Sunday, March 9, 2014

.అర్ధమాగధీ ప్రాకృత కథ

.అర్ధమాగధీ ప్రాకృత కథ
                                  (స్వతంత్రానువాదం) 
                                             డా|| చిలకమర్తి దుర్గాప్రసాద రావు
         
అమంగళ ముహస్యేవం రక్ఖణo ధీమయా కయం
సోచ్చా తుమ్హే తాహా హోహ మఈఏ కజ్జసాహగా
                       (అర్ధమాగధీ ప్రాకృతo)
(ఒక బుద్ధిమంతుడు తన బుద్ధిబలంతో ఒక అమంగళకరమైన ముఖం గల పురుషుని ప్రాణాలు  రక్షించాడు. ఇది విని నువ్వు కూడ బుద్ధిబలంతో కార్య సాధనకు ప్రయత్నించు).   
      పూర్వం ఒకనగరంలో  ఒక వ్యక్తి  ఉండేవాడు. వాడి దురదృష్టం ఏమిటో గాని ఎవరైనా ఉదయాన్నే  వాడి ముఖం చూస్తే చూసిన వారికి  ఆ రోజంతా  తిoడి దొరకదు. అందువల్ల ఎవరు ఉదయాన్నే వాడి ముఖం చూసేవారు కాదు. ఒక రోజు ఆ వ్యక్తి   గురింఛి  రాజు విన్నాడు. అది నిజమా కాదా అని పరీక్షించడానికి పొద్దున్నేఅతన్ని తన ఆస్థానానికి రమ్మని కబురుపెట్టాడు. వాడు కూడ భయపడుతూనే రాజుదగ్గరి కెళ్ళాడు. రాజు వాడి మొహం చూశాడు . కొంతసేపటికి భోజనం చేసే సమయం వచ్చింది . భోజనం చెయ్యడానికి కూర్చున్నాడు. ఇంకా ముద్ద నోట్లో పెట్టుకున్నాడో లేదో నగర ప్రజలంతా శత్రుభయంతో హాహాకారాలు చేయడం మొదలెట్టారు. దేశమంతా   పెద్ద కోలాహలం చెలరేగింది.  రాజు భోజనం విడిచిపెట్టి వెంటనే లేచాడు . సైన్యంతో నగరం నుంచి బయటకు వచ్చేశాడు. భయానికి కారణమేమి తెలియలేదు. కొంతసేపటికి నగరానికి తిరిగి వచ్చాడు . అప్పుడనుకున్నాడు. నేను అమంగళమైన వీడి మొగం చూశాను. అందుకే ఇంత అనర్థం జరిగింది అని  .ఇటువoటి వాడు తన రాజ్యoలో ఉoడడo తన ప్రజలందరికీ ప్రమాదం    కాబట్టి వాణ్ణి చంపెయ్యాలి అనుకున్నాడు. వాణ్ణి మరోసారి రమ్మని పిలిచాడు. వాణ్ణి చంపెయ్యమని సైనికుల్ని ఆదేశిoచాడు. పాపం ఆ అభాగ్యుడు తన దురదృష్టానికి బాధపడుతూ చేసేది లేక వాళ్ళ కూడ బయలుదేరాడు .
దార్లో ఒక వ్యక్తి కనిపించాడు . ఆతను చాల దయగలవాడు, తెలివైన వాడున్ను. జరిగిందంతా తెలుసుకున్నాడు . అమాయకుడైన అతన్ని చూస్తే జాలేసింది. ఎలాగైనా వాణ్ణి కాపాడాలనుకున్నాడు . ఉపాయం ఆలోచించాడు. వాడి చెవులో ఏదో ఊదేడు.
అంతే వాడు హుషారుగా తలారుల వెంట బయలుదేరి వెళ్ళాడు . వాళ్ళు
అతన్ని ఉరికంబం దగ్గరకు తీసుకుని  వెళ్ళారు. మెడకు తాడు బిగించారు . ఉరిశిక్ష పడ్డ వాడికి చివరి  కోరిక తీర్చడం ఆనవాయితి. ప్రాణభిక్ష తప్ప ఇంకేదైనా కోరుకో  అన్నారు వారు.   మరణించే ముందుగా ఒక్కసారి రాజుగారిని చూడాలనుది . ఇదే నా కోరిక అన్నాడు వాడు. దానికేముందిలే అనుకున్నారు వాళ్ళు. రాజు దగ్గరకు తీసుకెళ్లారు. రాజు వాణ్ణి చూసి కంగారుపడి ఎందు కొచ్చావు? అనడిగాడు. మహారాజా ! ప్రొద్దున్నే నా మొగం చూడడం వల్ల  మీకు ఒకపూట భోజనం దొరకలేదు. కాని నేను మీ ముఖం చూడడం వల్ల నాకు మరణ శిక్షపడింది. ప్రజలేమనుకుంటారో ఆలోచించండి . నా  ముఖం కంటే మీ ముఖం ఇంకా ప్రమాదకరమనుకోరా! ఇక మీ దగ్గరకు రావడానికి ఎవరు సాహసిస్తారు? . ఈ సంగతి  కొంచెం ఆలోచించండి మహారాజా! అన్నాడు. వాడి తెలివితేటలకు సంతోషించిన మహారాజు అతనికి శిక్ష రద్దుచేసి, చాలినంత పారితోషికం ఇచ్చి సంతోషపరచి పంపించాడు.
                                (పాయిఅ విన్నాణ కహ)
                                           ***

                                

No comments: