Tuesday, January 2, 2018

పొగడ్త – ఒక అగడ్త

పొగడ్త ఒక అగడ్త
డా|| చిలకమర్తి దుర్గాప్రసాదరావు

నిన్ను ఎప్పుడూ పోగిడేవాడిపై ఓ కన్నేసి ఉంచు అని పెద్దలు అంటూ ఉంటారు . అంటే పొగడ్త అంత ప్రమాదకరమైనదన్న మాట . ఇక సమాజంలో గతతరానికి , నేటి తరానికి గల తేడాను గమనిస్తే మనకు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది . అదేంటంటే గతతరంలో మనుషులు పైపైకి భేదాభిప్రాయాలు కలవారై ఉన్నా  ఆంతర్యంలో ఒకరిపట్ల మరొకరు ప్రేమ, అనురాగం  కలిగి ఉండేవారు . వారి మధ్య భేదాభిప్రాయాలు కేవలం ఆ ఒక్క అంశానికే మాత్రమే పరిమితమై ఉండేవి . మిగిలిన విషయాల్లో ఏకాభిప్రాయం కలిగే ఉండేవారు . ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునే వారు. కాని ఇప్పుడలా కాదు, ఏదైనా భేదాభిప్రాయం వస్తే మొత్తం వ్యక్తినే తీసిపారేస్తున్నారు, దూషిస్తున్నారు, దూరం చేసుకుంటున్నారు . ఇష్టమైతే పొగడ్తల్తో ముంచెత్తేస్తున్నారు చిన్నతేడా వస్తే సంబంధాలు తెంచేసుకుంటున్నారు. ఇక అగడ్త అంటే ఏమిటో చుద్దా౦.  పూర్వం రాజులు తమ కోటలకు రక్షణగా చుట్టూ చాల ఎత్తైన గోడలను  కట్టించుకునే వారు దానికి చాల చేరువగా లోతైన అగడ్తను త్రవ్వి౦చుకునే వారు . ఈ అగడ్తలో మొసళ్ళు మొ|| క్రూరమైన జంతువులను పెంచేవారు. ఆ అగడ్తలో పడినా , లేక గెంటి వేయబడినా  చావు తప్పదు.      ఇక ప్రస్తుతవిషయానికొస్తే, ఇష్టమైనప్పుడు పొగడడం, ఇష్టం లేనప్పుడు నిందించడం అంత మంచిది కాదు. మనిషికి మనిషికి మధ్య భేదాభిప్రాయం సహజం . భేదాభిప్రాయాలు మనుషులకే ఉంటాయి . జంతువులకుండవు .  ఎందుకంటే వాటికసలు అభిప్రాయాలే ఉండవు కాబట్టి  . ఇక భేదం ఎలా వస్తుంది .  ఇక సమాజంలో అయిందానికి కానిదానికి పొగడ్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి . పొగడ్త తప్పుకాదుగాని దానికో హద్దు ఉంటుంది . పధ్ధతి ఉంటుంది . Normally one praises others to be praised twice. వాణ్ణి వీడు, వీణ్ణి వాడు పొగుడుకోడం  వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు . ఇక కొంతమంది స్వయంగా వాళ్లని వాళ్ళే పొగుడు కు౦టూ ఉంటారు . కొందరు direct గా పొగుడుకు0టూ ఉంటే మరికొందరు indirect గా చాల తెలివిగా పొగుడుకుంటు ఉంటారు . ఉదాహరణకి ఒకాయన ఇలా అంటున్నాడు . మహాత్ములు చాల చిన్నవయస్సులో మరణించారు . శ్రీశంకరాచార్యులు 32 ఏళ్ళకి . ఏసుక్రీస్తు మహాశయుడు 33 ఏళ్ళకి శ్రీవివేకానందుడు 34 ఏళ్లకే మరణించారు ఈ మధ్య నాకు కూడ ఎందుకో ఒంట్లో బాగుండటం లేదు అన్నాడట . ఇక ఎవరిని పొడడొచ్చు, ఎవరిని పొగడకూడ, ఎవరిని ఎప్పుడు పొగడొచ్చు,ఎవర్ని ఎప్పుడూ పొగడకూడదో మన పెద్దలు ఇలా వివరించారు .   
प्रत्यक्षे गुरव: स्तुत्या: परोक्षे मित्रबान्धवा:
कार्यान्ते दास भृत्याश्च न कदाचन पुत्रक:
  
గురువులను ప్రత్యక్షంగా పొగడొచ్చు. మిత్రులను, బంధువులను పరోక్షంగానే పొగడాలి . సేవకులను, నిపుణులైన పనివారిని పని పూర్తయిన తరువాతనే పొగడాలి . ఇక పిల్లలను ఎన్నడు పొగడకూడదు . ఏదైనా ప్రగతి కనబరిస్తే నాలుగు మంచిమాటలతో అభినందించడం తప్పులేదు . పొగడడం మాత్రం చేయకూడదు . ఎవరినీ అనవసరంగా పొగడకండి ఎవరి  పొగడ్తలకు పొంగిపోకండి .  

No comments: