Tuesday, February 25, 2014

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము- చిలకమర్తి వేంకటసూర్యనారాయణ - మొదటి కథ

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము
(పద్యకథనము )
చిలకమర్తి వేంకటసూర్యనారాయణ
మొదటి కథ
10. కం || శ్రీననిశము నురమందున (
     దా నిలుపుచు భవ్యశేషతల్పము నందున్
     మానుగ శయనించెడు నా
     దీనావనుడైన హరి నుతించెద భక్తిన్
11.           సీ || శ్రీరమణీయమై చెలువొందు  తరులతల్
            రాజిల్లు చున్నట్టి రమ్యభూమి.
        బహుమాధురీభరఫలములొసంగుచు
               ప్రాణికోటిని( గాచు భాగ్యభూమి
       చిత్రవర్ణంబుల(జెన్నొందు క్రొవ్విరుల్
             వెలయుచునున్నట్టి వేదభూమి
      యజ్ఞయాగాది కార్యములొనర్చి నిరతి
           ధర్మంబు తప్పని కర్మభూమి
ఆ . వె || యై మహత్త్వమొలయు నైమిశారణ్యాన
           శౌనకాదులలరు సభకు నంత
          సూతమునివరుండు సురుచిరగతి రాగ
          నర్ఘ్యపాద్యవిధుల నాచరించి
12.           కం ||  మునిగణశౌనకముఖ్యులు
               వినయంబున సూతు గాంచి వినిపింపవె యో
               మునిచంద్ర! కలియుగంబున
              జనులకు మోక్షంబొసంగు సద్వ్రతమనగన్  
13.           ఆ || వె|| శౌనకాదు లార! శ్రద్ధగ వినుడిప్డు
                 నాదు నుడువులెల్ల మోదమలర
                 మున్ను నారదునకు  వెన్నుండు చెప్పిన  
                 దివ్యమైన వ్రతము తెలియ( జేతు
14 .సీ||  సురముని యొకనాటి శుభముహూర్తంబున
                      భూలోకమును జేరె కాలమహిమ
                హరినామకీర్తన లాలపించుచు  హాయి c 
                       పదునాల్గు భువనముల్ పయనమయ్యె
               పాపకర్మలుచేసి పలుబాధలొందెడు
                         నరజాతిగని కనికరమెసంగ  
                వీరలు తరియించు విధమేదటంచును
                        తలచి విష్ణువె దిక్కు  దానికనుచు
  తే.గీ ||      వేగ వైకుంఠపురమున కేగి యచట
                ద్వారమందున వేచిన తరుణమందు
               గారవము( జూపి శ్రీహరి కదలివచ్చి
              ఘనకృపాదృష్టి  నారదు( గాంచనంత

15.      ఆ||వె||  శుక్లవస్త్రంబులశోభిల్లు గాత్రుని
                  శంఖ చక్ర పద్మ శార్న్గ గదల
నాల్గుకరములలరునారాయణునిగాంఛి                                                                      నతులొనర్చి పలికె నారదుండు
16.     ఆ. వె || వాక్కు , మనసును వర్ణింప వశము  కాని
               యాదిమధ్యాంతరహిత! యనాదినిధన!
               వందనంబులు గైకొమ్ము  వారిజాక్ష!
              చిన్న విన్నపమాలించు శేష శయన !
17.     కం || ఆరీతి ప్రస్తుతింపగ
            నారాయణుడావిరించినందనుతోడన్
            నారద! నాకెఱిగింపుము  
            సారంబగు నీదుకోర్కె సరగున ననగన్
18 తే ||గీ . విష్ణుదేవుని వీక్షించి వినయమొప్ప
               ధాతృమానసపుత్రుడంతటను మురిసి
              మనసులోనున్న కోరిక మఱగులేక
               తెలియ(జేసెను దా  తేటతెల్లముగను
19.      ఆ||వె || మహి జనించినట్టి మానవులఱయగా
                  ధర్మవిధులు విడచి ధనవశులయి
                  పాపకూపమందు పడిన దుస్థితి గాంచి
                  వారినుద్ధరింప వచ్చినాడ

20.     తే . గీ || జనులు సంసారమందుండి జగతిలోన
                సకలభోగంబులందుచు శాశ్వతముగ
                స్వర్గవాసాన నలరెడు సత్ప్రభావ
                 మహితమౌ మార్గ మెరిగింపు మాకు ననగ
21.     కం || హరి తా విని యనె - శుభకర !
             వరమడుగగ వచ్చితీవు ప్రవిమలచరితా !
             పరహితము గోరి, మెచ్చితి,
             తరణోపాయంబు గూర్చు దాని వచింతున్
22.     ఆ|| వె|| అనవిని  ముని మిగులనానందమొందగా
                  గరుడవాహనుండు కరుణబూని
                  సకలవాంఛలొసంగు సద్వ్రతమొకదాని
                  దేవమునికి నిట్లు తెలియ (జే సె
23.      పరులలాభమొదవ  నరుదెంచు నినుగాంచి
                సంతసించితి మది సన్మునీoద్ర!
       పరమనిగూఢమై పరగెడు నొకదివ్య
               పూజావిధి వచింతు పుణ్యచరిత!
      వరభక్తి సత్యదేవవ్రతముతరచు
             సలిపెడి వారలు పొలుపు మీర
      సిరిసంపదలు గల్గి క్షేమానవర్ధిల్లి
             చివరకు నా చెంత (జేరుచుంద్రు
తే.గీ || ప్రేమతోడను దెలిపితి ఋషివరేణ్య !
       ఇంక సందేహమున్నచో నెరుగ(జెపుదు
      ననిన వినితరుణమనుచు మునివరుండు
      విష్ణుదేవుని ప్రశ్నించె వినయమొలుక

24.     సకలసిద్ధులొసంగు సత్యవ్రతoబును
సలుపుమనుచు మీరు పలికినారు
   చేయునట్టి విధులు, సిద్ధించు ఫలములు
   తెలియ జెప్ప వినెద దేవదేవ !
25.     కం || నారదు డాగతి బల్కిన
             నారాయణుడతనిదౌ మనంబెఱిగి లస
            చ్చారువచనములను మహో
            దారుండై, పలికెనిట్లు తద్దయు( బ్రీతిన్
26.     సీ || మాఘమాసంబున , మఱియు వైశాఖాన
                     కార్తీకమాసానగాని  మంచి
          పంచాంగశుద్ధిమై పరగెడు దినమందు
                    ఘనమైన సూర్యసంక్రమణమందు
         సమరంబునకునేగు సమయమందున బహు
                 క్లేశముల్ మదిలోన కెరలునపుడు
       ఘోరదారిద్ర్యాన కుందుచున్నప్పుడు
               బంధియై పెనుబాధ పడెడు వేళ
తే.గీ|| సంతతికి నంగలార్చెడు సమయమందు
         మోక్షమును గోరువారలు, ముఖ్యముగను
         కోర్కెలన్నియు సమకూడ(గోరు వారు
         సత్య వ్రతమును సలుపుట సముచితంబు

27.     సీ|| సత్య వ్రతంబున నత్యంత ప్రధాన
                   మైన ప్రసాదవిధాన మిదియె
            గోక్షీరమును, నేయి, గోధుమరవ్వయు
                  లేకున్న బియ్యపునూక కదళి
            పంచదారయు లేక మంచిబెల్లం బైన
                 నొక్కొక్కటి సపాద మొకట(జేర్చి
         యంత లేహ్యంబుగా నది వండి భక్తిమై
                స్వామికర్పణ చేసి సన్నుతించి
తే .గీ || వీనులారంగ సత్కథ వినుచు రహిని
          బంధుమిత్రులతో బాటు భజన సేయు
          నట్టి భక్తులును ప్రసాదమారగింప
          సకలశుభములు కోర్కెలు సఫలమగును

28.     సీ|| గోమయోదకముచే  కొమరొప్పగానల్కి
                  యుంచి మ్రుగ్గులనైదు, పంచె పరచి
           దాని మీదను శ్వేతతండులంబులు పోసి
                  ముందుగా గణపతినందు  నిలిపి
           ఇమ్ముగాను నవగ్రహమ్ముల స్థాపించి
                   దిక్పాలకుల వారి దిశలనుంఛి
            హరిహరబ్రహ్మలనాoడ్రతో నెలకొల్పి
                  కాంతులీనెడు తామ్ర కలశముంఛి
తే .గీ || పసిడితో లేక వేరొంట ప్రతిమ (జేసి
           మధ్యభాగాన స్థాపించి , మంత్రయుక్త
           పురుషసూక్తాన భక్తితో పూజసల్పి
           పూర్తిగావింపవలె సత్యమూర్తి వ్రతము.
29.     ఆ.వె || వ్రతము సలుపునట్టి వ్యక్తులు తొలుదొల్త
              నియమమొకటి విధిగ నెరపవలయు
             ఉదయమునను లేచి ఓ సత్యనారాయ
             ణా! భవద్వ్రతంబు నాచరింతు
     ఆ. వె ||   గాన , విఘ్నములను కలుగనీయక పనుల్
           ముగియునట్లు మమ్ము బ్రోవుమయ్య!
           అనుచు నాత్మయందు నా దివ్యరూపంబు
          ముదము తోడ నిలిపి మ్రొక్క వలయు
30.     ఆ.వె|| సూర్యుడస్తమించు శుభలగ్నమందున
              త్రివిధసంధ్య లంత (దీర్చి పిదప
             శాంతచిత్తమందు సంకల్ప మొనరించి
              సలుప వలయు విధిగ సత్య పూజ.
31.     కం || నాలుగు జాతుల వారును
            బాల్య స్త్రీ వృద్ధ భేద భావము వెలిగా
            మేలిమి వైభవమొప్పగ
            తాలిమిసలుపంగవలయు తద్వ్రతమెలమిన్
32.     సీ || సద్భక్తి తోడుత సతతమీ వ్రతమును
                         ప్రతిమాస మందున రమ్య రీతి
             నింపుగా శుభమైన యేకాదశింగాని
                          దివ్యమౌ పున్నమి దివసమందు 
            శుభదాయకంబగు సుదిన మేదైనను
                          పర్వదినంబులై పరగు నాళ్ళ
              కడకునేదినమైన గాని విమలమది
                          సత్యదేవుని పూజ సలుపనగును.
ఆ. వె || విష్ణుదేవుడట్లు విశదీకరించెను
           అమరమునికి నాడటంచనఘుడు
           సూతమునియు దెలిపె శుద్ధాంతరంగులౌ
          శౌనకాదిమునులు సంతసింప
మొదటికథ సంపూర్ణం

*********

No comments: