Saturday, June 3, 2017

తెలుసుకుందాం -2

తెలుసుకుందాం -2
           సేకరణ : డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
వివరణ : శ్రీమతి . పంతుల ప్రేమసుధ గారు

1. అప్పువారి అప్పూ తీరె అల్లుడి మనసూ తీరె
         
ఒక ఊళ్లో ఒక పేదబ్రాహ్మణుడు ఉండేవాడు. వారి అమ్మాయికి చిన్నతనంలోనే వివాహం అయ్యింది . ఒకనాడు అల్లుడొచ్చాడు . సమయానికి భర్త ఇంట్లో లేడు. అల్లుడికి ఏమైనా పెడదామంటే  ఇంట్లో ఏమి లేవు .  వెతగ్గా వెతగ్గా కొన్ని చక్కిలాలు కనిపించాయి . అవి అల్లుడికి పెట్టడానికి తీసుకెళ్ళి౦ది. వట్టి చక్కిలాలు నేను తినలేను . వాటితో పాటు మరేదైనా కావాలి అన్నాడు  అల్లుడు . అత్తగారు అల్లుడు ఏమడుగుతాడో అని కంగారు పడుతోంది . పాలు౦టే  తీసుకురా అత్తయ్యా పాలల్లో ముంచుకు తినడం  అంటే నాకు చాల ఇష్టం అన్నాడు . సమయానికి ఇంట్లో పాలు కూడ లేవు . పక్కవారి౦ట్లో ఆవు ఉంది . కొన్ని పాలు  అప్పుగా ఇమ్మని అడిగింది . వాళ్ళు ఒక గ్లాసుడు పాలు ఇచ్చారు . ఆ పాలు అల్లుడికి ఇచ్చింది . అల్లుడు వాటిలో చక్కిలాలు ముంచుకు తినేశాడు . పాలు పాలలాగే ఉండిపోయాయి . పాలు కూడ తాగు నాయనా! అంది అత్తగారు . ఇక పాలు తాగలేను అత్తయ్యా!  ఇప్పటికే కడుపు నిండి పోయింది అని  అక్కడనుండి కదిలాడు . ఆ తరువాత ఆ పాలను వారికి తిరిగిచ్చేసి  అప్పునుండి  బయటపడింది.  కొంత సేపటికి భర్త వస్తే ఈ విషయాలన్నీ వివరించింది. ఆయన అదంతా విని చివరికి ఇలా అన్నాడట . అప్పువారి అప్పూ తీరె అల్లుడి మనసూ తీరె.

2. బాదరాయణ సంబంధం

సాధారణంగా మనం కొంతమంది వ్యక్తులమధ్య గల సంబంధాన్ని వివరించి చెప్పలేనప్పుడు వారిద్దరి మధ్య అదేదో బాదరాయణసంబంధముండే ఉంటుంది  లెండి అంటాం .   ఈ బాదరాయణసంబంధం గురించి తెలుసుకునే ముందు బాదరాయణుడు అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకోవలసిన అవసరం ఉంది .

బదరా : బదరీవృక్షా: యస్మిన్ దేశే సంతి స దేశవిశేషో బాదర: స ఏవ అయనం స్థానం యస్య స: బాదరాయణ: శ్రీ వేదవ్యాస:
రేగుచెట్లు గల ప్రా౦తాన్ని బాదరం అంటారు. అదే నివాసస్థానంగా గల వ్యాసుని బాదరాయణుడు అని పిలుస్తారు . మొత్తంమీద  బాదరాయణుడికి రేగుచెట్లకీ ఒక సంబంధం ఉంది . ఈ నేపథ్య౦లో బాదరాయణసంబంధాన్నికూడ  విశ్లేషిద్దాం .     
  ఒక ప్రయాణికుడు బండి కట్టుకుని ఎక్కడినుంచో ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాడు . దారిలో ఒక బ్రాహ్మణ అగ్రహారం ఎదురు పడింది . ఆ వ్యక్తి ఇంకా చాల దూరం ప్రయాణం చెయ్యవలసి ఉంది  .   అది వేసవికాలం . ఒక ప్రక్క  ఎండ, మరోప్రక్క ఆకలి   దంచేస్తున్నాయి . ఆ వ్యక్తి తన బండి  ఒక ఇంటి ముందు ఆపి ఎద్దును అక్కడున్న ఒక రేగుచెట్టుకి కట్టేశాడు . తిన్నగా ఆ ఇంట్లో దూరి అన్ని పనులు పూర్తి చేసుకుని ఒకచోట  కూర్చున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి తన భార్యకు సంబంధించినవాడై ఉంటాడు అని యజమాని భావించాడు,  భర్తకు తెలిసినవాడై ఉంటాడులే అని ఆ ఇంటి ఇల్లాలు అనుకుంది.   సకల మర్యాదలు జరిగాయి . అది  భోజనసమయం కావడంవల్ల ఆ ఇల్లాలు షడ్రసోపేతంగా వండి వడ్డించింది . కమ్మగా తిని కాసేపు సొమ్మసిల్లి పడుకున్నాడు . చాల సమయం తర్వాత లేచి గబగబా బయటకు బయలు దేరుతున్నాడు . ఆ వచ్చిన వ్యక్తి ఎవరో వారిద్దరికీ తెలియదు . అందువల్ల అయ్యా ! మీరెవరు? మీకు మాకు గల సంబంధబంధవ్యాలేమిటి అని ప్రశ్నించారు . వాడికేం చెప్పాలో తెలియ లేదు . ఎందుకంటే వాడు వీ రిద్దరిలో ఎవరికీ సంబంధించిన వాడు కాదు. కనీసం తెలిసినవాడు కూడ కాదు . కాసేపు తికమక పడ్డాడు . ఒక ఆలోచన బుర్రలో ప్రవేశించింది . ఇలా అన్నాడు .
మీ ఇంటిముందున్న చెట్టు   రేగుచెట్టు . నా బండిచక్రం కూడ రేగుకర్రతో చేసిందే . అదీ రేగే ఇదీ రేగే. ఇదే మనమధ్య సంబంధం . మీరు మీరే మేము మేమే .
అస్మాకం బదరీచక్రం  యుష్మాకం బదరీతరు:
అయమేవాత్ర సంబంధ: యూయం యూయం వయం వయం

3. పురాణపండవారి హాస్యోక్తులు 

  గత తరానికి చెందిన సుప్రసిద్ధపండితులలో శ్రీ పురాణపండ మల్లయ్య శాస్త్రి గారు ఒకరు. ఈయన కవి, పండితులు, సరసులున్ను . ఏ సందర్భంలోనైన చమత్కారంగా మాట్లాడి హాస్యాన్ని పుట్టించగల నేర్పరి . ఆయనకు జ్యోతిషశాస్త్రంలో కూడ ప్రావీణ్యం ఉంది . ఒక రోజు ఆ ఊళ్లో ఉండే ఒక పెద్దాయన వారింటికి వచ్చి శాస్త్రిగారూ! శాస్త్రిగారూ ! నేను, మా అబ్బాయి ఒకే నక్షత్రంలో పుట్టే౦ . శాంతి వగైరాలు ఏమైనా చేయించాలా లేకుంటే  ప్రమాదం కలుగుతుందా అని అడిగాడు . అందుకు సమాధానంగా ఆయన నేను , మా అబ్బాయి కూడ ఒకే నక్షత్రంలో  పుట్టే౦ మాకేం కాలేదు. ఇద్దరం గుండ్రాయిల్లా ఉన్నాం అన్నారు. దానికాయన సంతోషించి నమస్కరించి వెళ్లి పోతోంటే శాస్త్రి గారు ఆయనను ఒక్క నిముషం ఆగమని అడిగారు . వాళ్ళావిణ్ణి అద్దం తెచ్చిపెట్టమని సైగ చేశారు . ఆవిడ అద్దం తెచ్చింది. ఆయన అద్దంలో ముఖం చూసుకుని ఇపుడు మీరు వెళ్ళొచ్చు అన్నారు . అదేంటి శాస్త్రి గారూ! మీరు కొంతసేపు నన్ను ఆపి అద్దం చూసుకుని ఆ తరువాత వెళ్ళమని   అంటున్నారు దేనికి ? అనడిగాడు . శాస్త్రిగారు అందుకు సమాధానమిస్తూ  ఏంలేదు, మీరు తలలు తీసి తలలు పెట్టగల సమర్ధులని  ఊళ్లో  వాళ్ళందరూ అంటుంటే విన్నాను . ఇప్పుడు నా తల ఉందో  లేదో అని చూసుకుంటున్నాను అన్నారు .
శాస్త్రిగారి మాటలకు ఆయన నివ్వెర  పోయాడు .

4. పురాణ పండవారి హాస్యోక్తులు 
ఒకనాడు పురాణపండ మల్లయ్యశాస్త్రి గారు నడుచుకుంటూ ఎక్కడికో వెడుతున్నారు . ఆ ప్రాంతానికి చెందిన ఒక పెద్దమనిషిగా చెలామణి ఔతున్నఒక జమీందారు పల్లకిలో ఆయనకు ఎదురొస్తున్నాడు . ఆయన వెళ్ళవలసిన చోటుకు ఏ దారిలో  వెళ్లాలో సరిగా తెలియదు . ఎదురొస్తున్న శాస్త్రి గారిని అడుగుదామనుకున్నాడు . అది తెలిసిన బోయీలు జమీందారుతో అయ్యా! మీరు పల్లకిలో కుర్చుని కాకుండా దిగి అడిగితే గౌరవంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అన్నారు . కాని జమీ౦దారు వారి సలహాను పెడచెవిని పెట్టి ఏమయ్యా ! ప౦తులూ! ఈ రోడ్డు ఎక్కడకు వెడుతు౦దో చెప్పగలవా అని అడిగాడు . దానికి సమాధానంగా ఆయన నేను పుట్టింది మొదలు ఈ రోజు దాక ఇక్కడే ఉన్నాను . ఈ రోడ్డు ఎక్కడకు వెళ్ళలేదు అంటూ ముందుకు సాగిపోయారు  . ఆ పెద్దమనిషి  ముఖంలో నెత్తురుచుక్క లేదు .                              
 5. పురాణ పండవారి హాస్యోక్తులు 
 ఒకనాడు శ్రీపురాణపండ మల్లయ్యశాస్త్రి గారిని పిఠాపురం రాజా వారు తమ ఆస్థానానికి రమ్మని ఆహ్వానించారు . ఆయన్ని తీసుకు రావడానికి   ఒక గుఱ్ఱపుబండి కూడ పంపించారు . కాని శాస్త్రిగారు ఆ బండిలో ఎక్కి ప్రయాణం చెయ్యడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆ గుఱ్ఱపుబండిలో  నడిపేవాడి తలకు కూర్చునేవారి కాళ్ళు తగులుతాయి . అది శాస్త్రి గారికి ఇష్టం లేదు. అందువల్ల ఆయన వేరే విధంగా ఆస్థానానికి చేరుకున్నారు . చాల ఆలస్యం ఐపోయింది . అప్పటికే అక్కడకు చేరిన వారందరూ అసహనంగా  శాస్త్రి గారితో అయ్యా! బండెక్కొచ్చారా ! అని అడిగారు. దానికి సమాధానంగా ఆయన అబ్బే లేదు . ఎండెక్కొచ్చాను అన్నారు . ఆయన మాటల చమత్కారం ముందు ఆయన చేసిన ఆలస్యం ఎవరూ పట్టించుకోలేదు .
 *  శ్రీమతి . పంతుల ప్రేమసుధ గారు శ్రీ పురాణపండ మల్లయ్య శాస్త్రి గారి మనుమరాలు (కుమారుని పుత్రిక).
















No comments: