Sunday, December 1, 2019

द्वे एव रसवत्फले ద్వే ఏవ రసవత్ఫలే


द्वे एव रसवत्फले
ద్వే ఏవ రసవత్ఫలే
Dr. Ch. Durga prasada Rao

संसारविषवृक्षस्य  द्वे एव रसवत्फले
काव्यामृतरसास्वाद: सांगत्यं सज्जनै: सह
       సంసారవిషవృక్షస్య ద్వే ఏవ రసవత్ఫలే
       కావ్యామృతరసాస్వాద: సాంగత్యం సజ్జనై: సహ||
అన్నారు మన పెద్దలు . నిజమే ఈ సంసారం విషతుల్యమే . కానీ మనం విషతుల్యమైన ఈ సంసారంలో ఉన్నంత మాత్రాన తల పట్టుకుని విచారిస్తూ కూర్చోవలసిన పనిలేదు . ఇది విషపూరితమే ఐనా  రెండు అమృతఫలాలు మన కందిస్తో౦ది . వాటిని మనం అందుకోవాలి . అవేంటో తెలుసుకుందాం . అవి కావ్యపఠనం, సజ్జనసాంగత్య౦  . మనకు వేదాలు , పురాణాలు ఉందనే ఉన్నాయి కదా ఈ కావ్యాలెందుకు అనే ఆలోచన ఎవరికైనా రావొచ్చు. కావ్యానికొక ప్రత్యేకత ఉంది.
ముందుగా కావ్యం యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం . కావ్యం వల్ల కీర్తి కలుగుతుంది . ధనం లభిస్తుంది . వ్యవహారచతురత అలవడుతుంది . అమంగళాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి . విగలితవేద్యాంతరమైన ఆనందాన్ని కావ్యం మనకందిస్తు౦ది . అంతే  కాకుండా ప్రియురాలివలే  నొప్పి కలిగించకుండా మృదువుగా మనకు కర్తవ్యాన్ని బోధిస్తుంది . ఇక వేదాల మాటకొస్తే అవి  ప్రభువులా ఆజ్ఞాపిస్తు బోధిస్తాయి . ఉదాహరణకు వేదం సత్యం వద ధర్మం చర మాతృదేవో భవ మొదలైన  చేయవలసిన పనులను న పరదారాం గచ్చేత్ మొదలైన వాక్యాల్లో  చేయకూడని పనులను మహారాజులాగా ఆజ్ఞాపిస్తూ బోధిస్తుంది .  పురాణం సత్యమేవ జయతే మొదలైన వాక్యాల్లో మిత్రునిలాగా హితబోధ చేస్తుంది . ఇక కావ్యం భార్య లేక ప్రియురాలిలా పఠిత మనస్సుకు ఎటువంటి నొప్పి  కలగకుండా చెబుతుంది . భార్య చూడండి తన భర్తకు ఒక చీర చూపించి పక్కింటి సుబ్బలక్ష్మి గారు చీరకొనుక్కున్నారు ఎంత బాగుందో చూడండి ధర కూడా చాల తక్కువ కేవలం పదివేల రూపాయలే అంటుంది . అది విన్న భర్త (సరసుడైన భర్త ) ఆమె అభిప్రాయం తెలుసుకుని ఆమెకు చీర కొంటున్నాడు . ఇక  ధర్మం చర  అనే నాలుగు వేదా క్షరాల పరమార్థాన్ని బోధించడానికే 1,25000 శ్లోకాలతో కూడిన మహాభారతం వ్రాయవలసి వచ్చింది . ధర్మాన్ని అనుసరించిన పాండవుల విజయం ధర్మాన్ని అనుసరించని కౌరవుల పరాజయం వర్ణించడం ద్వారా ధర్మం యొక్క గొప్పదనం సూచి౦చ బడింది.  అలాగే   న పరదారాం గచ్ఛేత్ (పరస్త్రీ ని ఆశించకు ) అనే ఆదేశానికి కావ్యరూపమే రామాయణం . కావ్యాలు మనేకేమీ సూటిగా చెప్పవు. రాముడిలా ఉండాలి రావణునిలా ఉండ కూడదు అనే విషయం అంతా చదివాక తెలుస్తుంది  . ఇక కావ్యాలు రసాత్మకంగా చెప్పడం వల్ల బ్రహ్మానందంతో సమానమైన ఆనందాన్ని కల్గిస్తాయి . ఇపుడు బ్రహ్మానందం అంటే ఏమిటో కొంచెం స్వల్పంగా తెలుసుకుందాం .
ఒకవ్యక్తి ఆరోగ్యవంతుడు , చదువుకున్నవాడు , బలవంతుడు , ఈ ప్రపంచంలో ఉన్న సంపదంతా అందిపుచ్చుకున్నవాడు ఉన్నాడనుకుందాం . అంతేగాక ఈ ప్రపంచాన్ని తానొక్కడే పరిపాలిస్తున్నాడనుకుందాం  . అటువంటివాడు అనుభవించే ఆనందం మానుషానండం .  దాన్ని 100 తో హెచ్చవేస్తే అది గంధర్వానందం. దాన్ని మరల 100 తో హెచ్చవేస్తే  అది దేవగంధర్వానండం. దాన్ని  100 తో హెచ్చవేస్తే పితృలోకానండం . దాన్ని 100 తో హెచ్చవేస్తే దేవలోకానండం . దాన్ని 100 తో హెచ్చవేస్తే ఇంద్రానందం . దాన్ని 100 తో హెచ్చవేస్తే బృహస్పతి ఆనందం . దాన్ని 100 తో హెచ్చవేస్తే ప్రజాపతి ఆనందం . దాన్ని 100 తో హెచ్చవేస్తే బ్రహ్మానందం .  దీన్ని బట్టి ఈ లోకంలో సామాన్య మానవుడు పొందే ఆనందం ఎంత స్వల్పమో తెలుస్తుంది ఇది శునకానందమే .  ఆ బ్రహ్మానందంతో ఇంచుమించు సమానమైన ఆనందాన్ని మనిషి కావ్యాలు చదవడం వల్ల పొందుతాడు .
ఇక రెండో ఫలం సజ్జనసా౦గత్యం . స్నేహం యొక్క గొప్పదనాన్ని వర్ణిస్తూ ఒకచోట
ఆహా !  మిత్ర అనే అమృతతుల్యమైన ఈ రెండక్షరాలు ఎవరు సృష్టించారోకదా! అంటాడు విష్ణుశర్మ. మంచివారితో స్నేహం మన బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది . సత్యం మాట్లాడేలా చేస్తుంది . గౌరవం పెంచుతుంది . చెడ్డ పనులు చేయకుండా మనల్ని రక్షిస్తుంది . మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది . మన కీర్తి దశదిశలా వ్యాపించేలా చేస్తుంది  అంటాడు భర్తృహరి .
అందువల్ల ఆనందమయ జీవితంకోసం మంచి పుస్తకాలు చదవండి . మంచి వారితో స్నేహం చెయ్యండి . ఇవే తరణోపాయాలు తరుణోపాయాలు కూడ.
                  <<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>> 

No comments: