Wednesday, June 21, 2017

The Yoga Sutras of Patanjali ---Sutra - 1

The Yoga Sutras of Patanjali

(పతంజలి యోగసూత్రములు)

Dr. Chilakamarthi DurgaprasadaRao

I.1. अथ योगानुशासनम्
1.అధ యోగానుశాసనమ్


నమస్కారం . ఈ రోజు (21-6-17)ప్రపంచమంతా అంతర్జాతీయ యోగదినమహోత్సవం జరుపుకుంటో౦ది  .  మనం ఏ దేశానికైనా వెళ్ళినప్పుడు మీరు ఎక్కడనుండి వచ్చారు? అని మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే   నేను భారతదేశం నుంచి వచ్చాను  అని మనం సమాధానం చెబితే కొన్నిదేశాలవారు మనల్ని సరిగా గుర్తించలేకపోవచ్చు . కాని నేను యోగశాస్త్రానికి జన్మభూమియైన  దేశంనుండి వచ్చాను అంటే అందరు మనల్ని భారతీయులుగా  గుర్తిస్తారు . ఇదీ  ప్రపంచంలో యోగశాస్త్రానికున్న గౌరవం, గుర్తి౦పున్నూ .
ఇక మన భారతీయతత్త్వశాస్త్రం నాస్తిక, ఆస్తిక దర్శనాలు అని రెండు విధాలుగా విభజింపబడింది. వేదప్రామాణ్యాన్ని అంగికరించనివి నాస్తికదర్శనాలు,  వేదప్రామాణ్యాన్ని అంగీకరించేవి ఆస్తిక దర్శనాలు .
చార్వాక , జైనములు  ,  1. యోగాచారులు 2. మాధ్యమికులు 3. వైభాషికులు 4. సౌత్రా౦తికులు అనే నాలుగు సంప్రదాయాలు గల   బౌద్ధదర్శన౦  నాస్తికదర్శనాలు .  సాంఖ్య, యోగ , న్యాయ , వైశేషిక , పూర్వోత్తరమీమా౦సలు ఆస్తిక దర్శనాలు .
చార్వాక దర్శన౦ బృహస్పతి
జైన దర్శన౦ ఋషభదేవుని మొదలు వ ర్ధమానమహావీరుని వరకు గల 24మంది తీర్థంకరులు 
బౌద్ధదర్శన౦ - గౌతమబుద్ధుడు
సాంఖ్యదర్శన౦    కపిలుడు
యోగదర్శన౦  పతంజలి
న్యాయదర్శన౦   గౌతముడు    
వైశేషికదర్శన౦  కణాదుడు
పూర్వమీమాంసాదర్శన౦    జైమిని
ఉత్తరమీమాంసాదర్శన౦ - వ్యాసుడు 
సాధారణంగా యోగం అంటే శారీరకమైన ఆరోగ్యం  లభించడానికి మనం వేసే ఆసనాలే అన్న భావన  కొంతమందిలో ఉంది . ఆసనాలు యోగంలో ఒక భాగమే గాని ఆసనాలే యోగం కాదు . అందువల్ల ఈ యోగశాస్త్రంపట్ల ఒక అవగాహన కల్గించడానికే నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను .
మానవుడు సాధించవలసిన నాలుగు పురుషార్థాలలో మోక్షం అత్యుత్తమమైనది . ఇది మానవుడు తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారానే సిద్ధిస్తుంది .అందుకే మానవునకు ఆత్మజ్ఞానం పొందడం కన్నా ఉత్తమమైనదేది లేదని శాస్త్రాలు   ఘోషిస్తున్నాయి         "आत्मलाभात् रं विद्यते किंचित् ఆత్మలాభాత్ న పరం విద్యతే కించిత్  (There is no higher purpose of human existence than knowing one’s  own self).  ఉపనిషత్తులు  ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందాలంటే ఎన్నో  మంచి ఉపాయాలు సూచించాయి . అందులో భాగంగా కఠోపనిషత్తు కశ్చిద్ధీర: ప్రత్యగాత్మాన మైక్షత్  ఆవృత్తచక్షు: అమృతత్వమిచ్ఛన్  అని    ఆత్మజ్ఞానోపాయాన్నిసూత్రప్రాయంగా పేర్కొ౦ది. ఒక విధంగా దాని వివరణమే యోగశాస్త్రం.  యోగశాస్త్ర ప్రవర్తకుడు పతంజలి.  ఈయన మూడుశాస్త్రాలలో మూడు అద్భుతమైన గ్రంథాలను  రచించిన మహనీయుడు.
ఈయన యోగశాస్త్రం ద్వారా  మానవుల చిత్తమాలిన్యాన్ని , వ్యాకరణశాస్త్రం ద్వారా  వాక్కులలోని మాలిన్యాన్ని , చరకం అనే వైద్యగ్రంథం ద్వారా శరీరమాలిన్యాన్ని తొలగించిన మహామనిషి. ఈ విషయం
योगेन चित्तस्य पदेन वाचां  मलं शरीरस्य तु वैद्यकेन
योsपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोsस्मि 
అనే శ్లోకం వల్ల తెలుస్తోంది .
 పతంజలి రచించిన యోగసూత్రాలు  సమాధి పాదం, సాధన పాదం, విభూతి పాదం, కైవల్య పాదం  అని నాలుగు పాదాలుగా విభజింపబడ్డాయి . నాలుగుపాదాల్లోను క్రమంగా 51+55+ 55+33 = మొత్తం   194 సూత్రాలున్నాయి  .
ఆస్తికదర్శనాలలో సాంఖ్య, యోగాలు రెండు సన్నిహిత సంబంధం గలవి . ఒక విధంగా చెప్పాలంటే సాంఖ్యం theory అనుకుంటే యోగం Practice. సాంఖ్యం 25 తత్త్వాలను చెబితే యోగం ఈశ్వరుని చేర్చి 25+1= 26  తత్త్వాలను పేర్కొంది . 
ఇపుడు సూత్రంలోకి వద్దా౦
I.1.अथ-योगानुशासनम्
1.అధ యోగానుశాసనమ్
ఈ సూత్రంలో అథ యోగ అనుశాసనం అనే మూడు పదాలున్నాయి . సంస్కృతంలో అథ శబ్దానికి చాల అర్థాలున్నాయి .
1. మంగళార్థం:
ఓంకార౦ , అథ అనే శబ్దం ఈ రెండు సృష్టికి ముందే బ్రహ్మ యొక్క కంఠాన్ని ఛేదించుకుని వెలువడ్డాయి కాబట్టి అవి మంగళకరములని శ్రుతిచెబుతోంది .
               ఓంకారశ్చాథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణ: పురా
               కంఠ౦ భిత్వా వినిర్యాతౌ తస్మాన్మా౦గళికావుభౌ
అథ పరస్మై పదాని అనే ప్రయోగంలో అథ శబ్దం  మంగళార్థంలో ఉంది .
2. ఆనంతర్యార్థం
స్నాతోsథ భు౦క్తే (స్నానం చేసిన తరువాత  తినును ) అనేచోట ఆనంతర్యార్థం.
3. ఆరంభార్థం
అథ శబ్దానుశాసనం  అనేచోట ఆరంభార్థం లోను .
4. ప్రశ్నార్థం
అథ వక్తుం సమర్థోసి ( చెప్పుటకు నీవు  సమర్ధుడవా?) అనేచోట ప్రశ్నార్థంలోను
5. కృత్స్నార్థం
అథ ధాతూన్ బ్రూమ: ( ధాతువులను సంపూర్ణంగా చెప్పెదము ) అనే చోట కృత్స్నార్థంలోను ప్రయోగించబడ్డాయి.
ఇక్కడ మాత్రం ఆరంభార్థంలో   
తాత్పర్యం : అధ యను శబ్దము అధికారార్ధము. అనగా శాస్త్రము నారంభించు చున్నామను హెచ్చరిక. యోగమనగా సమాధి. అనగా పలువిషయములందు సంచరించు మనస్సును  అరికట్టుట యుజిర్ ధాతువునకు యోగే”, సమాధౌ అను రెండర్ధములున్నను, సమాధౌ అను నర్ధమిచ్చట గ్రహింపదగినది. అనుశాసనమ్ అనుట చేత యోగశాస్త్రమనాదియని, దానిని మరల  ఎత్తి చెబుతున్నామని యభిప్రాయం. (To be continued)
No comments: