Monday, June 26, 2017

The Yoga Sutras of Patanjali- I-2,3&4

The Yoga Sutras of Patanjali- I-2,3&4
(పతంజలి యోగసూత్రములు)

Dr. Chilakamarthi DurgaprasadaRao

I.2. योग: चित्तवृत्तिनिरोध:
         యోగ: చిత్తవృత్తినిరోధ:
ఇక యోగ అనే పదానికి ఎన్నో అర్థాలున్నాయి . ముఖ్యంగా  జీవాత్మ పరమాత్మల కలయికయే యోగమని  ( संयोगो योग इत्युक्त: जीवात्मपरमात्मनो: ) , కర్మలయందు నేర్పరితనమే యోగమని (योग: कर्मसु कौशलम् ) , ఇంతవరకు లభించనిది లభించడం యోగమని  లభించిన దాని రక్షణ  క్షేమమని (अप्राप्तप्राप्ति: योग: प्राप्तस्य रक्षणं क्षेम: అప్రాప్తప్రాప్తి: యోగ: ప్రాప్తస్య రక్షణం క్షేమ: ) యోగక్షేమం వహామ్యహం అనే గీతావాక్యం వల్ల తెలుస్తోంది. యోగమంటే సమాధి అని, సమచిత్తత అని ఇంకా ఎన్నో విధాలుగా ఎన్నో అర్థాల్లో ఈ శబ్దం కనిపిస్తోంది .     
 పతంజలి మహర్షి చిత్తవృత్తులను నిరోధించుటయే యోగం అని పేర్కొన్నాడు .. योग: चित्तवृत्तिनिरोध: ( యోగ:  చిత్తవృత్తి నిరోధ: )
योग:=  యోగ౦ అంటే  
चित्तवृत्तिनिरोध: = చిత్త వృత్తులను నిరోధించడం 
Yoga is the control of thought waves in the Mind
తా: అనగా మనస్సును తన వ్యాపారములనుండి మరలించడం.  
చిత్తవృత్తులంటే ఏ౦టో, అవి ఎన్నో, ఎలా ఉంటాయో మనం మందు ముందు తెలుసు కుందాం .
I.3. तदा द्रष्टु: स्वरूपे अवस्थानम्
      తదా ద్రష్టు:
స్వరూపేsవస్థానమ్ 
तदा తదా = అట్లు మనస్సునరికట్టినచో
द्रष्टु: ద్రష్టు:=ద్రష్ట యగుజీవునికి
स्वरूपे స్వరూపే = తన నిజస్ధితియందు
    अवस्थानम्  అవస్ధానమ్=ఉండుట జరుగును .
ఈ ప్రపంచాన్ని రెండు విధాలుగా విభజించొచ్చు . ఒకటి దృక్ అంటే
చూసేది . రెండోది దృశ్యం అంటే చూడబడేది .
తా. మనస్సును లయింప జేసినచో  జీవుడు సాక్షీభూతమైన కేవల చైతన్య స్వరూపియై యుండును. అదే  జీవుని నైజస్దితి, ప్రపంచమంతయు దృశ్య౦ . దృశ్య౦ మనస్సు నాకర్షించి,  అనేక విధాలుగా పరుగెత్తేలా చేస్తుంది . ఆ విధంగా లోబడిన మనస్సు ప్రకృతిబంధములందు చిక్కుపడి, జీవునిజననమరణకూపమగు సంసార ప్రవాహమున కూలద్రోయును. ప్రకార౦ దృశ్య౦ నుండి  దృక్కును మరలిoచిన, జీవుడు క్రమ౦గా  కైవల్య స్ధితి యనగా మోక్ష౦ పొందును . 
I 4 .वृत्तिसारुप्यमितरत्र
వృత్తిసారూప్యమితరత్ర
సూ.4.వృత్తి సారూప్య మితరత్ర.
इतरत्र ఇతరత్ర = దృక్ రూపుడైనపురుషునికి స్వరూప స్ధితి లభించక మనస్సు పలు విషయములందు విక్షిప్తమైనచో
वृत्तिसारूप्यम् వృత్తి సారుప్యమేర్పడును.
అనగా మానస్సు తన వ్యాపారములoదు స్వేచ్ఛగ సంచరించు చుండును. శబ్దమునువినుచున్నమనస్సు శబ్దము వెంబడి పరుగెత్తును  జూచుచున్న మనస్సు రూపము వెంబడి పరుగెట్టును.    మనస్సునకు ముందు సూత్రమందు ఐదు వృత్తులు.అనగా ఐదు రకములగు వ్యాపారములు జెప్పబడును. యా వ్యాపారములందు లగ్నమై మనస్సు తద్వ్యాపారసారూప్యమును పొందును. అనగా ఆయావ్యాపారములందు మగ్నమైపోవును. 
(To be continued)







Friday, June 23, 2017

అర్థం – విపరీతార్థం

అర్థం విపరీతార్థం
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

కవి: కరోతి కావ్యాని రసం జానాతి పండిత:
    కన్యా సురతసౌఖ్యం తు జామాతా వేత్తి నో పితా

అన్నారు పెద్దలు . కవి కావ్యాలు రచిస్తాడు.   పండితుడైనవాడు  కావ్యం యొక్క రసాన్ని ఆస్వాదిస్తాడు . తండ్రి కుమార్తెను కంటాడు . కాని ఆమెను అల్లుడే అనుభవిస్తాడు  గాని తండ్రి కాదు కదా .
ఈ శ్లోకంలోని స్వారస్యమే౦టంటే ఒక్కొక్కప్పుడు రచయిత ఊహి౦చని లేదా రచయితకు తోచని భావాలు కూడ పాఠకునకు తోస్తాయి అని . అది సమంజసమే కాని నేటి కాలంలో పాఠకులు కొంతమంది ఏవేవో అర్థాలు చెప్పుకు పోతున్నారు . అవి మూలకర్తకు  తెలిస్తే ఇదేంట్రా బాబు నాకీ ఉద్దేశమే లేదు  అతనికెలా తట్టిందో అని తలపట్టుక్కూర్చునే పరిస్థితి నేడు కనిపిస్తోంది.  ముఖ్యంగా ఆధ్యాత్మిక ఉపన్యాసాలిచ్చేవారు ఈ విధంగా లేనిపోని అర్థాలు తీస్తూ ఉహాగానాలు చేయడం  మనం గమనిస్తాం . ఉదాహరణకు ఈ పద్యం చూడండి .
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలు ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ వినురవేమ
ఇది వేమన గారి పద్యం . భారతదేశంలో ఇద్దరు కవులున్నారు ఒకరు వాల్మీకి రెండవ వారు వేమన . వారి కవిత ఎంత సులభంగా ఉంటుందో అంత గంభీరంగా కూడ ఉంటు౦ది.  అది కాదనలేని సత్యం .  కాని ఐందానికి కానిదానికి ఎన్నో విపరీతార్థాలు తీసి చూపించడం మాత్రం సమంజసం అనిపించుకోదు . వ్యాఖ్యానం మూలచ్ఛేదీ తవ పాండిత్య విశేష: అనే విధంగా ఉండకూడదు .   వేమనగారి పద్య౦లోని  భావం అంతా చాల స్పష్టంగా తెలుస్తోంది . పాదానికి చెప్పుకీ మధ్యలో  ఇరుక్కున్న రాయి , చెవిలో దూరిన జోరీగ , కంటిలో పడ్డ నలుసు , కాల్లో గ్రుచ్చుకున్న ముల్లు, ఇంట్లో ఉండే పోరు భరింపరానివని అర్థం . ఈ పద్యాన్ని ఒకాయన వేదాంత పరంగా ఎలా అన్వయిస్తున్నాడో చూడండి  .  ఇదొక గురుశిష్యసంభాషణ .
గురువు : చెప్పు లోని రాయి చెవిలోని జోరీగ (జోరు +ఈగ) .
నీలోన దాగిన ఆత్మ గురించి చెప్పు . రాయిని సంస్కృత౦లో స్థాణువు అంటారు . ఆ పదానికి ఆత్మ అనే అర్థం కూడ ఉంది . సంస్కృత౦లో ఒక్కొక్క శబ్దం చాల  అర్థాలు కలిగి ఉంటుంది . అలాగే ఒకే అర్థాన్ని చెప్పడానికి చాల  శబ్దాలు౦టాయి . ఈగు అంటే నశి౦చు అని అర్థం. చెవి ఇ౦ద్రియానికి ప్రతిక . ఇంద్రియఉన్మాదం నశి౦చే లాగ అనే అర్థంలో ఇంద్రియముల ఉన్మాదం నశించే విధంగా నీ ఆత్మ స్వరూపాన్ని చూసి చెప్పమని  గురువు బోధ .    
ఇక రెండవపాదం: కంటి లోని నలుసు, కాలు ముల్లు  
గురువు ఆ విధంగా చెప్పగానే శిష్యునికి జ్ఞానోదయమై౦ది. వెంటనే అందుకున్నాడు . కంటి లోని నలుసు కాలు ముల్లు నేను నాలో దాగిన సూక్ష్మమైన ఆత్మను చూశాను . నలుసు అనే పదం వల్ల ఆత్మ చాల సూక్ష్మ౦ అని మనం గ్రహించాలి . ఆత్మ దర్శనమయ్యాక సంసారమనే ఈ ముల్లు కాలి పోతుంది . 
ఇక మూడో పాదం : ఇంటిలోని పోరు ఇంతింత కాదయా  ఒక్కడ ఇల్లు శరీరానికి ప్రతీక. ఈ శరీరంలో ఉండే ఇంద్రియాల పోరు ఇంతా అంతా కాదని ఆ వ్యక్తి అంటున్నాడు . ఇది వేమనకు తెలిస్తే నవ్వాలో ఏడవాలో తెలియక తలపట్టుకుని కూర్చోవడం ఖాయం. కాబట్టి సహృదయులు దేన్నైనా వ్యాఖ్యానించే టప్పుడు ఏది సమంజసం, ఏది సమంజసం కాదు  అని ఆలోచించుకోవాలి .

***

Wednesday, June 21, 2017

The Yoga Sutras of Patanjali ---Sutra - 1

The Yoga Sutras of Patanjali

(పతంజలి యోగసూత్రములు)

Dr. Chilakamarthi DurgaprasadaRao

I.1. अथ योगानुशासनम्
1.అధ యోగానుశాసనమ్


నమస్కారం . ఈ రోజు (21-6-17)ప్రపంచమంతా అంతర్జాతీయ యోగదినమహోత్సవం జరుపుకుంటో౦ది  .  మనం ఏ దేశానికైనా వెళ్ళినప్పుడు మీరు ఎక్కడనుండి వచ్చారు? అని మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే   నేను భారతదేశం నుంచి వచ్చాను  అని మనం సమాధానం చెబితే కొన్నిదేశాలవారు మనల్ని సరిగా గుర్తించలేకపోవచ్చు . కాని నేను యోగశాస్త్రానికి జన్మభూమియైన  దేశంనుండి వచ్చాను అంటే అందరు మనల్ని భారతీయులుగా  గుర్తిస్తారు . ఇదీ  ప్రపంచంలో యోగశాస్త్రానికున్న గౌరవం, గుర్తి౦పున్నూ .
ఇక మన భారతీయతత్త్వశాస్త్రం నాస్తిక, ఆస్తిక దర్శనాలు అని రెండు విధాలుగా విభజింపబడింది. వేదప్రామాణ్యాన్ని అంగికరించనివి నాస్తికదర్శనాలు,  వేదప్రామాణ్యాన్ని అంగీకరించేవి ఆస్తిక దర్శనాలు .
చార్వాక , జైనములు  ,  1. యోగాచారులు 2. మాధ్యమికులు 3. వైభాషికులు 4. సౌత్రా౦తికులు అనే నాలుగు సంప్రదాయాలు గల   బౌద్ధదర్శన౦  నాస్తికదర్శనాలు .  సాంఖ్య, యోగ , న్యాయ , వైశేషిక , పూర్వోత్తరమీమా౦సలు ఆస్తిక దర్శనాలు .
చార్వాక దర్శన౦ బృహస్పతి
జైన దర్శన౦ ఋషభదేవుని మొదలు వ ర్ధమానమహావీరుని వరకు గల 24మంది తీర్థంకరులు 
బౌద్ధదర్శన౦ - గౌతమబుద్ధుడు
సాంఖ్యదర్శన౦    కపిలుడు
యోగదర్శన౦  పతంజలి
న్యాయదర్శన౦   గౌతముడు    
వైశేషికదర్శన౦  కణాదుడు
పూర్వమీమాంసాదర్శన౦    జైమిని
ఉత్తరమీమాంసాదర్శన౦ - వ్యాసుడు 
సాధారణంగా యోగం అంటే శారీరకమైన ఆరోగ్యం  లభించడానికి మనం వేసే ఆసనాలే అన్న భావన  కొంతమందిలో ఉంది . ఆసనాలు యోగంలో ఒక భాగమే గాని ఆసనాలే యోగం కాదు . అందువల్ల ఈ యోగశాస్త్రంపట్ల ఒక అవగాహన కల్గించడానికే నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను .
మానవుడు సాధించవలసిన నాలుగు పురుషార్థాలలో మోక్షం అత్యుత్తమమైనది . ఇది మానవుడు తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారానే సిద్ధిస్తుంది .అందుకే మానవునకు ఆత్మజ్ఞానం పొందడం కన్నా ఉత్తమమైనదేది లేదని శాస్త్రాలు   ఘోషిస్తున్నాయి         "आत्मलाभात् रं विद्यते किंचित् ఆత్మలాభాత్ న పరం విద్యతే కించిత్  (There is no higher purpose of human existence than knowing one’s  own self).  ఉపనిషత్తులు  ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందాలంటే ఎన్నో  మంచి ఉపాయాలు సూచించాయి . అందులో భాగంగా కఠోపనిషత్తు కశ్చిద్ధీర: ప్రత్యగాత్మాన మైక్షత్  ఆవృత్తచక్షు: అమృతత్వమిచ్ఛన్  అని    ఆత్మజ్ఞానోపాయాన్నిసూత్రప్రాయంగా పేర్కొ౦ది. ఒక విధంగా దాని వివరణమే యోగశాస్త్రం.  యోగశాస్త్ర ప్రవర్తకుడు పతంజలి.  ఈయన మూడుశాస్త్రాలలో మూడు అద్భుతమైన గ్రంథాలను  రచించిన మహనీయుడు.
ఈయన యోగశాస్త్రం ద్వారా  మానవుల చిత్తమాలిన్యాన్ని , వ్యాకరణశాస్త్రం ద్వారా  వాక్కులలోని మాలిన్యాన్ని , చరకం అనే వైద్యగ్రంథం ద్వారా శరీరమాలిన్యాన్ని తొలగించిన మహామనిషి. ఈ విషయం
योगेन चित्तस्य पदेन वाचां  मलं शरीरस्य तु वैद्यकेन
योsपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोsस्मि 
అనే శ్లోకం వల్ల తెలుస్తోంది .
 పతంజలి రచించిన యోగసూత్రాలు  సమాధి పాదం, సాధన పాదం, విభూతి పాదం, కైవల్య పాదం  అని నాలుగు పాదాలుగా విభజింపబడ్డాయి . నాలుగుపాదాల్లోను క్రమంగా 51+55+ 55+33 = మొత్తం   194 సూత్రాలున్నాయి  .
ఆస్తికదర్శనాలలో సాంఖ్య, యోగాలు రెండు సన్నిహిత సంబంధం గలవి . ఒక విధంగా చెప్పాలంటే సాంఖ్యం theory అనుకుంటే యోగం Practice. సాంఖ్యం 25 తత్త్వాలను చెబితే యోగం ఈశ్వరుని చేర్చి 25+1= 26  తత్త్వాలను పేర్కొంది . 
ఇపుడు సూత్రంలోకి వద్దా౦
I.1.अथ-योगानुशासनम्
1.అధ యోగానుశాసనమ్
ఈ సూత్రంలో అథ యోగ అనుశాసనం అనే మూడు పదాలున్నాయి . సంస్కృతంలో అథ శబ్దానికి చాల అర్థాలున్నాయి .
1. మంగళార్థం:
ఓంకార౦ , అథ అనే శబ్దం ఈ రెండు సృష్టికి ముందే బ్రహ్మ యొక్క కంఠాన్ని ఛేదించుకుని వెలువడ్డాయి కాబట్టి అవి మంగళకరములని శ్రుతిచెబుతోంది .
               ఓంకారశ్చాథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణ: పురా
               కంఠ౦ భిత్వా వినిర్యాతౌ తస్మాన్మా౦గళికావుభౌ
అథ పరస్మై పదాని అనే ప్రయోగంలో అథ శబ్దం  మంగళార్థంలో ఉంది .
2. ఆనంతర్యార్థం
స్నాతోsథ భు౦క్తే (స్నానం చేసిన తరువాత  తినును ) అనేచోట ఆనంతర్యార్థం.
3. ఆరంభార్థం
అథ శబ్దానుశాసనం  అనేచోట ఆరంభార్థం లోను .
4. ప్రశ్నార్థం
అథ వక్తుం సమర్థోసి ( చెప్పుటకు నీవు  సమర్ధుడవా?) అనేచోట ప్రశ్నార్థంలోను
5. కృత్స్నార్థం
అథ ధాతూన్ బ్రూమ: ( ధాతువులను సంపూర్ణంగా చెప్పెదము ) అనే చోట కృత్స్నార్థంలోను ప్రయోగించబడ్డాయి.
ఇక్కడ మాత్రం ఆరంభార్థంలో   
తాత్పర్యం : అధ యను శబ్దము అధికారార్ధము. అనగా శాస్త్రము నారంభించు చున్నామను హెచ్చరిక. యోగమనగా సమాధి. అనగా పలువిషయములందు సంచరించు మనస్సును  అరికట్టుట యుజిర్ ధాతువునకు యోగే”, సమాధౌ అను రెండర్ధములున్నను, సమాధౌ అను నర్ధమిచ్చట గ్రహింపదగినది. అనుశాసనమ్ అనుట చేత యోగశాస్త్రమనాదియని, దానిని మరల  ఎత్తి చెబుతున్నామని యభిప్రాయం. (To be continued)




Tuesday, June 20, 2017

Let us know -4

Let us know -4
తెలుసుకుందాం - 4
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు

1. కతికితే అతకదు

మనలో ఎవరైనా పెండ్లిసంబంధాల నిమిత్త౦ అమ్మాయిని చూసుకోడానికి వెళ్ళినప్పుడు వారు భోజనం చెయ్యమని ఎంత బ్రతిమాలినా చెయ్యరు . కటికితే ఆతకదని చెప్పి తప్పి౦చుకుంటారు. దీనికి కారణ౦ ఏమిటా  అని ఆలోచిస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది . అదే౦టంటే  మనం వారు పెట్టిన భోజనం చేస్తే మనకు వారి పట్ల ఒక soft  corner ఏర్పడుతుంది . అది ఒక్కొక్కప్పుడు వ్యవహారానికి ఆటంకం కలుగజేయవచ్చు . ఉదాహరణకి మనం బట్టలుగాని మరేవైనా వస్తువులు గాని కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు ఆ షాపు  యజమాని మనకు tea గాని కూల్ డ్రింక్స్ గాని ఇస్తారు . మనం తీసుకో కూడదు . ఒకవేళ మనం అవి తీసుకుంటే ఆ వ్యక్తితో మనకు ఒక బంధం ఏర్పడుతుంది . బట్టలు లేదా ఏదైనా వస్తువు మనకు నచ్చినా నచ్చక పోయినా తప్పనిసరిగా కొనవలసిన అగత్యం ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్లు మనకందించిన cool drinks సీసాలు అప్పటికే డజనో అరడజనో త్రాగేసు౦టాం కాబట్టి .
అందుకని ఏదో ఒకటి కొనకుండా రాలేం . ఇక వస్తువో బట్టలో ఐతే అవి  ఎలాఉన్నా కొనుక్కోవచ్చు . కొంతకాలం వాడుకుని బయట పడెయ్యొచ్చు . కాని వధువు అటువంటిది కాదు, కాకూడదు . ఆమె జీవితాంతం మన వెంట ఉండేది ఉండవలసినదిన్నీ. అందువల్ల అటువంటి వ్యక్తిని ఎన్నుకోవడంలో ఎటువంటి మొహమాటాలకు తావుండకూడదు. మనం ఒకవేళ వాళ్ళు పెట్టినవన్నీ కాదనలేక ఆరగించి మన ఇంటికెళ్ళాకా అమ్మాయి నచ్చలేదని చెబితే పిండి వంటలు దొబ్బితిని పిల్లనచ్చలేదన్నారు వెధవలు అని తిట్టుకోవచ్చు . అటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు  .   ఇక కొంచెం  మొహమాటపడి పిల్ల నచ్చక పోయినా ఏదోవిధంగా నచ్చిందని చేసుకుంటే జీవితం దుర్భరం . కాబట్టి వివాహవిషయంలో ఇటువంటి మొహమాటాలను సమూలంగా త్రుంచి వేయడానికే కతికితే అతకదు అనే నియమాన్ని మన ప్రాచీనులు ఏర్పరిచారు . ఆహా ! ఎంత గొప్ప వారు మన పూర్వులు .     అందువల్ల  మనమెప్పుడైనా ఏదైనా కొనడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు మనకిచ్చే తినుబండారాలు తీసుకోకూడదు . వస్తువు కొన్నాక తీసుకోవచ్చు . ఎవరికీ ఇబ్బంది లేదు .  మొత్తం మీద చెప్పేదేమిటంటే :
                ఆహారవ్యవహారేషు త్యక్తలజ్జ: సుఖీ భవేత్   

2. న మమ (నాది కాదు)
నేనొకసారి ఒక ఆశ్రమానికి వెళ్లాను . స్వామీజీ సమీపంలో  ఒక చోట కూర్చున్నాను . అక్కడ చాల మంది ఉన్నారు . ఒక ధనవంతుడు ఆ స్వామివారి దగ్గరకొచ్చి నమస్కరించి కొన్ని పండ్లు సమర్పించాడు . అక్కడే కాస్సేపు కూర్చున్నాడు .  ఇంతలో భక్తులు అబిమానులు లేచివెడుతున్నారు. ఆయన ఒక్కొక్క పండు వారి చేతిలో పెడుతున్నారు. ఈ ధనవంతుడు కూడ లేచి వెళ్ళబోతూ ఆయనకు నమస్క రించాడు. స్వామి ఆయన చేతిలో కూడ ఒక పండు పెట్టారు . ఆయన ఆ పండ౦దు కుంటూ స్వామి ! ఇదేంటి  నా పండు నాకే ఇస్తున్నారు   ? అన్నాడు .
దానికి స్వామీజీ  అది నీ పండు ఎలా అవుతుంది ? అని ప్రశ్నించారు . అదేంటి స్వామి అవి నేను తెచ్చిన పండ్లేగా  నావి కాదంటారేమిటి అన్నాడు అమాయకంగా . ఓహో  అలాగా!  అవి నువ్వు నాకు ఇవ్వనంతవరకే నీవి . నాకు  ఇచ్చి౦ తరువాత నీవి  కావు పొమ్మన్నారు. కాని  అది ఆయనకు అర్థం కాలేదు . అపుడు ఇలా అన్నారు నాయనా ! ఏ వస్తువైనా మన దగ్గరున్న౦త సేపే మనది మనం ఎవరికైనా దానం చేశాకా అది మనది కాదు. అది స్వీకరించిన వారిదే . కాని కొంతమంది కొన్ని వస్తువులు ఇతరులకు దానం చేశాకా ఆ వస్తువులు నావేనని అందరికి డప్పుకొట్టి చెప్పుకుంటూ ఉంటారు . ఇది అవివేకం .
ఈ నియమం అన్నిటికి వర్తిస్తు౦ది. అమ్మాయికి పెళ్లి చేసి ఆమెను అత్తవారింటికి పంపించాక కూడ కొంతమంది ప్రబుద్ధులు అమ్మాయిని ఆసరాగా తీసుకుని వాళ్ళకు సంబంధించిన విషయాల్లో తలదూరుస్తూ ఉంటారు వాళ్ళపై పెత్తనం , అజమాయిషి చెలాయిస్తూ ఉంటారు . ఇది చాల తప్పు . అడిగినప్పుడు వారికి మంచి సలహాలిచ్చి ముందుకు నడిపించడం తప్పులేదు గాని అన్ని విషయాలల్లోనూ తలదూర్చడం మాత్రం సమంజసం కాదు . చాల వరకు వైవాహిక సంబంధాలు చెడిపోవడానికి ఇదొక ప్రధాన కారణం . కాబట్టి మనం ఇతరులకిచ్చిన వాటిపై మమకారం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది       


Monday, June 19, 2017

తెలుసుకుందాం -3

తెలుసుకుందాం -3
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
1.  మనం ఏదైనా ఒక  మంత్రం చదివిన తరువాత చివర్లో  ఓం శాంతి: శాంతి: శాంతి: అని మూడు సార్లు అంటాం . దీనికి కారణం  మనం మూడు రకాలైన దు:ఖాలను౦డి విముక్తి పొందడానికే అని తెలుసుకోవాలి . దుఖం మూడు విధాలు. ఆధిభౌతికం, ఆధిదైవికం , ఆధ్యాత్మికం . మనుష్యులవల్ల , మృగాలవల్ల మనకు కలిగే దుఖం ఆధిభౌతికం. యక్షుల వల్ల, రాక్షసుల వల్ల, గ్రహాల వల్ల కలిగే దు:ఖం ఆధిదైవికం . ఆధ్యాత్మికం మరల శారీరం , మానసం అని రెండు విధాలు . మన శరీరంలో శ్లేష్మం, వాత౦, పిత్తం అని మూడు పదార్థాలు  ఉంటాయి . ఇవి ఉండవలసిన పాళ్ళల్లో కాక భిన్నంగా ఉంటేనే రోగాలు వస్తాయి . అప్పుడు కలిగే బాధ శారీరం. ఇక కామం,  క్రోధం, లోభం , మోహం, మదం, మాత్సర్యం అనే ఆరిటి వల్ల కలిగే దు:ఖం మానసం . కాబట్టి ఈ మూడు విధములైన దు:ఖాలు తొలగడానికే మూడు సార్లు శాంతి:   శాంతి: అంటాం . 
*
2. మన ఇండ్లలో శుభకార్యాలకు , అశుభకార్యాలకు బీజాలు నాటి మొక్కలు పెంచే అలవాటు మన సాంప్రదాయంలో ఉంది . ఉదాహరణకు ఎవరింట్లోనైన ఉపనయనం , వివాహం మొ|| కార్యాలు జరిగితే కొన్ని గింజలు మొలకెత్తేవరకు పెంచడం , అలాగే ఎవరైనా మరణించినప్పుడు ధారాపాత్రపేరుతో కొన్ని ధాన్యం గింజల్ని మూకుళ్ళలో వేసి నీరు పోసి మొలకెత్తేలా చేయడం మనం గమనిస్తాం .     దీనికి గల కారణం ఆలోచిస్తే ఒకటి తెలుస్తుంది . మన వైదికసంస్కృతి ఒక్క చెట్టు కూడ నాశనం కావడానికి ఒప్పుకోదు.  కాకూడదని శాసించింది  . కాని వివాహాదిశుభకార్యాల్లో అగ్నిహోత్రం ఏర్పాటు చేసినప్పుడు, అలాగే ఎవరైనా మరణించినప్పుడు వారిని దహనం చెయ్యవలసినప్పుడు కొన్ని మొక్కలు నశించడం అనివార్యం . కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చెయ్యడానికే మొక్కలు పెంచమని ఆదేశించింది మన వైదికసంస్కృతి. విషవృక్షమైనప్పటికి నాటినవాడు దాన్ని స్వయంగా నరకరాదని హితబోధ చేస్తాడు కాళిదాసు . ఆహా ! ఎంత గొప్పది మన సంస్కృతి.
ఇక నేను ప్రతిరోజూ కనీసం ఐదుగురికి సరిపోయే ప్రాణవాయువును (OXYGEN) అందిస్తున్నాను. నా రక్షణ గురించి మీరు ఆలోచించరా? ( EVERYDAY I SUPPLY OXYGEN FOR UPTO FOUR PEOPLE . DONT YOU THINK I AM WORTH SAVING?) అంటుంది మొక్క. కాబట్టి ప్రతి చెట్టు ప్రగతికి మెట్టుగా భావించి రక్షించండి . ఒకవేళ ఏదైనా కారణం చేత ఒక మొక్క నశిస్తే ఆ నష్టాన్ని భర్తీ చెయ్యడానికి మరికొన్ని మొక్కలు నాటండి .
**
 
3. మనిషికి జరిపించే పదహారు సంస్కారాల్లో వివాహం ఒకటి ఇది చాల ప్రధానమై౦ది. ఈ వివాహంలో ఎన్నో అంశాలుంటాయి . పెళ్లి కూతురికి  కాళ్ళ గోళ్ళు తీయిస్తారు.
వేదిక వద్దకు బుట్టలో కూర్చోపెట్టి తీసుకొస్తారు . మంగళసూత్రం కట్టిస్తారు . తలంబ్రాలు పోయిస్తారు . ఊరేగింపు జరిపిస్తారు . ఇంకా ఎన్నెన్నో కార్యకలాపాలు ఉంటాయి . ఇవన్ని ఎందుకంటే మన ప్రాచీనమహర్షులు సమస్త మానవాళి సౌఖ్యాన్ని కోరినవారు కావడం చేత సంఘంలో ఒక శుభకార్యం జరిగితే ఆ సమాజంలో ఉన్న చేతి వృత్తులవారికి, మూతి వృత్తులవారికి కూడ ప్రయోజనం కలగాలి . అందువల్లనే పెళ్లి సందర్భంలో కాళ్ళగోళ్ళు తీయించడం అనే నెపంతో ఒక వర్గానికి చెందిన వ్యక్తిని సగౌరవంగా ఆహ్వానించి సన్మానించి సత్కరిస్తాం . మనం మన కాళ్ళ గోళ్ళను మనమే తీసుకోవచ్చు.  పెండ్లికూతురికి ఒక బ్లేడు ఇస్తే తనే తీసుకుంటుంది, వేరొకరితో తీయించవలసిన పనిలేదు . కాని ఆ పని ఆ ప్రత్యేక వ్యక్తి ద్వారా జరిపించడం వల్ల అతనికి ప్రత్యేక గౌరవం, ఆదరణ, పోషణ లభిస్తున్నాయి . అలాగే పెండ్లి కూతుర్ని నడిపించుకుని కాకుండా బుట్టలో కూర్చోపెట్టి తేవడం వల్ల బుట్టలు తయారు చేసే మేదరికి లాభం చేకూరుతుంది  . అలాగే సమాజంలో ఇంకా ఎన్నో వివిధ వృత్తులు ఆ వృత్తులు నిర్వహించే కులాలు ఉన్నాయి . వాళ్ళందరిని గుర్తించి వారి సేవలను ఉపయోగించుకుంటే తప్ప మొత్తం సంఘానికి ప్రయోజనం చేకూరదు . ఈ విధంగా ఆలోచిస్తే వివాహ౦లో ప్రయోజనం పొందని వృత్తి గాని; కులం గాని మనకు కనిపించవు . కాని నేడు జరుగుతున్నదే౦టి? అవన్నీ కనుమరుగై పోతున్నాయి . కాళ్లగోళ్లు మొదలుకొని కల్యాణమంటపం దాకా అన్నిటికి కాంట్రాక్టర్లే  ఉ౦టున్నారు .  ఈ సంప్రదాయం అశుభకార్యాలకు కూడ వర్తిస్తుంది . ఆ కార్యకలాపాలలో కూడ ఒకప్పుడు సమాజంలోని అన్ని వర్గాలు లాభం పొందేవి. ఇప్పుడలా జరగడం లేదు . కాళ్ళకు ముడేసే  దారం దగ్గర నుంచి కాటికాపరి రుసుము దాక  అన్ని కాంట్రాక్టే.   కాంట్రాక్టర్లే రాజ్యమేలుతున్నారు . ఉన్నవాడు లేనివాడు కూడా ఉన్నవాడికే సర్వస్వం సమర్పి౦చుకుంటున్నాడు . నాటి ఆ వ్యవస్థ బాగుందో నేటి ఈ వ్యవస్థ బాగుందో మనమే నిర్ణయించుకోవాలి.

***

Monday, June 5, 2017

సంభాషణ సంస్కృతం -6

సంభాషణ సంస్కృతం -6
Lesson—6

Dr. Durga Prasada Rao Chilakamarthi
Lesson—6/1
कति? (కతి?) (ఎన్ని? ) = How many?
ఇంతవరకు మనం అంకెలు , సంఖ్యావాచకాలు నేర్చుకున్నాం . ఇప్పుడు ఎవరైనా సంఖ్యా వాచకాలకు సంబంధించిన ప్రశ్నలడిగితే సమాధానం ఎలా చెప్పాలో నేర్చుకుందాం . 

n     Question: शिवस्य नेत्राणि कति सन्ति? శివస్య నేత్రాణి కతి ? (శివునకు  ఎన్ని కన్నులు ?
n     Answer:   शिवस्य नेत्राणि त्रीणि सन्ति (శివస్య నేత్రాణి త్రీణి ) శివునకు మూడు కన్నులు .
n     Question: पाण्डवा: कति सन्ति? (పాండవా: కతి సంతి ?) పాండవులు ఎంత మంది ?
n     Answer:   पाण्डवा: पञ्च   सन्ति (పాండవా: పంచ సంతి ? ) పాండవులు ఐదుగురు
n     Question: कौरवसोदरा: कति सन्ति? ( కౌరవసోదరా: కతి సంతి ?) కౌరవసోదరులు ఎందరు ?
n     Answer:   कौरवसोदरा: शतम् सन्ति = (కౌరవా: శతం సంతి )
n     Question: रावणस्य मुखानि कति सन्ति? ( రావణస్య ముఖాని కతి సంతి?) రావణునికి ముఖము లెన్ని ?
n     Answer:   रावणस्य दश मुखानि सन्ति (రావణస్య దశముఖాని సంతి) (రావణునకు పది ముఖములు )
n     Question: रावणस्य कति हस्ता:सन्ति?(రావణస్య కతి హస్తా: సంతి ?) రావణునకు ఎన్ని చేతులు ?
n     Answer:   रावणस्य विंशति हस्ता: सन्ति ( రావణస్య వింశతి హస్తా: సంతి ) రావణునకు ఇరువది చేతులు


Lesson—6/2
सप्तमीविभक्ति: = Locative case
It speaks of the location of a particular thing.
ఒక వస్తువు ఎక్కడ ఉందని ఎవరైనా ప్రశ్నిస్తే ఫలానా చోట ఉందని ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసు కుందాం . సప్తమీ విభక్తి ఆ విషయాన్ని సూచిస్తుంది . సప్తమీ విభక్తి ఒక వస్తువు యొక్క స్థానము(లొకేషన్)ను చెబుతుంది  అందుకే దిన్ని LOCATIVE CASE అంటారు.

Masculine Gender

NOMINATIVE CASE:                  LOCATIVE CASE
प्रथमाविभक्ति:                                     सप्तमीविभक्ति:
                      आसन्द:                            आसन्दे  ( in a chair)
Example:-- अध्यापक: आसन्दे  उपविशति (అధ్యాపక: ఆసందే ఉపవిశతి) = అధ్యాపకుడు కుర్చీలో కూ ర్చొనెను  The teacher is sitting in a chair.
                       हस्त:                             हस्ते (in  hand
Example:--पुस्तकं मम हस्ते अस्ति (పుస్తకం మమ హస్తే అస్తి) =పుస్తకం నా చేతిలో ఉన్నది     A book is in my hand.
                                         आकाश: (sky)                आकाशे (in the sky)
Example:- सूर्य: आकाशे अस्ति సూర్య: ఆకాశే అస్తి (సూర్యుడు ఆకాశములో ఉన్నాడు )= The Sun is in the sky.
घट: (pot)                         घटे (in a pot)
 Example:-- जलं घटे अस्ति ఘటే జలం ఆస్తి =కుండలో నీరు ఉన్నది  ( The water is in the pot)

Feminine Gender

n     NOMINATIVE CASE:                           LOCATIVE CASE;
                            शाखा ( branch)              शाखायाम्  ( in a  branch)
Example:-- वृक्षस्य शाखायां पक्षी अस्ति వృక్షస్య శాఖాయాం పక్షీ ఆస్తి ( A bird is in the branch of a tree)
                         नौका (ship)                       नौकायाम् ( in a  ship)
Example:--नाविक: नौकायाम् अस्ति (నావిక: నౌకాయాం ఆస్తి ) నావికుడు నౌకలో ఉన్నాడు ) (A sailor is in the ship)
            गङ्गा (river Ganges)  गङ्गायाम् (In the Ganges)
Example: गङ्गायां स्वच्छता अस्ति (గంగాయాం స్వచ్ఛతా అస్తి) గంగలో పవిత్రత ఉన్నది . (There is purity in the river Ganges)  
                       नदी (river)                      नद्याम् ( in a river)
Example:--नद्यां मकर: अस्ति నద్యాం మకర: ఆస్తి (నదిలో మొసలి ఉన్నది) (A crocodile is in the river)
सप्तमीविभक्ति: = Locative case
Neuter Gender
NOMINATIVE CASE: --- LOCATIVE CASE:
                                               जलम्             जले  (in water)
Example:-  जले मीन: अस्ति జలే మీన: అస్తి  ( A fish is in the water)
                                               पुष्पम्           पुष्पे  ( in flower)
     Example:-   सगन्ध: पुष्पे अस्ति (పుష్పే సుగంధ: అస్తి) పువ్వులో సౌరభం ఉన్నది ( Fragrance is in flower)
                                           विमानम्  -- विमाने (in a plane)
Example:-  सैनिक: विमाने उपविशति సైనిక: విమానే ఉపవిశతి =సైనికుడు విమానములో కూర్చున్నాడు (A soldier is sitting in a plane)
पात्रम्              पात्रे (in a vessel)
Example :-  पात्रे शर्करा अस्ति = Sugar is in the vessel
Answer the following in Sanskrit
1.     भवत: / भवत्या: गृहे कति दण्डदीपा: (tube lights) सन्ति?
    మీ ఇంటిలో ఎన్ని tube lights ఉన్నాయి ?
2.     भवत्या:/ भवत: कलाशालायां कति अध्यापका: (teachers) सन्ति?
మీ కళాశాలలో ఎంత మంది అధ్యాపకులున్నారు ?
3.     मम हस्ते कति अङ्गुल्य:( fingers) सन्ति? 
    నా చేతి(లో) కి ఎన్ని వ్రేళ్ళు ఉన్నాయి ?
4.     अस्माकं देशे कति नद्य: (rivers) सन्ति?
   మన దేశంలో ఎన్ని నదులున్నాయి ?
5.     क्रिकेट क्रीडायां पक्षे (in one group) कति क्रीडाकारा: सन्ति?
6.     క్రికెట్టు ఆటలో ఒక టీము(కు)లో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు ?    
Lesson—6/3
कदा (kadaa)=when
n     भवान् कदा दन्तधावनं करोति? = When do you brush your teeth?
    (Bhavaan kadaa dantadhaavanaM karoti) ?
n      भवती कदा पाठशालां गच्छति? =  When do you go to school?
     ( Bhavatee kadaa paaThashaalaaM gachchati ?)
n      स: कदा परीक्षां लिखति ? When does he write the examination?
      (saha kadaa  pareekShaaM likhati ?)
n     बालक: कदा उत्तिष्ठति = When does the boy get up?
      (baalakah kadaa uttishThati?)
Lesson--6/4

Names of the days in a week

n     प्रपरह्य: (ప్రపరహ్య:)అటుమొన్న= The day before the day before yesterday
n     परह्य: (పరహ్య:) మొన్న Day before yesterday
n     ह्य:(హ్య: ) నిన్న  Yesterday

n     अद्य  (అద్య) ఈరోజు Today