Friday, February 28, 2014

శ్రీసత్యనారాయణస్వామి వ్రతము -(పద్యకథనము)- చిలకమర్తి వేంకటసూర్యనారాయణ -- మూడవకథ

శ్రీసత్యనారాయణస్వామి వ్రతము
(పద్యకథనము)
చిలకమర్తి వేంకటసూర్యనారాయణ
మూడవకథ
50. సూతుండాగతి( దెలిపిన
       ప్రీతిన్విని మాన్యమునులు  వినయమెలర్పన్ 
       భూతలమున తద్వ్రతమీ
       భాతి సలిపినట్టి యితర భక్తులెవరనన్

51.                 సీ || ఉల్కాముఖుండను నుర్వీశుడొకనాడు
                          సంతతి నర్థించి సతిని( గూడి
              పరమపవిత్రమౌ భద్రశిలానదీ
                       తీరవాసంబున దీక్షబూని
             సకలవాంఛలు దీర్చు సత్యనారాయణ
                         సద్వ్రతమునుసల్పు సమయమందు
             వణిజూడొక్కడటకు వచ్చి క్రతువు జూచి
                       సాష్టాంగముగ  మ్రొక్కి స్వామి నంత
ఆ. వె||   వర్తకంబు మాని వైళ మింటికి (జని
         సతిని చేర బిలిచి స్వాoత మలర
          నమితభక్తి తోడ నా వ్రతమహిమను
          తెల్లముగ గృహిణికి  తెలియ(జేసె


కం ||    సంతతి కలిగిన యంతనె
          సంతోషము తోడ( జేతు సత్యవ్రతమో
          ఇంతీ! ఇది ఋతమని య
         త్యంతాసక్తి మెయి ప్రతిన నాతడు బూనెన్

53.. ఆ.వె || అట్లు ప్రతిన బూని యానందవార్ధిని
      చెలియతోడ గూడి చెలగుచుండ
      అచిరకాలమందె యతివ లీలావతి
      తాల్చె గర్భ మంత  దైవ కృపను

54        ఆ.వె || నెలలు నిండినంత నెలత లీలావతి
              రమ్య మైన దివ్యలగ్న మందు
              పూర్ణశశిని బోలు పుత్రిక ( బ్రసవించె
              సత్యదేవు మహిమ సత్యమనగ

55. తె.గీ|| పదునొకండవ దినమున బాలికకు, క
              ళావతి  యనంగ (బేరిడి రావణిక్స
              తీపతుల్ , దినదినము వర్ధిల్లుచుండి
               యా కళావతి వెల్గె చాంద్రీకళగతి
   
  56. ఆ.వె || యుక్త వయసు తనయకొప్పు చుండుట గాంచి
                     పతిని జేరి సతియు పలికె నిట్లు
                     మున్ను మీరలన్న మ్రొక్కును దీర్పంగ
                    సమయమనుచు వేడు సతిని గాంచి

57. కం||     రొక్కం బెక్కువ వ్యయమై
                చిక్కులొదవునంచు తలచి చిత్తాన , నతం
               డక్కాంత నీ విధంబున(
               జక్కటి వచనములు బలికి శాంతిల జేసెన్

58. సీ|| ఇంతిరో ! నాపలుకిటు వినవేయని
                   లక్షణం బొప్పగ లక్షపతికి
          అమ్మాయి నిచ్చి యే ఇమ్ముగ పెండిలి
                 చేయుట  ఎంతయు శ్రేష్టమనుచు
         సమయోక్తిచే నెట్లొ  శాంతింపగా ( జేసి
             సందేహముడిపెను సతికి; నిట్లు
     కాలంబు కొన్నేళ్ళు గడువగా నొకనాడు
             పెండ్లీడు వచ్చెను పిల్లకనుచు
ఆ .వె || పెండ్లి చేయనెంచి విప్రుని రావించి
           అనియె నిట్లు వైశ్యుడతని గాంచి
          సుగుణవంతుడైన సుందరాంగు నొకని
          సుతకు తగిన వరుని చూడుమనుచు

59.ఆ.వె||  అట్లువిన్నవింప నావిప్రుడత్యంత
             దీక్షతోడ నూళ్ళు తిరిగి తిరిగి
            కాంచనాఖ్యనెగడు ఘననగరంబున
           యోగ్యుడైన ఒక్క యువకునిగనె

60.సీ||   కులశీలగుణముల గుర్తించియీతడే
                   తగిన వరుండని తనివి చెంది
          విషయమ్ము సర్వము వినిపించె నతనికి     
                యువవణిజుని మది నొదవ వాంఛ
        లక్షాధికారియౌ లక్షపత్యాఖ్యుoడు
              ప్రముఖుడౌ వైశ్యుగా  వరలుచుoడె
        అతనిదౌ పుత్రిక యతివ కళావతి
       సౌoదర్యగుణశీల సౌమ్యురాలు
       అట్టి యామెకు దగినట్టి భర్తను గవే
       షించుచు నిటకు నేతెoచినాడ
ఆ.వె|| ఇచ్ఛయున్నయెడల నిప్పుడే నాతోడ
        రమ్మటంచు( బలికి సమ్మతి (గొని
        ప్రీతితోడ వాని వెంబడి నిడుకొని
        స్వస్థలంబు ( జేరె సద్విజుండు

61. కం||    వచ్చిన యువకుని (గన్గొని
               ముచ్చటతో వైశ్యతనయ ముగుదతనమునన్
              నచ్చెనని యిష్టమున్వెలి
              బుచ్చెన్నతశీర్షయై యపూర్వత్రపతో

62.ఆ.వె||   ఒకరినొకరు వలచి యోరజూపులగల్పి
                తనివి దీర్చుకొనుచు తాము మురిసి 
               మనసు మనసు గలిపి మమకారపాశాను
                బంధనములచేత పట్టుబడగ

63. కం||   ఉభయుల భావము లెఱుగుచు
              నభముననున్నట్టిసురగణము మెచ్చంగన్     
              విభవము గదురగ వైశ్యుడు
             శుభలగ్నమునందు పెండ్లి సుతకొనరిoచెన్

64. ఆ.వె||  తనయపెoడ్లిలోన తనకర్మవశమున
               వ్రతము సేయ మఱచె వైశ్యుడంత
              వర్తకంబు సేయు వాంఛతో జామాత
              తోడగూడి వేగనోడనెక్కె

65. కం || ఉల్లాసంబున వారలు
            కొల్లలు లాభంబు గోరి గుప్తపురతనాల్
            వెల్లడి జేసెడి నెపమున
            చల్లగ( జని  చేరె రత్నసానుపురంబున్

66. ఆ. వె || పురము జేరు సరికి ప్రొద్దు క్రుంకంగను
              ఓడ దరికి జేర్చి యొడ్డు జేరి
              యధిక మైన శ్రమకు నలసి వారచ్చట
              ఒడలు మఱచి నిద్రకొరిగి రంత!

67.ఆ.వె ||  మ్రొక్కు దీర్చలేక మోహంబుతో  మ్రగ్గి
                 మందుడగుచు దన్ను మఱచి యుండ
                 యమితదు:ఖ మొంది యలమటించుడటంచు
                 సత్యదేవుడలిగి శాపమిచ్చె

68.సీ||     సత్యదేవుని శాపసంకల్పమున జేసి   
                             దుండగులగు మాయదొoగ లచట
                 పరుగున తానేగి బహులీలలనుజేసి  
                               కావలివారల కనులు గప్పి
                  సాహసంబొప్పంగ చంద్రకేతుని సొమ్ము
                               చౌర్యాన గొనిపోవు సమయమందు
                    వెన్వెంట రాడ్భటుల్ వెన్నాడి తరుమగా
                               లొంగక వారలు గంగ దరిని
      తే.గీ|| మామ యల్లుoడు శయనించు మధ్యలోన
              తాము దోచిన మొత్తంపు ధనము నెల్ల
              జార విడచి యదృశ్యులై చనిరి యరయ
              విధివిధాన మేరికిని తప్పింప దరమె?

69. కం||   అత్తరి నా భటవర్గము
              మత్తున నిదురిoచు వారి మధ్యన సొత్తున్
             మొత్తం బంతయు కనుగొని
             బెత్తంబులతోడ బాది బెదిరిoపoగన్
       
    70. ఆ. వె || కినిసినట్టి వారికిని సంకెలలు వైచి
                    దూషణములనాడి త్రోసి కొనుచు
                    కొరడదెబ్బలిచ్చి గొని పోయి వారిని
                   రాజు ముందు నిల్పి రాజభటులు

71. కం||  వీరులమై యీ చోరుల
              ధీరత వెoటాడి పట్టి తెచ్చితిమిటకున్
             భూరమణా! యీ చోరుల
            నేరమునకు తగిన శిక్ష నెరపగవలయున్

72. సీ|| భటులట్లు పలుకగా భయమొంది వణిజులా
                     కంపితగాత్రులై కరము మోడ్చి
          చాలగ విలపించి చంద్రకేతుని గాంచి
                     బహువినయంబున పలికిరిట్లు
         వర్తకంబొనరింప వలెనను నాసచే
                    వచ్చియున్నారము వసుమతీశ!
        నిష్కారణoబుగా నేర మారోపించి
                   కట్టి తెచ్చిరి మీదు కడకు భటులు
తే .గీ ||  సత్యమెఱిగించినారము స్వామి ! తమకు
           చోరులము గాము రాజేంద్ర! సుగుణసాంద్ర!
           విడువు మనుచును పరిపరి వేడుకొనగ
          బధిరుడయ్యెను  నయ్యయో! ప్రభువదేమొ!

73. ఆ.వె||   అట్లు వేడ రాజు నత్యాగ్రహము జెంది
                బంది లోన నుంచె ప్రభువు వారి
                సత్యదేవు దివ్యసంకల్పమును మీర
                వనజభవునకైన వశమె తలప?
               
74. సీ|| బందిలోనబెట్టు పలుబాధలకుస్రుక్కి
                      వర్తకులిరువురీ వరుసనుoడ
         తల్లికూతుoడ్రట ధనసంపదలు(బోవ
                     నింటింట భిక్షంబు నెత్తుకొనుచు
          కడునిడుమలబడి కాలంబు పుచ్చుచు
                     నుండ కళావతి యొక్క నాడు
          అన్నార్థ మొకయింటికరుగగనచ్చోట
                    సత్యదేవవ్రతము జరుగుచుoడ
తే.గీ || పూర్తి యగువరకట ప్రొద్దుపుచ్చి పిదప
        భోజనము చేసి యింటికి బోవ సుతను
       శూలములబోలు కఠినంపు చూడ్కులొలయ
      దారుణoబుగ( బల్కె నా తల్లి యిట్లు

76. తే.గీ||  భర్తదరిలేని తరుణాల పడుచువయ్యు
              ఒంటరిగ నెచటకుంబోయి యుంటి వకట!
              చెడు తలoపులెడందను చేరెనేమొ!
              తడయక వచిoపుమనియెడు తల్లి కపుడు

77. కం|| జరిగినదంతయు నామెయు
            వెరవక యెఱిగిoపగానె విస్మృతి బోవన్
            మరచిన పూర్వపు మ్రొక్కెద
           స్ఫురియింపగ జనని తనదు సుతకిట్లనియెన్     
                              
78. కం||  నీ తండ్రియు మున్నెపుడో
             ఖ్యాతిగ సంతతియు గలుగగా నీ వ్రతమున్
             చేతునని ప్రతిన బూనుట
             చేతను జనియిoచితీవు చెలువుగ మాకున్

79. తే.గీ|| సత్యదేవుని వరమున      సత్ఫలముగ
             కళలతోడను మాకీవు కలిగినావు
            కాని మ్రొక్కును దీర్పక గడుపుచున్న
            కారణంబున కష్టాలు కలిగె మనకు

80. ఆ.వె||  తల్లి గతము నంత తనయకు నెఱిగించి
               వ్రతము పూ ర్తి సేయ వాంఛ గలిగి
               చేత సొమ్ము లేక చింతించు నoతలో
               దైవలీల ధనము తారసిల్లె

81. సీ||  ఆకస్మికoబుగా నందిన ధనముచే
                    భక్తితో వ్రతము దప్పక యొనర్చి
            దీనమ్ముగా సత్యదేవుని ప్రార్థించి
                        విమలభక్తి నిటుల వేడుకొనిరి
        మా యపరాధముల్ మన్నిoపుమో దేవ!
                     అనుకoపతో మమ్ము నాదుకొనవె
           మా భర్తలిoకను మా యిండ్లు క్షేమాన
                          చేరు నట్లొనరిoచు శేషశయన!
తే.గీ | సందియము లేక వైభవానoద మలర
      నిన్ను నిలవేల్పుగా నింట నిల్పుకొనుచు
      మాస మాసoబున వ్రతము మఱువకుండ
     సలుపుచుందుము లక్ష్మీశ! శరణు శరణు

82. కం || అని వారలు మ్రొక్కoగను
            కనికరము దలిర్ప శౌరి కడు వేగమునన్
            జని  చంద్రకేతు కలలో
            కనిపించి వచిoచెనిట్లు గoభీరముగన్
8౩. కం || నేరంబెఱుగని వీరల
            కారాగారమున( ద్రోయగా పాడియె నీ
           కో రాజా !మద్భక్తులు
           వారలవిడు నాదు నాజ్ఞ పాటింపదగున్

84. కం ||  అటు సేయక నా యానతి
              కుటిలమతి తృణీకరింప( గోరెదొ, నిన్నుo
              బటుతరశిక్షల పాల్సే
              యుట, రాజ్య భ్రంశమగుట నొక్కట జరుగున్

85. ఆ. వె|| అనెడు స్వప్నంపు పలుకుల కదిరి పడుచు
               కనులు దెఱచి నల్దిక్కులు కలయ( జూసి
                కలను గని యుంటి ననుచును   కలత( జెంది
                విప్రవర్యుల రావించి విన్నవింప

86. కం || దేవుని కపచారమునే
             గావించిన కారణమున కటువగు స్వప్నం
             బావిర్భవించి యుండును
             భూవర సత్యంబటంచు భూసురులనగన్          

  87.కం || అందము గూర్పగ వణిజుల
             బంధంబుల నూడ దీసి  పంపుము వేగన్
              పొందుము మహదానందము
              సందేహం బేల యనుచు సద్విజులనగన్

88. కం||   కాపరివారలకాజ్ఞగ
              భూపాలుడు పలికె   వేగ పొండటు మీరే
              పాపంబెఱుగని వణిజుల
              తాపంబును ( బాపి తెండు త్వరగా నిటకున్

89. ఆ. వె||   చంద్రకేతు నాజ్ఞ చయ్యన నాలించి
                  భయము దోప భటులు పరుగులిడుచు
                 సరగున వణిజుల సంకెలల్ దొలగించి
                 వర్తకులను నృపతి వద్ద జేర్ప

90. ఆ. వె||    నేడు మనకు నింక నిశ్చయంబుగ చావు
                   దప్పదనుచు మదిని దలచి దలచి
                   నిండు కొలువునందు నిలబడి వైశ్యులు
                   కంపితాంగులగుచు కరము మోడ్చి

91.  కం ||    గడగడ లాడెడు వారిని
                కడు ప్రేముడి గాంచి నృపతి కరుణను పలికెన్
                ఎడదను భీతిని విడువుడు
                తడయక మిము విడుతు నధికధనమునొసగెదన్

92. తే.గీ || అనుచు వారికి  క్షురకర్మలను, తలగడు
              గులను జేయించి , క్రొత్త బట్టలనొసoగి
              ఎన్నదగు ధనరాసుల నెన్నొ ఇచ్చి
             సాగనంపె నృపాలుడా సాధుజనుల


                          మూడవ కథ సంపూర్ణం

No comments: