Monday, February 10, 2014

గోదా సహస్రకమలమాలిక

గోదా సహస్రకమలమాలిక
(ఒక సమీక్ష)
Dr. Chilakamarthi Durgaprasada Rao,
3/106, Premnagar, Dayalbagh, AGRA
09897959425.
  
శ్రీగోదాసహస్రకమలమాలిక అనే గ్రంథాన్ని శ్రీమాన్ కే.యస్. రామానుజాచార్యులుగారు రచించారు. వీరు శ్రీమాన్ కే.టి.యల్ నరసింహాచార్యులుగారి ప్రోత్సాహంతో    గ్రంథం  రచించినట్లు  తెలుస్తోంది,
ఇందులో 420 శ్లోకాలున్నాయి . కవి వేయి నామాలతో గోదాదేవిని కిర్తించారు.
నామాలు ఆమె యొక్క జీవితవిశేషాల్ని, సుగుణసంపత్తిని, భక్తి పారవశ్యాన్ని, సందేశసారాంశాన్ని వివరించేవిగా ఉన్నాయి. ఇది స్తోత్ర గ్రంథమే ఐనప్పటికీ కవి ఎన్నో కవితారీతులను  చొప్పించారు. అంతే గాక తిరుప్పావై మొదలైన గ్రంథాల్లో ఉండే  అనేక విషయాలను ఇందు పొందు పరిచారుఒక్క మాటలో చెప్పాలంటే  గ్రంథం కవిత్త్వాన్ని సింగారించుకున్న విశిష్టాద్వైతసిద్ధాంతసారసంగ్రహం .
                     మనదేశం అనాదిగా కర్మభూమి. భక్తి, జ్ఞాన, వైరాగ్య సంపదలకు నిలయం. ఎందరో నిష్కామకర్మపరాయణులు, భక్తులు, జ్ఞానులు, విరాగులు పుణ్యభూమిలో జన్మింఛి జాతిని పునీతం చేశారు . ఆళ్వార్లు వైష్ణవసంప్రదాయానికి చెందిన భక్తశిఖామణులు . వీరు సంఖ్యలో 12మంది కావడం వలన పన్నిద్దరాళ్వార్లుగ ప్రసిద్ధి పొందారు.   ఆళ్వారనే తమిళపదానికి మునుగుట అని అర్థం. భగవంతుని యెడల ప్రేమతో, భగవంతుని అనుగ్రహంలో పూర్తిగా మునిగిన వారే ఆళ్వార్లని చెప్పవచ్చు . శ్రీ మహావిష్ణువు యొక్క పరివారం కలియుగంలో భక్తితత్వాన్ని వ్యాప్తి చెయ్యడం కోసం ఆళ్వార్లుగా అవతరించారని భాగవతం బట్టి తెలుస్తోంది.
(1) పోయిగై ఆళ్వార్ పాంచజన్యం ( శంఖం); (2) పూదత్తాళ్వార్ కౌమోదకి (గద); (3) పేయాళ్వార్ నందకము ( ఖడ్గం);
(4)తిరుమళి(డి)శైఆళ్వార్ -సుదర్శనం(చక్రం) (5); కులశేఖరాళ్వార్( కౌస్తుభమణి); (6) తొండరడిప్పొడి ఆళ్వార్ -(పుష్పమాల); (7) తిరుప్పాణి ఆళ్వార్ (శ్రీవత్సమనే పుట్టుమచ్చ); (8). తిరుమంగై  ఆళ్వార్-  (శారంగము అనే ధనుస్సు); (9) పెరియాళ్వార్ ( విష్ణు రథం); (10) చూడికురుత్తనాంచియార్ (గోదాదేవి/ఆండాళ్) - (భూదేవి); (11) నమ్మాళ్వార్-(విష్వక్సేనుడనే సైన్యాధ్యక్షుడు); (12) మధురకవి ఆళ్వార్- (గరుత్మంతుడు).             
                         తర్కకర్కశమైన వాదోపవాదాలతో, శుష్కమైన కర్మకాండలతో, దీర్ఘ జటిలసాధనలతో మరుభూమిగా మారిన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సహజమైన భక్తిప్రపత్తులతో ముంచెత్తి మోక్షమార్గాన్ని కరతలామలకం చేయ్యడానికి ఆళ్వారులు ఒకరి తరువాత ఒకరు  అవతరించారు. శరణాగతి ద్వార మోక్షసామ్రాజ్యానికి బంగారుబాటలు వేశారు. వీరిలో ఒకరు స్త్రీ, కొంతమంది ఎక్కువ కులం వారు, మరికొంతమంది తక్కువ కులం వారు, ఇంకా కొంతమంది అంటరానివారున్ను  కావడం గమనిస్తే ఆధ్యాత్మికప్రగతికి జాతి, కులం మొ||అసలాటంకాలు  కావనిపించక మానదు.   
             వీరిలో చూడికురుత్తనాంచియార్   స్త్రీ కావడం  ఒక విశేషం.
ఈమెనే గోదాదేవి  అని పిలుస్తారు. గ్రంథంలో గోదాదేవిని  రచయిత  అపార భగవద్భక్తిజ్ఞానవైరాగ్యశేవధిగా వర్ణించారు. ఈమె విష్ణుచిత్తుడను మరో పేరుగల పెరియాళ్వారు కూతురు. ఆతనికి తులసివనంలో దొరికింది. విధంగా ఒక ఆళ్వారుకు కూతురై స్వయంగ ఆళ్వార్లసరసన చోటు సంపాదించుకున్న ఈమె చరిత్ర ఎంతో పవిత్రమైనది. స్త్రీలోకానికే ఆదర్శపాత్రమైనది. చూడి కొడుత్తాళ్ అనే పదానికి ఆముక్తమాల్యద అని అర్థం . అంటే భగవంతునికై అల్లినపూలమాలను ముందుగా తాను ధరించి తన అందాన్ని తనివితీరా చూసుకుని మురిసి తరువాతే దేవునికి సమర్పణ చేసేది.
కృష్ణాయ గ్రధితా మాలా    రహో ధృత్వా  ప్ర మోదినీ    
వీక్ష్యాదర్శే స్వసౌందర్యం  కృష్ణకాంతాయితా క్షణం   
మొ శ్లోకాలను బట్టి విషయం వెల్లడౌతోంది.
          ఈమె చిన్నతనంలో తండ్రి వలన  భగవల్లీలావిశేషాల్ని  తెలుసుకొని చెలులకు చెప్పేది. తాను స్వయంగా సంగీత కవిత్వములయందు నేర్పరి కావడం చేత పూర్వజన్మసంస్కారం వల్ల  కల్గిన  భక్తిభావంతో ఎల్లప్పుడు భగవంతుని యందు మనసు లగ్నం చేసి అతన్నే గానం చేస్తూ ఉండేదిభగవంతుని పొందు కోసమే నిరంతరం తహతహలాడేది. విష్ణుచిత్తుడు ఆమె మన:ప్రవృత్తిని గమనించి ఆశ్చర్యపడి భగవంతునకు మొఱపెట్టుకోగా అతడు ప్రత్యక్షమై విష్ణుచిత్తునితో భక్తశిఖామణి!    భగవంతుని గుణగానం కంటే వేరొక తపస్సు ఏముంటుంది? నేను పూర్వం  వరాహరూపం ధరించినపుడు నన్ను భూదేవి తనివితీరా  గానం చేయలేక కొరతను  తీర్చుకోడానికై  నేడు గోదాదేవి పేరుతో నీ పుత్రికగా జన్మించింది.  ఆమె నన్ను వలచిందిఆమె ధరించిన మాలయే  నాకు అత్యంతప్రియమైంది.  నీవామెను శ్రీ రంగానికి తీసుకుపోయి  రంగనాధునికి  సమర్పించమని ఆదేశించాడుపిదప గోదాదేవి యధావిధిగా రంగనాధుని   పెండ్లాడిందిఈవిధంగా భక్తితో భగవంతునకు భార్యయైన  గోదాదేవి ధన్యచరిత. ఆమె చరితం అనురాగ భక్తిరసభరితంభగవంతునిపై గల ఇటువంటి భక్తిభావాన్ని అమలిన శృంగారమని కూడ పిలుస్తారుఈగ్రంథంలొని

హృత్పుండరీకమధ్యస్థ  హృషీకేశనిషేవిణీ
మూర్తీభూతా కృష్ణతృష్ణా  భక్తిక్రీతజనార్దనా

మొదలగు శ్లోకాలు ఆమె భక్తిపారవశ్యాన్ని చాటుతున్నాయి .
మానవుడు ముక్తిపొందడానికి భక్తియే ప్రధానం గాని జాతి ప్రధానం కాదని గోదాదేవి భావన. అంతేగాక మానవునకు  తండ్రి గాని, తల్లి గాని, సోదరుడు గాని, భర్త గాని, ధనం గాని రక్షకులు కారని శ్రేహరి చరణసన్నిధియే రక్షణమని ఉదాహరణ పూర్వకంగా తెలియజేసింది.
 
కిం పితా  రక్షక: పశ్య ప్రహ్లాదమితి శంసినీ
కిం మాతా రక్షక: పశ్య భరతం తమితీరిణీ
కిం భ్రాతా రక్షక: పశ్య తం సుగ్రీ మితీరిణీ
కిం భర్తా  రక్షక: పశ్య  ద్రౌపదీ మితి ఘోషిణీ
------------------------------------.
 హారిం వినా కోప్యన్య: రక్షక స్యాదితీరిణీ.
మొ || శ్లోకాల వల్ల  పై విషయం వెల్లడౌతోంది .
కవి గ్రంధంలో:
చిదచిత్పదతత్వానాం తత్వయాధాత్మ్య దర్శినీ  
పర్యంక విద్యాతత్వ జ్ఞా న్యాసవిద్యైకసంశ్రయా
అంతర్యామి హృషీకేశనారాయణ మహత్వవిత్
 మొ|| శ్లోకాలద్వారా ఎన్నో విశిష్టాద్వైతసిద్దాంతరహస్యాలను పొందుపరిచారు. వీటితో బాటుగా అనేక ఆలంకారికప్రయోగాలను కవి మనకందించారు.
ఘటస్తనస్నుతపయ: తులసీవనవర్ధినీ
అనే ప్రయోగం   యో హేమకుమ్భస్తనని: సృతానాం
స్కందస్య మాతు: పయసాం రసజ్ఞ: అనేకాళిదాసు మాటను గుర్తు చేస్తుంది.
ఈ కవి రఘువంశం గీతగోవిందం  కృష్ణకర్ణామృతం  రామాయణం భగవద్గీత మొ|| గ్రంథాల్ని మథించి ఎన్నో విశేషాల్ని ఇందులో పొందుపరిచారు. ఈ గ్రంథకర్త  వ్యాకరణశాస్త్రంలో చాల దిట్ట. సిద్ధాంతకౌముదిలోని ఉదాహరణలను శ్లోకాల్లో యథాతథంగా ఇమడ్చడం చదువరులకు ఆనందాన్ని కల్గిస్తుంది . ఉపర్యుపరి, హరయే రోచతే భక్తి:, తాం చ మాం చాంతరా విష్ణు:, పశ్యతోభయత: కృష్ణమ్, అంత  రేణ హరిం సౌఖ్యం కుత:?, న త్వాం తృణాయ మన్యే మొదలగు కారకప్రత్యయరూపాలు సహజరమణీయంగా ప్రయోగించారు.
                గ్రంథంలోని అష్టదళపద్మబంధం  కమలమాలికాబంధం కవి యొక్క బంధకవితాపాటవానికి మచ్చుతునకలు. అనుష్టుప్ ఛందస్సులో ఈయన చేయితిరిగిన చతురుడు. అందువల్ల గ్రంథమంతా నల్లేరుపై బండిలా సాగింది.
             విశిష్టాద్వైతసిద్ధాంతాలకు, భక్తిరసభావాలకు, అలంకారరచనారీతికి పెన్నిధి యైన ఈ గ్రంథం భగవద్భక్తులకు నిత్యపారాయణగ్రంథమనడం ఏమి అతిశయోక్తి కాదు. ఇట్టి అమూల్యగ్రంథాన్ని రచించిన కవి ప్రశంసనీయులు.  
*******
  

No comments: