Thursday, January 18, 2018

దిక్కుతోచని చిక్కుముడి

దిక్కుతోచని చిక్కుముడి

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

పూర్వం భోజుడు రాజ్యం చేస్తున్న రోజులవి. సుకవితా యద్యస్తి రాజ్యేన కిం ? (మంచి కవిత్వం ఉంటే రాజ్యం ఎందుకు ?) అనుకునే రోజులవి . భోజుడు స్వయంగా కవి, కవి పోషకుడున్నూ.   ఆయన్ని చూస్తేనే అందరికి కవిత్వం వచ్చేదని చెబుతారు . అందంగా కవిత్వం చెబితే అక్షరాలక్షలు కురిపించేవాడని పెద్దలు అంటూ ఉంటారు .  ఒకసారి ఆయన సభలో ఒక సమస్యను ఇచ్చి పూర్తి చెయ్యమని అడిగాడు . అదే౦ ఆషామాషీ సమస్యేం కాదు . ఎవ్వరు విప్పలేని చిక్కుముడి . అదే౦టంటే ఒక స్త్రీ ఒక పిల్లవాణ్ణి ముద్దులు పెట్టుకుంటూ  తమ్ముడా! అని , మేనల్లుడా ! అని , మనుమడా! అని, మామా! అని , కుమారుడా! అని, పినతండ్రీ! అని మఱదీ! అని పిలుస్తోంది ఇదెలా కుదురుతుందో చెప్పమని , ఈ చిక్కుముడిని విప్పమని అడిగాడు . దానికి సమాధానంగా బుద్ధిలో బృహస్పతి వంటి బుద్ధిసాగరుడనే మంత్రి ఒక కల్పన చేసి ఆ చిక్కుముడిని ఇలా విప్పడం జరిగింది . ఆయన ఒక స్త్రీని కలుసుకున్నట్లు ఆమె తన చరిత్రను స్వయంగా తనకు వివరించినట్లు అనల్పమైన  కల్పన చేశాడు . ఈ కల్పనలో కొంత అసభ్యత ఉన్నా కవితాహృదయంతో చూస్తే అది అసభ్యతగా అనిపించదు. ఇక  ఈ బుద్ధిసాగరుడు నిజంగా బుద్ధిసాగరుడే. ఆయన కల్పన చూడండి .
ముందుగా సమస్య పరికించండి .
శిశుం లాలయంత్యబ్రవీత్సా భ్రాత: భ్రాతృవ్య పౌత్ర శ్వశుర సుత పితృవ్యేతి తం దేవరేతి

సమాధానం :
జారోత్పన్నౌ విసృష్టౌ తనయదుహితరౌ ద౦పతీ దైవ యోగాత్
యోగిన్యా గర్హితా సా తదనుగమవశాద్యోగినీత్వం ప్రపేదే
పశ్చాద్వేశ్యీకృతాంబాజనితసుతశిశుం లాలయంత్యబ్రవీత్సా
భ్రాత: భ్రాతృవ్య పౌత్ర శ్వశుర సుత పితృవ్యేతి తం దేవరేతి   

जारोत्पन्नौ विसृष्टौ तनयदुहितरौ दंपती दैवयोगात्
योगिन्या गर्हिता सा तदनुगमवशाद्योगिनीत्वं प्रपेदे
पश्चाद्वेश्यी कृतांबाजनितसुतशिशुं लालयन्यब्रवीत्सा
भ्रात:! भ्रातृव्य ! पौत्र ! श्वशुर ! सुत ! पितृव्येति तं देवरेति
ఒక యోగిని ఒక బిడ్డను ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటూ తమ్ముడా! అని ఒకసారి , మేనల్లడా ! అని వేరొకసారి , మనుమడా (కొడుకు కొడుకు ) అని ఒకసారి మామగారూ! అని ఇంకో సారి , కుమారుడా అని మరొకసారి , పినతండ్రీ అని ఒకసారి మఱదీ! అని మరొకసారి పిలిచింది . ఆ వరుసలు చాల విచిత్రంగా పరస్పర విరుద్ధంగా ఆక్షేపకరంగా ఉన్నాయి . అదెలా సాధ్యమో చెప్పమని అడుగగా ఆమే స్వయంగా  ఇలా వివరించింది .
ఒక దేశంలో ఒక జంగం దంపతులకు (Nomadic people) ఒక అందమైన అమ్మాయి పుట్టింది . ఆమెను వేరొక జంగంవానికిచ్చి  పెళ్లి చేశారు. కాని ఆ జంగంవాడు ఊరూర తిరుగుతూ జీవనం చేయడం  వల్ల అతని భార్య అతని వెంట వెళ్ళకుండ పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆమె చాల అందగత్తె కావడం వల్ల చుట్టుపక్కల ఉన్న కుర్రకారు ఆమెకు వలవెయ్యడం, చివరకు ఆమె ఒకడి వలలో పడడం, వాడి వల్ల ఒక మగ బిడ్డను  ప్రసవించడం జరిగింది . తల్లిదండ్రులు ఆమె చేసిన పనికి బాధపడి, ఆమెను మందలించి  ఆ శిశువును తమ ఇంటికి అతిథిగా వచ్చిన, సంతానం లేనిఒక జంగం వానికి కుమారునిగా  పెంచుకొమ్మని   ఇచ్చేశారు .  కాని ఈమె తన బుద్ధి మార్చుకోలేదు . మరికొంతమందితో చెడు సహవాసం చేసి నన్ను కన్నది . ఆమె తల్లిదండ్రులు రెండవ బిడ్డనైన నన్నుమరో జంగానికి ఇచ్చేశారు . నాతల్లి అందగత్తె కాబట్టి తన చెడు ప్రవర్తన మానకుండా  కొనసాగిస్తూనే ఉంది.  నన్ను , నా అన్నను తీసుకు పోయినవారు మమ్మల్నిఇరుగుపోరుగువారికి  తమ స్వంత బిడ్డలనే చెప్పుకునే వారు . వారు, వీరు ఒకరికొకరు తెలిసిన వారు, బంధువులు కావడం వల్ల వారు మా ఇద్దరికీ పెళ్లి చేశారు. మేమిద్దరం ఒక చోట కాపురం చేస్తున్నాము . ఒకరోజు నా భర్త ఇంట్లో లేని సమయంలో ఒక యోగిని నా ఇంటికి వచ్చి నువ్వు పాపాత్మురాలివి . అన్నను పెళ్లి చేసుకున్నావు అని ఎన్నో విధాల నన్ను నిందించింది. ఆ తరువాత నా కథంతా వివరించింది . నా ప్రమేయం లేక పోయినా నేను జరిగిన తప్పుకు నన్ను నేను ఆసహ్యించుకుని నాకీ పాపం తొలగిపోయే మార్గం చెప్పమని ఆమెను అడిగాను . ఆ యోగిని దయతో నాకు యోగం ఉపదేశించి నన్ను తన వెంట తీసుకు పోయింది . ఇంటికి చేరిన నామగడు నేను కనిపించక పోయేసరికి చాల బాధపడ్డాడు . దేశదేశాలు తిరుగుచు చివరకు వేశ్యగా జీవిస్తున్న నా తల్లి ఉంటున్న నగరానికి చేరుకొని ఆమెను చేరదీశాడు.  వారిద్దరికీ ఈ పిల్లవాడు కలిగాడు. నేను పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ ఒక చోట ఈ పిల్లవాణ్ణి చూశాను . వీడి చరిత్ర తెలుసుకున్నాను .                     
1.                 వీడు, నా తల్లికి పుట్టడం వల్ల నాకు తమ్ముడయ్యాడు.
2.                 నాతోడ పుట్టిన వానికి (అన్నకు ) కొడుకు కాబట్టి నాకు మేనల్లుడు .
3.                 వీడు నాతల్లి కుమారునికి కుమారుడు కాబట్టి (దాని సవతినగు) నాకు మనుమడు .
4.                 నా తల్లికి నేను కొడుకు పెళ్ళాన్ని కాబట్టి కోడల్ని అయ్యాను . నాతల్లి నాకత్త అవుతుంది . అత్తగారి మగడు మామగారు మామగారి తమ్ముడు కూడ మామగారే ఔతాడు . ఇతడు నా మగని తల్లికి కుమారుడు కాబట్టి అతనికి తమ్ముడయ్యాడు. అందువల్ల నాకు కూడ మామగారే అవుతాడు .
5.                 నా మగనికి పుట్టడంవల్ల నాకు తమ్ముడు అవుతాడు.   
6.                  నా తల్లి భర్త నాకు తండ్రి గదా! తండ్రి తమ్ముడు పినతండ్రి  .
7.                 ఈ బిడ్డ నామగని అమ్మకు పుట్టిన వాడు కావడం వలన నామగనికి తమ్ముడు, నా మగని తమ్ముడు కాబట్టి నాకు మరది .
అందువల్ల నేను ఇతనిని  ఎత్తుకొని ముద్దులు పెట్టుకొనుచు తమ్ముడా! అని , తమ్ముని కొడకా ! అని  , మనుమడా (కొడుకు కొడుకు ) అని  మామగారు అని , కుమారుడా అని మరొకసారి , పినతండ్రీ అని మరొకసారి మఱదీ! అని మరొకసారి పిలిచాను .
जारोत्पन्नौ = జారుడైన పురుషునిచే కలిగిన వారు కావడం చేత;  विसृष्टौ = విడిచిపెట్టబడిన ; तनयदुहितरौ=  కొడుకు కూతురు ; दैवयोगात्= దైవ యోగం వల్ల ; दंपती= దంపతులయ్యారు; सा= ఆ కూతురు ;योगिन्या= ఒక యోగినిచే ;गर्हिता= నిందింప బడినదై  ; तदनुगमवशात् = ఆమెను  అనుసరింఛి వెళ్ళడం వలన ;योगिनीत्वं प्रपेदे = యోగినిగా మారెను ; पश्चात् =  ఆ తరువాత ; वेश्यीकृतांबाजनितसुतशिशुं= వేశ్యయైన తల్లికీ , దాని కుమారుని వలన పుట్టిన శిశువును ; लालयन्ती = లాలిస్తూ ; सा ==ఆమె;   भ्रात: = తమ్ముడా! ; भ्रातृव्य! = మేనల్లుడా!; पौत्र! = మనుమడా! ; श्वशुर! = మామ గారు! ; सुत != కుమారుడా! ; पितृव्य != పినత౦డ్రి! ; देवर! = మరది! ; इति= అని;  तं= అతనిని; न्यब्रवीत् = పలికెను (పిలిచెను ) .

రవిగా౦చనిచో కవిగా౦చునే కదా (A poet can see which even the SunGod cannot see ) అంటే ఇదేనేమో !

No comments: