Let us know -4
తెలుసుకుందాం - 4
తెలుసుకుందాం - 4
డాక్టర్.
చిలకమర్తి దుర్గాప్రసాద రావు
1. కతికితే అతకదు
మనలో ఎవరైనా
పెండ్లిసంబంధాల నిమిత్త౦ అమ్మాయిని చూసుకోడానికి వెళ్ళినప్పుడు వారు భోజనం
చెయ్యమని ఎంత బ్రతిమాలినా చెయ్యరు . కటికితే ఆతకదని చెప్పి తప్పి౦చుకుంటారు.
దీనికి కారణ౦ ఏమిటా అని ఆలోచిస్తే మనకు ఒక
విషయం తెలుస్తుంది . అదే౦టంటే మనం వారు
పెట్టిన భోజనం చేస్తే మనకు వారి పట్ల ఒక soft
corner ఏర్పడుతుంది . అది ఒక్కొక్కప్పుడు వ్యవహారానికి ఆటంకం కలుగజేయవచ్చు
. ఉదాహరణకి మనం బట్టలుగాని మరేవైనా వస్తువులు గాని కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు ఆ
షాపు యజమాని మనకు tea గాని కూల్ డ్రింక్స్
గాని ఇస్తారు . మనం తీసుకో కూడదు . ఒకవేళ మనం అవి తీసుకుంటే ఆ వ్యక్తితో మనకు ఒక
బంధం ఏర్పడుతుంది . బట్టలు లేదా ఏదైనా వస్తువు మనకు నచ్చినా నచ్చక పోయినా
తప్పనిసరిగా కొనవలసిన అగత్యం ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్లు మనకందించిన cool drinks
సీసాలు అప్పటికే డజనో అరడజనో త్రాగేసు౦టాం కాబట్టి .
అందుకని ఏదో ఒకటి
కొనకుండా రాలేం . ఇక వస్తువో బట్టలో ఐతే అవి ఎలాఉన్నా కొనుక్కోవచ్చు . కొంతకాలం వాడుకుని బయట
పడెయ్యొచ్చు . కాని వధువు అటువంటిది కాదు, కాకూడదు . ఆమె జీవితాంతం మన వెంట ఉండేది
ఉండవలసినదిన్నీ. అందువల్ల అటువంటి వ్యక్తిని ఎన్నుకోవడంలో ఎటువంటి మొహమాటాలకు
తావుండకూడదు. మనం ఒకవేళ వాళ్ళు పెట్టినవన్నీ కాదనలేక ఆరగించి మన ఇంటికెళ్ళాకా
అమ్మాయి నచ్చలేదని చెబితే పిండి వంటలు దొబ్బితిని పిల్లనచ్చలేదన్నారు వెధవలు
అని తిట్టుకోవచ్చు . అటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు . ఇక
కొంచెం మొహమాటపడి పిల్ల నచ్చక పోయినా
ఏదోవిధంగా నచ్చిందని చేసుకుంటే జీవితం దుర్భరం . కాబట్టి వివాహవిషయంలో ఇటువంటి
మొహమాటాలను సమూలంగా త్రుంచి వేయడానికే కతికితే అతకదు అనే నియమాన్ని
మన ప్రాచీనులు ఏర్పరిచారు . ఆహా ! ఎంత గొప్ప వారు మన పూర్వులు . అందువల్ల
మనమెప్పుడైనా ఏదైనా కొనడానికి ఎక్కడికైనా
వెళ్ళినప్పుడు వాళ్ళు మనకిచ్చే తినుబండారాలు తీసుకోకూడదు . వస్తువు కొన్నాక
తీసుకోవచ్చు . ఎవరికీ ఇబ్బంది లేదు .
మొత్తం మీద చెప్పేదేమిటంటే :
ఆహారవ్యవహారేషు త్యక్తలజ్జ:
సుఖీ భవేత్
2. న మమ (నాది కాదు)
నేనొకసారి ఒక
ఆశ్రమానికి వెళ్లాను . స్వామీజీ సమీపంలో
ఒక చోట కూర్చున్నాను . అక్కడ చాల మంది ఉన్నారు . ఒక ధనవంతుడు ఆ స్వామివారి
దగ్గరకొచ్చి నమస్కరించి కొన్ని పండ్లు సమర్పించాడు . అక్కడే కాస్సేపు కూర్చున్నాడు
. ఇంతలో భక్తులు అబిమానులు లేచివెడుతున్నారు.
ఆయన ఒక్కొక్క పండు వారి చేతిలో పెడుతున్నారు. ఈ ధనవంతుడు కూడ లేచి వెళ్ళబోతూ ఆయనకు
నమస్క రించాడు. స్వామి ఆయన చేతిలో కూడ ఒక పండు పెట్టారు . ఆయన ఆ పండ౦దు కుంటూ
స్వామి ! ఇదేంటి నా పండు నాకే
ఇస్తున్నారు ? అన్నాడు .
దానికి
స్వామీజీ అది నీ పండు ఎలా అవుతుంది ? అని
ప్రశ్నించారు . అదేంటి స్వామి అవి నేను తెచ్చిన పండ్లేగా నావి కాదంటారేమిటి అన్నాడు అమాయకంగా . ఓహో అలాగా!
అవి నువ్వు నాకు ఇవ్వనంతవరకే నీవి . నాకు
ఇచ్చి౦ తరువాత నీవి కావు
పొమ్మన్నారు. కాని అది ఆయనకు అర్థం కాలేదు
. అపుడు ఇలా అన్నారు నాయనా ! ఏ వస్తువైనా మన దగ్గరున్న౦త సేపే మనది మనం ఎవరికైనా
దానం చేశాకా అది మనది కాదు. అది స్వీకరించిన వారిదే . కాని కొంతమంది కొన్ని
వస్తువులు ఇతరులకు దానం చేశాకా ఆ వస్తువులు నావేనని అందరికి డప్పుకొట్టి
చెప్పుకుంటూ ఉంటారు . ఇది అవివేకం .
ఈ నియమం అన్నిటికి
వర్తిస్తు౦ది. అమ్మాయికి పెళ్లి చేసి ఆమెను అత్తవారింటికి పంపించాక కూడ కొంతమంది
ప్రబుద్ధులు అమ్మాయిని ఆసరాగా తీసుకుని వాళ్ళకు సంబంధించిన విషయాల్లో తలదూరుస్తూ
ఉంటారు వాళ్ళపై పెత్తనం , అజమాయిషి చెలాయిస్తూ ఉంటారు . ఇది చాల తప్పు .
అడిగినప్పుడు వారికి మంచి సలహాలిచ్చి ముందుకు నడిపించడం తప్పులేదు గాని అన్ని
విషయాలల్లోనూ తలదూర్చడం మాత్రం సమంజసం కాదు . చాల వరకు వైవాహిక సంబంధాలు
చెడిపోవడానికి ఇదొక ప్రధాన కారణం . కాబట్టి మనం ఇతరులకిచ్చిన వాటిపై మమకారం ఎంత
తగ్గించుకుంటే అంత మంచిది
No comments:
Post a Comment