తెలుసుకుందాం -3
డాక్టర్.
చిలకమర్తి దుర్గాప్రసాద రావు
1. మనం ఏదైనా ఒక మంత్రం చదివిన తరువాత చివర్లో ఓం శాంతి: శాంతి:
శాంతి: అని మూడు సార్లు అంటాం . దీనికి కారణం మనం మూడు రకాలైన దు:ఖాలను౦డి విముక్తి
పొందడానికే అని తెలుసుకోవాలి . దుఖం మూడు విధాలు. ఆధిభౌతికం, ఆధిదైవికం ,
ఆధ్యాత్మికం . మనుష్యులవల్ల , మృగాలవల్ల మనకు కలిగే
దుఖం ఆధిభౌతికం. యక్షుల వల్ల, రాక్షసుల వల్ల, గ్రహాల వల్ల కలిగే దు:ఖం
ఆధిదైవికం . ఆధ్యాత్మికం మరల శారీరం , మానసం అని రెండు విధాలు . మన శరీరంలో
శ్లేష్మం, వాత౦, పిత్తం అని మూడు పదార్థాలు ఉంటాయి . ఇవి ఉండవలసిన పాళ్ళల్లో కాక భిన్నంగా
ఉంటేనే రోగాలు వస్తాయి . అప్పుడు కలిగే బాధ శారీరం. ఇక కామం, క్రోధం, లోభం , మోహం, మదం, మాత్సర్యం అనే ఆరిటి
వల్ల కలిగే దు:ఖం మానసం . కాబట్టి ఈ మూడు విధములైన దు:ఖాలు తొలగడానికే మూడు సార్లు
శాంతి: శాంతి: అంటాం .
*
2. మన ఇండ్లలో
శుభకార్యాలకు , అశుభకార్యాలకు బీజాలు నాటి మొక్కలు పెంచే అలవాటు మన సాంప్రదాయంలో
ఉంది . ఉదాహరణకు ఎవరింట్లోనైన ఉపనయనం , వివాహం మొ|| కార్యాలు జరిగితే కొన్ని
గింజలు మొలకెత్తేవరకు పెంచడం , అలాగే ఎవరైనా మరణించినప్పుడు ధారాపాత్రపేరుతో
కొన్ని ధాన్యం గింజల్ని మూకుళ్ళలో వేసి నీరు పోసి మొలకెత్తేలా చేయడం మనం గమనిస్తాం
. దీనికి గల కారణం ఆలోచిస్తే ఒకటి తెలుస్తుంది . మన
వైదికసంస్కృతి ఒక్క చెట్టు కూడ నాశనం కావడానికి ఒప్పుకోదు. కాకూడదని శాసించింది . కాని వివాహాదిశుభకార్యాల్లో అగ్నిహోత్రం
ఏర్పాటు చేసినప్పుడు, అలాగే ఎవరైనా మరణించినప్పుడు వారిని దహనం చెయ్యవలసినప్పుడు
కొన్ని మొక్కలు నశించడం అనివార్యం . కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చెయ్యడానికే మొక్కలు
పెంచమని ఆదేశించింది మన వైదికసంస్కృతి. విషవృక్షమైనప్పటికి నాటినవాడు దాన్ని స్వయంగా
నరకరాదని హితబోధ చేస్తాడు కాళిదాసు . ఆహా ! ఎంత గొప్పది మన సంస్కృతి.
ఇక నేను ప్రతిరోజూ
కనీసం ఐదుగురికి సరిపోయే ప్రాణవాయువును (OXYGEN) అందిస్తున్నాను. నా రక్షణ గురించి
మీరు ఆలోచించరా? ( EVERYDAY I SUPPLY OXYGEN FOR UPTO FOUR PEOPLE . DON’T YOU THINK I AM WORTH
SAVING?) అంటుంది మొక్క. కాబట్టి ప్రతి చెట్టు ప్రగతికి మెట్టుగా భావించి
రక్షించండి . ఒకవేళ ఏదైనా కారణం చేత ఒక మొక్క నశిస్తే ఆ నష్టాన్ని భర్తీ
చెయ్యడానికి మరికొన్ని మొక్కలు నాటండి .
**
3. మనిషికి
జరిపించే పదహారు సంస్కారాల్లో వివాహం ఒకటి ఇది చాల ప్రధానమై౦ది. ఈ వివాహంలో ఎన్నో
అంశాలుంటాయి . పెళ్లి కూతురికి కాళ్ళ
గోళ్ళు తీయిస్తారు.
వేదిక వద్దకు బుట్టలో
కూర్చోపెట్టి తీసుకొస్తారు . మంగళసూత్రం కట్టిస్తారు . తలంబ్రాలు పోయిస్తారు . ఊరేగింపు
జరిపిస్తారు . ఇంకా ఎన్నెన్నో కార్యకలాపాలు ఉంటాయి . ఇవన్ని ఎందుకంటే మన ప్రాచీనమహర్షులు
సమస్త మానవాళి సౌఖ్యాన్ని కోరినవారు కావడం చేత సంఘంలో ఒక శుభకార్యం జరిగితే ఆ
సమాజంలో ఉన్న చేతి వృత్తులవారికి, మూతి వృత్తులవారికి కూడ ప్రయోజనం కలగాలి .
అందువల్లనే పెళ్లి సందర్భంలో కాళ్ళగోళ్ళు తీయించడం అనే నెపంతో ఒక వర్గానికి చెందిన
వ్యక్తిని సగౌరవంగా ఆహ్వానించి సన్మానించి సత్కరిస్తాం . మనం మన కాళ్ళ గోళ్ళను
మనమే తీసుకోవచ్చు. పెండ్లికూతురికి ఒక
బ్లేడు ఇస్తే తనే తీసుకుంటుంది, వేరొకరితో తీయించవలసిన పనిలేదు . కాని ఆ పని ఆ ప్రత్యేక
వ్యక్తి ద్వారా జరిపించడం వల్ల అతనికి ప్రత్యేక గౌరవం, ఆదరణ, పోషణ లభిస్తున్నాయి .
అలాగే పెండ్లి కూతుర్ని నడిపించుకుని కాకుండా బుట్టలో కూర్చోపెట్టి తేవడం వల్ల బుట్టలు
తయారు చేసే మేదరికి లాభం చేకూరుతుంది .
అలాగే సమాజంలో ఇంకా ఎన్నో వివిధ వృత్తులు ఆ వృత్తులు నిర్వహించే కులాలు ఉన్నాయి .
వాళ్ళందరిని గుర్తించి వారి సేవలను ఉపయోగించుకుంటే తప్ప మొత్తం సంఘానికి ప్రయోజనం
చేకూరదు . ఈ విధంగా ఆలోచిస్తే వివాహ౦లో ప్రయోజనం పొందని వృత్తి గాని; కులం గాని
మనకు కనిపించవు . కాని నేడు జరుగుతున్నదే౦టి? అవన్నీ కనుమరుగై పోతున్నాయి . కాళ్లగోళ్లు
మొదలుకొని కల్యాణమంటపం దాకా అన్నిటికి కాంట్రాక్టర్లే ఉ౦టున్నారు . ఈ సంప్రదాయం అశుభకార్యాలకు కూడ వర్తిస్తుంది . ఆ
కార్యకలాపాలలో కూడ ఒకప్పుడు సమాజంలోని అన్ని వర్గాలు లాభం పొందేవి. ఇప్పుడలా జరగడం
లేదు . కాళ్ళకు ముడేసే దారం దగ్గర నుంచి కాటికాపరి
రుసుము దాక అన్ని కాంట్రాక్టే. కాంట్రాక్టర్లే
రాజ్యమేలుతున్నారు . ఉన్నవాడు లేనివాడు కూడా ఉన్నవాడికే సర్వస్వం
సమర్పి౦చుకుంటున్నాడు . నాటి ఆ వ్యవస్థ బాగుందో నేటి ఈ వ్యవస్థ బాగుందో మనమే
నిర్ణయించుకోవాలి.
***
No comments:
Post a Comment