Monday, February 17, 2014

మృతసంజీవనం - ఒక సమీక్ష

         మృతసంజీవనం - ఒక సమీక్ష
డా|| చిలకమర్తి దుర్గాప్రసాదరావు
3/106, ప్రేమనగర్, దయాల్బాగు, ఆగ్రా
09897959425
 మృతసంజీవనం అనే  సంస్కృతనాటకాన్ని శ్రీమాన్ నల్లాన్చక్రవర్తి. కృష్ణమాచార్యులు గారు రచించారు. వీరికి గానకళాప్రపూర్ణ’‘సంగీతసాహిత్యకళానిధిఅనే బిరుదులున్నాయి. ఈయన సంస్కృతాంధ్ర భాషల్లో చాల గ్రంథాలు రచించారు.
                ఇది ఏడు అంకాల నాటకం. ఇందలి కథ ప్రాచీనమే ఐనప్పటికీ రచనా సంవిధానం అత్యంతఆధునికం. మద్యపానం వల్ల కలిగే అనర్థాలను   
ప్రదర్శించడం ద్వార ఆ దురభ్యాసాన్ని నిషేధించడమే ఈ నాటకం యొక్క ప్రథానసందేశం.  కవి
 శ్రీ రంజిత: కచ పరిష్కృత బర్హిబర్హ:
ఇంద్ర స్తుత: ప్రణమతాం ధిషణానుకూల:
శుక్రే తరామ్బుదవపు: వృషపర్వకారీ
శ్వశ్రేయసం దిశతు న: ఖగాదేవయాన:
అనే నాందీ శ్లోకం ద్వారా నాటకం లోని  ప్రథానపాత్రల పెర్లు సూచించారు. 
ఇది కవి రచనాచమత్కృతికి ఒక ఉదాహరణ. ఈ నాటకానికి ప్రథానకథ మహాభారతంలోని ఆదిపర్వం నుండి స్వీకరిపబడింది. కవి కాలానుగుణముగా కొన్ని మార్పులు చేసి ఈ నాటకాన్ని రచించారు.
మొదటి అంకంలో ఇంద్రబృహస్పతులు సంభాషించుకొనుచుండగా భటుడు ప్రవేశించి ఇంద్రునితో యుద్ధంలో మరణించిన రాక్షసులందఱూమరలా దేవలోకంపై దండెత్తి వస్తున్నారని తెలియ(జేస్తాడు. అది విని ఇంద్రుడు ఆశ్చర్యాన్ని ప్రకటించగా బృహస్పతి కొంతసేపు సమాధిలో ఉండి, శుక్రా చార్యుడు తన మంత్రబలంతో మరణించిన రాక్షసులను తిరిగి బ్రతికిస్తున్నాడని తెలియ(జేస్తాడు.
రెండో అంకంలో ఇంద్రుడు, బృహస్పతి కుమారుడగు కచుని చేరుకొని  దేవదానవుల వైరాన్ని , అమృతం యొక్క శక్తిక్షయాన్ని వివరించి విద్యాభ్యాసం నెపంతో రాక్షసగురువైన శుక్రాచార్యుని సేవించి అతని వద్ద గల మృతసంజీవనీవిద్యను నేర్చుకొని రమ్మని ఆదేశిస్తాడు. కచుడందుకంగీకరిస్తాడు.
మూడవఅంకంలో కచుడు శుక్రాచార్యుని చేరుకుని, తన రాకకు కారణాన్ని వివరించి అతనికి శిష్యుడౌతాడు.
నాల్గవ అంకంలో రాక్షసరాజైన వృషపర్వుడు , అతని మంత్రి ప్రవేశిస్తారు  మంత్రి వృషపర్వునితో యుద్ధంలో దేవతలు సంపూర్ణంగా మరణించలేదని వివరిస్తాడు.అంతలో గూఢచారి ప్రవేశించి బృహస్పతి కుమారుడైన కచుడు విద్యాభ్యాసం నెపంతో శుక్రాచార్యుని ఆశ్రయించిన వార్త అంద(జేస్తాడు. కచుడు దేవయానిని , శుక్రాచార్యుని తన వశం చేసుకున్నచో తమకు ముప్పు తప్పదని భావించి వారు శుక్రాచార్యునకు మౌఢ్యాన్ని పెంపొందించే ఉపాయంకోసం ఆలోచిస్తారు.
ఐదవ అంకంలో రాక్షసులు కచుణ్ణి సంహరించగా  శుక్రాచార్యుడు తన కుమార్తెయైన దేవయాని కోరికపై  అతన్ని బ్రతికిస్తాడు.
ఆఱవ అంకంలో వృషపర్వుడు, అతని మంత్రి ప్రవేశిస్తారు. తాము కచుణ్ణి సంహరింఛినప్పటికి అతడు తిరిగి బ్రతికి నందుకు చాల విచారిస్తారు. ఈ పర్యాయం కచుణ్ణి చంపి, భస్మం చేసి, మద్యపాన ప్రియుడగు శుక్రునిచే త్రాగించాలని నిశ్చయించుకుంటారు.
ఏడవ అంకంలో దేవయాని కచుని ఆలస్యానికి అందోళన ప్రకటించగా శుక్రుడు దివ్యదృష్టితో అన్వేషించి కచుడు తన కడుపులోనే ఉండడం గమనిస్తాడు. ఆక్షసులు చేసిన దుండగాన్ని గ్రహించి కచుణ్ణి బ్రతికించి
మృతసంజీవని ఉపదేశిస్తాడు. కచుడు శుక్రుని ఉదరాన్ని చీల్చుకుని బయటకువచ్చి తాను  నేర్చిన విద్యతో మరల శుక్రుని బ్రతికిస్తాడు. ఆ తరువాత శుక్రాచార్యుని అనుమతితో దేవలోకం చేరుకుంటాడు.
ఈ నాటకంలో కవి మృతసంజీవనం అనే పదాన్ని క్రొత్త అర్థంలో ప్రయోగిం చడం మనం గమనించవచ్చు . ఓ కచకుమారా! సమస్త ప్రాణులకు మృత్యువు తప్పదు. ఒకవేళ మానవుడు కృత్రిమశక్తులతో పునర్జీవితు డైనప్పటికీ ఎప్పటికైనా మరణించక తప్పదు. మానవుడు తన శక్తి యుక్తులను ఎల్లప్పుడూ లోకకళ్యాణానికే వినియోగించాలి గాని లోక వినాశనానికి వినియోగించ కూడదు. లోకంలో ధర్మం , సత్యం , దయ, శాంతి, శౌచం, నీతి మొదలగు ధర్మాలు పూర్తిగా నశించాయి కాబట్టి వాటిని మఱల బ్రతికించడానికి బుద్ధిమంతులు ప్రయత్నించాలని, అదే మృతసం జీవనమని  ఉపదేశిస్తాడు.
ధర్మస్సత్యం దయా శౌచం
నీతి: ప్రీతి: మృతా ఇవ
తేషాం సంజీవనే సర్వే
స్పృహయంతాం  మనీషిణ:
కవి మద్యపానం వల్ల కలిగే అనర్థాలను శుక్రాచార్యుని మాటల్లో ఇలా వెల్లడించారు.
బుద్ధేర్మోహకరం, విపత్పరికరం, సత్కీర్తినాశంకరం,
మానప్రాణహరం, దశేంద్రిగుణగ్రామప్రభాతస్కరం,
విత్తధ్వంసకరం, భ్రమేణ యుగపత్త్రైలోక్యసాక్షాత్కరం
శ్రోతారోsద్య నిషిధ్యతే ఖలు సురాపానం మయా సర్వత:          
                                                     మద్యపానం బుద్ధిని మోహపరుస్తుంది . ఎన్నో కష్టాలను తెచ్చి పెడుతుంది. కీర్తిని కలుషితం చేస్తుంది. మానప్రాణాలు హరిస్తుంది. ఇంద్రియ పటుత్వాన్ని శిథిలం చేస్తుంది. ధన నష్టాన్ని కలుగ(జేస్తుంది. మూడు లోకాలు ఒకే చోట ఉన్నట్లుగా భ్రమింప(జేస్తుంది. కాబట్టి మద్యపానం పూర్తిగా నిషేధిస్తున్నాను.
కవి స్వయంగా సంగీతవిద్యలో నిపుణులు. అందువల్ల ఎన్నో సంగీతశాస్త్ర విశేషాల్ని నాటకంలో పొందుపరిచారు. ఈయన ప్రకృతివర్ణనలో నిపుణుడు.
నాటకం లోని సూర్యవర్ణన, వసంతఋతువర్ణన మొదలగునవి ఇందుకు ఉదాహరణలు. శ్లేష, గర్భ కవిత్వాలలో కూడ ఈ యానాది ఆరితేరిన చేయి .కచ శబ్దాన్ని సాభిప్రాయంగా ప్రయోగించడం, కచదేవయానుల సంభాషణలో కచుని ఉక్తివైచిత్రి శ్లేషకవితానైపుణ్యానికి;  వసంతతిలకం లో   ఇంద్రవజ్రను  అమర్చడం గర్భకవిత్వనైపుణ్యానికి ఉదాహరణలు.
ఈ కవి తెలుగుభాషలోని సామెతలను సంస్కృతంలోకి అనువదించి ప్రయోగించడం మరో విశేషం.  ఎవడు త్రవ్వుకున్న గోతిలో వాడే పడతాడు అనే తానని స్వయంకృతగర్తే స్వయమేవ పతిత: లాంటివెన్నో ఉదాహరణలిందులో ఉన్నాయి. ఈ నాటకంలో మరెన్నో కవితావిశేషాలున్నాయి.   
ఈ నాటకం పూర్తిగా చదివి ఆకళింపు చేసుకున్నవారికి మద్యపానవ్యసనం  పట్ల విరక్తి కలుగక మానదు. ఇంత రసవత్తరమైన నాటకాన్ని రచించిన కవి ప్రశంసనీయులు. సంస్కృతసాహిత్యేతిహాసపుటలలో ఈ నాటకానికి సమున్నతమైన స్థానం లభిస్తుందనడంలో ఇటువంటి సందేహం లేదు.  


        

No comments: