Sunday, March 2, 2014

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము (పద్యకథనము ) చిలకమర్తి వేంకటసూర్యనారాయణ నాలుగవ కథ

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము
(పద్యకథనము )
చిలకమర్తి వేంకటసూర్యనారాయణ
నాలుగవ కథ

  9౩. ఆ.వె ||  అటుల సూతమునియు నంతయు నెఱిగింప
                 శౌనకాదిమునులు సంతసించి
                 ఆచటి నుండి వైశ్యు లెచటికి నేగిరో
                 తెలియజేయుమనగ పలికె  మునియు

94. కం|| వేడుక తోడను వణిజులు
             ఓడం ద్రవ్యంబు నునిచి యుత్సాహము పా
            రాడ తమయూరు చేరెడు
            గాఢపు తమి వారలపుడు గమియిoచంగా

95.తే.గీ || వారి మనసును శోధింప వలెనటంచు
              సత్యదేవుడు దండియై సత్వరమున
              లక్షపతియొద్ద నిల్చి సలక్షణముగ
               పలుక జొచ్చెను తీయని పలుకులిటుల

96. సీ|| దివ్యమౌ భక్తితో  తీర్థయాత్రలు జేసి
                   వచ్చినట్లీరు కన్పట్టుచుండె
          తనివి( దీరగ దాన ధర్మంబు లయ్యెడ
                  చిత్తశుద్ధిగ మున్ను జేసి నారొ!
         ఇక్కడ నేనిప్పుడొక్క వ్రతమ్మును
               మ్రొక్కు కొంటిని మది నిక్కువముగ
         కరమున కాసైన కానుపిoచని  స్థితి
              కారణంబునను మీ కడకు వచ్చి
 తే.గీ || యాచనము జేయ నిలచితి నర్థినగుచు
         కాన తోచిన ద్రవ్యంబు దాన మొసగి
         పుణ్యమును గట్టు కొండని పొగడి యడుగు
         వాని వీక్షించి పలికెనా వైశ్యలోభి

97. కం|| తెచ్చిన రొక్కంబును నే
            వెచ్చించితి దానములకు వెనుదీయకమున్
            మచ్చుకు లేదిపుడేమియు
            వచ్చిన మార్గామునబొమ్ము వైళమస్వామీ!

 98.ఆ.వె || అనుచుపలుకునట్టి యా కుటిలాత్ముని
               నటన లనృతమరసి  నవ్వుకొనుచు
             ధనములక్షలాది తరణిలో నుండంగ     
             నాస్తి యనుచు బలుక  న్యాయ మగునె?

99. ఆ.వె|| అనెడి  దండిగాంచి  యనుమానమున వాని  
              హాళి మీర మిగుల గేలిచేసి  
              పడవనున్నవెల్ల పత్రలతాదులే 
               దైవసాక్షి యనుచు తాను బల్కె

100. కం || నీ పల్కులె నిక్కములై
              చూపట్టును గాక యనుచు సూటి పలుకులన్
              శాపంబిడి తానేగెను
              చూపులకుo దoడిలీల చొప్పడు రీతిన్     

101.తే .గీ || దండి యఱిగిన పిమ్మట తాము మురిసి
              పీడ వదలినదనుకొంచు ప్రియము మీర
             పరుగు పరుగున( బోయి యా పడవ నెక్క
             తేలి పోవుట గమనించి తెల్లబోయి
   
102. ఆ.వె || ధనముతోడ నింపి తాళాలు వైచిన
               ఇనుప మందసమ్ము నిట్టె  ద్రెంచి,
               ఆకులలములరసి హా హతవిధి యoచు
               బావురనుచు గుండె బాదు కొనుచు                 
103. సీ || మచ్చున కిసుమంత మాయ మర్మము లేక
                     వర్తకంబొనరిoచి వాసి కెక్కి
            మోసంబు లేకయే గ్రాసంబు నార్జించి
                     దాత యటంచును ఖ్యాతి గాంచి
           సత్యంబు దప్పక సతతంబు చరియించి
                   గడియిoచినాడ నఖండయశము
          కడుకష్టములకోర్చి కాయాన చెమటోడ్చి
                  కూడ( బెట్టితి సిరి కోట్లకొలది
తే.గీ ||  ఇట్టి ధర్మార్జితైశ్వర్యమెట్లు బోయె?
          కాన రాకుండ గవ్వైన కర్మ మనుచు
         చాల దు:ఖిoచి, తెలివిని గోలుపోవు
         మామగారిని జేరి,జామాత యపుడు

104. ఆ.వె || ఆదరంబుతోడ నాతని రభసాన
               లేవదీసి , చాల సేవ ( జేసి
              పలుక( జొచ్చె నిటుల భక్తి యుక్తంబుగా
              మామ మనసు మార్చు మాటలలర

106. సీ|| యాచింప వచ్చిన యతివర్యునకు నొక్క
                        గవ్వనీయగలేదు కాని . వాని
             దూషణవాక్యాల తూలనాడి మఱియు
                      దండించి కసరియు తరిమినావు
           ధనము నాస్తి యనుచు దైవ ప్రమాణంబు
                           కావిoచితేమంత కర్మ మొదవె
             రూకయో! లేకర్ధరూకయో! యటుగాక
                           పావలో!  బేడయో! పరకయైన
తే .గీ || డాన మొసగిన  ధనమంత తరుగుననుచు
           సాగనంపి తకట| యా సాధుమూర్తి
            బ్రహ్మయో , విష్ణుదేవుడో,  పరమశివుడొ
           కావలయు గాని, యన్యులు గారు మామ!

106. తే.గీ ||  ఇప్పుడైనను మునిగిపోయినది లేదు
                   కొండ దరి జేరి దండి కూర్చుoడె గనుము
                   వాని పాదాలపై బడి దీనముగను
                   వేడ నాతడె రక్షించు నేడు మనల

107.కం ||  అని ధైర్యము పురిగొల్పుచు
                తనమామను వెంటగొనుచు, దారి తెలుపుచున్
                కనురెప్పపాటు లోపల
                చని వినయము తోడ దండి సన్నిధి జేరెన్

108. సీ|| కుటిలవేషము (దాల్చి  కొండపై నున్నట్టి
                      దండిని గాంచిన తక్షణoబ
           శరణంచు పదముల, కరముల బట్టుచు
                     కన్నీటిధారల కాళ్ళు కడిగి
            తప్పులు మన్నించి ధనమొసంగుమటంచు
                        వినయంబు తోడను వేడు కొనుచు
             సాష్టాoగముగ నమస్కారంబు గావించి
                          చేసిన దానికి చింత పడగ
తే .గీ || దేవదేవుడు మృదుహాసదీప్తులెసగ
           తగిన హేతువు తెలుపుచు దైన్యముడిపి
           వారి సంపదనంతయు వారి కొసగ
           వినయ వినమితశీర్షుడై వణిజుడపుడు

109. సీ|| సహజమౌ భక్తితో సాధుపాదాలకు
                       దండంబు లిడుచును దండికనియె
           మీ మాయ లోపల మిక్కిలిగా (జిక్కి
                      ముక్కోటి వేల్పులే మోహమొoద
             మానవమాత్రుండ, మదమోహపాశుoడ
                       ధూర్తుండ, దీనుండ దుర్బలుoడ
            ధనదాహపరుడ, వితరణరహితుడను
                          సత్యదూరుడనునాశాగ్రసితుడ
తే.గీ || నైన నేనెంత నీ శక్తి నరయ గాను?
        నా యహంకృతి కృత్యమే నన్ శపించె 
       గృహము (జేరిన తోడనే గృహిణి గూడి
       మ్రొక్కుదీర్చెద ననుచును చక్క( బలికి

110. తే.గీ || దండి వద్దను సెలవొoది తక్షణoబ
                పరుగు పరుగున నేతెంచి పడవ నెక్కి
               ధనము నిండిన పెట్టెల కనుల గాంచి
               యపరిమితమైన యానంద మనుభవిoచె

111. కం || ఓడకు లంగరు దీసియు
             వేడుకగా విడిచి పెట్టి, విరిసిన ముదమే
             తోడుగ, భక్తియె నీడగ
             పోడిమతో(జేరె స్వీయపురమున్  వారల్                  

 112. తే.గీ || వైశ్యవరుడంత నొక్క సేవకుని జీరి
                           ముoదు నీ వేగి మారాక మోదమలర
                 సతికి సుతకును నెఱిగిoచి సత్వరముగ
                          రమ్మటoచును ( బంపిoచె సమ్ముదమున

11౩.కం ||  వెంటనె సేవకుడలయుచు
              నింటికి నేతెoచు సరికి నిద్దరు బత్తిన్
              జంటగ వ్రతమును సలుపుట
              కంటంగని యతడు వలికె కడుముదమొదవన్

114. కం || సుజనులు, సత్కులజనితులు
                విజయముతో పురికి నేడె విచ్చేసిరి , యా
                నిజవార్త తెలిపి రమ్మని
               యజమానులు పంపిరనుచు నాతండనగన్ 

   115. కం|| లీలావతి యా పలుకులు
                 నాలిoచియు పతిని గాంచు నాతురత మదిన్
                 చాలం(గీల్కొన నొక్కతె
                 జాలంబదిలేక నోడ చయ్యన జేరెన్

116. ఆ.వె || వచ్చినట్టి సతిని  లచ్చపతియు గాoచ
                  ముదము వలపు వగలు  ముప్పిరిగొన
                   ఓడ డిగ్గి వచ్చి గాఢపు తమకాన
                  కౌగలించె సతిని రాగ మొదవ

117. కం|| ఒక్కరి నొక్కరు గాoచుచు
              మక్కువతో  కుశలమఱసి మఱిమఱి వారల్
              మిక్కిలిగ వచ్చు దు:ఖము
             గ్రక్కున దిగమ్రింగుకొనెడి కాలమ్మునకున్

118. వ్రతము పూర్తి చేసి వనిత కళావతి
        ప్రాణవిభుని(జూడ పరుగు లిడుచు
        వచ్చి యోడ నున్న వల్లభు గాంచెడు
        నoతలోన నొక్క వింత జరిగె

119. కం ||  తనపతితో నా నౌకయు
                కనులకు కానంగరాక ఘనమగు వార్ధిన్
               మునుగుట గాంచి కళావతి
               మనమున విలపించి యంత మహికొరగంగన్

120. కం|| అక్కడగల వారoదరు
             మిక్కిలి దు:ఖిoచి వనిత మేదిని బడగా          
             నిక్కపు కతమరయగ న
            ల్దిక్కుల్ పరికిoచిరధికదీనావస్థన్

121. కం ||  మూలo బెరుగక  యామెయు
                 బేలగ విలపించుచుండు వేళన్ మిగులన్
                 జాలిగొని  సత్యదేవుడు
                లీలన్నానెలతకు వివరింప( దొడంగెన్

122.సీ||   సతి కళావతి సత్య వ్రతమును పూర్తిగా
                            నెరపక మగనిపై వారలు ప్రేమ
             నా ప్రసాదాది ఫలాహారముల్విడి
                            వచ్చిన హేతువు వలన నాపె
              భర్తను ( గో ల్పోయి , పరితాప మందగా
                             వలసె నీరీతి నిప్పటికి నైన
               జాలంబు సేయక , సత్వరంబున  బోయి
                          దైవప్రసాదమంద శుభమబ్బు
            తే.గీ || ననెడి యాకాశవాణిని  నాలకించి
                     వేగ వ్రతమును  పూర్తిగావించ వెండి
                     యా ప్రసాదాలు పంచియు నారగించ
                     ప్రాణనాథుని పొడగాంచె, పరవశించె   
            
12౩. క౦ ||  డెందముల  హర్షమొలయగ
              న౦దరు నావ్రతమహిమల నారసిభక్తిన్   
              బంధువులగూడి  సలిపిరి
             సందియ మిసుమంతలేక  సత్యవ్రతమున్

124. కం ||  అది మొదలుగ నా వణిజులు
                విధిగా నెలకొక్క వ్రతము వేడుక మీరన్
                సదమలమతితో సలుపుచు
                నధికంబగు  సుఖములంది రవ్యయ భక్తిన్

125.తే.గీ || బ్రతికియున్నంతకాలము వ్రతముజేసి
               ఆయురారోగ్య భాగ్యంబు లనుభవించి
               పుత్రపౌత్రాది సంపదల్  బొంది, కడకు
               సత్యలోకమ్ము కేగిరి సద్వణిజులు!

నాల్గవకథ సoపూర్ణం
*****


No comments: