివుడు నిజరూపం ధరించి ఆమె చెయ్యి పట్టుకుంటాడు. ఆమె ఒక్కసారి  వెనక్కు తిరిగి చూస్తుంది . తీరా చూస్తే ఆయన శివుడు. తాను ఎవరి కోసం  ఇంత ఘోరమైన తపస్సు చేసిందో అయనే స్వంయంగా వచ్చి చెయ్యి పుచ్చుకున్నాడు. ఆమె మనస్సులో సిగ్గు, ప్రేమ ఒకేసారి చోటు చేసుకున్నాయి.  ఆ సన్నివేశాన్ని కాళిదాసు చాల అద్భుతంగా వర్ణించాడు.
                  అతన్ని చూడగానే ఆమెకు వణుకు పుట్టింది. శరీరమంతా ముచ్చెమటలు పోశాయి. అక్కడ ఉండిపోడానికి సిగ్గు అడ్డం వచ్చింది. వదిలి వెళ్ళడానికి ప్రేమ అడ్డం వచ్చింది. అందువల్ల  ఆమె ముందుకు మోపడానికి ఎత్తిన పాదాన్ని మోపకుండ  అలాగే  ఉంచేసిందట. అటువంటి స్థితిలో ఆమె పర్వతం చేత అడ్డగింపబడిన నది వలె ముందుకు వెళ్ళలేకపోయింది. అక్కడ ఉండలేక పోయింది.

  మార్గాచల వ్యతికరాకులితేవ సింధు:
శైలాధిరాజతనయా న యయౌ న తస్థౌ

       ఇటువంటి ఉపమానం అపూర్వం,  అసదృశం, అనితరసాధ్యం. బహుశా ఈ ఉపమానానికి ముగ్ధుడైన  రామరాజభూషణుడు శుక్తిమతి కోలాహలుల కథపై ఆధారపడిన వసుచరిత్రను స్వీకరించి ఉండవచ్చు. శుక్తిమతి నది.  కోలాహలుడు పర్వతం. ఆయన హిమవంతుని పుత్రుడు. జగజ్జనని పార్వతికి అనుంగు తమ్ముడు. శంకరునకు ముద్దుల మరది.   వీరి పుత్రికయే వసుచరిత్రనాయిక గిరిక .
            వసుచరిత్ర కావ్య నాయకుడగు  వసురాజు ప్రవేశం శాకుంతలం లోని దుష్యంతుని ప్రవేశాన్ని గుర్తుకు తెస్తుంది. గిరికావసురాజుల సమాగమం శకుంతలాదుష్యంతుల సమాగమాన్ని పోలి ఉంటుంది.
వసుచరిత్రలోని మంజువాణి శాకుంతలంలోని ప్రియంవదవలె చతురవచోవిలాసిని.
గిరిక చెలులు ఆమె జన్మవృత్తాంతం వసురాజుకు వివరించడం శాకుంతలంలోని శకుంతలావృత్తాంతకథనాన్ని పోలి ఉంటుంది. ఇక అక్కడ  దుష్యంతునకు  విదూషకుని వలె  ఇక్కడ వసురాజుకు  సహచరుడున్నాడు. కాని ఇతడు కాళిదాసు  విదూషకునివలె మట్టిబుర్ర కాదు  నాయికానాయకుల్ని కలిపిన గట్టిబుర్ర.
         ఇక వర్ణనల విషయానికొద్దాం. కాలిదాసు, పార్వతి ముఖసౌందర్యాన్ని వర్ణిస్తూ లక్ష్మీదేవి చంద్రుని ఆశ్రయిద్దామనుకుందట. చంద్రునిలో చల్లదనం, ఆహ్లాదకత మొదలైన లక్షణాలున్నాయి.  కాని పద్మం లోని  సవాసన, సౌకుమార్యం మొదలైన లక్షణాలు లేవు. ఒకవేళ వాటికోసం, పద్మాన్ని ఆశ్రయిస్తే చద్రునిలోని చల్లదనం, ఆహ్లాదకత్వం లభ్యం కావడం లేదు.  ఆమెకు అవీ కావాలి ఇవీ కావాలి అందుకని  చాల ఆలోచింఛి ఆలోచించి పార్వతీదేవి ముఖాన్ని చేరి అన్నిటిని పొందిన సంతృప్తిని చేజిక్కించుకుందట.
చంద్రంగతా  పద్మగుణాన్న భుంక్తే
పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం                                               
ఉమాముఖం తు ప్రతిపద్య లోలా
ద్విసంశ్రయాం ప్రీతిమావాప లక్ష్మీ: (కు||సం 1-43)
      ఈ శ్లోకంలో సొగసు చూసి ముగ్ధుడైన  రామరాజభూషణుడు తనకు సహజంగా అబ్బిన శ్లేషను కూడ జతచేసి తన కావ్యనాయిక గిరిక నేత్రసౌందర్యాన్ని ఎంత అద్భుతంగా వర్ణించాడో చూడండి.
  తన రాజీవశరంబెరుంగదు నిశాతత్వంబు లేగల్వ తూ
పునకుం జాలదు వేగలీలయని యా పూముల్కులొగ్గించి క్రొ
న్ననవిల్కాడు నవాంబుజోత్పల వితానంబీను మీనాక్షి లో
చనముల్ వింట ఘటింప బొల్చె నవి నిస్తంద్రాంబకఖ్యాతులన్

మన్మథుడు అనుకున్నాడు - తన దగ్గరున్న పద్మానికి (నిశాతత్వం)  పదును లేదు. రాత్రి పని చేయదు. ఇక కలువలమాటకొస్తే వాటికి వేగంలేదు, పగలు పనిచేయవు.   అని ఆరెండూ విడిచిపెట్టి  అన్ని లక్షణాలు కలిగిన  గిరిక యొక్క కండ్లు ఆయుధాలుగా ఉపయోగించడం మొదలుపెట్టాడట.

ఇపుడు కొన్ని సన్నివేశాలు పరిశీలిద్దాం:

                 పార్వతిని   శివునికిమ్మని అడగడానికి  శివుని కోరికపై సప్తర్షులు హిమవంతుని దగ్గరకొచ్చారు. శివుని గుణగణాలన్ని ఆయనముందు  ఏకరువు పెట్టి,
ఏమయ్యా! త్రిలోకపావని అయిన   మీ అమ్మాయి వధువు. పర్వతరాజువైన నీవు కన్యాదాతవు. సప్తర్షులమైన మేము  పెళ్లిపెద్దలుగా వచ్చి స్వయంగా నిన్ను యాచిస్తున్నాం. ఇక వరుడంటావా  సాక్షాత్తూ  ముల్లోకములకు ప్రభువైన శివుడు. నీ వంశోన్నతికి ఇంతకంటే ఇంకేం కావాలయ్యా ! అంటారు.

 ఉమా వధూ: భవాన్ దాతా యాచితార: ఇమే స్వయం
వర: శంభురలం హ్యేష: త్వత్కులోద్భూతయే విధి:

వసుకారుడు ఈ భావాన్ని ఎలా అనుకరించాడో చూడండి.       
  సతినడిగించు భావ్యగుణశాలి వసుండట, వేడవచ్చువాఁ
డతులిత దేవరాజ్యభరణైక దురంధరుడైన యా శత
క్రతుడట సత్కృపామహిమ కన్నియనిచ్చుట సర్వదేవతా
హితమట, యింతకన్న శుభమెయ్యది తొయ్యలి గన్నవారికిన్  ( వసుచరిత్ర.5.28)

కుమారసంభవంలో సంస్కృతసాహిత్యజగత్తును ఉర్రూతలూగించిన అద్భుతమైన సన్నివేశం ఒకటుంది .  ఇటువంటిది వేరెక్కడ కన్పించదు.
శివుని వివాహవిషయం మాట్లాడ వచ్చిన సప్త ఋషులు హిమవంతుని ముందు శివుని
గుణగణాలను స్తుతించడం ప్రారంభించారు.  పార్వతికి అవన్నీ వినాలనుంది. కాని అక్కడుండి వినడానికి సిగ్గు. ఆ ప్రదేశం విడిచి వెళ్ళడం సుతరాం ఇష్టం లేదు. అందుకని పార్వతి తనతండ్రి దగ్గర తలొంచుకుని కూర్చున్నదై,  తాను విలాసం కోసం తెచ్చుకున్న కమలం యొక్క రేకుల్ని పూర్తిగా లేక్కపెట్టేసిందట. సహస్రపత్రం కమలం శతపత్రం కుశేశయం అంటారు. అంటే కమలానికి వెయ్యిరేకులుంటాయి. అవి లెక్కపెట్టడం అనుకున్నంత సులభంకాదు. ఒకటి పట్టుకుంటే మరోటి జారిపోతూ ఉంటుంది. చాల సమయం పడుతుంది. కాబట్టి  అక్కడ ఉన్నా, లేనట్లుగా; విన్నా, విననట్లుగా; ఆసక్తి కనబరుస్తున్నా, కనబరచనట్లుగా సమయం అంతా అక్కడే గడిపేసిందట.
ఎంతకమనీయమైన భావం. ఇది ఆలోచించే కొద్ది ఆనందం స్రవిస్తూనే ఉంటుంది.                
        ఏవం వాదిని దేవర్షౌ పార్శ్వే పితురథోముఖీ
        లీలాకమలపత్రాణి గణయామాస పార్వతీ             అంటాడు కాళిదాసు . 
వసుచరిత్రకారుడు దీనికి తన ప్రతిభను కూడ జోడించి  ఎలా అనుకరించాడో చూడండి.

అనుటయు(దాత పార్శ్వగతయై తగు నాలతకూన దా నతా
ననయయి కేలి కేళినలినంబు మొనల్నఖరాంచలంబులం
దునుముచునుండె, వజ్రధరదోరశనిప్రతిమానమీనలాం
ఛనవిశిఖంబులింక  నఖసాధ్యములంచు గణించుకైవడిన్  (వసుచరిత్ర. 5.30)      
                  ఇక కణ్వుడు శకుంతలను అత్తవారింటికి పంపు సందర్భంలో కాళిదాసు రచించిన శ్లోకాలు విశ్వవిఖ్యాతాలు సార్వకాలికాలు. అందువల్లనే:

  కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతలా
తత్రాపి చ చతుర్థో0క: తత్రశ్లోకచతుష్టయం  

అనే నానుడి పండితలోకంలో బాగా విస్తరించింది. ఆ శ్లోకాలకు ముగ్ధుడైన  వసుకారుడు అందులో కొన్నిటిని అనువదించకుండా ఉండలేకపోయాడు. గిరికను అత్తవారింటికి సాగనంపు ఘట్టంలో  ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు.
 
యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్ప్ప ష్టముత్కంఠయా
కంఠ: స్తంభిత బాష్ప వృత్తి కలుష: చింతాజడం దర్శనం
వైక్లబ్యం మమతావదీదృశమహో! స్నేహాదరణ్యౌకస:
పీడ్యన్తే గృ హిణ: కథం ను తనయావిశ్లేషదు:ఖైర్నవై:  (అభిజ్ఞానశాకుంతలం 4 అంకం )

ఈ రోజు శకుంతల అత్తవారింటికి వెళ్ళుచున్నదనే సంగతి తలచుకోగానే నా
హృదయమం ఉత్కంఠతో నిండిపోయినది. కన్నీటిపొంగుచే కంఠము జీరపోయింది.  చూపు మసక బారింది  సర్వసంగపరిత్యాగిని, అరణ్యవాసిని  అయిన నాకే కేవలం  పెంచిన మమకారం వల్ల ఇంత దు:ఖం కలుగుతో ఉంటే , ఇక కని, పెంచి, పెద్దచేసిన       తమ కుమార్తెలు  అత్తవారింటికి వెళ్ళుచున్నప్పుడు కలుగు నూతనమైన విరహబాధతో గృహస్థులు ఇంకెంత కుమిలిపోతున్నారో కదా!
వసుచరిత్రకారుని అనుకరణ చూడండి.   

హేమలతానిభాంగికి నధీశనివేశవనప్రదేశ దీ
క్షా మహనీయ మంగళము సర్వము సాంగముగా ఘటించి య
క్కోమలిc జేరCబిల్చి  తలగ్రుచ్చి కవుంగిటc జేర్చి భూధర
గ్రామణి పల్కు గాఢతరగద్గదికాఘన నిస్వనంబునన్ ( వసుచరిత్ర 6/54)

ఇచట కంఠస్తంభితబాష్పవృత్తికలుష: అనే కాళిదాసోక్తిని గాఢతరగద్గదికాఘన నిస్వనంబునన్ అని వసుకారుడు యథాతథంగా అనుకరించడం గమనార్హం.

అదే విధంగా కణ్వుడు శకుంతలకు హితోపదేశం చేస్తాడు.  అమ్మాయీ ! నువ్వు నీ భర్త ఇంటికి వెళ్ళిన తరువాత నీ కంటే పెద్దవారికి సేవలు చేస్తూ ఉండు . నీ సవతుల యెడ ప్రేమతో మసులుకో. ఒకవేళ ఏ కారణం చేతనైన నీభర్త నీపై కోపిస్తే నువ్వు రోషం తెచ్చుకుని  అతని ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకు. అందరి పట్ల సమభావం కలిగి ఉండు. సంపదలు చూసుకుని ఎగిరెగిరి పడకు.  ఈ విధంగా నడుచుకుంటేనే నిజమైన  గృహిణులనిపించుకుంటారు. ఇందుకు భిన్నంగా ప్రవర్తించినవారు వారి వారి కుటుంబాలకు మానసికవ్యాధులై,  పీడిస్తున్నారు. (ఆధి అంటే మానసిక రోగం. వ్యాధి అంటే శారీరిక రోగం).       
శు శ్రూషస్వ  గురూన్ కురు ప్రియ సఖీవృత్తిం సపత్నీజనే
భర్తుర్విప్రకృతాపి రోషణతయా మాస్మ ప్రతీపం గమ:
భూయిష్టం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
యాన్త్యేవం గృహిణీపదం యువతయో వామా : కులస్యాధయ :

ఈ  కణ్వుని బోధలలోని సారాంశం వసుకారుడు రెండు పద్యాల్లో  ఇమిడ్చాడు.
తన సహజసిద్ధమైన శ్లేష కవనాచాతుర్యంతో కొంగ్రొత్త సొగసులు తీసుకొచ్చాడు.
సిసం:  మారుమాటాడదు మఱచియైనను గురు
వ్యాహార్యమునకీ యహార్యతనయ
యా నమ్రగతిc బూను మానంపు సవతు లె
ట్లైన నీదివ్యరత్నానుజాత
ఱాగయై మేరమీరదొకప్పుడును  ఘన
శ్రీలCబొంగియును  నీ సింధుకన్య
యేకా కృతివహించు నిను రాగవృత్తికి
నవరాగ వృత్తికి నబ్జసహజ
తే ||గీ || యచ్చెరువు, వింత, యబ్బురం, బరిది యనుచు
విశ్వధాత్రీశ్వరులు మెచ్చ వెలయవమ్మ
అమ్మ!  భవదీయ చిత్రగుణాతిశయము
వలన మాకెల్ల వన్నె రా మెలగవమ్మ ( వసుచరిత్ర- 6 / 56)
పతికృత ధర్మకౌశలము పట్టున c దోడగు నారి నారి దా c
బితృశరణప్రచింతమది బెట్టక యీ శనివేశితాత్మయౌ
సతి సతి రాశికెక్కి యిన సత్కృతి c గై కొను కన్య కన్య  శా
శ్వతమతి నిట్లుగా మనిన వామయె వామ గదమ్మ కోమలీ
ఈ పద్యాల్లో శ్లేష వలన అర్థస్ఫూర్తికి కొంత ఆటంకం వాటిల్లినా రామణీయకతకు భంగం కలుగలేదు.యాంత్యేవం గృ హిణీపదం యువతయో వామా కులస్యాధయ:
అన్న కాళిదాసు వాక్యం లోని అభిప్రాయాన్ని శాశ్వతమతినిట్లుగా మనిన వామయె వామగదా!వసుంధరన్ అని సంతరించడం గమనార్హం .        

అదే సందర్భంలో కోలాహలుడు గిరికతో:
ఈ శైవాలవతీప్రతీరభజనంబీనిర్మలప్రస్తరో
ద్దేశావాసమునీ మృగార్భకశకుంతీసఖ్యమున్  లేమి చిం
తా శల్యంబు వహింపకమ్మ
                 అనే మాటల్లో మృగార్భకశకుంతీసఖ్యము అనే మాట అభిజ్ఞాన శాకుంతలాన్ని తలపింప చేయడానికే కవి ప్రయోగించి ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు.
                అలాగే కాళిదాసు శకుంత లావణ్యం పశ్య మొదలైన వాక్యాల్లో పదాలవిరుపుతో అద్భుతమైన సన్నివేశాన్ని సృష్టించినట్లే  వసుచరిత్రకారుడు నెలతకీవ సులాభంబు నించు మంచు మొదలగు చోట్ల పదాల విరుపుతో అద్భుతాలు సృష్టించాడు.

                        వసుచరిత్రలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. స్థాలీపులాకన్యాయంగా కొన్నిటిని మాత్రమే పొందుపరచడమైనది. తక్కినవి పాఠకులు  గ్రంథమంత స్వయంగా చదివి తెలుసుకోవచ్చు. మొత్తంమీద రామరాజభూషణుడు కాళిదాసునే అనుసరించి, అనుకరించి, తరించిన కాళిదాసమానసపుత్రుడనడంలో ఎటువంటి సందేహం లేదు. 

No comments: