Sunday, February 9, 2014

ముదితల్ నేర్వగలేని విద్య కలదే

   ముదితల్ నేర్వగలేని విద్య కలదే
డా|| చిలకమర్తి దుర్గాప్రసాదరావు
09897959425

స్త్రీ  ప్రకృతిస్వరూపిణి. స్త్రీ అనే ఒకే పదంలో , , అనే మూడు ధ్వనులున్నాయి. సకారం ప్రకృతిలోని  సత్త్వగుణానికి, రకారం రజోగుణానికి , తకారం తమోగుణానికి ప్రతీకలు.  ప్రకృతి పురుషులిరువురూ సమానులే. ఎవరికెవరూ తీసిపోరు. అందువల్ల ప్రకృతిస్వరూపిణియైన స్త్రీ  పురుషుని కంటే ఎందులోను తక్కువకాదు, ఏ విషయంలోను  తీసిపోదు .       
మనదేశంలో ప్రాచీనకాలం నుండి పురుషులతో పాటు స్త్రీలు కూడ అన్ని రంగాల్లోను ముందంజలో ఉన్నారనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. లౌకికవిద్యల్లోనే కాదు, అలౌకికవిద్యల్లో కూడ వారు పురుషులతో బాటు సమానంగా నిలిచారు. వేదకాలంలో  కూడ స్త్రీలు పురుషులతో బాటుగా ఉపనయనాది సంస్కారాలు పొందేవారని, వేదాది విద్యలు అభ్యసించేవారని చెప్పడానికి ఎన్నోఆధారాలు లభిస్తున్నాయి.  రోమశ, లోపాముద్ర, అపల వంటి  ఎందరో స్త్రీమూర్తులు వేదమంత్రప్రణేత్రులుగా మనకు దర్శనమిస్తారు.    గార్గి, మైత్రేయి వంటి నారీమణులు  చాల గహనమైన వేదాంతచర్చల్లోకూడ పాల్గొనేవారని ఉపనిషత్తులు వెల్లడిస్తున్నాయి.     
                            ఇక మధ్యయుగానికొస్తే  శ్రీమండనమిశ్రులవారి సతీమణి ఉభయభారతి శ్రీశంకరమండనమిశ్రులమధ్య జరిగిన వాదప్రతివాదాలకు న్యాయనిర్ణేత్రిగా వ్యవహరించడం, పక్షపాతరహితంగా శ్రీశంకరులను విజేతగా ప్రకటించడం ప్రపంచచరిత్రలోనే ఒక అపూర్వమైన సంఘటనగా పేర్కోవచ్చు.
                      ఆ తరువాత కాలంలో అలంకారశాస్త్రంలో సుప్రసిద్ధులైన రాజశేఖరుని వంటి కొంతమంది కొన్ని విషయాలను  సిద్ధాంతీకరించడంలో తమ సతీమణుల అభిప్రాయాలు స్వీకరించడానికి వెనుకాడ లేదు.
ఈ విధంగా పూర్వకాలం నుండి మహిళలు వేదాదివిద్యల్లోను, శాస్త్రాల్లోను   ఆరితేరినవారుగా కనిపిస్తున్నారు. ఇంక కవిత్వం మాటకొస్తే పురుషులకు సవాలుగా నిల్చినవారు కూడ లేకపోలేదు.  కొంతమంది కవయిత్రులు తమను తాము సాక్షాత్తు సరస్వతిగా పేర్కొనడం బట్టి వారెంత ఆత్మవిశ్వాసం గలవారో మనం  గమనించవచ్చు.
                 దండి మహాకవి తనకావ్యంలో సరస్వతిని వర్ణిస్తూ సర్వశుక్లా సరస్వతీ అన్నాడు. అంటే సరస్వతి అంతటా తెల్లగా ఉంటుందని అర్థం. విజయాంబిక అనే ఒక కవయిత్రి ఉండేది. ఆమెను విజ్జికా అని కూడ పిలుస్తారు. ఆమె నల్లగా ఉంటుంది. పాండిత్యంలో మాత్రం సరస్వతితో సమానం . ఎటొచ్చీ ఒక్కటే తేడా. సరస్వతి తెలుపు ఈమె నలుపు. పోలిక కుదరడం లేదు. అది ఆమెకు మనస్తాపం కల్గించింది. దండి అభిప్రాయాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ  ఇలా అంది:
నీలోత్పలదళశ్యామాం
 విజ్జికాం మామజానత:
వృథైవ దండినా ప్రోక్తా
 సర్వ శుక్లా సరస్వతీ   
నల్లని దేహకాంతిగల నన్ను గురించి తెలుసుకోకుండ దండి సరస్వతి తెల్లగా ఉంటుందని అనవసరంగా అన్నాడు. ఎంత విడ్డూరం. ఒక స్త్రీ ఆత్మవిశ్వాసానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి అవసరం లేదేమో.
అలాగే గంగాదేవి వంటి కవయిత్రులు సంస్కృతసాహిత్యంలో ఎంతోమంది ఉన్నారు. ఎన్నోరసవత్తరమైన కావ్యాలు వెలయించారు. 
             ఇక తెలుగుసాహిత్యం మాటకొస్తే తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల వంటి కవయిత్రులు రసవత్తరమైన కావ్యాలు వెలయించారు. ప్రతిభాపాటవాల్లో వీరందరు పురుషులకు ఏమాత్రం తీసిపోనివారే.
ఇవన్నీ ఒక ఎత్తు కాగా, వేదాంతశాస్త్రంలో నిష్ణాతులైన స్త్రీమూర్తులుండడం మరొక ఎత్తు. ఒక అరుదైన విశేషం.
స్త్రీ శూద్రద్విజబంధూనాం త్రయీ న శ్రుతిగోచరా   
స్త్రీలు, శూద్రులు, భ్రష్టులైన బ్రాహ్మణులు వేదాలు వినుటకే అనర్హులు అనే కఠోరమైన శాసనాన్ని కూడ లెక్కచేయక శాస్త్రరాజమైన వేదాంతంలో కూలంకషమైన పాండిత్యాన్ని సంపాదించిన విదుషీమణులు కొందరు ఉండడం  మన సంస్కృతికి అందులోను స్త్రీజాతికి ఒక గర్వ కారణం .  అట్టివారిలో కామాక్షి అనే యువతి  చాల పేరుప్రఖ్యాతులు గడించింది. ఈమె  తెలుగువారి ఆడపడుచు కావడం  మరింత గర్వకారణం.
కామాక్షి చోళదేశంలోని మయూరక్షేత్రంలో జన్మించింది .తండ్రి రామస్వామి . సోదరుడు సుబ్రహ్మణ్యాచార్యుడు. ఈమె భర్త రామలింగాచార్యులు. ఆయన ఆంగ్లవిద్యలో బి.ఏ పట్టభద్రుడు. ఆంగ్లేయుల హయాములో ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్న ఆయన 1871 లో ఆకస్మికంగా మరణించారు. అప్పటికి కామాక్షి వయస్సు కేవలం 21 సంవత్సరాలు. నాటినుండి ఆమె  పుట్టింటిలోనే ఉండి గురువు వద్ద తర్క,వేదాంత శాస్త్రాలను క్షుణ్ణంగా చదివింది. ఆ తరువాత అన్నగారి దగ్గరకు చేరింది. ఎన్నో వేదాంతగ్రంథాలు రచించింది.
             శ్రీమధుసూదనసరస్వతి రచించిన అద్వైతసిద్ధికి సారాంశరూపమైన అద్వైతదీపిక, త్ర్యంబకభట్టు రచింఛిన శ్రుతిరత్నప్రకాశం, శ్రుతిమతోద్యుతి అనే గ్రంథాలకు  శ్రుతిరత్నప్రకాశటిప్పణి, శ్రుతిమతోద్యుతిటిప్పణి మొదలగు  వ్యాఖ్యాన గ్రంథాలు రచించింది. ఇవి వాదప్రతివాదాలతో నిండి అతిగాహనమైన తాత్త్వికవిషయాలను వెల్లడిస్తాయి .
             ఇక శాస్త్రాధ్యయనం, గ్రంథరచనలతో బాటు ఆధ్యాత్మిక తత్త్వానుభూతిని సమకాలీన భక్తకోటికి పంచియిచ్చిన మహిళామణులెందరో  ఈ భారతావనిలో జన్మించారు. ముఖ్యంగా మదాలస, మీరాబాయి, సక్కుబాయి, ముక్తాబాయి, రబియా, అవదయక్కల్  వంటి ఎందరో మహిళామణులు ఆధ్యాత్మికజ్ఞానసంపన్నలై , భక్తిభావపునీతలై సమాజాన్ని పునీతం చేశారు.
              మదాలస అను వనిత  చిన్ననాటి నుండి తాత్త్వికచింతనతో ఉండేది. తన బిడ్డల్ని ఉయ్యాల్లో నిద్రపుచ్చుతూ
శుద్ధోsసి బుద్ధోsసి నిరంజనోsసి
        సంసారమాయా పరివర్జితోsసి
       అంటూ పిల్లలకు ఆత్మతత్త్వాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసి, వారందర్నీ జీవన్ముక్తులుగా తీర్చిదిద్దింది. ఆమె స్త్రీలోకానికే ఆదర్శం. అలాగే మీరాబాయి కృష్ణుని పరదైవంగా వరించి తరించింది. సక్కుబాయి పండరినాథుని భజించి ముక్తి పొందింది.
              అవదయక్కల్ అనే మహిళామణి  సాక్షాత్తు పార్వతీదేవి అవతారంగా పేరు పొందింది. ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యా: అన్నట్లు ఆమెకు గురూపదేశం పొందిన క్షణంలోనే జ్ఞానం సిద్ధించింది. ఇక గోదాదేవిగా పేరుపొందిన చూడికొత్తనాంచియార్ ఒక ఆళ్వారుకు కూతురై, ఆళ్వార్ల సరసన స్థానం సంపాదించి భగవంతుడే స్వయంగా తనను కోరివరించే స్థాయికెదిగింది.
               ఆధునికకాలంలో కూడ తరిగొండ వెంకమ్మ, మచిలీపట్నం     దొంతులమ్మ , ఆదోని తిక్కలక్ష్మమ్మ, కురుమద్దాలి పిచ్చమ్మ అవధూత , గంగాయపల్లె సూక్ష్మమూర్తెమ్మ, మాణిక్యనగరం వెంకమ్మ, పిరాట్ల రామలక్ష్మమ్మ, రేపల్లె చిన్నమ్మ,  చివటం అచ్చెమ్మ, గుట్టూరుకోన అంజనాదేవి, జిల్లెళ్ళమూడి అనసూయమ్మ, అక్కుర్తి మూటలమ్మ, పెనుమెత్స సీతమ్మయోగిని, తాడ్వాయి శబరిమాత, గుత్తికొండబిలం యోగిని పేరమ్మ, కోసలనగరం రామక్కమ్మ, ముప్పాళ్ళ సరస్వతి లక్ష్మమ్మ, అవధూత అమ్మ, తాపేశ్వరం దేవుడమ్మ, చింతలపూడి యోగినీమాత, నారాయణవరం మంగమ్మ, ఏలూరు టేహరాకమలమ్మ, గోవాడ శేషమ్మయోగిని,  శృంగవృక్షం శివబాలయోగీశ్వరి మొ ||  యోగినీమాతలు తమ ఆధ్యాత్మికచింతన, ఆచరణ, ప్రబోధాలతో భక్తకోటిని పునీతం చేశారు.
                  ప్రస్తుత కాలంలో కూడ మహిళామణులెందరో యోగినీ మాతలుగా అవతరించి తాము తరించి భక్తులను తరింపచేస్తున్నారు. ఇక లౌకికవిద్యమాటకొస్తే స్త్రీలు చాల రంగాల్లో పురుషులతో సమానంగానూ కొన్నిరంగాల్లో పురుషులకంటే ముందంజలోను ఉన్నారు. తమకు సాధ్యం కానిదేదీ లేదని సాధించి నిరూపిస్తున్నారు.  
ఇక అధ్యాపకత్వం  మాటకొస్తే  మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద’’ అని ఉపనిషత్తులు స్త్రిలకే పెద్దపీట వేశాయి.  కాబట్టి ఇటు లౌకికవిద్యలు మొదలుకొని అటు పారలౌకికవిద్య వరకు స్త్రీలు నేర్చుకోలేనిదంటూ ఏదీ లేదు. ఇక స్త్రీ విద్యావంతురాలైతే ముందుగా కుటుంబం ఆ పైన సమాజం చైతన్యవంతం ఔతుందనడంలో  ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేటి మహిళలు తమహక్కులను, హక్కులతో పాటు బాధ్యతలను కూడ గుర్తించి  తుచ్ఛమైన విషయాలపై దృష్టి సారించకుండా విద్యారంగంలోను, ఆధ్యాత్మిక రంగంలోను, అన్ని రంగాల్లోను విశేషప్రగతి సాధించి సమాజాభివృద్ధికి మరెన్నో బంగారు బాటలు వేయగలరని ఆశిద్దాం.





               

No comments: