Friday, June 23, 2017

అర్థం – విపరీతార్థం

అర్థం విపరీతార్థం
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

కవి: కరోతి కావ్యాని రసం జానాతి పండిత:
    కన్యా సురతసౌఖ్యం తు జామాతా వేత్తి నో పితా

అన్నారు పెద్దలు . కవి కావ్యాలు రచిస్తాడు.   పండితుడైనవాడు  కావ్యం యొక్క రసాన్ని ఆస్వాదిస్తాడు . తండ్రి కుమార్తెను కంటాడు . కాని ఆమెను అల్లుడే అనుభవిస్తాడు  గాని తండ్రి కాదు కదా .
ఈ శ్లోకంలోని స్వారస్యమే౦టంటే ఒక్కొక్కప్పుడు రచయిత ఊహి౦చని లేదా రచయితకు తోచని భావాలు కూడ పాఠకునకు తోస్తాయి అని . అది సమంజసమే కాని నేటి కాలంలో పాఠకులు కొంతమంది ఏవేవో అర్థాలు చెప్పుకు పోతున్నారు . అవి మూలకర్తకు  తెలిస్తే ఇదేంట్రా బాబు నాకీ ఉద్దేశమే లేదు  అతనికెలా తట్టిందో అని తలపట్టుక్కూర్చునే పరిస్థితి నేడు కనిపిస్తోంది.  ముఖ్యంగా ఆధ్యాత్మిక ఉపన్యాసాలిచ్చేవారు ఈ విధంగా లేనిపోని అర్థాలు తీస్తూ ఉహాగానాలు చేయడం  మనం గమనిస్తాం . ఉదాహరణకు ఈ పద్యం చూడండి .
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలు ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ వినురవేమ
ఇది వేమన గారి పద్యం . భారతదేశంలో ఇద్దరు కవులున్నారు ఒకరు వాల్మీకి రెండవ వారు వేమన . వారి కవిత ఎంత సులభంగా ఉంటుందో అంత గంభీరంగా కూడ ఉంటు౦ది.  అది కాదనలేని సత్యం .  కాని ఐందానికి కానిదానికి ఎన్నో విపరీతార్థాలు తీసి చూపించడం మాత్రం సమంజసం అనిపించుకోదు . వ్యాఖ్యానం మూలచ్ఛేదీ తవ పాండిత్య విశేష: అనే విధంగా ఉండకూడదు .   వేమనగారి పద్య౦లోని  భావం అంతా చాల స్పష్టంగా తెలుస్తోంది . పాదానికి చెప్పుకీ మధ్యలో  ఇరుక్కున్న రాయి , చెవిలో దూరిన జోరీగ , కంటిలో పడ్డ నలుసు , కాల్లో గ్రుచ్చుకున్న ముల్లు, ఇంట్లో ఉండే పోరు భరింపరానివని అర్థం . ఈ పద్యాన్ని ఒకాయన వేదాంత పరంగా ఎలా అన్వయిస్తున్నాడో చూడండి  .  ఇదొక గురుశిష్యసంభాషణ .
గురువు : చెప్పు లోని రాయి చెవిలోని జోరీగ (జోరు +ఈగ) .
నీలోన దాగిన ఆత్మ గురించి చెప్పు . రాయిని సంస్కృత౦లో స్థాణువు అంటారు . ఆ పదానికి ఆత్మ అనే అర్థం కూడ ఉంది . సంస్కృత౦లో ఒక్కొక్క శబ్దం చాల  అర్థాలు కలిగి ఉంటుంది . అలాగే ఒకే అర్థాన్ని చెప్పడానికి చాల  శబ్దాలు౦టాయి . ఈగు అంటే నశి౦చు అని అర్థం. చెవి ఇ౦ద్రియానికి ప్రతిక . ఇంద్రియఉన్మాదం నశి౦చే లాగ అనే అర్థంలో ఇంద్రియముల ఉన్మాదం నశించే విధంగా నీ ఆత్మ స్వరూపాన్ని చూసి చెప్పమని  గురువు బోధ .    
ఇక రెండవపాదం: కంటి లోని నలుసు, కాలు ముల్లు  
గురువు ఆ విధంగా చెప్పగానే శిష్యునికి జ్ఞానోదయమై౦ది. వెంటనే అందుకున్నాడు . కంటి లోని నలుసు కాలు ముల్లు నేను నాలో దాగిన సూక్ష్మమైన ఆత్మను చూశాను . నలుసు అనే పదం వల్ల ఆత్మ చాల సూక్ష్మ౦ అని మనం గ్రహించాలి . ఆత్మ దర్శనమయ్యాక సంసారమనే ఈ ముల్లు కాలి పోతుంది . 
ఇక మూడో పాదం : ఇంటిలోని పోరు ఇంతింత కాదయా  ఒక్కడ ఇల్లు శరీరానికి ప్రతీక. ఈ శరీరంలో ఉండే ఇంద్రియాల పోరు ఇంతా అంతా కాదని ఆ వ్యక్తి అంటున్నాడు . ఇది వేమనకు తెలిస్తే నవ్వాలో ఏడవాలో తెలియక తలపట్టుకుని కూర్చోవడం ఖాయం. కాబట్టి సహృదయులు దేన్నైనా వ్యాఖ్యానించే టప్పుడు ఏది సమంజసం, ఏది సమంజసం కాదు  అని ఆలోచించుకోవాలి .

***

No comments: