Sunday, March 2, 2014

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము (పద్యకథనము ) చిలకమర్తి వేంకటసూర్యనారాయణ - ఐదవ కథ

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము
(పద్యకథనము )
చిలకమర్తి వేంకటసూర్యనారాయణ
                                  ఐదవ కథ
126. తే .గీ ||   సూతుడటు కథ ముగియించ, భూతలాన
                   పూతమై యెసగు ప్రసాదమును త్యజించి
                   కష్టములపాల యినవారు కలరె యింక?
                   అని  మునులడుగన్ సూతమహర్షి  పలికె

127. కం|| మిక్కిలి ఫలితము నిచ్చెడు
             చక్కని కథనొకటి మీదు సందేహముపోన్
            గ్రక్కున దెలిపెడ మీరలు
           మక్కువతో వినుడటంచు మాన్యుడు బలికెన్

128. కం|| తుoగధ్వజుడనియెడు నృప
              పుoగవుడొకనాడరణ్యమున వేటకును
              ప్పొంగుచుజనె వలసిన సే
              నంగొని యనువైన సాధనంబుల తోడన్

129. సీ|| వివిధమృగంబుల వేటాడి వేసరి ,
                      మెండుగా కాసెడు నెండ నలసి
           శ్రమదీరుటకు (దాన సైన్యాల వీడ్కొని

                   విపులవృక్షఛ్చాయవిశ్రమించి
          కొలదిదూరంబున గొల్లలందరు గూడి
                  సత్యవ్రతంబును సలుపుచుండ
        కనుగొనియున్ దన ఘనత తరుగునంచు 
              గర్వముతో రాజు కదలకున్న
తే.గీ || తత్ప్రభుని ముందట ప్రసాదమతి గౌర
         వముగ నా పేదలుoచి దేవ! గయికొనరె
        యంచు ప్రార్థించి చన , వారి నతినికృష్ట
         జాతి వారంచు గర్హించె జనవిభుoడు

1౩1. ఆ. వె||  హీనకులజులిచ్చె నిది యని ద్వేషించి
                తూలనాడి దాని త్రోసి వైచె
               తీవ్రకోపమునను దిగ్గున తా లేచి
               తురగ మెక్కివేగ పురము చేరె

1౩2. తే. గీ ||   కోటగుమ్మంబు వద్దను కూలబడిన
                  సేవకుల గాంచి మదిలోన చింత (జెంది
                  సత్వరంబుగ లోనికి జని  యతండు
                  యన్నిమూలల త్వరితుడై యరసి నంత

133.  కం||  ఎచ్చటి వారచ్చటనే
               చచ్చిన గతినుండ నృపతిచంద్రుని మదియున్
               నొచ్చెను, దు:ఖము మ్రింగుచు
               హెచ్చుగ యోచిoపసాగె హేతువు కొఱకై

1౩౩. తే.గీ|| గతము గూర్చియ తా కలగన్నయట్లు
               మనము నందు నిలిచె  తన యనుచితములు      
               చేష్టలు , యహంకృతియు నంత చిoతపడుచు
               తల్లడిలి  వేగమే  పోయి గొల్లలదరి
               జరిగినట్టి విధంమును నెరుక పరుప
    
        135.కం || గొల్లలు పలికిన సూక్తుల
                      నెల్లను విని దాన సత్యమెరిగి నృపాలుం
                      డుల్లము రంజిల తానును
                      చల్లగ జరిపించె నచట సత్యవ్రతమున్

1౩6.కం || ఏతద్వ్రతమహిమన్ భూ
             నేత సకల భాగ్యభోగనిచయముగని సం
             ప్రీతి నిహమందు పరమం
            దాతతసౌఖ్యంబునందె హరికృపవలనన్       

1౩7.  కం || దీనికి మిoచిన వ్రతమును
               కానము వేరొక్కటెపుడు కలియుగమందున్
               నానారూపధరుండై
               మానవులను బ్రోచు నెపుడు మాధవునుచున్  

1౩8.  తే.గీ || స్వామి సత్యనారాయణ వ్రతవిధి కథ
                సర్వమును సూతుడు శ్రవణపర్వముగను
               శౌనకాదులకు దెలిపి స్వస్తి జెప్ప
              శాంతి శుభమoచు మునులును సంతసిలిరి
ఫలశ్రుతి
              1౩9.కం ||  ఈ కథ వినినన్ , చదివిన
                            ప్రాకటముగ వ్రతము సలుపు ఫలమొనగూడున్
 శ్రీకాంతాప్రియుడాదృతి
            వైకుoఠప్రాప్తి భక్తవరులకొసoగున్

సర్వము సoపూర్ణము
శ్రీ సత్యదేవార్పణమస్తు
మంగళం మహత్
శుభం భూయాత్
ఓo
శాంతి: శాంతి: శాంతి:

*****

No comments: