సర్వం శర్వ(శివ)మయం
జగత్
డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాద
రావు
భగవంతుడు
నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడే అయినా సాధకుడు తన అభిరుచిననుసరించి ఒక
ఆకారాన్ని కల్పించుకుని ఆరాధించుకోవడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం . సాకారరూపమైన దైవతారాధన ఏకాగ్రతకు ఎంతో కొంత అనుకూలంగా ఉండటమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు . భగవంతుడు సాకారుడనేవారికి, నిరాకారుడనే వారికి
కూడ అనువైనది శివారాధన. లింగాకారుడైన శివునకు రూపముందా అంటే లేదు
, లేదా అంటే ఉంది . అందుకే మనదేశంలో శివారాధన చరిత్ర పూర్వయుగం నుండి నేటివరకు
ఆవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది .
వేదాలకు సారాంశభూతములైన
ఉపనిషత్తుల్లో ‘ఆత్మ‘, ‘బ్రహ్మము’ అనే రెండు పదాలు
మనకు కనిపిస్తాయి. ఆత్మే బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మ, ఆత్మ అనే పదానికి సర్వవ్యాపి
అని అర్థం . అది సత్ - చిత్- ఆనంద స్వరూపం
. అది సజాతీయ, విజాతీయ, స్వగతభేద శూన్యం. అంటే ఆత్మతో సమానమైన వస్తువు మరొకటి లేదు
, ఆత్మకంటే భిన్నమైన వస్తువు మరొకటి లేదు, అదే విధంగా
ఆత్మలో ఎటువంటి భేదాలు కూడ లేవు . ఉదాగారణకి ఒక చెట్టును తీసుకుంటే చెట్టులో
వేరని, కాండమని, కొమ్మలని, ఆకులని భేదాలుంటాయి కాని ఆత్మలో అటువంటి భేదాలేమి లేవు
. ఉన్నదదొక్కటే . రెండో వస్తువు లేదు . ఇక ఉపనిషత్తుల్లో ‘శివ’ ‘విష్ణు’ అనే పదాలు
ఉన్నాయి, కాని అవి ఆత్మకు విశేషణాలుగా
మనకు దర్శనమిస్తున్నాయి. మాండుక్యఉపనిషత్తు ఆత్మను వర్ణిస్తూ ఆత్మ జాగ్రత్స్వప్నసుషుప్తి
దశలలో విశ్వ – తైజస – ప్రాజ్ఞులుగా వ్యవహరింప బడునని వీటికి
ఆధారభూతమైన తురీయాన్ని(నాల్గవస్థితి) వర్ణిస్తూ ‘శాంతం, శివం
, అద్వైతం, చతుర్థం మన్యంతే’ అని శివపదాన్ని పేర్కొంది . ఇక్కడ
నాలుగో స్థితి అంటే ఆవుకి నాలుగు కాళ్ళ లాగ ఒకటి , రెండు , మూడు నాలుగు అని కాదు,
మొదటి మూడు స్థితులకు ఆధారభూతమైనది, అసలు సిసలైనది అని గ్రహించాలి. అలాగే కఠోపనిషత్తులో
“ తద్విష్ణో: పరమం పదం” అని విష్ణుపదం
సర్వవ్యాపకత్వాన్ని సూచించే విధంగా ఉంది . వేదాంతశాస్త్ర౦ ప్రకారం ఒకే చైతన్యం
సృష్టి కార్యక్రమం నిర్వహిస్తే బ్రహ్మ అని, పోషణ కార్యక్రమం చేస్తుంటే విష్ణువని, లయం చేసేటప్పుడు మహేశ్వరుడని చెప్పింది . మొత్తం మీద భక్తులు తమ
సౌకర్యంకోసం అపరిచ్ఛిన్నమైన బ్రహ్మపదార్థాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా
భావించుకుని వారికొక రూపకల్పన చేసి ఆరాధించుకోవడం అనూచానంగా వస్తున్న సాంప్రదాయం .
శివుడు
విశ్వరూపుడు. పంచ భూతాలు శివస్వరూపమే . అందుకే జంబుకేశ్వరంలోని జలలింగం, అరుణాచలంలోని అగ్ని లింగం, చిదంబరం
లోని ఆకాశలింగం, తిరువళ్లూరులోని పృథ్వీలింగం , కాళహస్తిలోని వాయు లింగం పంచభూతాత్మకమైన శివతత్త్వానికి ప్రతికలు .
వేదంలోని నమక చమకాలు ప్రపంచమంతా శివమయంగా అభివర్ణిస్తున్నాయి .
శివుని త్రిపురారి
అంటారు . ఇక్కడ త్రిపురాలు అంటే స్థూలశరీరం, సూక్ష్మ శరీరం, కారణశరీరం అని
అర్థం . అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశాల్లో
అన్నమయకోశం స్థూలశరీరం గాను , ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు
మూడు కలసి సూక్ష్మ శరీరంగాను ఆనందమయకోశం కారణశరీరం గాను ఏర్పడ్డాయి .
ఆత్మ ఈ మూడు
శరీరాలకు అంటే ఆ ఐదు కోశాలకు అతీతం . అందుకే ఆత్మస్వరుపుడైన శివుణ్ణి
త్రిపురాంతకుడని అంటారు .
శివావతారం ఒక
ఆదర్శవంతమైన అవతారం కష్టాలను తానే అనుభవిస్తూ ఇతరులకు సుఖాలను పంచడం ఆయన తత్త్వం .
క్షీరసాగరాన్ని
మథించినప్పుడు దాని నుండి పుట్టిన హాలాహలానికి నారాయణుడు ముదలగు దేవతా శ్రేష్ఠులందరు
భయపడి పాఱిపోతుండగా వారికి అభయమిచ్చి హాలాహలాన్ని మ్రింగి వారినందరినీ రక్షించిన
దైవతసార్వభౌముడు శివుడు . ఆ విషయాన్ని ఒక భక్తుడు ఇలా అంటాడు .
య: క్షీరాంబుధిమంథనోద్భవమహాహాలాహలం భీకరం
దృష్ట్వా తత్ర
పలాయతాన్సురగణాన్నారాయణాదీ౦స్తథా
సంపీత్వా
పరిపాలయజ్జగదిదం విశ్వాధికం శంకరం
సేవ్యో న: సకలాపదాం
పరిహరన్ కైలాసవాసీ విభు:
శివుడు
నిరాడంబరతకు దర్పణం. ముల్లోకనాథుడైనా ఆదిభిక్షువే, కుబేరుని మిత్రుడైనా దిగంబరుడే.
శివునిలో ఆదర్శవంతుడైన ఒక కుటుంబయజమాని కనిపిస్తాడు. ధర్మపత్నికి సగం
శరీరాన్నిచ్చిన శివుడు పురుషులతో పాటు
స్త్రీలకు కూడ సమప్రాథాన్యం ఉండాలని వాదించే ఈ నాటి కొంతమంది ఉదారవాదులకు
ఆదర్శప్రాయుడు. సంసారం అనేక భిన్నాభిప్రాయాలుగల వ్యక్తులకు, క్లిష్టపరిస్థితులకు, అంత:కలహాలకు,
రాగద్వేషాలకు , ఆటుపోటులకు ఆలవాలం. అందువల్ల అన్ని పరిస్థితులను సమన్వయపరుచుకుంటూ
చాకచక్యంగా ముందుకు సాగేవాడే శివునిలా ఉత్తమయజమానిగా కీర్తి పొందుతాడు . లేకుంటే
ఉత్తయజమానిగానో , చెత్త యజమానిగానో మిగిలిపోతాడు.
ఈశ్వరుని కుమారుడైన వినాయకుని వాహనం ఎలుక. దాన్ని ఎప్పుడు తినేద్దామా అని
శివుని మెడలోని పాము ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ పామును ఎప్పుడు మ్రి౦గేద్దామా అని కుమారస్వామి వాహనం నెమలి
ఆలోచిస్తూ ఉంటుంది. పార్వతి వాహనమైన సింహం ఏనుగుమొహం గల వినాయకుణ్ణి ఎప్పుడు న౦జుకుందామా
ఆని నిరీక్షిస్తో ఉంటుంది. ఇక సవతులకయ్యం మామూలే. శివుని మూడవకంటి అగ్ని తలపైనున్న
చంద్రుణ్ణి మాడ్చేస్తూ ఉంటుంది. ఒకప్రక్క పాముల బుసబుసలు , చాటుమాటుగా ఈ భార్యాభర్తల
గుసగుసలు , మరోప్రక్క సవతులమధ్య రుసరుసలతో ఆ వాతావరణం గందరగోళంగా ఉంటుంది .
అటువంటి పరిస్థితిలో ఎవరిని నొప్పించకుండా , తానూ నొచ్చుకోకుండా సంసారంలో ఉంటూనే
అసంసారిగా మెలగగలగడం శివుని ప్రత్యేకత. ఇది ప్రతి గృహస్థుడు గమనించి ఆచరించవలసిన ఆదర్శం.
ఇక మోక్షం పొందడానికి ఎవరు అర్హులు అనే విషయానికొస్తే ఉపనిషత్తులన్నీ ముక్తకంఠ౦గా ‘ధీరుడు’ అనే పదాన్ని
పేర్కొన్నాయి. ఈ ధీరుడు అనే పదానికి
నిర్వచనం చెబుతూ కాళిదాసు “ వికార హేతౌ సతి విక్రియంతే యేషాం న
చేతాంసి త ఏవ దీరా:” అంటే మనస్సు వికారం చెందడానికి అన్ని
అవకాశాలు ఉన్నప్పటికీ ఎవరి మనస్సు ఎట్టి వికారాన్ని పొందదో అతడే ధీరుడు అని అంటాడు
. కాళిదాసు శివుని ఉద్దేశించి ఈ మాటలు చెప్పాడు . శివుడు హిమాలయాలలో తపస్సు
చేసుకోడానికి వచ్చినప్పుడు హిమవంతుడు తనకుమార్తెయైన పార్వతిని అతనికి సపర్యలు
చేయడానికి నియమి౦చాడట. శివుడు ఆమె ఉనికిని కాదనలేదట. పార్వతిలాంటి అతిలోక
సౌందర్యవతి ఉనికి శివుని తపస్సుకు ఇబ్బందికరమే, అయినా శివుడు కాదనలేకపోవడానికి
కారణం శివుని ధీరత్వమే అంటాడు కవి. అటువంటి ధీరత్వం శివారాధన వల్ల అందరికి సిద్ధిస్తుంది.
ఆయన భక్తసులభుడు. తనకొచ్చే ప్రమాదాన్ని కూడ లెక్క చెయ్యకుండా భక్తుల కొరికలీడేర్చే
భోళాశంకరుడు. ఎవరు ఏ రూపంలో తలిస్తే వారికి ఆరూపంలోనే ప్రత్యక్షమయ్యే భక్త
కల్పద్రుమం . అందుకే ధూర్జటి ....
నిన్నే రూపముగా
భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ
చన్నో కుoచమొ
మేకపె౦టికయొనీచందంబెఱి౦గించి నా
కన్నారన్
భవదీయమూర్తి సగుణాకారంబుగా జూపవే
చిన్నీరేజవిహారమత్త
మధుపా! శ్రీ కాళహస్తీశ్వరా !
ఒక
భక్తుడు శివుని పూజిద్దామని ఒకణ్ణి, శివుడు ఎలా ఉంటాడు? అని అడిగాడట . దానికి వాడు
తన మోకాలు చూపించి ఇదే శివుడు అనగానే ఆ భక్తుడు నమ్మి ఆ మోకాల్ని శివునిగా ధ్యానం
చెయ్యగానే శివుడు ప్రత్యక్షమయ్యాడట . అలాగే ఒక భక్తుడు స్త్రీ యొక్క స్తనాన్ని శివలింగంగా
భావించి కొలిచి ముక్తిపొందడం (ఆ+చన్ను+ఈశ్వరుడు = ఆచంటేశ్వరుడు), మరొకచోట ఒక
అమాయకుడు శివుడెలా ఉంటాడని ఒకణ్ణి అడిగినప్పుడు కుంచం చూపించాడట . ఆ భక్తుడు కుంచాన్నిశివలింగంగా
భావించి కొలవగానే శివుడు దర్శనం ఇచ్చాడట
(కు౦చేశ్వరుడు ). మరొకచోట ఒకవ్యక్తి ఒక ‘మేకగొద్దె’ను చూపించి ఇదే
శివుడని చెప్పడం ఆ భక్తుడు కొలవడం శివుడు దర్శనం ఇవ్వడం (మేకపె౦టేశ్వరుడు ) ఈ
విధంగా శివుడు తన భక్తుని కోరిక ననుసరించి వివిధరూపాల్లో దర్శనమివ్వడం మనకు
కనిపిస్తుంది. ‘యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం’ అనే
గీతావాక్యానికి శివపురాణాల్లో కోకొల్లలుగా ఉదాహరణలు లభిస్తాయి . ఒక్క మాటలో
చెప్పాలంటే భక్తుల వలన శివుడు ఇబ్బందులు పడిన ఘట్టాలు కనిపిస్తాయిగాని శివుని
కొలిచి ఇబ్బందులు పడ్డ భక్తులు మచ్చుకు ఒక్కరు కూడ కనిపించరు.
ఇక
ఆ౦ధ్రదేశంలోని తూర్పు గోదావరిజిల్లాలో
పలివెల అనే గ్రామం ఉంది . అక్కడ వెలసిన శివునికి కొప్పులి౦గేశ్వరుడని పేరు
. ఈ లింగానికి ఒక పెద్ద కొప్పు ఉంటుంది .ఇదెలా వచ్చిందో తెలుసుకుందాం . అది
శివాలయం ఆ శివాలయంలో పూజారి ఉండేవాడు. ఆయన
ప్రతిరోజూ భక్తితో శివుని ఆరాధిస్తూ ఉండేవాడు. రాజు ప్రతిరోజూ సాయంకాలం ఆపూజారికి
శివపూజకోసం పువ్వులు పంపిస్తూ ఉండేవాడు . ఈ పూజారి ఆ పువ్వుల్ని పూజకు
వినియోగించకుండా తన ప్రియురాలి కొప్పులో తురిమి ఉదయాన్నే ఆపువ్వుల్ని రాజుకు
ప్రసాదంగా పంపిస్తూ ఉండేవాడు. రోజులు
గడుస్తున్నాయి. రాజుకి ఒక రోజు పువ్వుల్లో తలవెండ్రుకలు కనిపి౦చాయి . ఆయనకనుమానమొచ్చింది.
పూజారిని పిలిచి ఆ విషయం అడిగాడు . ఆ పూజారి భయంతో వణికి పోయాడు . శివలింగానికి
జుట్టు౦దండి. ఆ వెండ్రుకలే ఇవి అని పదిమందిలోనూ తడుముకోకుండా తన నోటికొచ్చింది
చెప్పేశాడు. రాజు అంతగా పట్టించుకు౦టాడనుకోలేదు. కాని రాజు ‘శివలింగానికి
జుట్టు ఉండడం ఏమిటి? చాల విడ్డూరంగా ఉంది. రేపు మేము వచ్చి చూస్తాం, నీమాట నిజమైతే
‘సిరి’ అబద్ధమైతే ‘ఉరి’ తప్పదు సిద్ధంగా ఉండు అన్నాడు . ఇక పూజారి
ప్రాణభయంతో నిద్రాహారాలు మాని రాత్రంతా శివుని ధ్యానించి రక్షి౦పమని వేడుకోగా
ఉదయానికికల్లా శివలింగానికి జుట్టు మొలిచింది . నాటి నుండి ఆయన
కొప్పులి౦గేశ్వరునిగా ప్రసిద్ధిపొందేడు. ఈ
విధంగా శివతత్త్వం, అద్భుతం, అపారం, అనంతం, అసదృశం, అవర్ణనీయం .
ఇక ఆయన పశుపతి .
పశువు అంటే జీవుడు . పశుపతి అంటే జీవులకు ప్రభువని అర్థం . మనం శివాలయానికి వెళ్లి
నప్పుడు నంది కొమ్ములలో౦చి శివుణ్ణి చూస్తాం . దాని అ౦తరార్థమేమిటంటే
ప్రతిజీవునిలోను పరమేశ్వ రుణ్ణి చూడాలని మాత్రమే. ఈ ప్రక్రియలోని ఉద్దేశం కనుమరుగై
అది అర్థం లేని ఆచారంగానే మిగిలిపోయింది. ప్రతిజీవునిలోను శివుణ్ణి చూడగలగడమే
నిజమైన శివపూజ . శ్రీ శంకరాచార్యులవారు మానసికంగా చేసే నిజమైన శివారాధన ఎలా ఉండాలో ఇలా వివరించారు.
ఆత్మా త్వం గిరిజా
మతి: సహచరా: ప్రాణా: శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా
నిద్రా సమాధిస్థితి:
సంచార: పదయో:
ప్రదక్షిణవిధి: స్తోత్రాని సర్వాన్ గిరో
యద్యత్కర్మ కరోమి
తత్తదఖిలం శంభో! తవారాధనం
(ఓదేవ! నీవే ఆత్మవు.
పార్వతియే బుద్ధి. ప్రాణములే సహచరులు. ఈ శరీరమే గృహం . నేను చేసే ప్రతిపని నీకు
పూజయే. నిద్రయే సమాధి . నేను కర్తవ్యబుద్ధితో చేసే ప్రతి క్రియాకలాపము నీ
ఆరాధానమే) .
ఇటువంటి భావన
కలగాలంటే ఈ విశ్వంలోని అణువణువులోను శివతత్త్వాన్ని చూడగలగాలి. పెద్దలు ‘ఆరోగ్యం
భాస్కరాదిచ్ఛేన్మోక్షమిచ్ఛేన్మహేశ్వరాత్’ అన్నారు కాబట్టి
ఉత్తమపుషార్థమైన మోక్షం కోసం శివుణ్ణి ఆరాధిద్దాం తరిద్దాం.
No comments:
Post a Comment